Thursday, September 30, 2010

కోస్తాలో కొత్తగా జరగబోయే అభివృద్ధి ఏమిటన్నది .........

కోస్తా పొడవునా కొండచిలువ!

పదేళ్ల కిందటి మాట. మలివిడత తెలంగాణ ఉద్యమం అప్పుడప్పుడే బలంగా వినిపిస్తున్నది. ఆ నేపథ్యంలో సమైక్యవాదాన్ని విశ్వసించే ఒక వామపక్షనాయకుడు ఒక ఆసక్తికరమైన వాదన వినిపించారు. 'కోస్తాంధ్ర అభివృద్ధి చెందిందం టే అందుకు భౌగోళికమైన కారణాలు కూడా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాలకు ఏ దేశంలో అయినా అభివృద్ధికి అధిక అవకాశాలుంటాయి.

చైనాలో కూడా కోస్తాప్రాంతాలన్నీ తక్కిన దేశం కంటె అభివృద్ధి చెందుతున్నాయి.' ప్రాంతీయ అసమానతలకు విధానపరమైన లోపాలు, ఆధిపత్యధోరణులు కారణమని భావించే వారికి ఆ నైసర్గిక, భౌగోళిక కారణాలు విచిత్రంగానే ధ్వనించాయి.

సముద్రతీరం మాత్రమే కాదు, కొన్నిచోట్ల జీవనదులు, మరికొన్ని చోట్ల పర్వతశ్రేణు లు, కొన్ని చోట్ల విశాలమైన మైదాన ప్రాంతాలు కూడా-ఆయా దేశాలకు సానుకూలతలుగా ఉంటాయి.

జీవనం ఎంతో దుర్భరంగా ఉండే ఎడారి సీమలు కూడా ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలకు బంగారు గనులుగా పనికి వస్తాయి. పరిసర ప్రాకృతిక వ్యవస్థతో తన మనుగడను అనుసంధానించుకోగలిగితేనే మనిషి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. సమాజాలు తమకు అందుబాటులో ఉన్న వనరులను ఎట్లా సమష్టి ప్రయోజనాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం వినియోగించుకుంటారన్న ది, వాటి వాటి విచక్షణ, వివేకాల మీద ఆధారపడి ఉంటుంది.

దారిద్య్రం కానీ, సంపన్నత కానీ ఆ విచక్షణ, వివేకం మీదనే సంక్రమిస్తాయి. బంగారాన్ని తవ్వితీయడం తెలిసి, దాన్నొక సాధారణ అలంకార లోహంగా వినియోగించుకుంటున్న అమెరికా ఖండ మూలవాసులు యూరోపియన్ల దెబ్బకు దాదాపు అంతరించిపోయారు, అదే బంగారం అమెరికాను స్వర్ణమయం చేసింది. బంగారం, బొగ్గు, వజ్రాలు పుష్కలం గా ఉన్న ఆఫ్రికా ఖండం చీకటిలోనే మిగిలిపోయింది. వనరులు ఎక్కడ ఉన్నాయన్న ది కాక, ఎవరిచేతిలో ఉన్నాయన్నది చాలా ముఖ్యమైన అంశం.

శ్రీకృష్ణకమిటీ సభ్యుడు అబూ సలే షరీఫ్ గతవారం ప్రకాశం జిల్లాలో పర్యటిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదిహేనేళ్ల కాలంలో కోస్తాంధ్రలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతుందని, ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న అభివృ ద్ధి ఇకపై కోస్తాంధ్రకు తరలివస్తుందని ఆయన అన్నారు. గ్యాస్‌పైప్‌లైన్లు, పోర్టులు, సువిశాల తీరప్రాంతం కోస్తాంధ్రను సుసంపన్నం చేయనున్నాయని ఆయన వివరించారు.

షరీఫ్ వ్యాఖ్యలలో రాష్ట్రవిభజన గురించిన సూచన ఏదైనా ఉన్నదా అన్న కుతూహలాన్ని కాసేపు పక్కనబెడితే, కోస్తాలో కొత్తగా జరగబోయే అభివృద్ధి ఏమిటన్నది ఆశ్చర్యం కలిగిస్తుంది. సముద్రతీరం కొత్తగా వచ్చింది కాదు. సహజ వాయు నిక్షేపాలను కనిపెట్టి కూడా దశాబ్దాలు గడచిపోయాయి. ఇప్పుడు కొత్తగా ఒరగబోయే అభివృద్ధి ఏమిటట? అదేదో ఇంతకాలం ఎందుకు జరగలేదట?

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న క్రమంలో జరిగిన అనేక వాదవివాదాల్లో ఆంధ్రమేధావుల ఫోరమ్‌కు చెందిన చలసాని శ్రీనివాస్ కొన్ని కొత్త కోణాల ను ముందుకు తెచ్చారు. అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతం కావడం వల్ల, కోస్తాంధ్ర వివక్షకు గురి అయిందని, రాష్ట్రస్థాయి వ్యవస్థలు కానీ, సంస్థలు కానీ తీరాంధ్రలో స్థాపితం కాలేదని, కనీసం చెప్పుకోదగిన ఒక ఆస్పత్రికి కూడా ఆ ప్రాంతం నోచుకోలేదని ఆయన అంటున్నారు.

ఆయన చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, అక్కడ స్థానికంగా అభివృద్ధి జరిగే అవకాశాలున్నాయన్న శ్రీనివాస్ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. కాకపోతే, అభివృద్ధిని స్థానికంగా కాక, హైదరాబాద్ చుట్టూ కేంద్రితం చేసింది కూడా ప్రభుత్వ విధానా లు, కోస్తాంధ్రకు చెందిన ప్రాబల్య వర్గాలు అన్న అంశానికి ఆయన పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు.

అభివృద్ధి ఎక్కడ జరిగిందని కాక, ఎవరి ద్వారా ఎవరి కోసం జరిగిందన్న ప్రశ్నను ఆయన వాదన పట్టించుకోదు. అయితే, అబూ సలే షరీఫ్ జరగబోతోందని చెబుతున్న అభివృద్ధీ చలసాని శ్రీనివాస్ కోరుకుంటున్న అభివృద్ధీ ఒకటేనా అన్నది ప్రశ్న.

కోస్తా ప్రాంతానికి నైసర్గికమైన అనుకూలాంశాలున్నాయని, చైనాయే అందుకు ఉదాహరణ అనీ చెప్పిన వామపక్షనేత ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారో లేదో తెలియదు. చైనాతో సహా అనేక వర్ధమాన దేశాల్లో ప్రపంచీకరణ తీరప్రాంతాలలో 'సునామీ అభివృద్ధి'ని సృష్టిస్తోంది. స్థానిక ఆర్థిక వ్యవస్థలన్నిటినీ బలహీనపరచి, వనరులను ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానం చేయడమే పరమావధిగా గ్లోబల్ అభివృద్ధి జరుగుతున్నది.

ముడివనరులను, చవుక మానవశక్తిని ప్రపంచానికి అమ్ముకోవడమే తక్షణాభివృద్ధి మార్గమని చైనావంటి దేశా లు భావిస్తూ ఉండవచ్చు, అదే మార్గంలో మనదేశమూ సాగుతుండవచ్చు. కానీ, అభివృద్ధిరథచక్రాల కింద నలిగిపోతున్న నిర్వాసితులు దాన్ని అనుమతించడం లేదు.

తీరాంధ్ర పొడవునా 73 థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పి, లక్ష మెగావాట్ల దాకా విద్యుదుత్పత్తి చేయాలన్న సంకల్పం సోంపేట రైతులను ఏమీ భ్రమింపజేయలేకపోతున్నది. తొమ్మిది ఓడరేవులను, తీరం పొడవునా వందలాది ఫార్మా, రసాయ న కర్మాగారాలను నెలకొల్పాలన్న ప్రయత్నం 14 లక్షల మత్స్యకార కుటుంబాలను ఆనందపరచడం లేదు.

గొప్పగా చెప్పుకునే 900 కిలోమీటర్ల సముద్రతీరం- స్థానికులను నిరుద్యోగులను నిరాశ్రయులను చేసి, జలాలను కలుషితం చేసి, మనుగడలను ముంచివేయబోతున్నది. సముద్రానికీ, మానవ ఆవాసాలకీ నడుమ ఉన్న భూభాగమంతా కార్పొరేట్ కారిడార్‌గా మారబోతున్నది. షరీఫ్‌గారూ, మీరు ఆశపెడుతున్న అభివృద్ధి ఇదే నా? శ్రీనివాస్‌గారూ, మీరు ఈ ప్రక్రియను ఆమోదిస్తారా?

దురాశతో బంగారు బాతును కోసుకుతినే అభివృద్ధి మార్గం కోస్తాంధ్రకు కొత్తదేమీ కాదు. డాలర్ల కోసం రొయ్యల మడుగులు తయారుచేసి, ఇప్పుడు ఉప్పుకయ్యలుగా మారిన పంటపొలాలను చూసి దుఃఖపడుతున్న అనుభవం ఉండనే ఉన్నది. నీటిని టీఎంసీల కొద్దీ తాగే రక్కసిపంటలు, ఆయకట్టు చివర్లలో అగాధాల్లోకి వేసిన బోరుబావులు, అడుగుతవ్వితే మధురజలాలు ఉబికే నేలలో నిండిన ఫ్లోరైడ్ విషం, పారిశుద్ధ్యం కరవైన పట్టణాలు- ఇవీ తీరాం ధ్ర వైభవానికి సూచికలు.

వీటికి తోడు ఇప్పుడు అనకొండలాగా ఇచ్ఛాపురం నుంచి తడ దాకా స్వర్ణచతుర్భుజికి సమాంతరంగా పరచుకుంటున్న కారిడార్. దేశమంటే మట్టికానట్టే, ప్రాంతాలంటే కూడా మట్టికాదు. మనుషులే. ప్రాంతీయ అభివృద్ధి అంటే అక్కడి మనుషుల అభివృద్ధే. హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణను సంపన్నం చేయనట్టే, తీరాంధ్రకు సమకూరే వైభవం కూడా కోస్తాప్రజలకు సౌభాగ్యాన్ని ఇవ్వ దు. ముందే చెప్పినట్టు, ఏ నేలమీద ఏ పరిశ్రమలున్నాయన్నది కాదు, అవి ఎవరిచేతుల్లో ఎవరి కోసం ఉన్నాయన్నది ప్రశ్న. సమైక్యం సంగతి సరే, చాపకిందికి వస్తున్న నీరు తెలుస్తున్నదా?

వనరుల మీద నిర్ణయాధికారం స్థానికులకే ఉండాలన్న నినాదం తెలంగాణకే పరిమితమైనది కాదు. సార్వజనీనమైనది, సార్వత్రకమైనది. తెలంగాణ వనరులపై స్వయం నిర్ణయాధికారం కావాలన్నది ఎటువంటి ఆకాంక్షో, తీరాంధ్ర వనరులను స్థానికుల అభీష్ఠానుసారం మాత్రమే వినియోగించాలన్నది కూడా అటువంటి ఆకాం క్షే.

రాష్ట్ర విభజన జరిగినా జరుగకున్నా తీరాంధ్రలో రానున్న సంవత్సరాలలో విధ్వంస రథచక్రాలు పరుగు తీస్తూనే ఉంటాయి. లక్షలాది ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసే, దాదాపు కోటి మందిని జీవనాధారాల నుంచి, ఆవాసాల నుంచి నిర్వాసితులను చేసే దుర్మార్గాన్ని నిరోధించాలనే సంకల్పం తీరాంధ్రనేతలకు ఉన్నదా? 

-కె. శ్రీనివాస్


Friday, September 24, 2010

సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లు తెలంగాణ వస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని మేం ప్రచారం చేశాం.

సీమంద్రులతో వ్యాపారాలు నిజమే
మా వ్యాపారాలపైనా ఉద్యమ ప్రభావం

తెలంగాణకు చంద్రబాబే శిఖండి
పరదేశీ అయినా ఓకే..
ఆంధ్రా నేతలకు మాత్రం అంగీకరించరు
కవిత అడిగితే సిరిసిల్ల సీటిచ్చేస్తా
  * కేటీఆర్
 
మీ పేరు తారకరామారావు. దాంతో వివాదమొస్తే..
ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారేంటని చిన్నప్పటి నుంచీ చాలామంది అడిగారు. కానీ, నా నామకరణం రోజున మా నాన్నగారు అసలు లేరు. నాకు ఈ పేరు పెట్టడంలో ఆయన పాత్ర శూన్యం. (ఆర్కే: ఎన్టీఆర్ మీద అభిమానంతోనే ఆ పేరు పెట్టానని కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మా ప్రాంతంవాడు. ఆ పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తే..) నిరభ్యంతరంగా పేరు మార్చుకుంటా. నాకేం అభ్యంతరం లేదు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటామన్న టీడీపీ వాళ్లను కూడా మీరు వదలడం లేదు. చంద్రబాబు తెలంగాణకు అడ్డుపడుతున్నట్టా?
వంద శాతం చంద్రబాబుది శిఖండి పాత్ర. డిసెంబర్ 9నాడు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

తెలంగాణ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధపడితే.. మీరు టీఆర్ఎస్‌ను టీడీపీలో కలుపుతారా?
తెలంగాణ పోరాటం ఆత్మగౌరవం అనే నినాదంతో ఆంద్రుల ఆధిపత్యంపై జరుగుతుంటే.. తెలంగాణ వచ్చాక టీడీపీ ఎలా ఉంటుంది? తెలంగాణలో ఒక పరదేశీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఆమోదిస్తారేమో కానీ.. ఆంధ్రా నాయకుడి ఆధిపత్యంలోని పార్టీని సమర్థించే మూడ్‌లో లేరు.

తెలంగాణ వాళ్లకు సీమాంధ్ర వ్యక్తి పరదేశీ కంటే కూడా అభ్యంతరకరమా?
ఈరోజు పరిస్థితుల్లో అది వాస్తవం. జార్ఖండ్‌లో ఆర్జేడీ తుడిచిపెట్టుకుపోయినట్లే.. రేపు తెలంగాణలో టీడీపీ నామరూపాల్లేకుండాపోతుందన్నది నా అభిప్రాయం. తెలంగాణలో టీడీపీ ఉండకూడదని కాంగ్రెస్ అనుకుంటుంది. (ఆర్కే: మీ ఇద్దరూ కలిసినప్పుడు ఆటోమేటిగ్గా టీడీపీ పోతుంది) మేమనేదీ అదే! సోనియాకు కావాల్సింది ఎంపీ సీట్లు. కాంగ్రెస్, బీజేపీలలో ఒకరిని నిర్ణయించుకోవాల్సి వస్తే టీఆర్ఎస్‌ది లౌకిక విధానం.

హైదరాబాద్‌ను యూటీ చేయాలంటున్నారు..
అది పూర్తిగా అసంబద్ధం. హైదరాబాద్ మాకు రావడం లేదు కనక మీకు కూడా రానివ్వమంటే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని ఎవరూ నిలువరించలేరు. సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ అన్నట్లు తెలంగాణ వస్తే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని మేం ప్రచారం చేశాం. దానికి అనుగుణంగానే రేపు వ్యవహరించకపోతే నష్టపోయేదీ మేమే. ఇన్‌వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. సీమాంధ్ర కానీ సింగపూర్ కానీ.. వ్యాపారవేత్తలను ఆహ్వానిస్తాం.

పదిమందిని కలుపుకొని వెళ్లడానికి చూడకుండా వెళుతున్నారనే అభిప్రాయముంది..
పోరాటమే కావూరి, రాయపాటి, లగడపాటి, మేకపాటికి వ్యతిరేకంగా జరుగుతుంటే వాళ్లని కలుపుకొని పోవడం ఎలా? అసలు ఆంధ్రాలో ఎంపీలంతా పెట్టుబడిదారులు.

టీఆర్ఎస్ కుటుంబ పార్టీ అయిపోయిందిగా..
చూసేవాళ్ల దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కవిత పార్టీలో లేదు. ఆమె పార్టీలో భాగస్వామి కాదు.

కావాలని చెల్లెల్ని తొక్కేస్తున్నట్టున్నారు?
తను అడిగితే తనకోసం ఏం చేయడానికైనా సిద్ధం. (ఆర్కే: వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం ఖాయమా?) తను నుంచుంటానంటే నా సీటు ఇవ్వడానికి కూడా సిద్ధమే. 2006లో కరీంనగర్ ఉప ఎన్నిక వచ్చింది. అది పార్టీకి, ఉద్యమానికి, అందరికీ చావో రేవో ఎన్నిక కనక.. మూడు నెలలు లీవ్ అడిగాను. వాళ్లు ఇవ్వనన్నారు. దాంతో నాన్నగారికి చెప్పకుండానే రిజైన్ చేశాను. సిరిసిల్లలో పోటీ చేయాలని కూడా అనుకోలేదు. అవకాశం వస్తే.. ఎంపీగా వెళ్లాలని అనుకున్నా. అనుకోని పరిస్థితుల్లో సిరిసిల్లలో పోటీ చేశాను. మీకు అహం ఎక్కువని, దురుసుస్వభావమన్న విమర్శ ఉంది.ఇంత తీవ్రమైన విమర్శ ఉందని తెలియదు. మీరు చెప్పిన వాటిని నేను కరెక్టు చేసుకుంటా.

జీవన భృతికి మీరేం చేస్తున్నారు?
రెండు మూడు చేస్తున్నాను. ఫ్రెండ్స్‌తో కలిసి సర్వీస్ అపార్టుమెంట్స్ పెట్టాను. ట్రాక్టర్స్‌ది సీఎన్ఎఫ్ డీలర్ షిప్ ఉంది. కొంత రియల్ ఎస్టేట్ ఉంది. తెలంగాణ ఉద్యమం కావచ్చు. ఆర్థిక మాంద్యం కావచ్చు వాటి ప్రభావాలు మాపై కూడా పడతాయి. (ఆర్కే: మీకు పార్ట్‌నర్స్ ఎవరు? సీమాం«ద్రులు ఎవరైనా ఉన్నారా?) ఉంటారండి. తప్పనిసరిగా ఉన్నారు. అన్ని ప్రాంతాలవారు ఉన్నారు.

మీ జీవిత లక్ష్యం ఏమిటి?
మా నాన్న పేరు నిలబెట్టాలని. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోవాలని.

మీ ఫాదర్ పదవులు త్యాగం చేశారు కదా! తెలంగాణ వచ్చాక మీరూ అలాగే ఉంటారా?
నాలుగేళ్ల తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయంగా కొనసాగుతా. గెలిచిన తర్వాత పదవి వస్తే వంద శాతం తీసుకుంటా. అధికారం వచ్చిన తర్వాత పదవులు తీసుకోకపోవడం కూడా కరెక్టు కాదు. 
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో

Saturday, September 18, 2010

మేయర్‌గారు 100 కోట్లు మేశారు * రైతుల సబ్సిడీ స్వాహా చేశారు

ఎరువుల స్కాంలో కొత్త కోణం
4500 టన్నుల అక్రమ తరలింపు!
'హరిత' అక్రమం.. క్రిభ్‌కో, ఇఫ్కో ఎరువులతో దందా
రెండేళ్లుగా సాగుతున్న బాగోతం
వ్యవసాయ, మార్కెఫెడ్ అధికారులు కుమ్మక్కు?
వైఎస్‌కు బామ్మర్ది.. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ దందాలో ఇదో కొత్త కోణం! రైతులకు చెందాల్సిన సబ్సిడీని మేయరు గారు ఎంచక్కా మేసేశారు! ఒకటీరెండు కోట్లు కాదు.. ఏకంగా వంద కోట్ల రూపాయలు! అన్ని చట్టాలనూ అతిక్రమించి.. అక్రమ వ్యాపారానికి అడ్డదార్లు తొక్కారు! క్రిభ్‌కో, ఇఫ్కో వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా తన హరిత ఫ్యాక్టరీకి తరలించుకుపోయారు! అది కూడా మౌఖిక ఆదేశాలతోనే!

అక్రమ సంపాదనలో వాటా ఎందుకు కోల్పోవాలనుకున్నారేమో... ఈ బాగోతం రెండేళ్లుగా సాగుతున్నా.. వ్యవసాయ శాఖ అధికారులుగానీ.. మార్క్‌ఫెడ్ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు! ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 మిక్సింగ్ ప్లాంట్లకు 4.5 వేల టన్నుల యూరియాను అక్రమంగా తరలించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో ఇప్పటికే బయటపడింది. ఇందులో రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన కంపెనీలే అధికంగా ఉన్నాయి.

రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన కీసరలోని హరిత ఫర్టిలైజర్‌కు అక్రమంగా ఈ ఏడాది 3,400 టన్నులు తరలివెళ్లినట్లు విచారణలో బయటపడింది. ఇందులో 2,200 టన్నులు ఆగాపూర్‌లోని తారమా మ్యాక్స్ ద్వారా తరలించగా వేయి టన్నులను మార్క్‌ఫెడ్ నేరుగా సరఫరా చేసింది. ఇది చాలదన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా క్రిభ్‌కో కంపెనీ నేరుగా మరో 200 టన్నులను హరిత కంపెనీకి విక్రయించింది. ఈ ఎరువుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా తరలించిన వేయి టన్నులను ఇఫ్కో తయారు చేయగా మిగిలిన ఎరువులు క్రిభ్‌కోలో ఉత్పత్తి అయ్యాయి.

