Saturday, October 30, 2010

ఆనాడు నువ్వు తెలుగు తల్లివి, ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన బిరుదు... 'దయ్యం'



 మా దయ్యానికి మల్లెపూదండ
ఆనాడు నువ్వు తెలుగు తల్లివి,
ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి
ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన
బిరుదు... 'దయ్యం'
అవును నువ్వు నిజంగా దయ్యానివే!

అర్ధనూట పదహారు రోజులు
ఆకలితో మలమల మాడ్చి
అమర జీవిని బలితీసుకున్న దయ్యానివి నువ్వు!
ఏదో ఒరగబెడతానని అందర్నీ తీసుకొచ్చి
ఎటూ కాని ఎడారిపాలు చేసిన
దయ్యానివి నువ్వు!
ఇడ్లీ, సాంబార్ వదిలేసి రండి,
విందు భోజనం వడ్డిస్తానని పిలిచి
ఇరానీ చాయ్ కూడా
లేకుండా చేసిన దయ్యానివి నువ్వు!

తుంటరి వరుడంటూ నెహ్రూ ఉమ్మేసినా
తుడుచుకుని నవ్వేసిన దయ్యానివి నువ్వు!

కొత్త రాజధానిలో నీ బిడ్డలు
కొలువే చేయకూడదని
పెద్ద మనుషులు తీర్పిచ్చినా
పట్టని దయ్యానివి నువ్వు!

నీలోని రుద్రమ్మకు మసిపూసి,
నీకు సవతి తల్లిగా ముసుగేసినా
ఉలుకూ పలుకూ లేని దయ్యానివి నువ్వు!

నీతోపాటు త్యాగయ్యనూ తిక్కన్ననూ
అందర్నీ దయ్యాల్ని చేసి
కొత్తమ్మ కాళ్లు పట్టిస్తున్న దెయ్యానివి నువ్వు!

చిరునవ్వు సిరులన్నీ భాగ్యనగరిలో పారేసుకుని,
కట్టుబట్టలతో గడప దాటలేక
చూరుపట్టుకు వేలాడుతున్న దయ్యానివి నువ్వు!

హైటెక్ హంగులు, ధగధగ రోడ్లు,
మిలమిల లైట్లు
ఏవీ నీవి కానివై వెక్కిరిస్తుంటే,
గూడు పాడైనా ఎగిరిపోలేని చిలకలా
శిలావిగ్రహమై నిల్చిన దయ్యానివి నువ్వు!

నీ వాళ్లను పంచెలూడదీసి కొడతామంటున్నా
నీకు రోజూ వస్త్రాపహరణం తప్పదంటున్నా
ద్రౌపదిలా శ్రీకృష్ణ జపం చేస్తున్న
దయ్యానివి నువ్వు!

ఎంత దయ్యమైనా అమ్మ అమ్మే
అందుకే ఈ పరాయి పంచలో
సిగ్గులేని మా బతుకుల సాక్షిగా
'భాగో'లే తప్ప బాగోలేని మా మనసుల సాక్షిగా
తెల్లవారీ వారక ముందే, దొర నిద్ర లేవకముందే,
తిట్లూ శాపనార్థాల చీకట్లలో,
కాలుతున్న ఏపీ 16 స్కూటర్ వెలుగులో
ఎవరూ చూడకుండా దొంగల్లా వస్తాం!
నీకో మల్లెపూదండ వేసేసి పారిపోతాం!!
- వక్కలంక రమణ

రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ ఉండగా... మేధావులు కుల, మత, ప్రాంతీయ అభిమానంతో.....

నేతల మాటలు.. భవితతో ఆటలు

గడచిన వారం రోజులుగా వివిధ పార్టీలకు చెందిన మన నాయకులు, సమాజంలో మేధావులుగా చలామణి అవుతున్నవారు చేస్తున్న ప్రకటనలు, విమర్శలు చూస్తూ ఉంటే రోత పుడుతున్నది. రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ ఉండగా... మేధావులు కుల, మత, ప్రాంతీయ అభిమానంతో మాట్లాడుతున్నారు.

సమస్యను సమస్యగా చూసి పరిష్కారం కోసం చొరవ తీసుకోవలసిన వర్గాలు కలుషిత మనస్సులతో ఆయా సమస్యలను మరింత జటిలం చేయడమే కాకుండా, మొత్తం సమాజంలో విద్వేషపూరిత వాతావరణాన్ని వ్యాపింపజేస్తున్నారు. అధికారం అనుభవించిన వాళ్లు, అధికారంలో ఉన్నవాళ్లు, అధికారం అందుకోవాలని కలలు కంటున్న వాళ్లు అన్న తేడా లేకుండా, ఎవరికి తోచిన విధంగా వాళ్లు వ్యవహరిస్తుండటం ఈ రాష్ట్రం చేసుకు న్న దౌర్భాగ్యం.

