Thursday, October 14, 2010

కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే ..........

మూడ్ మారిస్తేనే 'ఫ్రంట్'లో గద్దర్ కొత్త పలుకు

కె.సి.ఆర్. ఎక్కడ విఫలం అయ్యారో అక్కడే విజయం సాధించగలిగితే, తెలంగాణలో కూడా గద్దర్ ఫ్రంట్‌కు మద్దతు అమాంతం పెరుగుతుంది. కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే తెలంగాణవాదులు సహజంగానే ఆయనతో నడుస్తారు. అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

అదే సమయంలో, అసాధ్యం కూడా కాదు. ఈ విషయంలో గద్దర్ విజయం సాధించినా, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికలకు దూరంగా ఉండే పక్షంలో అది బలపడే అవకాశమే లేదు. ఎన్నికలలో పోటీ చేసి పదవులు పొందే అవకాశం లేనప్పుడు, ఎవరు మాత్రం ఆయనతో నడవడానికి ముందుకు వస్తారు!

రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత దిలాసాగా, కులాసాగా ఉన్న నాయకుడు మరొకరు లేరని గతవారం రాసిన వ్యాసం లో పేర్కొన్నాను. అయితే వారం తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇప్పుడు కె.సి.ఆర్.కు పక్కలో బల్లెం లా తెర మీదకొచ్చింది.

అందుకే రాజకీయాల్లో ఇవ్వాళ ఉన్న ట్లు రేపు ఉండదని పేర్కొనడం జరిగింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితికి పోటీగా నిలదొక్కుకోగలుగుతుందా? గద్దర్ నాయకత్వానికి కె.సి.ఆర్. నేతృత్వాని కి లభించినంత ఆమోదం లభిస్తుందా? గద్దర్ ఫ్రంట్‌కు ప్రజల మద్దతు ఎంత మేరకు లభిస్తుంది? అసలు, ఈ ఫ్రంట్ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోంది? ఈ ఫ్రంట్ ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేదా? మొదలైన సందేహాలు ఉండనే ఉన్నా యి.

అయినా గద్దర్ ఫ్రంట్ గురించి వ్యాఖ్యానించడానికి కె.సి.ఆర్.తో సహా టి.ఆర్.ఎస్. శ్రేణులు నిరాకరించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది గద్దర్ నేపథ్యం కాగా, దళిత - బి.సి. సంఘాల మద్దతు కొత్తగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌కు ఉండే అవకాశం రెండవ కారణం. అటు మావోయిస్టులతోనూ, ఇటు దళిత-బి.సి.లతోనూ కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేనందునే గద్దర్ విషయంలో కె.సి.ఆర్. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే గద్దర్‌ను దుర్భాషలాడిన కె.సి.ఆర్., ఇప్పుడు వ్యాఖ్యానించడానికి కూడా నిరాకరిస్తున్నా రు. ఎంతటి వారినైనా పురుగును తీసేసినట్లు మాట్లాడే కె.సి.ఆర్., గద్దర్ విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు.

ఇంతకీ, గద్దర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజాఫ్రంట్ హఠాత్తుగా పురుడు పోసుకోవడానికి, ఆ ఫ్రంట్‌కు మద్దతు పెరగడానికి కారణం ఏమిటి? కె. చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలే ఈ పరిణామాలకు కారణమని చెప్పవచ్చు. తనకు మాత్రమే సాధ్యమైన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను చీల్చి చెండాడే కె.సి.ఆర్.లో పలు అవలక్షణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఖచ్చితంగా కె.సి.ఆర్.కే దక్కుతుంది.

అయితే, ఈ క్రమంలో తనకు సహకరించిన పలువురితో ఆయన పలు సందర్భాలలో అమర్యాదకరంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. గద్దర్‌తో పాటు పలు ప్రజా సంఘాలు తమదైన శైలిలో తెలంగాణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. వాటన్నింటి ఫలి తం తెలంగాణ రాష్ట్ర సమితికి లభించడం వల్ల ఆ పార్టీ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీగా అవతరించగా, తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయంగా కె.సి.ఆర్. ఎదిగారు.

