Friday, September 24, 2010

సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లు తెలంగాణ వస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని మేం ప్రచారం చేశాం.

సీమంద్రులతో వ్యాపారాలు నిజమే
మా వ్యాపారాలపైనా ఉద్యమ ప్రభావం

తెలంగాణకు చంద్రబాబే శిఖండి
పరదేశీ అయినా ఓకే..
ఆంధ్రా నేతలకు మాత్రం అంగీకరించరు
కవిత అడిగితే సిరిసిల్ల సీటిచ్చేస్తా
  * కేటీఆర్
 
మీ పేరు తారకరామారావు. దాంతో వివాదమొస్తే..
ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారేంటని చిన్నప్పటి నుంచీ చాలామంది అడిగారు. కానీ, నా నామకరణం రోజున మా నాన్నగారు అసలు లేరు. నాకు ఈ పేరు పెట్టడంలో ఆయన పాత్ర శూన్యం. (ఆర్కే: ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఆ పేరు పెట్టానని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మా ప్రాంతంవాడు. ఆ పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తే..) నిరభ్యంతరంగా పేరు మార్చుకుంటా. నాకేం అభ్యంతరం లేదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామన్న టీడీపీ వాళ్లను కూడా మీరు వదలడం లేదు. చంద్రబాబు తెలంగాణకు అడ్డుపడుతున్నట్టా?
వంద శాతం చంద్రబాబుది శిఖండి పాత్ర. డిసెంబర్ 9నాడు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తెలంగాణ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడితే.. మీరు టీఆర్ఎస్‌ను టీడీపీలో కలుపుతారా?
తెలంగాణ పోరాటం ఆత్మగౌరవం అనే నినాదంతో ఆంద్రుల ఆధిపత్యంపై జరుగుతుంటే.. తెలంగాణ వచ్చాక టీడీపీ ఎలా ఉంటుంది? తెలంగాణలో ఒక పరదేశీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఆమోదిస్తారేమో కానీ.. ఆంధ్రా నాయకుడి ఆధిపత్యంలోని పార్టీని సమర్థించే మూడ్‌లో లేరు.

తెలంగాణ వాళ్లకు సీమాంధ్ర వ్యక్తి పరదేశీ కంటే కూడా అభ్యంతరకరమా?
ఈరోజు పరిస్థితుల్లో అది వాస్తవం. జార్ఖండ్‌లో ఆర్జేడీ తుడిచిపెట్టుకుపోయినట్లే.. రేపు తెలంగాణలో టీడీపీ నామరూపాల్లేకుండాపోతుందన్నది నా అభిప్రాయం. తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కాంగ్రెస్ అనుకుంటుంది. (ఆర్కే: మీ ఇద్దరూ కలిసినప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీ పోతుంది) మేమనేదీ అదే! సోనియాకు కావాల్సింది ఎంపీ సీట్లు. కాంగ్రెస్, బీజేపీలలో ఒకరిని నిర్ణయించుకోవాల్సి వస్తే టీఆర్ఎస్‌ది లౌకిక విధానం.

హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారు..
అది పూర్తిగా అసంబద్ధం. హైదరాబాద్ మాకు రావడం లేదు కనక మీకు కూడా రానివ్వమంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ఎవరూ నిలువరించలేరు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లు తెలంగాణ వస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని మేం ప్రచారం చేశాం. దానికి అనుగుణంగానే రేపు వ్యవహరించకపోతే నష్టపోయేదీ మేమే. ఇన్‌వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. సీమాంధ్ర కానీ సింగపూర్ కానీ.. వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తాం.

పదిమందిని కలుపుకొని వెళ్లడానికి చూడకుండా వెళుతున్నారనే అభిప్రాయముంది..
పోరాటమే కావూరి, రాయపాటి, లగడపాటి, మేకపాటికి వ్యతిరేకంగా జరుగుతుంటే వాళ్లని కలుపుకొని పోవడం ఎలా? అసలు ఆంధ్రాలో ఎంపీలంతా పెట్టుబడిదారులు.

టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అయిపోయిందిగా..
చూసేవాళ్ల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కవిత పార్టీలో లేదు. ఆమె పార్టీలో భాగస్వామి కాదు.

కావాలని చెల్లెల్ని తొక్కేస్తున్నట్టున్నారు?
తను అడిగితే తనకోసం ఏం చేయడానికైనా సిద్ధం. (ఆర్కే: వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఖాయమా?) తను నుంచుంటానంటే నా సీటు ఇవ్వడానికి కూడా సిద్ధమే. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక వచ్చింది. అది పార్టీకి, ఉద్యమానికి, అందరికీ చావో రేవో ఎన్నిక కనక.. మూడు నెలలు లీవ్ అడిగాను. వాళ్లు ఇవ్వనన్నారు. దాంతో నాన్నగారికి చెప్పకుండానే రిజైన్ చేశాను. సిరిసిల్లలో పోటీ చేయాలని కూడా అనుకోలేదు. అవకాశం వస్తే.. ఎంపీగా వెళ్లాలని అనుకున్నా. అనుకోని పరిస్థితుల్లో సిరిసిల్లలో పోటీ చేశాను. మీకు అహం ఎక్కువని, దురుసుస్వభావమన్న విమర్శ ఉంది.ఇంత తీవ్రమైన విమర్శ ఉందని తెలియదు. మీరు చెప్పిన వాటిని నేను కరెక్టు చేసుకుంటా.

జీవన భృతికి మీరేం చేస్తున్నారు?
రెండు మూడు చేస్తున్నాను. ఫ్రెండ్స్‌తో కలిసి సర్వీస్ అపార్టుమెంట్స్ పెట్టాను. ట్రాక్టర్స్‌ది సీఎన్ఎఫ్ డీలర్ షిప్ ఉంది. కొంత రియల్ ఎస్టేట్ ఉంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఆర్థిక మాంద్యం కావచ్చు వాటి ప్రభావాలు మాపై కూడా పడతాయి. (ఆర్కే: మీకు పార్ట్‌నర్స్ ఎవరు? సీమాం«ద్రులు ఎవరైనా ఉన్నారా?) ఉంటారండి. తప్పనిసరిగా ఉన్నారు. అన్ని ప్రాంతాలవారు ఉన్నారు.

మీ జీవిత లక్ష్యం ఏమిటి?
మా నాన్న పేరు నిలబెట్టాలని. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలని.

మీ ఫాదర్ పదవులు త్యాగం చేశారు కదా! తెలంగాణ వచ్చాక మీరూ అలాగే ఉంటారా?
నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయంగా కొనసాగుతా. గెలిచిన తర్వాత పదవి వస్తే వంద శాతం తీసుకుంటా. అధికారం వచ్చిన తర్వాత పదవులు తీసుకోకపోవడం కూడా కరెక్టు కాదు. 
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో