Wednesday, December 29, 2010

ఆంధ్రప్రదేశ్‌పై మేమిచ్చే నివేదికతో శాశ్వత పరిష్కారం

ఒక రోజు ముందే నివేదిక సమర్పణ! 

AP-Map

అత్యధికులకు అత్యధిక సంతోషం
నిర్ణయం ఇక కేంద్రం చేతుల్లోనే
శాంతి భద్రతలకు ప్రమాదం లేదు
నివేదిక అమలు ఎప్పుడు? ఎలా? అన్నది మాత్రం లక్ష వరహాల ప్రశ్న
ముందు జాగ్రత్త కోసమే బలగాలు
విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణ
నివేదిక రెండు సంపుటాల్లో
మార్గాంతరాలు చెప్పాం: దుగ్గల్
"నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా? అనధికారికంగా వెల్లడిస్తుందా? అన్నది చెప్పలేం. మీ ఊపిరి బిగబట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి...'' - శ్రీకృష్ణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న తమ నివేదిక రాష్ట్ర విభజన సమస్యకు శాశ్వత పరిష్కారం సూచిస్తుందని భావిస్తున్నట్టు శ్రీకృష్ణ కమిటీ చైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ చెప్పారు. గడువు ప్రకారం తమ నివేదికను ఈ నెల 31లోపు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. నివేదికలో అన్ని అంశాల గురించి చర్చించామన్నారు. వాటిని వెల్లడించేందుకు ఆయన తిరస్కరించారు.

అయితే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరిశోధించి తయారు చేసిన నివేదిక ఇదని చెప్పారు. తమ సిఫారసులపై ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. కమిటీ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముంబై అల్లర్లపై తన నివేదికను అమలు చేయలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని, ఈ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వం ఎప్పుడు, ఎలా అమలు చేస్తుందనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న చెప్పారు.

60 ఏళ్లుగా పరిష్కారంకాని సమస్యను మీ నివేదిక పరిష్కరిస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. దీర్ఘకాలికంగా పరిష్కారం కావల్సిన సమస్యలు కొంత కాలంలోనే పరిష్కారమైన దాఖలాలున్నాయని ఆయన సోదాహరణంగా చెప్పారు. 25 సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న దంపతులకు 9 నెలల్లో పిల్లలు కలిగిన సందర్భాలు తనకు తెలుసునని ఆయన అన్నారు. తమ నివేదిక అత్యధికమంది ప్రజలకు అత్యధిక సంతోషాన్ని కలిగిస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు.

తమ నివేదిక తర్వాత ఎలాంటి శాంతి భద్రతల సమస్యలూ తలెత్తవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ బలగాలు రాష్ట్రానికి తరలించడం సాధారణ భద్రతా ఏర్పాట్లలో భాగమని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటారని, అది ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశానికి వచ్చినప్పుడు, కామన్‌వెల్త్ క్రీడలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా భద్రతా దళాలను నియమించారని, అయినప్పటికీ ఒక్క సంఘటన కూడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రతా దళాలను నియమించడం ద్వారా ప్రభుత్వం సమస్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. నివేదిక ఎలా ఉన్నా, శాంతిని కాపాడేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన పదే పదే పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ తమకు శాంతిని కొనసాగించేందుకు సహకరించాయని, వారు చెప్పేదాన్ని నమ్మాలని ఆయన అన్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అంతా శాంతియుతంగా జరిగిందని, ఇక ముందు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డిసెంబర్ 31లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నివేదిక సమర్పిస్తామని, తానెన్నడూ తనకిచ్చిన గడువును దాటలేదని అన్నారు. అయితే.. 30న ఈ నివేదికను చిదంబరానికి అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 31న చిదంబరం ఒక కార్యక్రమం నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నారని సమాచారం. ఈ రీత్యా 30వ తేదీనే నివేదికను శ్రీకృష్ణ కమిటీ ఆయనకు సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా, అనధికారికంగా వెల్లడిస్తుందా చెప్పలేమని శ్రీకృష్ణ అన్నారు. నివేదిక సమర్పించడంతో తమ పని పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం నక్సలైట్ సమస్యను సమీక్షించేందుకు గడ్చిరోలీలో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే నివేదికను సమర్పిస్తామని చెప్పారు. నివేదికపై ఎందుకింత ఆసక్తి నెలకొన్నదో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శిశువు జన్మించేముందు కూడా అది మగా, ఆడా తెలుసుకునే ఆసక్తి ఉంటుందని, కానీ లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించినందువల్ల అలా ముందుగా తెలుసుకునే వీలు లేదని అన్నారు. అలాంటి నిషేధం నివేదికల విషయంలో కూడా ఉండాలని ఆయన అన్నారు. "మీ ఊపిరి బిగపట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి..'' అని ఆయన అన్నారు. నివేదిక ఎన్ని పేజీలున్నదీ, ఎంత పెద్దదీ, చిన్నదీ అన్నది ప్రధానం కాదని, అందులో ఏం చెప్పారో ప్రధానమని అన్నారు.