నేరుగా ఎరువులను దిగుమతి చేసుకునేందుకు ఒక సమయంలో ఇబ్బంది రావడంతో అతిగతీ లేని ఆగాపూర్‌లోని 'తారమా మ్యాక్స్' పేరుతో 2200 టన్నులను దిగుమతి చేసుకున్నారు. మూడో కంటికి కూడా తెలియకుండా ఇదంతా జరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వేల టన్నుల యూరియా, డీఏపీలో దారి మళ్లినట్లు తెలుస్తోంది. గత ఏడాది, ఈ ఏడాది ఎరువుల కొరతకు మిక్సింగ్ ప్లాంట్లే ఓ కారణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

మౌఖిక ఆదేశాలతోనే అంతా: అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి, ఏకపక్షంగా అధికారులు అక్రమంగా ఎరువులను కంపెనీకి తరలించారని, రాతపూర్వకంగా ఎటువంటి ఫైల్ కదలకుండానే వేల టన్నుల యూరియా, డీఎపీలను హరిత కంపెనీకి చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మార్క్‌ఫెడ్ ద్వారా ఈ ఏడాది హరిత ఫర్టిలైజర్ కంపెనీకి వేయి టన్నుల ఇఫ్కో యూరియాని విక్రయించారు.

ఎలాంటి ఆధారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో యూరియాను కేటాయించేందుకు జిల్లా మేనేజర్ నిరాకరించారు. అయితే కంపెనీ యాజమాన్యం వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఆయనపై ఒత్తిడి తెచ్చి యూరియాను విడుదల చేయించింది. ఇపుడు దీనిపై వివాదం రేగడంతో వారంతా కింది స్థాయి అధికారులపై నెట్టేస్తున్నారు. కింద స్థాయి అధికారులు కేసులో ఇరుక్కుపోయారు.

అక్రమాలు జరిగేది ఇలానే: ఎరువుల కుంభకోణంలో ఇప్పటికే అధికారుల పాత్ర స్పష్టమైంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల సహకారంతో నాలుగైదేళ్లుగా కొందరు మిక్సింగ్ ప్లాంట్లు నిర్మించారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్ల కిందట నిర్మించిన హరిత ఫర్టిలైజర్ కంపెనీలోనే భారీగా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ఎరువుల నియంత్రణ చట్టంలోని అన్ని నిబంధలను అతిక్రమించి కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడ్డారు.

అసలు ఆ ప్లాంట్ తయారు చేస్తున్న ఎరువులకు కావాల్సిన ముడిసరుకు మొత్తం అక్రమంగానే తరలించారు. వాస్తవానికి మిక్సింగ్ ప్లాంట్లు దిగుమతి చేసుకునే ఎరువులు, ముడిసరుకుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి రాయితీలు ఉండవు. ఉదాహరణకు యూరియా తయారీ కంపెనీకి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 200లకుపైగానే సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం 50కిలోల యూరియా ధర 500కు పైగానే ఉన్నా ప్రభుత్వం రూ. 275లకు అందచేస్తోంది.

అలాగే డీఏపీకి కూడా భారీగా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల బస్తా రైతుకు సబ్సిడీపై రూ. 517లకే అందిస్తోంది. ఒక వేళ మిక్సింగ్ కంపెనీలు యూరియాను కొనుగోలు చేయాలంటే వీటికి దాదాపు రెట్టింపునకుపైనే ఖర్చు చేసి కొనుగోలు చేయా లి. అది కూడా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచి సరుకు తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం లేదా ఉత్పత్తి కంపెనీల ద్వారా సరఫరా చేసే యూరియా, ఇతర ఎరువుల్లో నాణ్యత లోపిస్తే వాటిని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. వీటిలో నుంచే మిక్సింగ్ కంపెనీలు కొనుగోలు చేయాలి. ఎరువుల్లో తగ్గిన కాంప్లెక్స్ శాతాన్ని బట్టి వీటి రేటును అధికారులు నిర్ధారిస్తారు.

చట్టాలన్నీ అతిక్రమించి: హరిత ఎరువుల మిక్సింగ్ కంపెనీ అన్ని నిబంధనలూ తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమ ఎరువుల వ్యాపారం చేస్తోంది. కేంద్ర ఎరువుల నియంత్రణ చట్టాలను పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఎరువుల నియంత్రణ చట్టం 1985 క్లాజ్ 24 ప్రకారం కంపెనీల నుంచి నేరుగా ఏ ప్రైవేటు వ్యక్తి కూడా ఎరువులను దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు. ఈ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయాలి. సబ్సిడీ పై ఇచ్చే ఎరువులను రైతులను మాత్రమే వినియోగించాలి.

