Wednesday, December 29, 2010

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ..... * పగ్గాలకోసం పరుగులు .....

రేపు నివేదిక ?
AP-Mapగడువు ముగిసేందుకు ఒక రోజు ముందే ప్రత్యేక తెలంగాణ ఏర్పా టుపై అభిప్రాయ సేకరణ జరిపిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించనున్నది. ఈ నెల 31న కేంద్ర హోంమంత్రి చిదంబరం అరుణా చల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు కనుక, 30నే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమ ర్పించబోతున్నట్టు తెలిసింది. కమిటీకి సారథ్యం వహిస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి దుగ్గల్‌, మరో సభ్యుడు చిదంబరాన్ని కలిసి నివేదిక సమర్పిస్తారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మంగళవారంనాడు ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు

తొలుత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ మాట్లా డుతూ, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఇప్పటివరకు కమిటీ చేసిన పర్యటనలు, సమావేశాల వివ రాలు తెలియజేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో వినతిపత్రాలు అందాయని తెలిపారు. వీటి ద్వారా తమకు అమూల్యమైన సూచనలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు.

srikrishana 

ఈ అధ్యయనంలో ఎన్నో సాంకేతికాంశాలు పరిగణలోకి తీసుకున్నామని,అందులో ముఖ్యంగా నీటి పారుదల, విద్యుత్‌, ఉపాధి, హైదరాబాదు అనే ముఖ్యమైన నాలుగు అంశాలపై నిపుణులతో గోష్ఠి నిర్వహించమన్నారు. కమిటీ నిర్వహించిన అధ్యయనాలలో ఎక్కువ భాగం హైదరాబాదులో చేశామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వందకు పై చిలుకు రాజకీయ పార్టీలు, ఇతర మేధావులు, ప్రతినిధులతో చర్చలు నిర్వహించామని, రాష్ట్రంలోని 23 జిల్లాలలోని పలు గ్రామాలను సైతం సందర్శించి స్థానిక వర్గాలతో కూడా చర్చించి ప్రాథమిక స్థాయి సమాచారాన్ని సేకరించమన్నారు.

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు....
తమ నివేదిక రెండు సంపుటాలుగా ఉండబోతుందని, ఈ నివేదిక మెజారిటీ ప్రజలను సంతృప్తి పరిచే విధంగా వుంటుందని, కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ వెల్లడించారు. ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు విషయాలను కూలంకశంగా విశదీకరించామని, నిర్ణయించిన కాలపరిమితి లోగానే నివేదికను హోంశాఖ మంత్రి చిదంబరానికి అందజేస్తామని పేర్కొన్నారు. అయోధ్య తరహాలో ఈ నివేదిక పై కూడా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ తమ నివేదిక లోని ఏ ఒక్క అంశానికి సంబంధించిన ఏ విధమైన వివరాలను, వ్యక్తుల పేర్లను వెల్లడించలేమన్నారు.

సమస్య ఎంత పురాతనమైనదైనా పరిష్కారం ఉంటుందని తమ నివేదికలో పలు పరిష్కార మార్గాలను సూచించామని, అన్ని ముఖ్యమైన అంశాలను, అతి సున్నితమైన అంశాలను నివేదికలో పొందుపరిచామని వెల్లడించారు. సమస్యకు పూర్వ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనపు బలగాలను రాష్ట్రానికి తరలించారని రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో కమిటి లోని ఇతర సభ్యులు ప్రొ. రబీందర్‌ కౌర్‌, రణబీర్‌ సింగ్‌, డా. అబ్ధుల్‌ షరీఫ్‌, ఇతర ఉన్నతాధికారుల పాల్గొన్నారు. 

పగ్గాలకోసం పరుగులు
Narasimhan-Governor 
రాష్ట్రంలో పరి స్థితిని అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించిన మరుసటి రోజే గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన జరపనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. రాష్టప్రతి పాలన విధిస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో గవర్నర్‌ పర్యటనకు విపరీతమైన ప్రాధాన్యం లభిస్తున్నది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి చిదం బరం, ఇతర కీలక మంత్రులను కలుసు కుంటారని తెలిసింది. కమిటీ నివేదిక వెలు వడిన మరుసటిరోజే గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీకి పరుగులు పెట్టటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవ ర్నర్‌ అక్క డికి వెళ్ళి రాష్ట్రంలో నివేదిక అనంతర పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా లేక మరేదైనా నివేదిక ఇస్తారా అనే దానిపైవిస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

విభజన వద్దంటారా?
విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం గవర్నర్‌కు రాష్ట్రాన్ని విడగొట్టటం సుతరామూ ఇష్టం లేదు. అలా చేయటం ద్వారా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంతాలలో శాంతి భద్రతలకు చేజేతులా విఘాతం కలి గించినట్టే అవుతుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అసలు ఒక దశలో డిసెం బర్‌ 31 తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏమీ మారవన్న అభిప్రాయంతో ఉన్న ఆయన ఇప్పుడు నివేదిక వచ్చీ రాగానే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడతారన్నది ప్రశ్నగా మిగులుతోంది. డిసెంబర్‌ 31 తర్వాత ఏమవుతుందని గత డిల్లీ పర్య టన సందర్భంగా అడిగితే జనవరి ఒకటి వస్తుంది అని తేలిగ్గా కొట్టి పారేశారు. ఇప్పుడేమో పరిస్థితిని మదింపు వేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.