అసలే అహంభావి అయిన కె.సి.ఆర్., ఈ క్రమంలో ఒంటెత్తు పోకడలకు తెర తీశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసినట్టేనన్న భావం కలిగిస్తూ, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో ఏది జరగాలన్నా తన వల్ల మాత్రమే సాధ్యమన్న అభిప్రాయాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నించడం మొదలెట్టారు. అందు లో భాగంగానే వివిధ పరిశ్రమలకు చెందిన సి.ఇ.ఒ.లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు

అదే సమయంలో తెలంగాణ ఉద్యమం బలపడటానికి కారకులైన పలువురిని (గద్దర్ తో సహా) కలుపుకుపోవడానికి ప్రయత్నించకపోగా, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నే తెలంగాణ ప్రజాఫ్రంట్ పురుడు పోసుకుంది. తనను 'ఫుట్‌పాత్ గాడు' అని కె.సి.ఆర్. దూషించిన విషయాన్ని ఫ్రంట్ నాయకుడు గద్దర్ గుర్తు చేయడంతో పాటు, కాళ్ల క్రింద దుమ్మే కదా అని తీసి పారేస్తే కంట్లో పడి ఇబ్బంది పెడతామని చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం.

గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోం ది? ఆ ఫ్రంట్‌కున్న ప్లస్ పాయింట్లు - మైనస్ పాయింట్లు ఏమి టి అనే విషయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చర్చ జరుగుతోంది. మాములుగా అయితే, మావోయిస్టు ఉద్యమ నేప థ్యం ఉన్న గద్దర్‌కు ఇతర వర్గాల మద్దతు లభించకపోయి ఉండేది. కానీ, కె.సి.ఆర్. అరాచక ప్రవర్తనతో కినుక వహించి ఉన్న వివిధ వర్గాలకు చెందిన వారితోపాటు, పలువురు నాయకులు కూడా గద్దర్ విషయంలో ఆసక్తి చూపుతున్నారు.

ఇంతకాలం తమతో ఆడుకుంటూ వచ్చిన కె.సి.ఆర్.కు గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ ద్వారా చెక్ పెట్టవచ్చన్న ఆశతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం కూడా ఉన్నాయి. మాట్లాడటానికి కూడా అందుబాటులోకి రానంతగా అహం పెంచుకున్న కె.సి.ఆర్.కు చెక్ ఉండి తీరాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు నాయకులు కూడా అభిప్రాయపడుతున్నా రు. కె.సి.ఆర్. వల్ల గానీ, టి.ఆర్.ఎస్. వల్ల గానీ ఇబ్బందులు పడుతున్న సీమాంధ్రకు చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రత్యామ్నాయ వేదిక లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవసరమైతే, గద్దర్‌కు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ వల్ల తెలంగాణ ఏర్పాటు లక్ష్యాని కి విఘాతంకలిగే ప్రమాదం ఉంటుందని తెలంగాణవాదుల్లో ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఫ్రంట్ ఎన్నికల బరిలో నిలిస్తే తెలంగాణ కోరుకునే వారి ఓట్లు చీలిపోయి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లాభపడే ప్రమాదం ఉందని ఈ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఈ పరిస్థితు ల్లో తెలంగాణ వాదుల్లో వ్యక్తం అవుతున్న సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత గద్దర్‌పై ఉంది. అదే సమయంలో, తన నేతృత్వంలోని ఫ్రంట్‌కు జవసత్వాలు కూడగట్టాలంటే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించక తప్పని స్థితి గద్దర్‌ది. ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండే పక్షంలో ఫ్రంట్‌లో చేరడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంతేకాకుండా, ఫ్రంట్ చేప ట్టే ఉద్యమాల ఫలితం కూడా తెలంగా ణ రాష్ట్ర సమితి ఖాతాలోకే వెడుతుంది.

ఈ కారణంగా ఎన్నికలకు దూరమన్న నిర్ణయానికి గద్దర్ ఎంతోకాలం కట్టుబడి ఉండలేకపోవచ్చు. ఒకవేళ ఆ మాటకే కట్టుబడి ఉండే పక్షంలో కె.సి.ఆర్. నెత్తిన పాలు పోసినట్టే! ఈ కారణంగానే గద్దర్‌కు మద్దతు ప్రకటించిన ప్రజా సంఘాలు, ఇతర కుల సంఘాలు ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు కూడా దాదాపు మానసికంగా సిద్ధపడిన పరిస్థితులలో ఆ ప్రాంత ప్రజలను (ఆంధ్రావాళ్లు దోపిడీ దారులు అని అనడం) దూషించడం ద్వారా కె.సి.ఆర్. పరిస్థితిని జటిలం చేశారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను బలమైన శక్తిగా తీర్చి దిద్దాలంటే రెండు, మూడు విషయాలలో స్పష్టత ఏర్పరుచుకోవలసిన అవసరం గద్దర్‌కు ఉంది.