మార్గాంతరాలూ.. పర్యవసానాలు.. : దుగ్గల్
తమ నివేదిక రెండు సంపుటాల్లో ఉంటుందని కమిటీ సభ్య కార్యదర్శి వీకే దుగ్గల్ చెప్పారు. తమకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సానుకూల ప్రతిస్పందన లభించిందని, అన్ని వర్గాలతో సవివరంగా మాట్లాడామని తెలిపారు. నివేదిక రూపకల్పనకు కొన్ని సంస్థల మద్దతు కూడా తీసుకున్నామన్నారు. తమ నివేదిక మొదటి సంపుటంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలకు అధ్యాయాల వారీగా కేటాయించామని, పలు మార్గాంతరాలను, పర్యవసానాలను సూచించామని దుగ్గల్ వెల్లడించారు.

విధి విధానాల్లో ప్రస్తావించిన ప్రతి అంశాన్నీ వివరణాత్మకంగా పరిశీలించామని, ప్రస్తుత సమస్య (తెలంగాణ) వెలుగు నీడలన్నింటినీ విశ్లేషించామని ఆయన చెప్పారు. రెండవ సంపుటిలో అనుబంధాలు ఉన్నాయని చెప్పారు. ముద్రణలో ఉన్నందున ఎన్ని పేజీలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేనని, తమ నివేదిక భారీగానే ఉంటుందని అన్నారు. మార్గదర్శకాల్లో మొదటి అంశం ప్రధానమైనదని, దానిపై పూర్తి దృష్టి కేంద్రీకరించామన్నారు.

బాగా పరిశోధన చేసిన, నిష్పాక్షికమైన, వృత్తి నైపుణ్యంతో కూడిన నివేదిక తమదని ప్రతి రాజకీయ నాయకుడూ అంగీకరిస్తారని ఆయన చెప్పుకున్నారు. శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, 1969, 1972, 2009లోనూ, ఇటీవలి కాలంలోనూ ప్రభుత్వం ఏ విధంగా శాంతిభద్రతలను కాపాడిందో అదే విధంగా చర్యలు తీసుకోవడం సహజమని దుగ్గల్ అన్నారు. పార్టీలు, నాయకులందరూ నివేదిక ఎలా ఉన్నా శాంతి భద్రతలు కాపాడతామని తమకు హామీ ఇచ్చారని , ప్రజలతో మాట్లాడి శాంతికి భగ్నం కాకుండా చూస్తామని చెప్పారని కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ తెలిపారు.

అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తామీ నివేదికను రూపొందించామని, తమ సిఫారసులను అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తారనే అభిప్రాయంతో ఉన్నామని కమిటీ సభ్యుడు అబూసలే షరీఫ్ చెప్పారు. తాము రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలూ తిరిగి ప్రజలను కలుసుకోవడంలో, సమస్యలను చర్చించడంలో ఎంతో ఆనందాన్ని పొందామని, నివేదిక రూపకల్పనలో జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉన్నదని మరో సభ్యుడు రణబీర్ సింగ్ చెప్పారు.

No comments: