Sunday, January 9, 2011

మధ్యంతరమా? వస్తుందా?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎంత కాలం ఉంటుం ది? రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవా? ఈ రెండు ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పరిపాలన దాదాపుగా అచేతనావస్థకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళంతోపాటు, తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ మరో అయిదారు రోజులలో నివేదిక ఇవ్వవలసి ఉండటం! ఈ రెండు పరిణామాల వల్ల ప్రభుత్వ మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి.

వాస్తవానికి శాసనసభ కు మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కోరుకోవడం లేదు. మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి న మాజీ ఎం.పి. జగన్మోహనరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. ఎందుకంటే ఎన్నికలు వస్తే తెలంగాణలో టి.ఆర్.ఎస్. గరిష్ఠ స్థాయిలో లాభపడే అవకాశం ఉండగా, సీమాంధ్రలో జగన్ ఎంతో కొంత లాభపడతారు.

అందువల్లే పరిస్థితులు కుదుటపడి పార్టీపై పట్టు వచ్చేవరకు, ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థి తి ఇటు తెలంగాణలో దిక్కుతోచని రీతిలో ఉండగా, సీమాంధ్రలో కూడా అంతంత మాత్రమే కనుక ఆ పార్టీ కూడా ఎన్నికలు కోరుకోవ డం లేదు.

'లక్ష్య' పేరిట విజయవాడలో జగన్ చేపట్టిన దీక్షకు ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు సంఘీభావం ప్రకటించారన్న దాన్ని బట్టి మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంచనా వేయలేని స్థితి! ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులు ఎటూ తేల్చుకోలేని డోలాయమానంలో ఉన్నారు. జగన్‌కు సంఘీభావం ప్రకటించిన వారంతా చివరి వరకు ఆయనతోనే ఉంటారన్న నమ్మకం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని చెబుతున్న వారి ప్రకటనలనూ విశ్వసించలేని స్థితి.

నిజానికి పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఉదయం జగన్‌తో మాట్లాడితే, సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుస్తున్నారు. ఈ పరిణామం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. భారీ ఖర్చుతో విజయవాడ లో చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్షకు ఆశించినస్థాయిలో జనం రాలేద న్న వార్తలు వచ్చాయి. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో రెండవసారి జగన్ చేసిన పర్యటనకూ జనం పలుచబడినట్టు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితి జగన్ వర్గాన్ని సహజంగానే ఎంతో కొంత నిరాశకు గురిచేసింది. కాలం గడిచే కొద్దీ జగన్ ప్రభావం బలహీన పడుతుందన్నది కాంగ్రెస్ ప్రముఖుల అంచనా. అదే జరిగితే, ప్రస్తు తం జగన్‌కు సంఘీభావం ప్రకటించినవారు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉంది. మీడియా ప్రచారం ద్వారా జగన్ గురించి ఎంతో ఊహించుకున్న జనానికి ఆయన ప్రసంగాలు నిరాశ నే మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ ఎటువంటి వ్యూహంతో కదులుతారు? ఆయనకు ప్రస్తుతం కనిపిస్తున్న జనాదర ణ చివరి వరకు మిగులుతుందా? అనే అంశాలు స్పష్టం అయితే గానీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చెప్పలేం. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జగన్ లక్ష్యం. ఈ కారణంగానే విజయవాడ సభలో ప్రసంగించిన ఆయన వర్గీయులు, రైతుల సంక్షే మం కన్నా, రాజకీయ విమర్శలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి మైనారిటీలో పడిన విషయం వాస్తవం. అయితే జగన్‌కు సంఘీభావం తెలుపుతున్న వారంతా రాజీనామాల కు సిద్ధపడతారా? అన్నదీ సందేహమే. వీలైతే మరో రెండు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో జగన్ వర్గం ఉంది. అందుకు అవసరమైన బల సమీకరణకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. 50 నుంచి 60 మంది వరకు శాసన సభ్యులను కూడగట్టగల సత్తా ప్రస్తుతానికి జగన్‌కు ఉంది.

పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఈ సంఖ్య పెరగవచ్చు కూడా. కానీ ప్రస్తుతానికి 50 నుంచి 60 మంది శాసన సభ్యులు తమ సభ్యత్వాలను వదులుకొంటారా? అన్నది ప్రశ్నార్థకమే! రాజీనామా లు చేసి, జగన్ వెంట నడిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ధీమా ఏర్పడితే తప్ప, వారెవ్వరూ ఆ పని చేయడానికి సిద్ధపడ రు. ఈ క్రమంలో సర్వే సంస్థలపై పలువురు ఆధారపడుతున్నారు.

జగన్ బలం ఎంత? అనే విషయం అలా ఉంచితే, రాజకీయంగా జగన్ బలపడే పరిస్థితి ఏర్పడకుండా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహజంగానే కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దాదాపు 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగాలేనందున వారెవ్వరూ మధ్యంతర ఎన్నికలను కోరుకోరు. అలాగని నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ద తు ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు.

జగన్ బలం 60కి పరిమితమయ్యే పక్షంలో (ఇది ప్రస్తుతానికి గరిష్ఠం), ప్రజారాజ్యం-మజ్లిస్ శాసనసభ్యుల సంఖ్య ను కలుపుకొన్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దాదాపు 35 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు తెచ్చుకుని ప్రధాన రాజకీయ పక్షాలైన తాము నష్టపోవడానికి కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు సిద్ధంగా ఉండవు కనుక ఏదో ఒక ఫార్ములా రూపొందే అవకాశం ఉంది.

తాము కనుమరుగై చంద్రశేఖరరావు, జగన్మోహనరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లాభపడటాన్ని ఆ రెండు పార్టీ లు సహజంగానే జీర్ణించుకోలేవు. మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణలో 100 స్థానాలను కైవసం చేసుకోవాలని టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటికిప్పు డు ఎన్నికలు వస్తే, కె.సి.ఆర్ అంచనా వేస్తున్నట్లు, 100 స్థానాలకు కొంచెం కుడిఎడమగా టి.ఆర్.ఎస్. బలం పెరిగే అవకాశం కచ్చితం గా ఉంది. సీమాంధ్రలో పరిస్థితిని ప్రస్తుతానికి అంచనా వేయలేం.

ఈ నేపథ్యంలో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ స్థానంలో మరే ఇతర పార్టీ ఉన్నా అదే పని చేస్తుంది. అటు సీమాంధ్రలో జగన్‌కు, ఇటు తెలంగాణలో కె.సి.ఆర్.కు లాభించే పని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు చేస్తుంది? జగన్ ఇదివరకే సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టినందున, రాష్ట్ర విభజ న జరిగితే సీమాంధ్రలో ఆయనకే లాభం చేకూరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఫలితంగా తెలంగాణ అంశం మరోమారు పీటముడి పడే అవకాశం ఉంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం నామమాత్రమన్న నిర్ణయానికి వచ్చే వరకూ తెలంగాణ అంశాన్ని ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ నాన్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏ సిఫారసులు చేస్తుందన్న విషయం అటుంచితే, అది ఇచ్చే నివేదికను పరిశీలించడానికి మంత్రుల కమిటీని నియమిం చి కాలయాపన చేయవచ్చు.

టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇటువంటి అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. ఉద్యమాల గురించి మాట్లాడకుండా ఆయన, ఎన్నికల గురించి, ఆ ఎన్నికల్లో సాధించవలసిన సీట్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణితో తెలంగాణ ఇప్పట్లో రాదన్న అనుమానాలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌వాదులతో పాటు, కరడుగట్టిన తెలంగాణవాదులు కూడా, ప్రైవేటు సంభాషణల్లో, ఇటువంటి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చి రెండు ప్రాంతాలలో నష్టపోవడానికి కాంగ్రెస్ మాత్రం ఎందుకు సిద్ధపడుతుంది? జగన్ వ్యవహారం ఉండి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ విషయం అలా ఉంచితే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి నెల రోజులు గడిచాయి. కానీ ఇంతవరకు ఆయన అంతరంగం ఏమి టో ఆవిష్కృతం కాలేదు. తాను మొండి మనిషినని రుజువు చేసుకోవడానికి అనుక్షణం ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తాను మెతకగా ఉంటే పని చేయనివ్వరని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రిమొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వపరమైన అంశాల విషయంలోనే కాకుండా, పార్టీ పరమైన విషయాలలో కూడా ఆయన తనకంటూ ఒక టీంను ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. మంత్రులను విశ్వాసంలోకి తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. దీనితో పలువురు సీనియర్ మంత్రు లు ఆయన పట్ల కినుకగా ఉన్నారు. అయినా, ఎవరు ఏమనుకుంటా రు అన్న దానితో నిమిత్తం లేకుండా, కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలి లో వ్యవహరిస్తున్నారు.

రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాల ని కోరుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏడురోజుల పాటు నిరాహారదీక్ష చేసినా, కనీసం ఒక్క డిమాండ్‌ను తీర్చడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వాస్తవానికి అసెంబ్లీలో తాను ప్రకటించిన ప్యాకేజీ కన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వపరంగా కృషి జరుగుతోంది. అయితే చంద్రబాబు దీక్ష చేపట్టినందునే ప్రభుత్వం సాయం పెంచిందన్న అభిప్రాయం రైతుల్లో కలగకుండా ఉండటానికే, అఖిలపక్ష సమావేశంలో ఎవరు ఎంత గొంతు చించుకున్నా, ముఖ్యమంత్రి మొండికేశారు.

ఒకటిరెండు రోజులలో ప్రభుత్వం కొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా సహాయం చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూరరాదన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అంత మొండిగా ఉన్నారు. చంద్రబాబుతో దీక్ష విరమింపచేయడానికి కనీసం మంత్రు ల బృందాన్ని అయినా పంపారు. విజయవాడలో ఆర్భాటంగా జగన్ చేపట్టిన 48 గంటల దీక్షను ముఖ్యమంత్రి కనీసం గుర్తించలేదు.

జగన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. తొలిదశలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి, మలి దశలో రాజశేఖరరెడ్డి ప్రభావాన్ని తగ్గించి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న రెండంచెల వ్యూహంతో ఆయన ఉన్నారు. ప్రజల్లో రాజశేఖరరెడ్డి ప్రభావం తొలగించగలిగితే, జగన్ పరిస్థితి 'నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేప'లా తయారవుతుందని ముఖ్యమంత్రి వర్గీయులు అంచనా వేస్తున్నారు.

వాస్తవం కూడా అదే! రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకొనే జగన్ ప్రస్తుతానికి రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి, తాను కంగారు పడి ఇతరులను కంగారు పెట్టే బదులు, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ క్రమం లో కాంగ్రెస్ అధిష్ఠానం సలహాలు, సూచనలతో రూపొందించుకున్న రెండంచెల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగితే, 2014లో జరిగే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చునన్నది కిరణ్ అంతరంగంగా చెబుతున్నారు.

రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్లు దీక్షలు చేసినా, మరొకటి చేసినా, రాజకీయ ప్రయోజనాలు అంతర్లీనంగా అందులో ఇమిడి ఉంటాయి. చంద్రబాబు చేపట్టిన దీక్ష వెనుక గానీ, జగన్ ముగించుకున్న లక్ష్య దీక్ష వెనుకగానీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎలా ఉంటాయి?! అయితే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలన్నీ, రాజకీయ ప్రయోజనాలను కాసేపు పక్కనబెటి,్ట రైతుల లో ఆత్మ విశ్వాసం పాదుకొల్పడానికి ఏకోన్ముఖంగా ముందుకు కదలవలసిన అవసరం ఉంది.

ప్రతిరోజూ 20 మందికి తగ్గకుండా రైతు లు, ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టిన జగన్ ఆ వెంటనే క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి పులివెందుల వెళ్లిపోయారు. రాజకీ య బల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇచ్చిన ఇటువంటి దీక్షల వల్ల రైతులకు వొనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. రైతులకు ఇప్పుడు కావలసింది పార్ట్ టైం రాజకీయ నాయకులు కాదు. 'మీ వెనుక మేము న్నాం' అని ధైర్యం చెప్పి, ఆదుకునే ఆపన్న హస్తం కావాలి.

ఏడురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి, ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబునాయుడు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి న తర్వాత ఏమి చేయనున్నారో వేచి చూడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడకుండా, రైతులకు సహాయం అందించడానికి చొరవ తీసుకోవలసిన బాధ్యత, ఒక ప్రతిపక్ష నేతగా, తొమ్మిది సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఎక్కువగా ఉంది. చంద్రబాబుకు ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని ఆలోచించకుం డా, రైతులకు వీలైనంత మేర సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యోన్ముఖులు కావాలి.

'సర్వరోగ నివారి ణి జిందా తిలిస్మాత్' అన్నట్లు, అన్ని సమస్యలకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారం అని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే బదులు, తెలంగాణ జిల్లాలలో గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ముందుకు రావలసిన అవసరం ఉంది. తనకు ఎంతమంది శాసనసభ్యులు మద్ద తు ఇస్తారన్న లెక్కలకు కాసేపు స్వస్తి చెప్పి, రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంది. మరి వీళ్లంతా కలసి కదులుతారా? 

-ఆదిత్య


Wednesday, January 5, 2011

తేల్చేద్దాం! * 'తెలంగాణ'పై అనిశ్చితి అంతానికే కేంద్రం మొగ్గు * శ్రీకృష్ణ నివేదికలో స్పష్టమైన రోడ్ మ్యాప్ * పార్టీలు తేల్చుకోవాలి పరిష్కారం వాటి చేతుల్లోనే

 
ప్రాధాన్య క్రమంలో ఆరు సిఫారసులు
అదే విధానంలో పరిష్కారానికి యత్నాలు
గురువారం ఉదయం 11 గంటలకే పార్టీలతో భేటీ
స్పందించేందుకు 10 రోజుల సమయం
స్పష్టత ఇవ్వకుంటే తుది నిర్ణయం కేంద్రానిదే
రాష్ట్ర విభజనపై తేల్చేద్దాం... అనిశ్చితిని అంతం చేద్దాం... సాగదీతకు ఫుల్‌స్టాప్ పెట్టి, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేద్దాం..!! ఇవీ కేంద్రం మదిలో తాజా ఆలోచనలు. రాష్ట్రంలో సామాజిక ఆందోళనలు.. విభజన అంశంపై కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణం ఎక్కువకాలం కొనసాగితే మంచిది కాదన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కార మార్గాలు చెప్పిందని, స్పష్టమైన ఆ రోడ్‌మ్యాప్‌ను ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల ఆరున ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం యథాతథంగా జరుగుతుందని, ఆ సమావేశంలో నివేదికను అందజేయడంతో పాటు.. నివేదిక సారాంశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని సమాచారం. ఆ వెంటనే నివేదికను మధ్యాహ్నం రెండు గంటలకల్లా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ప్రతి స్పందించేందుకు రాజకీయ పార్టీలకు పది రోజుల పాటు సమయం ఇస్తారని తెలుస్తోంది.

నివేదికపై రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇక నిర్ణయం కేంద్రమే తీసుకుంటుందని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన ఆరు పరిష్కార మార్గాల్లో ఒక్కోదానికి ఒక్కో గ్రేడ్ ఇచ్చారని తెలిసింది. ఈ ఆరింటిలో మొదటి పరిష్కారమే ఉత్తమ మార్గమని కమిటీ అభిప్రాయపడుతోందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఒక వేళ మొదటి పరిష్కారం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు భావించిన పక్షంలో రెండవ పరిష్కారంవైపు దృష్టి పెడతారు.

దీన్నీ తిరస్కరిస్తే మూడోది.. అలాగే ఇతర పరిష్కార మార్గాలపైనా చర్చ జరుగుతుందని హోం శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇదే విధంగా కొనసాగించడమా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమా? సమైక్యాంధ్రలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పించడమా? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు సూచించడమా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమా? లేక రెండు ప్రాంతాల రాజధానిగా కొనసాగించడమా, మూడు రాష్ట్రాలుగా విభజించడమా, లేక రాయలసీమను తెలంగాణలో విలీనం చేయడమా? ఇలా అనేక అంశాలను కమిటీ చర్చించిందని తెలిసింది. ఇందులో ఏ పరిష్కార మార్గానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందో ఇప్పుడే చెప్పడానికి హోంశాఖ వర్గాలు నిరాకరించాయి.

రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే రాష్ట్రం విషయంపై కేంద్రం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుందని ఈ వర్గాలు చెప్పాయి. వారి అభిప్రాయానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ విభజనకే నిర్ణయించిన పక్షంలో తాత్కాలికంగా ఉభయ ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించడమో, విజయవాడ, గుంటూరులను నూతన రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించడమో జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి.

తాము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నామని పేర్కొన్నాయి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు గతంలో ఒక అభిప్రాయం చెప్పి, తాము ప్రకటన చేసిన తర్వాత కేంద్రంపై నింద వేశాయని, ఇప్పుడు ఆ ఆవకాశం లేకుండా ఆ పార్టీలు స్పష్టత ఏర్పర్చుకోవాల్సి ఉన్నదని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను స్పష్టంగా, పరిస్థితిని యథాతథంగా నివేదించిందని, ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేమని, రాజకీయ పార్టీలు కూడా ఈ నివేదికను తమ నిర్ణయానికి ఆధారంగా స్వీకరించాలని ఈ వర్గాలు సూచిస్తున్నాయి. కాగా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర హోంమంత్రి చిదంబరం సంప్రదిస్తున్నారని, వారు ఢిల్లీకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి. వారు రాకపోతే నివేదికను వారికి చేరేలా చేస్తామని ఈ వర్గాలు చెప్పాయి.
Click Here!

పార్టీలు తేల్చుకోవాలి
పరిష్కారం వాటి చేతుల్లోనే
అవి కోరినంత కాలం చర్చలు

అనిశ్చితి ఎంత కాలమో నాకూ తెలియదు
6న అర్థమవుతుంది
ఇద్దరేసి చొప్పున రమ్మనడం భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించడం కాదు
ఎంత మందిని పంపాలో పార్టీల ఇష్టం
చిదంబరం వ్యాఖ్యలు
 అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో ఆరో తేదీ దాకా నాకూ తెలియదు.. తెలంగాణకు పరిష్కారం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంది..! కోరుకున్నంత కాలం చర్చలు జరపడానికి సిద్ధం! ఇవీ కేంద్ర హోం మంత్రి నోట వెలువడిన మాటలు!! శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసేందుకు ఈ నెల ఆరున ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు! ఆహ్వానించిన అన్ని పార్టీలూ తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతాయన్న ధీమా వ్యక్తం చేసిన చిదంబరం.. ఈ భేటీలో ఏ పార్టీ ఏం చెబుతుందో వేచి చూడాలని అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఎంతకాలం చర్చలు కొనసాగించాలన్న విషయం రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. దాని గురించి ఆ పార్టీలే తేల్చుకోవాలని, కాలపరిమితి గురించి తాను చెప్పలేనని చిదంబరం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చర్చలు కొనసాగించాలని కోరుకున్నంత కాలం తాను చర్చలు జరుపుతానని తెలిపారు. సమస్యను నాన్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వ్యాఖ్యానాల్ని ఆయన ఖండించారు. "నాకు ఉద్దేశాలు అంటకట్టకండి.'' అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు.

జవవరి 6న మీరు విస్తృత చర్చలు జరుపుతారా, లేక కేవలం నివేదిక ఇచ్చి ఊరుకుంటారా? అని అడిగినప్పుడు రాజకీయ పార్టీలు సమావేశంలో స్పందించే తీరును బట్టి చర్చలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 6న కమిటీ నివేదికపై చర్చించేందుకు ఒక పార్టీ నుంచి ఇద్దర్ని ఆహ్వానించినంత మాత్రాన ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నామని కాదని ఆయన వివరణ ఇచ్చారు.

గత జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి చర్చించేందుకు 8 పార్టీల నుంచి ఇద్దర్ని ఆహ్వానించామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించామని ఆయన చెప్పారు. ఇద్దర్ని మాత్రమే పంపాలన్న నిబంధన ఏమీ లేదని, పార్టీ ఒక్కర్ని కూడా సమావేశానికి పంపించవచ్చునని చిదంబరం స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఇద్దరు వచ్చినంత మాత్రాన వేర్వేరు అభిప్రాయాలు చెబుతారని కూడా చెప్పలేమని అన్నారు.

గత సమావేశంలో కూడా సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చిదంబరం గుర్తు చేశారు. జనవరి 6 సమావేశాన్ని టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు బహిష్కరిస్తున్న సంగతిని ప్రస్తావించగా.. "చూద్దాం..'' అన్నారు. నివేదిక అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్, సీపీఐలు సమయం కోరుతున్నాయని చెప్పినప్పుడు "వారు జనవరి 6న ఏం చెబుతారో చూడాల్సి ఉంది..'' అని స్పందించారు.

టీఆర్ఎస్ ఈ సమావేశంలో పాల్గొంటుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. జనవరి 6న ఏం జరుగుతుందో, పార్టీలు ఏమి చెబుతాయో చూడకుండా ఇప్పుడే తాను మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని పార్టీలూ ప్రజాస్వామ్య క్రమం కొనసాగేలా చూడడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Click Here!
భయం వద్దు !
pc-chindambram తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ ప్రకటించినా, ఆరో తేదీన జరిగే చర్చలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది రాజకీయ పార్టీలూ హాజరవుతాయన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ‘అఖిలపక్ష సమావేశానికి ఎనిమిది పార్టీల్నీ ఆహ్వా నించాం. మొత్తం ఎనిమిది పార్టీలూ సమావేశానికి హాజరవుతాయన్న నమ్మకం నాకుంది’ అని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం విలేకరులకు తెలి పారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరిపి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చిదంబరం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఒక్కో పార్టీ నుంచీ ఇద్దరు ప్రతినిధుల్ని ఆహ్వానించి, కేంద్రం భిన్నాభిప్రాయాల్ని కోరుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలను గురించి అడగ్గా చిదంబరం -‘అలా అనడం సరికాదు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు కేంద్రం 2010 జనవరి 5నప్రతి పార్టీనుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఆహ్వానించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాం’ అన్నారు. అ యితే, ఏ పార్టీ అయినా ఒక ప్రతినిధిని కూడా పంపవచ్చ న్నారు. ‘గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే, ఫలానా పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే, వారు రెండు అభి ప్రాయాల్ని వ్యక్తం చేస్తారని అనుకోకూడదని తెలిసింది. 2010 జనవరి 5న జరిగిన సమావేశానికి సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నుంచి ఇద్దరేసి ప్రతినిధులు హాజరైనా, ఒక్కో పార్టీ తరఫున ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.

అయినా, ఇదో సమస్య కాదు. ఆరున జరిగే సమావే శంలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారు ఒకరిని లేదా ఇద్దరిని పంపవచ్చు. అది వారిష్టం’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘గురువారం సమావేశంలో తాము పాల్గొనడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు ప్రకటించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందా?’ అని విలేకరులు అడగ్గా - ‘ఆరున ఏం జరుగుతుందో చూద్దాం’ అని చిదంబరం సమాధానమిచ్చారు. నివేదిక వెల్లడి అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లు జరగవని, అల్లర్లు జరుగుతాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని చిదంబరం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు లక్ష్మణరేఖ
telangana-mps
కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపీలను ఆ పార్టీ అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. తెలంగాణ ప్రాంత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరు కూడా బుధవారం మధ్యాహ్నం హస్తినలో అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మంగళవారం ఎంపీలకు ఫోన్‌ చేసి బుధవారం ఒంటిగంట వరకు ఢిల్లీకి చేరు కోవాలని సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, మరో కేంద్ర మంత్రి గులాం నబీఆజాద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ తదితరులు తెలంగాణ ఎంపీలతో భేటి కానున్నారు.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్ప టికే కొందరు ఎంపీలు ఢిల్లీ చేరుకోగా, మరి కొందరుబుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళనున్నారు. సమావేశం ఎజెండా ఏమిటో ఇప్పటి వరకు ఎంపీలకు సైతం తెలియరానప్పటికీ, గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంపీల వైఖరి, ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం తరువాత శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం వెల్లడించనున్న నేపధ్యంలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తగు సూచనలు చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మందలింపులా?
ఇటీవలి కాలంగా పార్టీ తెలంగాణ ఎంపీల వ్యవహార శైలీపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు వినిపిస్తోంది. డిసెంబర్‌ 22 నుంచి తెలంగాణ ఎంపీలు గట్టిగా వ్యవహరించడం, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలంటూ సీనియర్‌నేత, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ కె.కేశవరావుతో సహా 10 మంది ఎంపీలు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష ప్రారంభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఇద్దరు మంత్రులు సైతం దీక్షా శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. తెలంగాణ కోసం అవసరమైతే మాతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైకమాండ్‌ను ధిక్కరించే స్థాయిలో వీరు వ్యవహరించారని సీమాంధ్ర నేతలు ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు ఇబ్బంది కరంగా పరిణమించింది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే అన్నింటికి సిద్ధమని, అవసరమైతే పదవులను సైతం వదులుకుంటామని కేకేతో సహా పలువురు నేతలు హైకమాండ్‌కు హెచ్చరించినంత పనిచేశారు. ఈ నెల 7వ తేదీ మరో సారి భేటి అయి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భవిష్యత్‌ కార్యచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతల సమావేశాల్లో పలువురు నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా హైకమాండ్‌ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో సీరియస్‌గా ఉన్న అధిష్ఠానం కంట్రోల్‌ చేయక పోతే మళ్ళి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని భావించే తెలంగాణ ఎంపీలను ఢిల్లీకి పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంపీల తీరుపై అధిష్ఠానం నేతలు మందలించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, గీత దాటితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమే కాకుండా ఎంపీలకు లక్ష్మణరేఖ విధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

బుజ్జగింపులా?

తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకే అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిపించినట్లు పార్టీలో మరో వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్‌లు మినహాయించి మిగతా 10 మంది ఎంపీలు తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి సైతం వెనుకాడబోమని ఇటీవలే స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటీ గత వారం ఎంపీలు చేపట్టిన దీక్షకు పై నలుగురు ఎంపీలు దూరంగా ఉన్నారు.

pranabaమరో ఎంపి విహెచ్‌ ఎంపీల దీక్షలో పాల్గొనక పోయినా సంఘీభావం తెలియజేశారు. పది మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి బాటను అనుసరిస్తే పార్టీకి లేని పోని సమస్యలు రావడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది ఎంపీలు ఒక్క తాటిపై ఉండి తెలంగాణ విషయంలో ఇక వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పడం, విద్యార్ధులపై కేసుల ఎత్తివేత విషయంలో దీక్షకు దిగన సమయంలో , హైకమాండ్‌ పలు మార్లు సంప్రదించి, దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా అలాగే కొనసాగించారు.

తెలంగాణ పేరుతో ఎంపిలు తిరుగుబాటు చేస్తే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారవుతుందని పార్టీ నాయకత్వానికి భయం వెంటాడుతున్నట్లు వినిపిస్తోంది. మరో వైపు కేంద్రం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాకుండా కొంత కాలం తరువాత తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ ఎంపీలకు హైకమాండ్‌ నచ్చజెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్‌ఎస్‌కు లాభం చేకూరకుండా, అది కాంగ్రెస్‌ వల్లే వచ్చిందనే భావం ప్రజల్లో ఏర్పడే విధంగా చూడాల్సిన వసరం ఉందని, అందుకే కాస్త జాప్యం జరిగినా మీరు ఓపికపట్టాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి అనంతరం మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడకుండా సంయమనం పాటించాలని పార్టీ ఎంపీలను అధిష్ఠానం నచ్చజెప్పే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలో వినిపిస్తోంది.

నేడు ఢిల్లీకి డిఎస్‌, సిఎం
పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం వేర్వేరుగా ఢిల్లీకి బయలు దేరి వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు వీరు అక్కడే ఉంటారు. 6వ తేదీన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడించనున్నందున వీరు హస్తినకు వెళుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించడంతోనే పీసీసీ చీఫ్‌ డిఎస్‌ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కావాల్సి ఉండటంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ఎంపీలతో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమావేశంలో వీలును బట్టి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.

మాకేనా హద్దులు ?
 మాకే నా హద్దులు. సీమాంధ్ర ఎంపీలకు వర్తించవా? పార్టీ నుంచి బయటికి వెళ్ళిన జగన్‌కు మద్దతు పలుకుతూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదిరిస్తున్న ఎంపీల విష యం పట్టదా? మేము పార్టీని బతికించుకోవడానికి నానా పాట్లు పడుతుంటే, వాళ్ళు పార్టీకి నష్టం కలి గించే విధంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు అధిష్ఠానం తీరుపై తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం హస్తినలో హైక మాండ్‌ ఏర్పాటు చేసిన సమావేశం తెలంగాణ ఎంపీలను కట్టడి చేయడానికేనని ప్రధానంగా ప్రచా రం జరుగుతుండడంతో ఆ ప్రాంత ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజల కోసం, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తాము దీక్షలు చేపడితే అదేదో పెద్ద నేరంగా, పార్టీకి చేసినద్రోహంగా చిత్రీకరించి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించడం, కొందరి మాటలు విని హైకమాండ్‌ తమతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇటూ పార్టీలో, అటు ప్రజల్లో తాము చులకనయ్యే అవకాశాలుంటాయని ఎంపీలు మండిపడుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో తాము మౌనంగా ఉంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరని, తెలంగాణకు అంగీకరించి కమిటీ వేసి ఇప్పుడేమో తెలంగాణ ఇచ్చేది లేదంటే జనం కాంగ్రెస్‌ను ఎన్నడు నమ్మె పరిస్థితి ఉండదని తెలంగాణ ఎంపీలు అంటున్నారు. పైగా తాము ఇటీవల దీక్షలు చేపట్టింది కూడా విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసమే తప్ప, మరొకటి కాదన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటనను, పార్లమెంట్‌లో ఇచ్చిన హమీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందుకే తాము దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని వారంటున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పనిచేయక పోతే తెలంగాణలో పార్టీకి పుట్టగతులు ఉండని పరిస్థితులు వస్తాయని ఒక ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాము ఉద్యమించక పోతే రేపటి రోజు తెలంగాణలో జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికి ఉండాలంటే తాము నడుస్తున్న దారి సరైనదని మరో ఎంపీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తున్నదని ప్రజల్లో భావం ఏర్పడుతున్నదని, అలాంటి పరిస్థితులు రాకుండా తాము ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీ అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన జగన్‌కు మద్దతుగా నిలుస్తూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, ఓదార్పు యాత్ర కోసం కార్యాలయాలను నెలకొల్పుతూ, సోనియాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్‌ మాట్లాడినా అతని వెంటే ఉంటూ అతనికి జై కొట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్న సబ్బం హరి లాంటి ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీనియర్‌ ఎంపి ఒకరు ప్రశ్నించారు.

వాళ్ళు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నా అధిష్ఠానం మౌనంగా ఉంటున్నదని, తాము పార్టీని పటిష్టం చేయడానికి దీక్షలు, తెలంగాణకు మధ్దతుగా మాట్లాడితే ఏదో నష్టం జరిగిపోయినట్లు స్పందించిన తీరు బాగులేదని ఆ ఎంిపీ అధిష్ఠానం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం చూసుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మరో ఎంపి వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అయినా ఓట్లు వేసే జనం పక్షాన నిలబడక పోతే, వారి సానుభూతి, సహకారం లేక పోతే గెలువగలమా? అధిష్ఠాం గెలిపిస్తుందా? అని ఆ ఎంపి ప్రశ్నించారు. తాము తెలంగాణ ప్రజల అభిష్ఠాల మేరకే వ్యవహరిస్తున్నామని, ఎక్కడ కూడా పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించడం లేదని ఎంపీలు పేర్కొన్నారు. బుధవారం హైకమాండ్‌తో జరిగే భేటిలో ప్రణబ్‌, ఆజాద్‌, మొయిలీలకు తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

చేతులెత్తేసిన కిరణ్‌, డీఎస్‌
krian-sirr 
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వివరాల వెల్ల డికి సమయం సమీపిస్తోన్న నేప థ్యంలో తమ పార్టీకి చెందిన పార్ల మెంటు సభ్యులను కట్టడి చేసే బాధ్య తను అధిష్ఠానమే స్వయంగా భుజం మీద వేసుకుంది. అయితే, ఆ అం శంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తమ వల్ల కాదంటూ చేతులెత్తేయడ ంతో నేరుగా అధిష్ఠానమే రంగంలో దిగడం అనివార్యమయింది. విశ్వస నీయ సమాచారం ప్రకారం... శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అను కూలంగా రాకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను ఎన్నిసార్లు స్వయంగా వెళ్లి నచ్చచెబుతున్నా మాట వినడం లేదని పీసీసీ అధ్యక్షుడు డిఎస్‌ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వైఖరి వల్ల టీఆర్‌ఎస్‌ లాభపడటమే కాకుండా, తెలంగాణవాదం బలపడి అది ప్రత్యక్షంగా శాంతిభద్రతల సమస్యగా మారి, పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తోందని సీఎం కూడాఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన దీక్ష వల్ల సొంత పార్టీ ఎంపీలే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న భావన ప్రజల్లో నెలకొందని సీఎం నాయకత్వానికి వివరించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉండాలన్న తమ మాటను ఎవరూ లెక్కచేయకుండా, తెలంగాణపై గట్టిగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో కాంగ్రెస్‌ ఎంపీలు సొంత అజెండాతో వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని కిరణ్‌ నాయకత్వానికి వివరించారు.

dss తాను కూడా వారికి ఇటీవలి కాలంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మాటవినడం లేదన్నారు. దానికితోడు.. వెంకట స్వామి, కేశవరావు, హన్మంతరావు, మధుయాష్కీ, సర్యే సత్యనారా యణ, వివేక్‌ వంటి నాయకులంతా సీనియర్లయినందున తన స్థాయి కూడా సరిపోవడం లేదని, వారికి తాను చెప్పినా వినే పరిస్థితి లేదని కిరణ్‌ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కేశవరావు మీదే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేకేనే దీనిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలను కిరణ్‌ తన వాదనలకు మద్దతుగా పంపించారు. అయితే నిజానికి.. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, జగన్‌ తిరుగు బాటు వ్యవహారాన్ని తాను సమర్థవంతంగా అణచివేస్తానన్న భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కిరణ్‌, తీరా అధిష్ఠానానికి తానిచ్చిన హామీలలోనే వైఫల్యం చెందడ ం ప్రస్తావనార్హం.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై స్పీకర్‌ హోదాలో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంతో పాటు, అనేకసార్లు స్వయంగా అధిష్ఠానం వద్ద పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి, ఢిల్లీకి దగ్గర య్యారు. ఆ తర్వాత కీలకమైన ఆ రెండు అంశాలపై నిర్దిష్ట హామీ ఇచ్చి సీఎం పదవి పొందిన కిరణ్‌, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని నియంత్రించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేడయం చర్చనీయాంశమయింది. జగన్‌ వైపు రెడ్డి వర్గం వెళ్లకుండా ఉండేందుకే మంత్రివర్గంలో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు, కీలక హోదాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన కిరణ్‌, తెలంగాణ అంశంలో తానిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయి, చివరకు ప్రణబ్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.

తాము చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం, తన స్థాయి, అనుభవం, వయసుకు మించి నాయకులు ఉండటంతో.. మీరు జోక్యం చేసుకోకుంటేనే జనవరి 6 తర్వాత పరిస్థితులు ప్రభుత్వం చేతులో ఉంటాయని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తర్వాతే ప్రణబ్‌ ముఖర్జీ రంగప్రవేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కావాలని తెలంగాణ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీకి బహుశా ముఖ్యమంత్రితో పాటు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ కూడా హాజరుకావచ్చంటు న్నారు. తాజా పరిస్థితి, పరిణామాలు పరిశీలిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి చేతులు దాటినట్లు స్పష్టమవుతోంది. వారిద్దరికీ ఎవరూ మాట వినడం లేదన్న వాస్తవం రుజువయిపోయింది.

అంతా ఢిల్లీ స్థాయి నేతలు కావడం, వారికి అధిష్ఠానంలో ఏదో ఒక స్థాయిలో పలుకుబడి ఉండటంతో సీఎం, డీఎస్‌ చేతులెత్తేయవలసి రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ప్రస్తుత తెలంగాణ సీనియర్ల అనుభవం-వయసుతో పోలిస్తే చిన్నవాడు కావడం కూడా ఇబ్బందికలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలోనూ దాదాపు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడిని పక్కకుపెట్టి.. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నేరుగా అధిష్ఠానమే చూసేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఏర్పడుతోంది.

Monday, January 3, 2011

6న భేటిపై రగడ * జనవరి 'ఆరు'పై అరవై వాదనలు * తెలంగాణకు తెర * నివేదిక సీఎం చేతుల్లో !


అఖిలపక్షానికి వెళ్లం..మళ్లీ గోల్‌మాల్‌కే సమావేశం : కేసీఆర్
ఒక్కో ప్రతినిధినే పిలవాలంటూ చిదంబరానికి లేఖ
అసలు కమిటీనే పనికిమాలినది... మేమూ ఢిల్లీ వెళ్లం : బీజేపీ
మీరూ వెళ్లొద్దు...నారాయణకు కేసీఆర్ వినతి
తిరస్కరించిన సీపీఐ... భేటికి వామపక్షాల ,పీఆర్పీ రెడీ
సోనియాను పిలిస్తే బాబూ వస్తారు... కేసీఆర్ మెలికపై టీడీపీ
కథ అడ్డం తిరిగింది. కేంద్రం అనుకున్నదొకటి. జరుగుతున్నది మరొకటి! తాంబూలాలు ఇచ్చేద్దాం అని కేంద్రం భావిస్తే.. దానికి ముందే తన్నులాటలు షురూ అయ్యాయి!! ఆరో తేదీ రాకుండానే.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బయటపడకుండానే.. అఖిల పక్షంలోని పార్టీలు తలో పక్షంగా మారిపోయాయి. నివేదికతో సంబంధం లేకుండా అఖిలపక్ష భేటీపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రానికే షరతులు విధిస్తున్నాయి.

అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని కొన్ని పార్టీలు ప్రకటిస్తే.. మాకు టైం కావాలని మరికొన్ని డిమాండ్ చేస్తున్నాయి. అసలా భేటీయే దండగ అని మరికొన్ని ఈసడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆరో తేదీ భేటీపై అసలు కేంద్రం వైఖరి ఏమిటి? పార్టీల డిమాండ్లను పట్టించుకుంటుందా!? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. నెలనెలా కేంద్ర హోం శాఖ నిర్వహించే విలేకరుల సమావేశం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీల వైఖరులపై చిదంబరం తన స్పందనను వ్యక్తం చేసే అవకాశం ఉంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ఈనెల ఆరో తేదీన 8 గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని.. అప్పటికప్పుడే అభిప్రాయాలు చెప్పాలని ఆహ్వానిస్తూ చిదంబరం లేఖలు రాశారు. ఆ లేఖలోని కేంద్రం మెలికకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధినే ఆహ్వానించాలని.. ఒక్క అభిప్రాయాన్నే చెప్పమనాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్నారు. మళ్లీ గోల్‌మాల్‌కే ఆరోతేదీ భేటీ అన్నారు. ఇద్దరేసి ప్రతినిధులు వస్తే.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారని, ఏకాభిప్రాయం లేదని కేంద్రం తప్పించుకుంటుందని, తెలంగాణ సమస్యను తాత్సారం చేయడానికే ఈ ఎత్తు అని ధ్వజమెత్తారు. కేంద్రమే కిరికిరి చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు చిదంబరానికే ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఇక, ఈ అఖిలపక్ష భేటీ.. పనికిమాలిన, పనికిరాని సమావేశమని బీజేపీ తేల్చేసింది. దానిని తాము బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీనే తాము గుర్తించడం లేదని, ఇక అదిచ్చే నివేదికను గుర్తిస్తామా!? అని ప్రశ్నించారు. అయితే.. ప్రజారాజ్యం పార్టీతోపాటు వామపక్షాలు మాత్రం భేటీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రతినిధులను కూడా ఎంపిక చేశాయి. అఖిలపక్ష భేటీకి వెళ్లవద్దంటూ కేసీఆర్ కోరినా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

అంతేనా.. మీరు కూడా పాల్గొని పార్టీ వాదనను అక్కడే వినిపించండి అంటూ కేసీఆర్‌కే ఆయన హితవు పలికారు. అయితే.. సీపీఐతోపాటు పీఆర్పీ కూడా నివేదిక అధ్యయనానికి తమకు మరికొంత సమయం కావాలంటూ చిదంబరానికి లేఖలు రాశాయి. ఇక, కేసీఆర్ 'ఝలక్'పై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లి భయపడుతోందని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాను పిలిపిస్తే.. టీడీపీ తరఫున చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వస్తారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ నుంచి ఒక్కొక్కరినే పిలవాలన్న కేసీఆర్ వాదనను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, కడియం శ్రీహరి సమర్థించారు. కానీ, పార్టీ అధ్యక్షులనే పిలవాలని మెలిక పెట్టారు. నివేదికపై అసలు అఖిలపక్షమే అనవసరమని తేల్చేశారు. ఈ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఇచ్చాక అఖిలపక్షం దండగ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే.. కేసీఆర్ వాదనతో తమకు పని లేదని, అఖిలపక్ష భేటీకి వెళతామని మరో ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు.

కేసీఆర్‌ది పలాయన వాదమని సీమాంధ్రనేతలు విమర్శించారు. ఇక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కేకే మరికాస్త ముందుకెళ్లారు. సీడబ్ల్యూసీ పదవి తనకు ముఖ్యం కాదని, తెలంగాణ రాకపోతే ఆ పదవిని విసిరి పారేస్తానని వ్యాఖ్యానించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తెలంగాణ రాదా!? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈ దెబ్బతో తెలంగాణ సమస్య ఖతం కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు.

పొలిటికల్ బెటాలియన్ ఎవరి వాదనను వారు వినిపిస్తుంటే.. పోలీస్ బెటాలియన్ వాడవాడలా కవాతు చేస్తోంది. పికెట్లు, తనిఖీలతో రాష్ట్ర రాజధానిలో గుబులు పుట్టిస్తోంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో తెలంగాణ చిక్కుముడి.. అఖిలపక్షానికి ముందే పీటముడి పడుతోంది. ఈ ముడిని చిదంబరం విప్పుతారా!? మరో ముడి వేస్తారా!?.


అఖిలపక్ష భేటీకి రాం.. *  చిదంబరానికి కేసీఆర్ ఝలక్

ఒక్కోపార్టీ నుండి ఇద్దరేసి సభ్యులన్నందుకే తిరస్కరిస్తున్నామని ప్రకటన
తెలంగాణ సమస్యను జటిలం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది
అనైతిక చర్యలకు పాల్పడుతూ, కాలయాపన చేసేందుకు యత్నిస్తోంది
ఒక పార్టీ.. ఒక్క అభిప్రాయమే చెప్పాలి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి
అభివృద్ధి ఒక్కటే కాదు.. ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలి

టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ నిమిత్తం కేంద్ర హోంశాఖ ఈ నెల 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాము హాజరు కాబోమని టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఒక్కో రాజకీయ పార్టీ నుంచిఇద్దరు వ్యక్తులను పంపాలంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం పంపిన ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు విజయశాంతి, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో కేంద్రం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భేటీ ఏర్పాటు చేసిన పద్ధతి సక్రమంగా లేదని, గతాన్ని పునరావృతం చేసే విధంగానే ఉందని కేసీఆర్ విమర్శించారు. ఇటువంటి సమావేశాల వల్ల ఫలితం రాదని, అందువల్ల తాము అఖిలపక్ష సమావేశానికి రాబోమని తేల్చిచెపుతూ హోంమంత్రి చిదంబరానికి లేఖ రాశారు.
ఇద్దర్ని ఎలా పిలుస్తారు..?

‘ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరిని ఆహ్వానించడం ఆశ్చర్యకరం. ఒకే పార్టీకి చెందిన రెండుప్రాంతాల వారు అక్కడకొచ్చి కలహించుకుని కొట్లాడుకునే విధంగా ఈ ప్రయత్నం ఉంది. చాట్లో తవుడుపోసి కుక్కలకు కొట్లాట పెట్టేవిధంగా, తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుని చావండనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని తాత్సారం చేసి, జటిలంగా మార్చి, మరింత కాలం నానబెట్టాలనే ధోరణి వారిలో కనిపిస్తోంది. ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు సభ్యులను పిలిచి కేంద్రమే కావాలని అనైతిక విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే చిదంబరం ఆహ్వానాన్ని బాధతో తిరస్కరిస్తున్నా..’ అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోనూ, తెలంగాణ మేధావులతోనూ చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏడాదికిందట అఖిలపక్ష సమావేశంలో ఇద్దరిని పిలిచి చేసిన తప్పే శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రస్తుతం చేసిందన్నారు. పార్టీ నుండి ఒక్కటే నివేదికను కాకుండా ఆయా పార్టీలో భిన్నాభిప్రాయాలను తీసుకుని తప్పుచేసిందని విమర్శించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయటం ‘పెళ్లి తర్వాత పెళ్లిచూపుల వంటింద’ని మండిపడ్డారు.
కేంద్రం నిర్ణయం అనైతికం..
‘కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకపార్టీ నుండి ఒకే అభిప్రాయం వచ్చేవిధంగా చూడాలి. ఇద్దరిని ఆహ్వానించడం వల్ల ఏకాభిప్రాయం రాలేదంటూ తెలంగాణ అంశాన్ని మరింత కాలయాపన చేస్తరు. ఒక పార్టీ నుండి ఇద్దరిని పిలవాలనే నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుంది. ఒకేపార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చే అనైతిక పద్ధతులకు కేంద్ర నిర్ణయమే ఆస్కారాన్నిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయం కూడా చెప్పాలంటే ఎలా సాధ్యం? డిసెంబరు 10న పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తారా లేదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు. పిడికెడు మంది స్వార్థపరులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు మినహా తెలంగాణ ఏర్పాటుకు అక్కడి ప్రజలు వ్యతిరేకంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని గుంటూరులో ఇటీవల టీడీపీ నిర్వహించిన రైతుకోసం సభలో ఎంతోమంది సాధారణ ప్రజలు మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. శ్రీకృష్ణ కమిటీపై విశ్వాసం లేకున్నా ఇప్పటివరకూ ఓపిక పట్టామన్నారు. ఈ కమిటీలు, నివేదికలతో సంబంధం లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధితో తెలంగాణ అంశాన్ని ముడిపెట్టలేమని, ఆత్మగౌరవం, స్వయంపాలనను ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. నివేదికలోని అంశాలేమిటో తెలియకుండా తొందరపడి వ్యాఖ్యానించడమెందుకని, 6వ తేదీ దాటితే నివేదిక ఇంటర్నెట్‌లోనే ఉంటుందన్నారు. నివేదికలోని అంశాలను చూసిన తర్వాతనే ఎలా స్పందించాలనేది నిర్ణయిస్తామని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణకు తెర
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అఖిలపక్షాన్ని ఆహ్వానించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సాధ్యమైనంత కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదా?...అసలు కమిటీ ఉద్దేశమూ అదేనా?...ఇలా కాలయాపన చేయటం ద్వారా క్రమంగా తెలంగాణ అంశాన్ని తెర చాటుకు పంపించాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించుకున్నదా?...వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏ ఒక్క ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఇతర ప్రాంతాలకు చెందిన ఎంపీలు దూరమయ్యే ప్రమాదం ఉంది కనుక నిర్ణయాన్ని వాయిదా వెయ్యడమే ఉత్తమమని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

final-tngf 
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6 తేదీన ఢిల్లీలో అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించటంలోనే కేంద్ర ప్రభుత్వ తాత్సారవైఖరి తేలిపోతున్నదని తెలంగాణకు పూర్తి మద్దతు పలుకుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ లాంటి పార్టీలు స్పష్టం చేస్తున్నా యి. గత ఏడాది జనవరి ఐదున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇలాగే అఖిలపక్షాన్ని పిలిపించారు. ఒక్కో పార్టీ నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు వెళ్ళి తమ ప్రాంతాలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పటం, ఏకాభిప్రాయం ఏ పార్టీలోనూ లేదన్న సాకు చూపిన కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసి బంతిని ఆ కోర్టులోకి నెట్టటం జరిగింది. ఇప్పుడూ అలాగే ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిచి, ఏ పార్టీకీ ఏకాభిప్రాయం లేదన్న సాకు చూపి తెలంగాణ అంశాన్ని అటకెక్కించటమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ అంటున్నాయి.

అసలు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఉద్దేశమూ అదేనని టీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. కమిటీ నివేదిక నాలుక గీచుకోవటానికి తప్ప దేనికీ పనికి రాదని టీఆర్‌ఎస్‌ మొదటినుంచీ చెబుతున్నది. అయితే నివేదిక ఇవ్వలేదనే చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం భారీ నివేదిక సమర్పించింది. ఇక బీజేపీ అసలు కమిటీనే గుర్తించేది లేదు పొమ్మన్నది. ఆ కమిటీకి చట్టబద్ధత లేదని ఎప్పుడో స్పష్టం చేసింది. ఇలా పార్టీలు తమకు నివేదిక సమర్పించనప్పుడు ఆయా పార్టీల అభిప్రాయాలు తమ కు తెలియనప్పుడు తాము పూర్తి స్థాయిలో సిఫారసులు చేయలేమని చెప్పి తప్పించుకునే ఉద్దేశం కమిటీకి ఉన్నట్టు తేలిపోతున్నదని టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అంటున్నారు.
ఎంపీలు దూరం కాకుండా ఉండేందుకే?...
ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ నాన్చుడు తంత్రాన్ని అనుసరించటం ద్వారా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్టీకి దూరం కాకుండా ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. కమిటీయే కనుక కచ్చితమైన సిఫారసులు చేసి ఉంటే, అవి ఏదో ఒక ప్రాంత ఎంపీలకు కంటగింపుగా తయారయ్యే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ దెబ్బ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రాంత ఎంపీలను దూరం చేసుకుని కేంద్రంలో అధికారానికి ఎసరు పెట్టుకోవటం ఎందుకన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు.

సాధ్యమైనంత ఎక్కువ కాలం కమిటీ సిఫారసులు లేదా నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా కాలాన్ని నెట్టుకురావాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కమిటీ సిఫారసులలో ఏమున్నా దాన్ని ముందుగా పార్టీలోని అన్ని ప్రాంతాల ఎంపీలకు తెలియజెప్పి, ఏమి చేస్తే ప్రయోజనం ఉంటుందో ఆలోచించుకున్న తర్వాతే నివేదికపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు తనం ప్రదర్శిస్తే పుట్టి మునుగుతుందన్న ఆందోళన కాంగ్రెస్‌ అధినాయకత్వంలో ఉందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నివేదికపై మరో కమిటీ?
సాధ్యమైనంత ఎక్కువకాలం కాలయాపన చేసేందుకు వీలుగా ముందు మొక్కుబడిగా అఖిలపక్షాన్ని నిర్వహించి, ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదన్న సాకు చూపి మరో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, నివేదికను ఆ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పి మరి కొంత కాలం ఊపిరి పీల్చుకోవటం కాంగ్రెస్‌ అధినాయకత్వం అసలు ఉద్దేశంగా కనిపిస్తున్నదని బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ తదితర పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కమిటీ గడువును సైతం దాదాపు ఏడాది పాటు విధించటం, అప్పట్లోగా రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో తెలిసిపోతాయి కాబట్టి అవసరం అయితే అప్పుడే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయంతో హై కమాండ్‌ ఉన్నట్టు ఢిల్లీలోని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అడకత్తెరలో తెలంగాణ ఎంపీలు...
అధినాయకత్వం వేస్తున్న ఈ నాన్చివేత ఎత్తుగడలు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల పరిస్థితిని అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తున్నాయి. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఎంత గట్టిగా చెబుతున్నా, వారు అధినాయకత్వం ఇలాగే సాచివేత ధోరణి అనుసరిస్తే ప్రజలు తమను వీధుల్లో నిలదీసే పరిస్థితి దాపురిస్తుందని ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. అఖిలపక్షం తర్వాత కేంద్రం ఏదో ఒక అభిప్రాయాన్ని చెప్పకపోతే ప్రజలు తమను నిలదీయక తప్పదని, దానికి తాము ఇవ్వాల్సిన సంజాయిషీ ఏమిటో తేల్చుకోలేకపోతున్నామని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్‌ నేత కె.కేశవరావు లాంటి వారు స్వరం పెంచి అవసరం అయితే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వాన్ని అయినా సరే వదులుకుంటానని చెప్పటం, తెలంగాణ కోసం జైలుకు వెళ్ళటానికైనా సిద్ధం అని చెప్పటాన్ని చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులలో ఏ స్థాయి ఆందోళన, భయం పెనవేసుకు పోయి ఉన్నాయో అర్థం అవుతున్నదని ఇతర పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ తెలంగాణఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అనుసరిస్తున్న నాన్చుడు వ్యూహం తెలంగాణ నేతలను మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరించేలా చేస్తున్నది. చూస్తూ చూస్తూ నాయకత్వాన్ని ధిక్కరించలేకపోవటం, అలాగని మౌనంగా ఉండి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోవటం వంటి ఇబ్బందికర పరిస్థితిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Click Here!

‘ఆరు’కు ఎసరు ?
logos 
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివే దికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు కేంద్రం ఈ నెల ఆరున ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశం సజావుగా సాగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాకుండా పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా చొరవ తీసుకుంటున్నారు. పార్టీకి ఇద్దరు చొప్పున వెళ్ళటం వల్ల తేలేది ఏమీ లేదని అలాంటప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు ఫోన్‌ చేసి వెళ్ళవద్దని అర్థించారు. అయితే తాము వెళ్ళి తీరుతామని, అభిప్రాయం చెబుతామని నారాయణ స్పష్టం చేసినట్టు సమాచారం. అయినా ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మరోసారి మాట్లాడి సీపీఐని దూరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
బీజేపీ దూరం....
అసలు కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు అఖిలపక్షానికి హాజరై ప్రయోజనం ఏమిటని బీజేపీ ముందు నుంచీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిలపక్షానికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్‌.విద్యాసాగరరావు సైతం ఇదే డిమాండ్‌ చేశారు. సమావేశానికి కాంగ్రెస్‌, టీడీపీ దూరంగా ఉండాలని సూచించారు.
టీడీపీ డైలమా...
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో తల బొప్పికట్టించుకున్న తాము మళ్ళీ అఖిల పక్షానికి వెళ్ళి రెండు ప్రాంతాలకూ అనుకూలంగా అభిప్రాయాలు చెప్పి వస్తే టీఆర్‌ఎస్‌కు మరో అస్త్రాన్ని అందించినట్టు అవుతుందన్న అభిప్రా యంతో తెలంగాణ ప్రాంత నేతలు కొందరు ఉన్నట్టు సమాచారం. సీమా ంధ్ర ప్రాంత నేతలు సైతం ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిసింది. వెళ్ళినా ఏ ప్రాంతం నేతలు ఆ ప్రాంతానికి అనుకూలంగా వాదనలు వినిపించటం తప్ప చేయగలిగిందేమీ లేదని, అలాంటప్పుడు సమావే శానికి వెళ్ళి తెలంగాణ లేదా సమైక్యాంధ్ర వ్యతిరేక పార్టీగా ముద్ర వేయిం చుకోవటం ఎందుకన్న అభిప్రాయాన్ని పార్టీలో పలువురు సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
కచ్చితంగా వెళ్ళేది మూడు పార్టీలే...
ఈ నేపథ్యంలో అఖిలపక్షానికి కచ్చితంగా హాజరయ్యే పార్టీలు మూడే కనిపిస్తున్నాయి. అధికార పక్షం కాబట్టి కాంగ్రెస్‌కు ఎలాగూ వెళ్ళక తప్ప దు. ఆ పార్టీ తరఫున ఇద్దరితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తాను సైతం స్వయంగా హాజరవుతానని కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటిం చారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ తరఫున మెజారిటీ అభిప్రాయం సమైక్యానికి అనుకూలంగానే ఉండక తప్పదు. ఇక ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదాన్ని అటకెక్కించి సమైక్య వాదానికి కట్టుబడింది. లోక్‌సత్తా అదే అభిప్రాయంతో ఉంది. ఇక మజ్లిస్‌ తెలంగాణకు అనుకూలమూ కాదు, ప్రతికూలమూ కాదు. అయితే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

ఇక సీపీఎం సైతం తన వైఖరిలో మార్పు రాకపోయినప్పటికీ, తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాము హాజరైనా, కాకపోయినా ఎలాంటి ఫలితమూ ఉండనప్పుడు, ఇప్పటికే ఒకసారి పార్టీ అభిప్రాయాన్ని ఏడాది క్రితం స్పష్టం చేసినందున హాజరై ప్రయోజనం ఏమీ లేదన్న అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలలో చాలా మటుకు గైర్హాజరు అయిన పక్షంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చేందుకు వీలు కలుగుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఎలాగూ జాతీయ పార్టీ అయిన బీజేపీ హాజరు కానందున మిగిలిన పార్టీలను సైతం సమావేశానికి దూరంగా ఉంచితే తెలంగాణ పట్ల ప్రజాభిప్రాయం ఎంత తీవ్రంగా ఉందో కేంద్రానికి వ్యక్తం చేసినట్టు అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. తాము సమావేశానికి వెళ్తామని సీపీఐ చెప్పినప్పటికీ, మరో మారు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మంతనాలు జరిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

Click Here!

నివేదిక సీఎం చేతుల్లో !

పీఆర్పీ, ఎంఐఎం నేతలతో కిరణ్ చర్చలు

అఖిలపక్ష వ్యూహంపై కసరత్తు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసా? ఆ నివేదిక ప్రతి ముఖ్యమంత్రి చేతికి చేరిందా? అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం... తాను అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు!! ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో హోం మంత్రి చిదంబరం సమక్షంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు.

అంతేకాదు.. భవిష్యత్తులో తనతో కలిసి వస్తారని భావిస్తున్న పీఆర్పీ, ఎంఐఎం పెద్దలతో ఆదివారం సాయంత్రం వేర్వేరుగా చర్చించారు. చిరంజీవి, రామచంద్రయ్య, అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించినట్లు పీఆర్పీ... ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడామని ఎంఐఎం నాయకులు చెబుతున్నా, నిజానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాలపైనే వీరు ప్రధానంగా చర్చించారని తెలిసింది.

అయితే, రైతు సమస్యలపై మాట్లాడేందుకు సోమవారంనాటికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామని, అనుకోకుండా ఆయన ఆదివారమే సమయం ఇవ్వడంతో చిరంజీవి, రామచంద్రయ్య వెళ్లి కలిశారని పీఆర్పీ పార్టీ వర్గాలు వివరించాయి. ఈ సమావేశానికి కొద్దిసేపటి ముందే కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పార్టీకి ఒక్కరినే అఖిలపక్ష భేటీకి పిలవాలని, లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని వివిధ అంశాలపై ఎలాంటి వైఖరి అవలంబించాలన్న అంశంపై సీఎం వారితో చర్చించారు. ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందే సొంత పార్టీలోని తెలంగాణ నేతల్లో కూడా భిన్నస్వరాలు వినిపించడంతో తన వైఖరి ఏంటో బయట పడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

Saturday, January 1, 2011

అభివృద్ధే .... అందరి ఆకాంక్ష !

telangana ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభి వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీకృష్ణ కమిటీ ప్రక టించింది. అన్ని ప్రాంతాలు. నగరాలు, పట్టణాలు అభివృద్ది బాటలో కొనసాగితేనే మంచిదన్నది మెజారిటీ జనాభిప్రాయమని శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది. శుక్రవారం ఆ కమిటి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రజలు కేవలం అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, అణగారిన వర్గాలకు అభయ హస్తం అందించే వారి కోసమే ఎదురు చూస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తమకు ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న డిమాండ్‌ అధికంగా వినవచ్చిందని వెల్లడించారు.

ఆర్థికంగా పరిపుష్ఠి అయితేనే కుటుంబం, గ్రామం, రాష్ర్టం అన్ని విధాలా ముందుకు వెళతాయని క్షేత్ర స్థాయిలో జరిపిన అధ్యయనంలో వెల్లడయినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యుడు రణబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం పరిధిలో అభివృద్ధి కాంక్షించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ వారు మరే విధమైన కోర్కెలు కోరడం లేదనిస్సష్టం చేశారు. మరో సభ్యురాలు రవీందర్‌ కౌర్‌ మాట్లాడుతూ ఇప్పుడు పట్టణాలలో కేవలం మౌలిక వసతులతోనే సరిపెట్టడం సరికాదని, నగరాలకే పరిమితమైన ఆధునిక సౌకర్యాలు పట్టణాలకు కూడా విస్తరించి, సాంకేతికంగా ప్రజలను చైతన్య వంతులుగా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని ప్రజలు కోరారని, కమ్యూనికేషన్లు, ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞాన బోధన, రవాణ సౌకర్యాలు అందుబాటులోకి రావాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

మహిళలు కూడా అభివృద్ధితోనే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మైనారిటీలు, క్ట్రిస్టియన్లు, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు తెగలు, షెడ్యూల్‌ కులాల వారు తమ సామాజిక అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారని మరో సభ్యుడు అబుసలె షరీఫ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఏ సందర్భంలోనూ వారు తెలంగాణ అని గాని, సమైక్యాంధ్ర అని గాని ఉచ్ఛరించకపోవడం గమనార్హం. మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ తమ అభివృద్ధినే కాంక్షిస్తున్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర మహిళలైతే, తాము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని, అలాగే తమ బిడ్డలకూ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారని వివరించారు.

కాంగ్రెస్‌ మెడపై తెలంగాణ కత్తి
katti-copy రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై పెట్టిన కేసుల ఎత్తివేత క్రెడిట్‌ తమకే దక్కాలన్న వ్యూహంతో ముందుకెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కొత్త సమస్య తప్పన్న ట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలో సొంత ప్రాబల్యంకోసం కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన దీక్షా వ్యూహం తిరిగి వారి మెడకే చుట్టుకోనున్నట్లు కనిపి స్తోంది. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై ప్రదర్శించిన చిత్తశుద్ధినే ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ చూపాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలపై ప్రతిపక్షపార్టీలతో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు ఒత్తిడి పెంచాలని యోచిస్తున్నాయి. అవసరమైతే తెలం గాణ సాధన కోసం తాము రాజీనామాలకు కూడా సిద్దపడతామని దీక్ష శిబిరంలో కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టంచేశారు. మరోవైపు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి వ్యాఖ్యనాలకు దిగకూడదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే హుకుం జారీ చేసింది. ఈ నియంత్రణ రేఖ తెలం గాణ కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే, నేతలకు ఇబ్బందిక రంగా మారనున్నట్లు కనిపిస్తోంది.
నివేదిక ప్రతికూలంగా వస్తే?
విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసం తెలం గాణ కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో వారికి క్రెడిట్‌ దక్కింది. అసెంబ్లీ సమావేశాల సంద ర్భంగా అధికార పక్షంతోపాటు ప్రతిపక్షపార్టీలన్నీ కలసినా ఈ కేసులను మాత్రం ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశంపైనే రెండు రోజుల పాటు అసెంబ్లీలోని ఉభయ సభలో స్థబిం చిపోయాయి. కానీ ఆ తరువాత కేవలం కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతోనే ప్రభుత్వం దిగొచ్చి కేసులను రద్దుచేసింది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ను దక్కించుకోవడంతోపాటు తాము తల్చుకొంటే ప్రత్యేక రాష్ట్రానైనా సాధిస్తామన్న సంకేతం తెలం గాణ కాంగ్రెస్‌ నేతలు ఇచ్చారు. ఈ అంశాన్ని ఆధా రంగా చేసుకొన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యే, నేతలను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రతిపక్షపార్టీలు సిద్దమ వుతున్నాయి.

కేసుల ఎత్తివేతతో కాంగ్రెస్‌ ఎంపీలపై నమ్మకం పెంచుకొన్న తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు సైతం తమ ప్రాంత పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నారు. అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయిం చాలని భావిస్తున్నారు. తెలంగాణ సాధన విషయం లో కాంగ్రెస్‌ నేతలపైనే ఈ ప్రాంత ప్రజలు కూడా బాధ్యతను మోపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్‌ పార్టీకే ఉద్యమ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెలిచి ఓడినట్లు అవుతుందా?
తెలంగాణ సాధన విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలలో కూడా ఆందోళన నెలకొంది. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా నివేదిక వస్తే తమ పరిస్థితి ఏమిటీ అని వారిలో మీమాంస మొదలైంది. విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణ యించుకొంది కాబట్టే వాటిని రద్దుచేసింది. కాకపో తే కాంగ్రెస్‌కే ఆ క్రెడిట్‌ దక్కాలన్న ఉద్దేశం తోనే తెలంగాణకు చెందిన ఆ పార్టీ ఎంపీల దీక్షతో వాటిని రద్దుచేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వా నికి, తెలంగాణ ఎంపీలకు ఇరువురికి తెలిసిందే. ప్రభు త్వం కేసులను ఎత్తివేయాలని భావించింది కాబట్టే ఈ కేసులు రద్దు అయ్యాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తే తెలం గాణ లో ఆ పార్టీ నేతలకు ఇబ్బంది ఉండదు. ఒక వేళ ఇవ్వకూడదని భావిస్తే అధిష్ఠానాన్ని తాము ఏమేర ప్రభావితం చేయగలమన్న ఆందోళన కాంగ్రెస్‌ ఎం పీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు నేతలలో మొద లైంది. దీక్షలే కాదు రాజీనామాల అస్త్రం ప్రయోగిం చినా తమ అధిష్ఠానం దిగివస్తుందా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. 
ఇక మధ్యంతరమే !
Sri-Krishరాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఖాయం కానున్నాయన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. జనవరి 6న ఢిల్లీలో కృష్ణ కమిటీ నివేదిక వివరాలను కేంద్ర హోంమంత్రి చిదంబరం విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న వచ్చన్న అంచనా అన్ని పార్టీలు, వర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తి, ఇతర ప్రాంతాల వారిపై దాడులు జరిగితే దాని ప్రభావం సీమాంధ్రలో చూపే క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. అప్పుడు రాష్ట్రంలో రాష్ర్టపతిపాలన అనివార్యమవు తుందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ చర్చల్లో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న భావన అంతర్గతంగా వ్యక్తమవుతోంది.

ఫిబ్రవరిలో శాసనసభా సమావేశాలు జరగనుండటం, అదే సమ యంలో జగన్‌ కూడా పార్టీని స్థాపిస్తుండటంతో అందరి దృష్టి ఫిబ్రవరిపైనే కేంద్రీకృతమయింది. జగన్‌ అప్పటికి పార్టీ పెట్టడం ఖాయమయినందున, ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన వర్గీయులయిన ఎమ్మెల్యేలు జగన్‌ పార్టీలోకి వెళ్లడం ఖాయ మంటున్నారు. సరిగ్గా సమావేశాలు ప్రారంభమయిన రోజు నుంచే కిరణ్‌ సర్కారుకు జగన్‌ షాక్‌ మొదలుకావచ్చని తెలుస్తోంది. జగన్‌కు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలంతా సమావేశాల ప్రారంభం నుంచి ముగింపులోగా ఒక్కొక్కరుగా రాజీనామా అస్త్రాలు ప్రయోగించ వచ్చంటున్నారు. దానితో కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంలో పడటం ఖాయమన్న అంచనా వ్యక్తమవుతోంది.

జనవరి 6న వెల్లడయ్యే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అంశాల ప్రభావం అప్పటికి తీవ్రంగా ఉండ వచ్చన్న అంచనా కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలోఈనెల ప్రారంభం నుంచి మొదలయ్యే ఉద్యమాలు ఫిబ్రవరి నాటికి మరీ ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పార్టీలలో చర్చ జరుగుతోంది. ఆ పరిణా మాలు అధికార కాంగ్రెస్‌కు మరీ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆ క్రమం లో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు, రాష్ట్రం లో నష్టనివారణకు కేంద్రప్రభుత్వం కూడా అనివార్యంగా రాష్టప్రతి పాలన విధిస్తుందని విశ్లేషిస్తున్నారు.

కాగా.. రాష్ట్రంలో రాష్టప్రతిపాలన విధించే అవకా శాలను ప్రజాప్రతినిధులు కూడా త్రోసిపుచ్చడం లేదు. వారు కూడా ఆ మేరకు మానసికంగా సిద్ధంగానే ఉన్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఇలాంటి భావన కనిపించడం విశేషం. మనం సక్రమంగా పరిపాలించకపోతే మన స్థానంలో మరొకరు వస్తారంటూ ధర్మాన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల అంతరంగం, ఆందోళనను ఆవిష్కరిస్తోంది.

ఢిల్లీ రాజకీయ వాతావరణపై అవగాహన, అంతర్గత రాజకీయాలపై అనుభవం ఉన్న మంత్రులు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్ల అంతరంగ సంభాషణల్లో కూడా ఇదే భావన ధ్వనిస్తోంది. జగన్‌ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ దాదాపు ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత, జనవరి మొదటి వారం నుంచి రాష్ట్రంలో నెలకొనే రాజకీయ పరిస్థితులను ఇప్పటినుంచే ఎలా ఎదుర్కోవాలి? ఆలోగా ఏయే అంశాలతో ప్రజల ముందుకు వెళ్లాలన్న దానిపై అన్ని పార్టీల్లో సీరియస్‌గానే చర్చ జరుగుతోంది. తమకు లాభించే అంశాలతో పాటు ప్రత్యర్థులను ఇరకున పెట్టే వాటిపై కసరత్తు మొదలుపెట్టారు.

ఎన్ని ‘కల’లో ...
kcr-annaగత కొంతకాలం వరకూ తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కిం చిన టీఆర్‌ ఎస్‌ ఇటీవలి కాలం నుంచీ బాణీ మార్చింది. ఉద్యమాల కన్నా ఎన్నికల మాటే ఎక్కువగా వినిపిస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే ఆకాశాన్ని బద్దలు కొడతామని, భూకంపం, ప్రళయం సృష్టిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేసిన కేసీఆర్‌.. వచ్చే పార్లమెంటు,అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టాలని గడువు విధించడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగిస్తోంది. కేసీఆర్‌ ఇచ్చిన గడువు ఒకరకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఊరట కలిగించడ మేనని, దీనివల్ల తమ పార్టీ కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందన్న ఆరోపణలను నిజం చేసినట్టవుతుందని వాదిస్తు న్నారు.

డిసెంబర్‌ 31 తర్వాత ప్రళయం సృష్టిస్తా మని గతంలో చెప్పిన తమ నాయకుడే మళ్లీ ఇప్పుడుమార్చి వరకూ గడువు ఇవ్వడంపై సొంత పార్టీ సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి తమ పార్టీ తెలంగాణ కోసం ఉధృతంగా ఉద్యమాలు చేస్తుందని ఒకవైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే, తమ అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వానికి పరోక్షంగా గడువు ఇవ్వడంపై వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో కొంతకాలం వరకూ ఉద్యమాల పేరుతో హోరెత్తించిన కేసీఆర్‌.. గత కొద్దిరోజుల నుంచి మధ్యంతర ఎన్నికల గురించి తరచూ మాట్లాడటంపై సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యమం గురించి మాట్లాడకుండా కేవలం ఎన్నికల గురించే ప్రస్తావిస్తుండటం, పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం వల్ల వ్యతిరేక సంకేతాలు వెళతాయన్న ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది.

ఇలాంటి తొందరపాటు తనం వల్ల తమ పార్టీకి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన కంటే ఎన్నికలే ముఖ్యమన్న భావన ప్రజల్లో నెలకొనే ప్రమాదం ఉందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత, తమ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడటం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలే తప్ప, ఎన్నికల గురించి మాట్లాడితే తమకు ప్రత్యేక రాష్ట్రంపై కన్నా ఎన్నికల పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ప్రజలు అనుమానించే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.

నిజానికి.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేరని సీనియర్లు చెబుతున్నారు.తరచూ రాజీనామాలు చేయటం, మళ్లీ పోటీ చేయడం వల్ల ఆర్థికంగా చాలా చితికిపోతున్నామన్న ఆవేదన ఎమ్మెల్యేలలో ఉందని అంగీకరిస్తున్నారు. పట్టుమని ఏడాది కూడా కాకముందే ఎన్నికలకు సిద్ధం కావాలంటే, గత ఎన్నికల్లో చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చలేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు. తినగ తినగ తీపి కూడా చేదుగా ఉంటుందన్నట్లు ప్రజలు కూడా ఇలాంటి నిర్ణయాలను హర్షించరంటున్నారు.

‘ఇంతవరకూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. సంపాదించుకోవడం దేవుడికెరుక. పాత అప్పులు తీర్చలేక పరేషానవుతున్నా’మని కొందరు ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల వద్ద జరిగే అంతరగత సంభాషణల్లో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ద్వారా తమను హడలెత్తిస్తున్నారని, అటు ప్రజల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఎన్నికలే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యం కాదన్న భావన కల్పిస్తున్నారని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.