రాష్ట్ర రాజకీయాలు విద్వేషమయం అవడం తో, ఏ ఒక్క పార్టీకీ మరో పార్టీ పొడగిట్టడం లేదు. ఫలితంగా ఆయా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, మరింత ముదురుతున్నాయి. గతంలో ప్రధాన సమస్యలపై అధికారం లో ఉన్నవాళ్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పరిష్కారా లు కనుగొనేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పార్టీలు వ్యవహరిస్తుండటంతో అఖిలపక్ష సమావేశాలకు అర్థం లేకుండా పోతున్నది. ఆయా సమస్యలపై పలు పార్టీల అధినేతలు ఈ వారం రోజుల్లో పలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. కానీ, ఏ ఒక్క సమావేశంలో కూడా పార్టీల ప్రతినిధులు నిర్ణయాత్మకంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి సూచనలు చేసిన పాపాన పోలేదు.

సమాజంలో పెడధోరణులు ప్రవేశిస్తున్నప్పుడు చొరవ తీసుకుని కార్యరంగంలోకి దిగవలసిన మేధావులు అయితే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. లేదా, మరింత వక్రంగా ఆలోచి స్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఉదాహరణకు... 2012లో యుగాంతం అవుతుందని వచ్చిన పుకార్లను ఆధారంగా చేసుకుని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సంస్థ కు చెందిన విద్యార్థులు కొందరు, ఆ పరిస్థితి వస్తే హైదరాబాద్‌లో ఎటువంటి విపరీతాలు జరుగుతాయో ఊహిస్తూ గ్రాఫి క్స్ మాయాజాలంతో లఘుచిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని న్యూస్‌చానెళ్లలో చూసిన తెలంగాణకు చెందిన మేధావి ఒకరు స్పందిస్తూ, "ఆ నాశనం అయ్యేది ఏదో విశాఖపట్నంలో ఊహించి చేయవచ్చు కదా? మా హైదరాబాద్‌లోనే విధ్వం సం ఊహించడం ఎందుకు?''అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి మేధావుల ఆలోచనలు ఎంత పెడధోరణులు పడుతున్నా యో తెలుస్తున్నది. ఆ లఘుచిత్రం రూపొందించిన విద్యార్థులకు గ్రాఫిక్స్ రూపొందించడంలో ఉన్న ప్రతిభ సదరు మేధావికి కనపడలేదు.

వాస్తవానికి, ఆ విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు. హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పనిచేస్తున్నది హైదరాబాద్‌లో. ప్రస్తుతం హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని కూడా! ఇలాంటి వక్రభాష్యాలు, విద్వేషపూరిత ఆలోచనలవల్ల ఆ విద్యార్థుల ప్రతిభ గురించి ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతున్న ది.

ఇది సమాజానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదేవిధంగా, విగ్రహాల ఏర్పాటు వివాదం ఒకటి తెరపైకి వచ్చి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించింది అనుకోం డి! తెలంగాణకు చెందిన గిరిజన నాయకుడు కొమురం భీం విగ్రహాన్ని కూడా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.సి.ఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎం.ఎల్.ఎ కె.తారకరామారావు కోరడంలో తప్పులేదు.

అయి తే, భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది వరకే ఏర్పాటు చేసిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాల ను ధ్వంసం చేస్తామని ఆయన అనడం ఎంతవరకు సమంజ సం? ఇది ఒక బాధ్యతగల నాయకుడు చేయవలసిన ప్రకటనే నా? వాస్తవానికి కొమురం భీంను ఇంతకాలం విస్మరించినందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే ముందుగా సంజాయిషీ ఇచ్చుకోవాలి.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పలు విగ్రహాలలో సీమాంధ్రకు చెందినవారివే ఎక్కువ ఉన్న విషయం కూడా వాస్తవమే! అయితే, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడానికి ముందే ఆయా ప్రాంతా ల ప్రజలు వారి విగ్రహాలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని గౌరవభావాన్ని తెలుపుకొన్నారు. ఫలితంగానే వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చి ట్యాంక్‌బండ్‌పై చోటు లభించింది.