పగ్గాలు చేజిక్కించుకునేందుకే?...
శ్రీకృష్ణ నివేదిక స్వరూప స్వభావాల ఎలా ఉన్నా, దానిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే దాకా రాష్టప్రతి పాలన విధిస్తే సరిపోతుందని కేంద్రానికి నివే దిక సమర్పించి, వారి అంగీకారం మేరకు రాష్ట్రంలో పగ్గాలు చేజిక్కిం చుకునేందుకే గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ఆంతర్యం అని రాజకీయ వర్గాలు అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. స్వతహాగా ఐపీఎస్‌ అధికారి అయిన తనకు పగ్గా లు అప్పగిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని, ఉద్యమించే శక్తులు ఏవైనా ఉక్కు పాదంతో అణచివేస్తానని కేంద్రానికి గట్టి నమ్మకం కలిగించే ప్రయత్నాన్ని గవర్నర్‌ చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కిరణ్‌పై అనాసక్తి?...
నిజానికి గవర్నర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌ పాలనా దక్షతపై పెద్దగా విశ్వాసం లేదన్న మాటలూ వినిపిస్తున్నాయి. తెలంగాణలో కానీ, సీమాంధ్రలో కానీ శ్రీకృష్ణ నివేదిక దరిమిలా పరిణామాలు హింసాత్మకమై శాంతి భద్రతల సమస్య తలెత్తితే కిరణ్‌ సర్కార్‌ నియంత్రించలేదన్న అభిప్రాయంతో గవర్నర్‌ ఉన్నట్టు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకు వస్తే కిరణ్‌ సులభంగా లొంగిపోతారన్న అభిప్రాయం గవర్నర్‌కు ఉందని, దీనికి ఉదాహరణ ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసుల నుంచి విద్యార్థులను విముక్తులను చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒకటిన్నర రోజులు నిరశన పాటించగానే ఆ డిమాండ్‌కు అనుకూలంగా కిరణ్‌ నిర్ణయం తీసుకోవటం గవర్నర్‌కు నచ్చలేదని విశ్వసనీయంగా తెలిసింది.

అలాగే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఫ్రీ జోన్‌ అంశం తేలేదాకా ఎసై్స నియామకాలు చేపట్టరాదని రాజకీయ పార్టీలు, జేఏసీలు తీసుకు వచ్చిన ఒత్తిడికి సైతం ప్రభుత్వం లొంగిపోవటం పట్ల గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మున్ముందు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసు హృదయంతో అణచి వేయటమే తప్ప లొంగుబాటుకు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని, ఈ ధైర్యం రాజకీయ పార్టీలకు ఉండదు కాబట్టి తన చేతికి పగ్గాలు ఇస్తే కేంద్రానికి ఎలాంటి తలనొప్పీ రాకుండా చూస్తానని గవర్నర్‌ తన పైరవీ తానే చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే జోక్యాలు...
వాస్తవానికి రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే గవర్నర్‌ ప్రభుత్వ వ్యవహారాలను నిశితంగా పరిశీలించటం ప్రారంభించారు. తాను అందరి లాంటి గవర్నర్‌ను కాదని పదే పదే చెప్పుకున్నారు. అనేక సందర్భాలలో ముఖ్య మంత్రులు సహా సీనియర్‌ ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఇంటిలిజెన్స్‌ అధికారులను పిలి పించి పరిస్థితులు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు సమ ర్పించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన మర ణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.రోశయ్య తమ రాజకీయ అనుభవం, చాతుర్యాన్నంతా ఉపయోగిస్తూ గవర్నర్‌ను మెప్పిస్తూ వచ్చారు. అనే క సందర్భాలలో రోశయ్య లౌక్యాన్ని ప్రదర్శించి గవర్నర్‌కు అవసరమైనంత మే రకే సమాచారం అందిస్తూ వచ్చారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో గవర్నర్‌ ఇంత వరకూ పాలనాపరమైన అంశాలపై చర్చించిన సందర్భం లేదు.

సిఫారసుల మేరకే?...
అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో ఎవరికీ తెలియకుండానే రాష్ట్రానికి భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను రప్పించటం, ఉస్మానియా వర్సిటీలో భారీగా మోహరించి వరుసగా కవాతులు నిర్వహింపజేయటం వంటి నిర్ణయాలను డీజీపీ తీసుకోవటం వెనుక సైతం గవర్నర్‌ జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణ కమిటీతో సైతం ఆయన మాట్లాడినట్టు చెబుతున్నారు. నివేదిక సమర్పించటం వరకే తప్ప శాంతి భద్రతల విషయంలో తమకే సంబంధం లేదని మంగళవారం ఢిల్లీలో మీడియాకు చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ అదే సందర్భంలో శాంతి భద్రతలను పరిరక్షించటానికే అదనపు బలగాలు వెళ్ళాయని, దానివల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందేమీ కలగదని చెప్పటం గమనార్హం.

No comments: