
ఆర్థికంగా పరిపుష్ఠి అయితేనే కుటుంబం, గ్రామం, రాష్ర్టం అన్ని విధాలా ముందుకు వెళతాయని క్షేత్ర స్థాయిలో జరిపిన అధ్యయనంలో వెల్లడయినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యుడు రణబీర్ సింగ్ మాట్లాడుతూ రాజ్యాంగం పరిధిలో అభివృద్ధి కాంక్షించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ వారు మరే విధమైన కోర్కెలు కోరడం లేదనిస్సష్టం చేశారు. మరో సభ్యురాలు రవీందర్ కౌర్ మాట్లాడుతూ ఇప్పుడు పట్టణాలలో కేవలం మౌలిక వసతులతోనే సరిపెట్టడం సరికాదని, నగరాలకే పరిమితమైన ఆధునిక సౌకర్యాలు పట్టణాలకు కూడా విస్తరించి, సాంకేతికంగా ప్రజలను చైతన్య వంతులుగా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని ప్రజలు కోరారని, కమ్యూనికేషన్లు, ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞాన బోధన, రవాణ సౌకర్యాలు అందుబాటులోకి రావాలని కోరుతున్నట్లు వెల్లడించారు.
మహిళలు కూడా అభివృద్ధితోనే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మైనారిటీలు, క్ట్రిస్టియన్లు, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు తెగలు, షెడ్యూల్ కులాల వారు తమ సామాజిక అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారని మరో సభ్యుడు అబుసలె షరీఫ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఏ సందర్భంలోనూ వారు తెలంగాణ అని గాని, సమైక్యాంధ్ర అని గాని ఉచ్ఛరించకపోవడం గమనార్హం. మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ తమ అభివృద్ధినే కాంక్షిస్తున్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర మహిళలైతే, తాము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని, అలాగే తమ బిడ్డలకూ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారని వివరించారు.
కాంగ్రెస్ మెడపై తెలంగాణ కత్తి

నివేదిక ప్రతికూలంగా వస్తే?
విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసం తెలం గాణ కాంగ్రెస్ ఎంపీలు దీక్షకు దిగడంతో వారికి క్రెడిట్ దక్కింది. అసెంబ్లీ సమావేశాల సంద ర్భంగా అధికార పక్షంతోపాటు ప్రతిపక్షపార్టీలన్నీ కలసినా ఈ కేసులను మాత్రం ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశంపైనే రెండు రోజుల పాటు అసెంబ్లీలోని ఉభయ సభలో స్థబిం చిపోయాయి. కానీ ఆ తరువాత కేవలం కాంగ్రెస్ ఎంపీలు దీక్షకు దిగడంతోనే ప్రభుత్వం దిగొచ్చి కేసులను రద్దుచేసింది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ను దక్కించుకోవడంతోపాటు తాము తల్చుకొంటే ప్రత్యేక రాష్ట్రానైనా సాధిస్తామన్న సంకేతం తెలం గాణ కాంగ్రెస్ నేతలు ఇచ్చారు. ఈ అంశాన్ని ఆధా రంగా చేసుకొన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యే, నేతలను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రతిపక్షపార్టీలు సిద్దమ వుతున్నాయి.
కేసుల ఎత్తివేతతో కాంగ్రెస్ ఎంపీలపై నమ్మకం పెంచుకొన్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు సైతం తమ ప్రాంత పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నారు. అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయిం చాలని భావిస్తున్నారు. తెలంగాణ సాధన విషయం లో కాంగ్రెస్ నేతలపైనే ఈ ప్రాంత ప్రజలు కూడా బాధ్యతను మోపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకే ఉద్యమ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెలిచి ఓడినట్లు అవుతుందా?
తెలంగాణ సాధన విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్ నేతలలో కూడా ఆందోళన నెలకొంది. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా నివేదిక వస్తే తమ పరిస్థితి ఏమిటీ అని వారిలో మీమాంస మొదలైంది. విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణ యించుకొంది కాబట్టే వాటిని రద్దుచేసింది. కాకపో తే కాంగ్రెస్‌కే ఆ క్రెడిట్ దక్కాలన్న ఉద్దేశం తోనే తెలంగాణకు చెందిన ఆ పార్టీ ఎంపీల దీక్షతో వాటిని రద్దుచేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వా నికి, తెలంగాణ ఎంపీలకు ఇరువురికి తెలిసిందే. ప్రభు త్వం కేసులను ఎత్తివేయాలని భావించింది కాబట్టే ఈ కేసులు రద్దు అయ్యాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తే తెలం గాణ లో ఆ పార్టీ నేతలకు ఇబ్బంది ఉండదు. ఒక వేళ ఇవ్వకూడదని భావిస్తే అధిష్ఠానాన్ని తాము ఏమేర ప్రభావితం చేయగలమన్న ఆందోళన కాంగ్రెస్ ఎం పీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు నేతలలో మొద లైంది. దీక్షలే కాదు రాజీనామాల అస్త్రం ప్రయోగిం చినా తమ అధిష్ఠానం దిగివస్తుందా అని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
ఇక మధ్యంతరమే !

ఫిబ్రవరిలో శాసనసభా సమావేశాలు జరగనుండటం, అదే సమ యంలో జగన్ కూడా పార్టీని స్థాపిస్తుండటంతో అందరి దృష్టి ఫిబ్రవరిపైనే కేంద్రీకృతమయింది. జగన్ అప్పటికి పార్టీ పెట్టడం ఖాయమయినందున, ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన వర్గీయులయిన ఎమ్మెల్యేలు జగన్ పార్టీలోకి వెళ్లడం ఖాయ మంటున్నారు. సరిగ్గా సమావేశాలు ప్రారంభమయిన రోజు నుంచే కిరణ్ సర్కారుకు జగన్ షాక్ మొదలుకావచ్చని తెలుస్తోంది. జగన్‌కు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలంతా సమావేశాల ప్రారంభం నుంచి ముగింపులోగా ఒక్కొక్కరుగా రాజీనామా అస్త్రాలు ప్రయోగించ వచ్చంటున్నారు. దానితో కాంగ్రెస్ సర్కారు సంక్షోభంలో పడటం ఖాయమన్న అంచనా వ్యక్తమవుతోంది.
జనవరి 6న వెల్లడయ్యే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అంశాల ప్రభావం అప్పటికి తీవ్రంగా ఉండ వచ్చన్న అంచనా కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలోఈనెల ప్రారంభం నుంచి మొదలయ్యే ఉద్యమాలు ఫిబ్రవరి నాటికి మరీ ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పార్టీలలో చర్చ జరుగుతోంది. ఆ పరిణా మాలు అధికార కాంగ్రెస్‌కు మరీ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆ క్రమం లో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు, రాష్ట్రం లో నష్టనివారణకు కేంద్రప్రభుత్వం కూడా అనివార్యంగా రాష్టప్రతి పాలన విధిస్తుందని విశ్లేషిస్తున్నారు.
కాగా.. రాష్ట్రంలో రాష్టప్రతిపాలన విధించే అవకా శాలను ప్రజాప్రతినిధులు కూడా త్రోసిపుచ్చడం లేదు. వారు కూడా ఆ మేరకు మానసికంగా సిద్ధంగానే ఉన్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఇలాంటి భావన కనిపించడం విశేషం. మనం సక్రమంగా పరిపాలించకపోతే మన స్థానంలో మరొకరు వస్తారంటూ ధర్మాన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల అంతరంగం, ఆందోళనను ఆవిష్కరిస్తోంది.
ఢిల్లీ రాజకీయ వాతావరణపై అవగాహన, అంతర్గత రాజకీయాలపై అనుభవం ఉన్న మంత్రులు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ల అంతరంగ సంభాషణల్లో కూడా ఇదే భావన ధ్వనిస్తోంది. జగన్ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ దాదాపు ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత, జనవరి మొదటి వారం నుంచి రాష్ట్రంలో నెలకొనే రాజకీయ పరిస్థితులను ఇప్పటినుంచే ఎలా ఎదుర్కోవాలి? ఆలోగా ఏయే అంశాలతో ప్రజల ముందుకు వెళ్లాలన్న దానిపై అన్ని పార్టీల్లో సీరియస్‌గానే చర్చ జరుగుతోంది. తమకు లాభించే అంశాలతో పాటు ప్రత్యర్థులను ఇరకున పెట్టే వాటిపై కసరత్తు మొదలుపెట్టారు.
ఎన్ని ‘కల’లో ...

డిసెంబర్ 31 తర్వాత ప్రళయం సృష్టిస్తా మని గతంలో చెప్పిన తమ నాయకుడే మళ్లీ ఇప్పుడుమార్చి వరకూ గడువు ఇవ్వడంపై సొంత పార్టీ సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి తమ పార్టీ తెలంగాణ కోసం ఉధృతంగా ఉద్యమాలు చేస్తుందని ఒకవైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే, తమ అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వానికి పరోక్షంగా గడువు ఇవ్వడంపై వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో కొంతకాలం వరకూ ఉద్యమాల పేరుతో హోరెత్తించిన కేసీఆర్.. గత కొద్దిరోజుల నుంచి మధ్యంతర ఎన్నికల గురించి తరచూ మాట్లాడటంపై సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యమం గురించి మాట్లాడకుండా కేవలం ఎన్నికల గురించే ప్రస్తావిస్తుండటం, పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం వల్ల వ్యతిరేక సంకేతాలు వెళతాయన్న ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది.
ఇలాంటి తొందరపాటు తనం వల్ల తమ పార్టీకి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన కంటే ఎన్నికలే ముఖ్యమన్న భావన ప్రజల్లో నెలకొనే ప్రమాదం ఉందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత, తమ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడటం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలే తప్ప, ఎన్నికల గురించి మాట్లాడితే తమకు ప్రత్యేక రాష్ట్రంపై కన్నా ఎన్నికల పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ప్రజలు అనుమానించే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.
నిజానికి.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేరని సీనియర్లు చెబుతున్నారు.తరచూ రాజీనామాలు చేయటం, మళ్లీ పోటీ చేయడం వల్ల ఆర్థికంగా చాలా చితికిపోతున్నామన్న ఆవేదన ఎమ్మెల్యేలలో ఉందని అంగీకరిస్తున్నారు. పట్టుమని ఏడాది కూడా కాకముందే ఎన్నికలకు సిద్ధం కావాలంటే, గత ఎన్నికల్లో చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చలేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు. తినగ తినగ తీపి కూడా చేదుగా ఉంటుందన్నట్లు ప్రజలు కూడా ఇలాంటి నిర్ణయాలను హర్షించరంటున్నారు.
‘ఇంతవరకూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. సంపాదించుకోవడం దేవుడికెరుక. పాత అప్పులు తీర్చలేక పరేషానవుతున్నా’మని కొందరు ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల వద్ద జరిగే అంతరగత సంభాషణల్లో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ద్వారా తమను హడలెత్తిస్తున్నారని, అటు ప్రజల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఎన్నికలే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యం కాదన్న భావన కల్పిస్తున్నారని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.