ఇందులో మొదటి ది... కె.సి.ఆర్. దురుసు ప్రవర్తన వల్ల తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సీమాంధ్రకు చెందిన నాయకులను న్యూట్రల్‌గా మార్చడానికి ప్రయత్నించడం. సీమాంధ్రలో కూడా పర్యటిస్తానని గద్దర్ స్వయంగా ప్రకటించినందున ఈ దిశగా ఆయన కృషి చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ఏర్పా టు జరిగితే హైదరాబాద్‌లో గానీ, జిల్లాలలో గానీ నివసిస్తు న్న సీమాం«ద్రులకు పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇవ్వడం ద్వారా సీమాంధ్ర ప్రజల మద్దతు కూడ గట్టే అవకాశం గద్దర్ కు ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రజలను ఒప్పించగలిగితే అది గద్దర్ సాధించిన గొప్ప విజయం అవుతుంది. కె.సి.ఆర్. ఎక్క డ విఫలం అయ్యారో అక్కడే విజయం సాధించగలిగితే, తెలంగాణలో కూడా గద్దర్ ఫ్రంట్‌కు మద్దతు అమాంతం పెరుగుతుంది. కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే తెలంగాణవాదులు సహజంగానే ఆయనతో నడుస్తా రు.

అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదే సమయం లో, అసాధ్యం కూడా కాదు. ఈ విషయంలో గద్దర్ విజయం సాధించి నా, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికల కు దూరంగా ఉండే పక్షంలో అది బలపడే అవకాశమే లేదు. ఎన్నికల లో పోటీ చేసి పదవు లు పొందే అవకాశం లేనప్పుడు, ఎవరు మాత్రం ఆయనతో నడవడానికి ముందుకు వస్తారు! కేవలం ప్రజాసంఘాల మద్దతు మాత్రమే సరిపోదన్న వాస్తవాన్ని గద్దర్ గుర్తించాలి. అంతేకాకుండా, తాను మావోయిస్టు ల నీడలో ఉన్నాన నే ప్రజాభిప్రాయాన్ని కూడా తొలగించుకోవలసిన బాధ్యత గద్దర్‌పై ఉంది.

అలా జరగని పక్షంలో ఇతర వర్గాల మద్దతు ఆయనకు లభించే అవకాశం లేదు. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులకు క్రింది వర్గాలలో ఆదరణ ఉండవచ్చు గానీ, పై వర్గాలలో ఆ పరిస్థితి లేదు. ఈ రెండు, మూడు విషయాలలో స్పష్టతతోపాటు దృఢచిత్తంగా గద్దర్ ముందుకు వెళ్లని పక్షంలో కొత్తగా ఏర్పాటైన ఫ్రంట్ వ్యవహా రం ముణ్ణాళ్ల ముచ్చటగా తయారవుతుంది. టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావుకు ప్రత్యామ్నాయంగా నిలిచి ఢీ అంటే ఢీ అనే స్థితికి ఎదగాలంటే బూర్జువా పార్టీలు (గద్దర్ భాషలో) అనుసరించే వ్యూహ ప్రతి వ్యూహాలను గద్దర్ కూడా అలవర్చుకోక తప్పదు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల స్పాన్సర్డ్ సంస్థ ఈ ఫ్రంట్ అని ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా టి.ఆర్.ఎస్. నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది కనుక, వారికి అటువంటి చాన్స్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత కూడా గద్దర్‌పై ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక గద్దర్‌కు మనస్సులో ఉందని కొంతకాలంగా వినిపిస్తోంది.

ఇదే నిజమైతే, తెలంగా ణ ఏర్పాటైతే దళితుడైన గద్దర్‌నే ముఖ్యమంత్రిగా అంగీకరిస్తామని టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి వ్యూహ రచన చేయడంలో ఆయన దిట్ట కను క, గద్దర్‌ను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించి తెలంగాణ ప్రజాఫ్రంట్ ను కూడా తన అనుబంధ సంస్థగా మార్చుకోవడానికి కె.సి.ఆర్. ప్రయత్నించే అవకాశాలు లేక పోలేదు.

