Sunday, January 9, 2011

మధ్యంతరమా? వస్తుందా?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎంత కాలం ఉంటుం ది? రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవా? ఈ రెండు ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పరిపాలన దాదాపుగా అచేతనావస్థకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళంతోపాటు, తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ మరో అయిదారు రోజులలో నివేదిక ఇవ్వవలసి ఉండటం! ఈ రెండు పరిణామాల వల్ల ప్రభుత్వ మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి.

వాస్తవానికి శాసనసభ కు మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కోరుకోవడం లేదు. మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి న మాజీ ఎం.పి. జగన్మోహనరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. ఎందుకంటే ఎన్నికలు వస్తే తెలంగాణలో టి.ఆర్.ఎస్. గరిష్ఠ స్థాయిలో లాభపడే అవకాశం ఉండగా, సీమాంధ్రలో జగన్ ఎంతో కొంత లాభపడతారు.

అందువల్లే పరిస్థితులు కుదుటపడి పార్టీపై పట్టు వచ్చేవరకు, ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థి తి ఇటు తెలంగాణలో దిక్కుతోచని రీతిలో ఉండగా, సీమాంధ్రలో కూడా అంతంత మాత్రమే కనుక ఆ పార్టీ కూడా ఎన్నికలు కోరుకోవ డం లేదు.

'లక్ష్య' పేరిట విజయవాడలో జగన్ చేపట్టిన దీక్షకు ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు సంఘీభావం ప్రకటించారన్న దాన్ని బట్టి మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంచనా వేయలేని స్థితి! ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులు ఎటూ తేల్చుకోలేని డోలాయమానంలో ఉన్నారు. జగన్‌కు సంఘీభావం ప్రకటించిన వారంతా చివరి వరకు ఆయనతోనే ఉంటారన్న నమ్మకం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని చెబుతున్న వారి ప్రకటనలనూ విశ్వసించలేని స్థితి.

నిజానికి పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఉదయం జగన్‌తో మాట్లాడితే, సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుస్తున్నారు. ఈ పరిణామం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. భారీ ఖర్చుతో విజయవాడ లో చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్షకు ఆశించినస్థాయిలో జనం రాలేద న్న వార్తలు వచ్చాయి. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో రెండవసారి జగన్ చేసిన పర్యటనకూ జనం పలుచబడినట్టు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితి జగన్ వర్గాన్ని సహజంగానే ఎంతో కొంత నిరాశకు గురిచేసింది. కాలం గడిచే కొద్దీ జగన్ ప్రభావం బలహీన పడుతుందన్నది కాంగ్రెస్ ప్రముఖుల అంచనా. అదే జరిగితే, ప్రస్తు తం జగన్‌కు సంఘీభావం ప్రకటించినవారు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉంది. మీడియా ప్రచారం ద్వారా జగన్ గురించి ఎంతో ఊహించుకున్న జనానికి ఆయన ప్రసంగాలు నిరాశ నే మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ ఎటువంటి వ్యూహంతో కదులుతారు? ఆయనకు ప్రస్తుతం కనిపిస్తున్న జనాదర ణ చివరి వరకు మిగులుతుందా? అనే అంశాలు స్పష్టం అయితే గానీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చెప్పలేం. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జగన్ లక్ష్యం. ఈ కారణంగానే విజయవాడ సభలో ప్రసంగించిన ఆయన వర్గీయులు, రైతుల సంక్షే మం కన్నా, రాజకీయ విమర్శలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి మైనారిటీలో పడిన విషయం వాస్తవం. అయితే జగన్‌కు సంఘీభావం తెలుపుతున్న వారంతా రాజీనామాల కు సిద్ధపడతారా? అన్నదీ సందేహమే. వీలైతే మరో రెండు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో జగన్ వర్గం ఉంది. అందుకు అవసరమైన బల సమీకరణకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. 50 నుంచి 60 మంది వరకు శాసన సభ్యులను కూడగట్టగల సత్తా ప్రస్తుతానికి జగన్‌కు ఉంది.

పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఈ సంఖ్య పెరగవచ్చు కూడా. కానీ ప్రస్తుతానికి 50 నుంచి 60 మంది శాసన సభ్యులు తమ సభ్యత్వాలను వదులుకొంటారా? అన్నది ప్రశ్నార్థకమే! రాజీనామా లు చేసి, జగన్ వెంట నడిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ధీమా ఏర్పడితే తప్ప, వారెవ్వరూ ఆ పని చేయడానికి సిద్ధపడ రు. ఈ క్రమంలో సర్వే సంస్థలపై పలువురు ఆధారపడుతున్నారు.

జగన్ బలం ఎంత? అనే విషయం అలా ఉంచితే, రాజకీయంగా జగన్ బలపడే పరిస్థితి ఏర్పడకుండా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహజంగానే కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దాదాపు 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగాలేనందున వారెవ్వరూ మధ్యంతర ఎన్నికలను కోరుకోరు. అలాగని నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ద తు ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు.

జగన్ బలం 60కి పరిమితమయ్యే పక్షంలో (ఇది ప్రస్తుతానికి గరిష్ఠం), ప్రజారాజ్యం-మజ్లిస్ శాసనసభ్యుల సంఖ్య ను కలుపుకొన్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దాదాపు 35 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు తెచ్చుకుని ప్రధాన రాజకీయ పక్షాలైన తాము నష్టపోవడానికి కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు సిద్ధంగా ఉండవు కనుక ఏదో ఒక ఫార్ములా రూపొందే అవకాశం ఉంది.

తాము కనుమరుగై చంద్రశేఖరరావు, జగన్మోహనరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లాభపడటాన్ని ఆ రెండు పార్టీ లు సహజంగానే జీర్ణించుకోలేవు. మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణలో 100 స్థానాలను కైవసం చేసుకోవాలని టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటికిప్పు డు ఎన్నికలు వస్తే, కె.సి.ఆర్ అంచనా వేస్తున్నట్లు, 100 స్థానాలకు కొంచెం కుడిఎడమగా టి.ఆర్.ఎస్. బలం పెరిగే అవకాశం కచ్చితం గా ఉంది. సీమాంధ్రలో పరిస్థితిని ప్రస్తుతానికి అంచనా వేయలేం.

ఈ నేపథ్యంలో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ స్థానంలో మరే ఇతర పార్టీ ఉన్నా అదే పని చేస్తుంది. అటు సీమాంధ్రలో జగన్‌కు, ఇటు తెలంగాణలో కె.సి.ఆర్.కు లాభించే పని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు చేస్తుంది? జగన్ ఇదివరకే సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టినందున, రాష్ట్ర విభజ న జరిగితే సీమాంధ్రలో ఆయనకే లాభం చేకూరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఫలితంగా తెలంగాణ అంశం మరోమారు పీటముడి పడే అవకాశం ఉంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం నామమాత్రమన్న నిర్ణయానికి వచ్చే వరకూ తెలంగాణ అంశాన్ని ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ నాన్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏ సిఫారసులు చేస్తుందన్న విషయం అటుంచితే, అది ఇచ్చే నివేదికను పరిశీలించడానికి మంత్రుల కమిటీని నియమిం చి కాలయాపన చేయవచ్చు.

టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇటువంటి అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. ఉద్యమాల గురించి మాట్లాడకుండా ఆయన, ఎన్నికల గురించి, ఆ ఎన్నికల్లో సాధించవలసిన సీట్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణితో తెలంగాణ ఇప్పట్లో రాదన్న అనుమానాలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌వాదులతో పాటు, కరడుగట్టిన తెలంగాణవాదులు కూడా, ప్రైవేటు సంభాషణల్లో, ఇటువంటి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చి రెండు ప్రాంతాలలో నష్టపోవడానికి కాంగ్రెస్ మాత్రం ఎందుకు సిద్ధపడుతుంది? జగన్ వ్యవహారం ఉండి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ విషయం అలా ఉంచితే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి నెల రోజులు గడిచాయి. కానీ ఇంతవరకు ఆయన అంతరంగం ఏమి టో ఆవిష్కృతం కాలేదు. తాను మొండి మనిషినని రుజువు చేసుకోవడానికి అనుక్షణం ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తాను మెతకగా ఉంటే పని చేయనివ్వరని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రిమొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వపరమైన అంశాల విషయంలోనే కాకుండా, పార్టీ పరమైన విషయాలలో కూడా ఆయన తనకంటూ ఒక టీంను ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. మంత్రులను విశ్వాసంలోకి తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. దీనితో పలువురు సీనియర్ మంత్రు లు ఆయన పట్ల కినుకగా ఉన్నారు. అయినా, ఎవరు ఏమనుకుంటా రు అన్న దానితో నిమిత్తం లేకుండా, కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలి లో వ్యవహరిస్తున్నారు.

రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాల ని కోరుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏడురోజుల పాటు నిరాహారదీక్ష చేసినా, కనీసం ఒక్క డిమాండ్‌ను తీర్చడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వాస్తవానికి అసెంబ్లీలో తాను ప్రకటించిన ప్యాకేజీ కన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వపరంగా కృషి జరుగుతోంది. అయితే చంద్రబాబు దీక్ష చేపట్టినందునే ప్రభుత్వం సాయం పెంచిందన్న అభిప్రాయం రైతుల్లో కలగకుండా ఉండటానికే, అఖిలపక్ష సమావేశంలో ఎవరు ఎంత గొంతు చించుకున్నా, ముఖ్యమంత్రి మొండికేశారు.

ఒకటిరెండు రోజులలో ప్రభుత్వం కొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా సహాయం చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూరరాదన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అంత మొండిగా ఉన్నారు. చంద్రబాబుతో దీక్ష విరమింపచేయడానికి కనీసం మంత్రు ల బృందాన్ని అయినా పంపారు. విజయవాడలో ఆర్భాటంగా జగన్ చేపట్టిన 48 గంటల దీక్షను ముఖ్యమంత్రి కనీసం గుర్తించలేదు.

జగన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. తొలిదశలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి, మలి దశలో రాజశేఖరరెడ్డి ప్రభావాన్ని తగ్గించి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న రెండంచెల వ్యూహంతో ఆయన ఉన్నారు. ప్రజల్లో రాజశేఖరరెడ్డి ప్రభావం తొలగించగలిగితే, జగన్ పరిస్థితి 'నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేప'లా తయారవుతుందని ముఖ్యమంత్రి వర్గీయులు అంచనా వేస్తున్నారు.

వాస్తవం కూడా అదే! రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకొనే జగన్ ప్రస్తుతానికి రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి, తాను కంగారు పడి ఇతరులను కంగారు పెట్టే బదులు, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ క్రమం లో కాంగ్రెస్ అధిష్ఠానం సలహాలు, సూచనలతో రూపొందించుకున్న రెండంచెల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగితే, 2014లో జరిగే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చునన్నది కిరణ్ అంతరంగంగా చెబుతున్నారు.

రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్లు దీక్షలు చేసినా, మరొకటి చేసినా, రాజకీయ ప్రయోజనాలు అంతర్లీనంగా అందులో ఇమిడి ఉంటాయి. చంద్రబాబు చేపట్టిన దీక్ష వెనుక గానీ, జగన్ ముగించుకున్న లక్ష్య దీక్ష వెనుకగానీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎలా ఉంటాయి?! అయితే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలన్నీ, రాజకీయ ప్రయోజనాలను కాసేపు పక్కనబెటి,్ట రైతుల లో ఆత్మ విశ్వాసం పాదుకొల్పడానికి ఏకోన్ముఖంగా ముందుకు కదలవలసిన అవసరం ఉంది.

ప్రతిరోజూ 20 మందికి తగ్గకుండా రైతు లు, ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టిన జగన్ ఆ వెంటనే క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి పులివెందుల వెళ్లిపోయారు. రాజకీ య బల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇచ్చిన ఇటువంటి దీక్షల వల్ల రైతులకు వొనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. రైతులకు ఇప్పుడు కావలసింది పార్ట్ టైం రాజకీయ నాయకులు కాదు. 'మీ వెనుక మేము న్నాం' అని ధైర్యం చెప్పి, ఆదుకునే ఆపన్న హస్తం కావాలి.

ఏడురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి, ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబునాయుడు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి న తర్వాత ఏమి చేయనున్నారో వేచి చూడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడకుండా, రైతులకు సహాయం అందించడానికి చొరవ తీసుకోవలసిన బాధ్యత, ఒక ప్రతిపక్ష నేతగా, తొమ్మిది సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఎక్కువగా ఉంది. చంద్రబాబుకు ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని ఆలోచించకుం డా, రైతులకు వీలైనంత మేర సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యోన్ముఖులు కావాలి.

'సర్వరోగ నివారి ణి జిందా తిలిస్మాత్' అన్నట్లు, అన్ని సమస్యలకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారం అని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే బదులు, తెలంగాణ జిల్లాలలో గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ముందుకు రావలసిన అవసరం ఉంది. తనకు ఎంతమంది శాసనసభ్యులు మద్ద తు ఇస్తారన్న లెక్కలకు కాసేపు స్వస్తి చెప్పి, రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంది. మరి వీళ్లంతా కలసి కదులుతారా? 

-ఆదిత్య