కొమురం భీం విగ్రహాన్ని ఆదిలాబాద్ జిల్లాలో గానీ, తెలంగాణలోని మరో జిల్లాలో గానీ ఇంతకాలం ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో తెలంగాణ నాయకులు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఒక మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరిగిపోదు. కాకపోతే, గుర్తింపు లభించినట్లు అవుతుంది.

అయితే ఇందుకు ఎంచుకున్న మార్గం సరైనదేనా అని ఆలోచించవలసిన బాధ్యత కె.తారకరామారావుపై గానీ, మరొకరిపైగానీ లేదా? ఎందుకంటే ట్యాంక్‌బండ్‌పై స్థానం పొందిన సీమాంధ్రకు చెందిన పలువురు మహనీయులను తెలంగాణకు చెందినవాళ్లు కూడా అభిమానిస్తారు. యోగి వేమన అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఆ కారణంగానైనా వేమ న విగ్రహానికి తాను రక్షణగా నిలబడతానని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

తెలుగు లలిత కళాతోరణం పేరు మార్పు వివాదం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. కళాబంధుగా కీర్తించబడటాన్ని ఇష్టపడే కాంగ్రె స్ ఎం.పి. టి.సుబ్బరామి రెడ్డి పదికోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి తెలుగు లలిత కళాతోరణానికి ముందు రాజీవ్‌గాంధీ పేరు చేర్పిస్తూ ప్రభుత్వంతో ఉత్తర్వు లు జారీ చేయించారు. ఇక్కడ రాజీవ్‌గాంధీ పేరు పెట్టడం సమర్థనీయమా? కాదా? అన్నది ప్రశ్నకాదు.

తెలుగు సంస్కృతికి ప్రతీకగా ఎన్.టి.రామారావు నిర్మించిన దీనికి ఇప్పుడు పేరు మార్చవలసిన అవసరం ఉందా? అన్నదే ప్రశ్న. ఇలా ఎప్పుడో పేరు పెట్టిన సంస్థలు, ప్రదేశాలకు ఇప్పుడు పేర్లు మార్చడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేకపోగా, కొత్త సమస్యలకు తెరతీసినట్లు అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలుగువాడు కాకపోయినా, ఆ రోజుల్లో ఉన్న జాతీయ భావంతో ఆ మహనీయుడి పేరిట రవీంద్ర భారతిని మనం నిర్మించుకున్నాం.

ఇప్పుడు ప్రాంతీయ కోణం తో చూసి రవీంద్ర భారతి పేరు మార్చాలని ఎవరైనా అంటే మాత్రం ఏమి చేయగలం! లలితకళా తోరణం ముందు తెలు గు అన్న పదం చేర్చడం ద్వారా తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటడానికి నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రయత్నించారు. అంతేకాదు, ఆయన హయాంలో ప్రారంభమైన పలు పథకాలకు కూడా వ్యక్తుల పేర్లు రాకుండా తెలుగు పేర్ల నే ఎన్.టి.ఆర్ ఎంచుకున్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మెప్పు పొందడానికో లేక మరో కారణం వల్లనోగానీ తెలుగు లలిత కళాతోరణం ముందు రాజీవ్‌గాంధీ పేరు చేర్పించడాని కి సుబ్బిరామిరెడ్డి పూనుకున్నారు. దీనితో ఇది సహజంగానే వివాదం అయింది. తెలుగు లలిత కళాతోరణం పేరు మార్చే పక్షంలో కాళోజీ నారాయణరావు పేరు పెట్టాలని కొందరు, సుద్దాల హనుమంతు పేరు పెట్టాలని మరికొందరు తెలంగాణ వాదులు ప్రకటనలు చేయడం ప్రారంభించారు.

లేని సమస్యను సృష్టించుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి! ఈ వివాదం నేపథ్యంలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ప్రతినిధులు పర స్పరం చేసుకు న్న విమర్శలు రోత పుట్టిస్తున్నాయి. మన నాయకులు ఇంతగా ఎందుకు దిగజారిపోతున్నారా? అని ఆవేదన కలుగుతున్నది.

అన్నింటికీ రాజీవ్ పేరు పెట్టుకుంటూపోతున్న కాంగ్రెస్ నాయకులు సులభ్ శౌచాలయాలకు కూడా ఆయన పేరే పెట్టుకుంటే సరిపోతుందన్నట్లుగా నారాయణ వ్యాఖ్యానించగా... నారాయణ చనిపోయిన తర్వాత 'నారాయణ మూత్రశాలలు' ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు బదులిచ్చారు. తెలుగు సంస్కృతి ఈ స్థాయికి దిగజారినందుకు గర్వించు దాం!