తెలంగాణ ప్రజాఫ్రంట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కె.సి.ఆర్.కు చెక్ పెట్టే పరిస్థితి ఉంటుందా? లేదా? అన్న విషయం ప్రక్కన పెడితే, గురువారం నాడు రాష్ట్రం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. పేదల కోసం నిరంతరం తపన పడిన రిటైర్డు ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్.ఆర్.శంకరన్ కన్ను మూయడంతో దిక్కులేని వారికి మరో దిక్కు లేకుండా పోయింది. ఇవ్వాళ్టి ఐ.ఎ.ఎస్. అధికారులతో పోల్చుకుంటే శంకరన్ జీవనశైలి గానీ, సర్వీసులో ఉన్నపుడు పని చేసిన తీరు గానీ, నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది.

లక్ష్య సాధనలో అడ్డు ఉండకూడదనే సంకల్పంతో ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన శంకరన్, ఐ.ఎ.ఎస్.లకు రోల్ మోడల్‌గా నిలిచారు. కానీ, దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నవారి ప్రాపకం సంపాదించి కీలక పోస్టులు పొందడం, ఆ తర్వాత రెండు చేతు లా సంపాదించడానికి అలవాటు పడిన వారు ప్రస్తుత ఐ.ఎ.ఎస్. అధికారులలో పలువురు ఉన్నారు. వారెవరికీ శంకరన్ భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించే తీరిక కూడా లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి

. శంకరన్ వంటి వ్యక్తులు ప్రజా సంఘాలకు మాత్రమే పరిమితం కాదు. తమ కోసం నిజాయితీగా జీవించిన అధికారికి నివాళులు అర్పించవలసిన బాధ్యత పౌరులందరిపైనా ఉంటుంది. అలా చేయగలిగితేనే, శంకరన్ వంటి వాళ్లు మనకు మళ్లీ మళ్లీ పుట్టు కు వస్తారు. లేకపోతే నేటి కుక్క మూతి పిందెలే మిగులుతా యి. శంకరన్ సిద్ధాంతాలతో అందరూ ఏకీభవించవలసిన అవసరం లేదు. కానీ, ఆయన జీవితం మాత్రం ప్రతి ఒక్కరికీ ఆద ర్శం కావాలి.

ఆయన వలె జీవించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, అలాంటి వారిని ఆరాధించి గౌరవించడం మన కనీస బాధ్యత. మానవ హక్కుల వేదిక కన్వీనర్ బాలగోపాల్ చనిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఆయన వర్ధంతి కి సరిగ్గా ఒకరోజు ముందు శంకరన్ కన్ను మూశారు. ఇలా మనకు మిగిలిన అతి కొద్ది మంది ఆదర్శమూర్తులు వెళ్లిపోవ డం బాధాకరం. జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన బాలగోపాల్, శంకరన్ వంటి వాళ్లు పైలోకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు గానీ, ఇక్కడ దిక్కులేని వారికి దిక్కులేకుండా పోయిందే!

అన్నింటికంటే బాధాకరం ఏమిటంటే.. ఈ ఇద్దరు మహనీయుల పట్ల సమాజం స్పందించిన తీరు. శంకరన్ అంతిమ యాత్ర అతి సాదాసీదాగా సాగిపోయింది. బాలగోపాల్ ప్రథమ వర్ధంతి కేవలం ప్రజా సంఘాలు లేదా అలాం టి భావజాలం ఉన్న కొద్దిమంది వ్యక్తులకే పరిమితం అయిం ది.

ప్రజల సంపదను అడ్డంగా, నిలువుగా దోచుకుతింటున్న నాయకుల కోసం కొట్టుకు చచ్చే వాళ్లు ఉన్నంత కాలం ఇంతకంటే భిన్నమైన వాతావరణాన్ని ఊహించలేం. అవినీతిపరులకు జేజేలు పలికే వారు బాలగోపాల్, శంకరన్ వంటి వాళ్లను గుండెల్లో పెట్టుకోవాలని ఆశించడం అత్యాశే అవుతుంది. 

-ఆదిత్య