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న మైక్రో ఫైనాన్స్ విషయంలో కూడా ఆయా పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు వారి బాధ్యతారాహిత్యాన్ని చెబుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌కు సంబంధించి పేద ప్రజలు రెండు కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇందులో మొదటిదీ, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలకు కారణమైనదీ అధిక వడ్డీ. 40 నుంచి 60 శాతం వరకు వడ్డీ వసూలు చేయడంతో పాటు, ఒకే వ్యక్తికి రెండు మూడు సంస్థలు అప్పులు ఇవ్వడం వల్ల సమస్య జటి లం అయింది.

ఇచ్చిన అప్పు వసూలు కోసం మైక్రో సంస్థల ప్రతినిధులు సహజంగానే ఒత్తిడి తెస్తారు. పర్యవసానంగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలను మూసివేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? అంటే, అదీ లేదు. ఈ పరిస్థితులలో సమస్యను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారానికి దోహదపడాల్సిన రాజకీయ పక్షా లు తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాయి.

తీసుకున్న అప్పులు ఎగ్గొట్టాలని సి.పి.ఐ. నేత నారాయణ ప్రకటన ఇవ్వగానే, తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కూడా ముందూ వెనుక ఆలోచించకుండా అప్పు ఎగవేయవలసింది గా రుణగ్రహీతలకు పిలుపు ఇవ్వడా న్ని ఎలా సమర్థించుకోగలరు? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను కట్టవద్దని పిలుపు ఇచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయి ఉంటారు.

పరిపాలనా దక్షత గల వ్యక్తిగా కీర్తి గడించిన చంద్రబాబు ఇటువంటి సందర్భాలలో చౌకబారు ప్రచారం కోసం పాకులాడటం బాధాకరం. వాస్తవానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన ఈ సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోవచ్చు కూడా. ఎవరు అధికారంలో ఉన్నా సమస్యలు ఉంటూనే ఉంటాయన్న నిర్ధారణకు వచ్చిన ప్రజలు, ఆయా సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించిన వారిని అభిమానించే రోజులు వచ్చాయి.

ఈ సత్యాన్ని చంద్రబాబు గుర్తించవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఒకదాని పొడ మరొక దానికి గిట్టకపోవడం వల్లనే మైక్రోఫైనాన్స్ వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ కారణంగానే గత ఆదివారం నాడు ఎ.బి.ఎన్. ఛానెల్ చొరవ తీసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిపతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వడ్డీ రేటు తగ్గించుకోవడానికి సంస్థల అధిపతులను అంగీకరింపజేసింది.

ఇకపై వడ్డీరేటును 24 శాతానికి మించనివ్వబోమని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులోని నిబంధనలను విధిగా పాటిస్తామ ని మైక్రోఫైనాన్స్ సంస్థల అధిపతులు అంగీకరించారు. ఇందు కు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు రాజకీయ పార్టీలు పూనుకోవాలి. కానీ, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అప్పులు ఎగవేయవలసింది గా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు విలువ తెలిసి వాడుకోవడం కూడా పౌరులకు అవసరమే. ఒకసారి అరాచకత్వం అలవాటు చేస్తే అది మొత్తం సమాజాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుం ది. ఎగవేయడం అంటూ అలవాటైతే, ప్రభుత్వాలకు కట్టే పన్నుల్ని కూడా ప్రజలు ఎగవేయడానికి ప్రయత్నిస్తారు.

గతంలో కరెంటు బిల్లుల విషయంలో ఇలాంటి అనుభవాలే ప్రభుత్వానికి ఎదురయ్యాయి. తీసుకు న్న అప్పులను ఎగవేయ డం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్డినెన్సులో పొందుపరచిన నిబంధనలను పాటించేలా మైక్రోఫైనాన్స్ సంస్థలపై ఒత్తిడి తేవడంతో పాటు, ఎ.బి.ఎన్. ఏర్పాటు చేసిన సమావేశంలో అంగీకరించిన విధంగా 24 శాతానికే అప్పు లభించేలా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కా రం అవుతుంది.

ఒకవేళ పేద ప్రజలకు అప్పుల బాధ నుంచి ఊరట కల్పించాలని రాజకీయ పార్టీలు భావించే పక్షంలో, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు లేదా బ్యాంకులకు గ్రాంటు రూపం లో నిధులు అందే ఏర్పాటుకు కృషి చేయాలి. అంతేగానీ తామే బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తూ, మొత్తం సమాజాన్ని కూడా బాధ్యతారహితంగా మార్చివేసే అధికారం ఏ రాజకీయ నాయకుడికీ లేదు. 

- ఆదిత్య