కానీ హరిత సంస్థ నేరుగా క్రిభ్‌కో నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంది. దీనికి అధికారులంతా సహకరించారు. అలాగే సెక్షన్ 23 (1) ఏ, బీ, సీ క్లాజుల కింద మిక్సింగ్ ప్లాంట్లు నాన్‌స్టాండర్డ్‌గా గుర్తించిన సరుకును మాత్రమే కొనుగోలు చేసి, వాటితో కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసుకోవాలి. ఇదంతా కూడా వ్యవసాయ శాఖ పరిధిలోనే జరగాలి. కానీ రైతులు వినియోగించే మంచి సరుకునే దిగుమతి చేసుకున్నారు. అది కూడా రైతు సబ్సిడీని స్వాహా చేసి సరుకును తరలించారు.

Saturday, September 11, 2010

వినాయకుడికి సంకట చవితి

 
*  వినాయక చవితి శుభాకాంక్షలు. 
తాము తలపెట్టిన కార్యక్రమాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, నిర్విఘ్నంగా నెరవేరాలని భక్తులు చవితి రోజున విఘ్న నాయకుడిని వేడుకుంటారు. అయితే ఈ వినాయక చవితి మాత్రం, మన రాష్ట్రంలో ఏక దంతుడికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. ఎందుకంటే సామాన్య భక్తులు కోరే కోరికలు, రాష్ట్రంలోని రాజకీయ నాయకుల కోరికలు, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం మనస్సులోని మాటలు పరస్పర విరుద్ధం గా ఉన్నాయి.

ఒకరి కోరిక తీర్చితే, మరొకరికి నష్టం జరుగుతుం ది. దీనితో అందరినీ సంతృప్తిపరచడం ఎలాగో తెలియక తలపట్టుకోవలసిన స్థితిలో లంబోదరుడు చిక్కుకోవడం ఈ వినాయ క చవితి ప్రత్యేకత! ముందుగా గణాధిపతి పరిగణనలో ఉన్న కోర్కెల జాబితాను పరిశీలిద్దాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులతోపాటు, ప్రజారాజ్యంపార్టీ కోరుతున్నది.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఈరెండు కోర్కెలలో దేన్ని తీర్చాలో తెలియక గణాధిపుడు సహజంగానే గడబిడపడుతున్నాడు. తెలంగాణవాదుల కోర్కె తీర్చితే సీమాంధ్ర వాళ్లకు కోపం వచ్చి, వచ్చే వినాయక చవితి నాడు తనకు ఉండ్రాళ్లు పెట్టరేమోనన్న ధర్మ సందేహంలో మోదక ప్రియుడు చిక్కుకున్నాడు.

అలాగని సీమాంధ్ర వాళ్ల కోర్కెను మన్నిస్తే, తెలంగాణవాదులకు కోపం వచ్చి, ఈ ప్రాంతంలో తనకు పూజా పునస్కారాలు దక్కవేమోనన్న భయంలో 'ప్రథమ పూజల దేవుడు' ఉన్నాడు. తనకు తెలంగాణలోనే, ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఆదరణ ఎక్కువని గజ కర్ణికుడికి తెలుసు! దీంతో జటిలమైన ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తేలక, మధ్యేమార్గం ఉందేమో కనుక్కోవలసింది గా, శ్రీకృష్ణ కమిటీని ఆ పార్వతీ నందనుడే వేడుకోవలసిన పరిస్థితి!

దీన్ని బట్టి రాష్ట్ర విభజన విషయంలో విఘ్నేశ్వరుడు చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం అవుతున్నది. తేలాల్సింది ఏమిటంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏయే ప్రతిపాదనలు చోటు చేసుకోబోతున్నాయి? ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతున్నది?

ఈ రెండు అంశాలు బొజ్జ గణపయ్య చిట్టి చేతిలో లేవు కనుక, అటు తెలంగాణవాదులు గానీ, ఇటు సీమాంధ్రకు చెందిన వాళ్లు గానీ, ఈ వినాయక చవితి రోజున దేవుడిని వదిలేసి, అంతకంటే శక్తిమంతురాలైన సోనియాగాంధీకి విన్నపాలు పంపుకోవడం మేలు! అలా చేస్తే కనీసం మిగతా కోర్కెల విషయంలోనైనా గణపతి ఆశీస్సులు లభించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారిపోయిన కడప ఎం.పి. జగన్మోహనరెడ్డి వ్యవహారాన్నే తీసుకుందాం. జగన్మోహనరెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు కనుక, తాను కలలుగంటున్న ముఖ్యమంత్రి పదవిని కటాక్షించాలని, ఆయన వినాయక చవి తి రోజున సుముఖుడిని కోరుకోకపోవచ్చు. కానీ ఆయన అనుచరులకు లంబోదరుడిపై నమ్మకం ఉంది కనుక, జగన్‌ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని వారు వేడుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో పాటు, పార్టీలోని జగన్ వ్యతిరేకులు ఆయనను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇష్టపడకపోవడం! జగన్ పట్ల అంతులేని ఆగ్రహంతో ఉన్నానని, తనను కలిసిన వారి వద్ద హావభావాలు ప్రదర్శిస్తున్న సోనియాగాంధీ కూడా క్రైస్తవ మతాన్నే అనుసరిస్తారు కనుక, ఆమె కూడా జగన్ తన దారిలోకి రావాలని గజాననుడిని కోరకపోవచ్చు.

అంటే జగన్ వల్ల గానీ, ఇటు సోనియాగాంధీ వల్ల గానీ ఈ వికట దేవుడికి వచ్చిన సంకటం ఏమీ లేదు. ఎటొచ్చీ వారి అనుయాయుల కోరికలతో నే చిక్కు వచ్చి పడుతోంది. అయితే జగన్ తమ దారిలోకి అయినా రావాలని, లేదా రాజకీయాలలో అడ్రస్ లేకుండా పోవాలని, కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు, ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకులు కోరుకుంటూ ఉండగా, జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ అధిష్ఠానం మనస్సు మార్చాలని, లేదా ప్రజల అండదండలతో పార్టీని ఎదిరించైనా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన వర్గం ముచ్చట పడుతోంది.

ఈ రెండు కోర్కె లు పరస్పర విరుద్ధంగా ఉన్నందున, ఎవరో ఒకరి కోర్కెను మన్నించి, మరో వర్గం ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేని వక్రతుండుడు, ఇక్కడ కూడా లౌక్యం ప్రదర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జగన్ భవిష్యత్తును, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును, ఆయన ప్రజలకే వదలి వేసే అవకాశం ఉంది. అంటే జగన్ ముఖ్యమంత్రి అవుతారా? రాజకీయంగా కనుమరుగు అవుతా రా? అన్నది తేల్చవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీదే ఉంది.

అదే సమయంలో తన నాయన చనిపోయి ఏడాది దాటినా, ఇప్పటికీ నాయనను, తనను టార్గెట్ చేసి, అసూయ, కుళ్లుతో విమర్శలు చేస్తున్న వాళ్లంతా నాశనం కావాలని, జగన్, ఆయ న వర్గం కోరుకుంటున్నది. అంటే ఈ బాధ్యత కూడా చవితి నాడు శివ పుత్రుడిపైనే పడుతోంది.

పోనీ ఈ కోర్కెను తీర్చి, కైలాసానికి వెళదామనుకుంటే, అయిదేళ్లు తండ్రి అధికారంలో ఉంటేనే వేల కోట్ల రూపాయల ను అక్రమంగా పోగేసుకున్న జగన్‌కు, మళ్లీ అధికారం సిద్ధిస్తే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలదు కనుక, ఆయనే రాజకీయంగా నాశనం కావాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు.

ఈ రెండు కోర్కెలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నందున, ఎవరినీ నొప్పించకుండా ఉండటానికి, మోదకప్రియుడు ఉండ్రాళ్లు భోంచేసి, మౌనవ్రతం పాటిస్తే ఏ పేచీ ఉండదని, ఆయన అధికారిక వాహనంగా చెల్లుబాటు అవుతున్న మూషికుడు సలహా ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య కొనసాగుతా రా? ఆయన కుర్చీకి ముప్పు ఉందా? లేదా? అనే, రాజకీయ వర్గాలను వేధిస్తున్న ధర్మ సందేహానికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత విఘ్నేశ్వరుడిపై ఉంది.

లంబోదరుడి విగ్రహాలను బంకమట్టితోనే తయారు చేసుకుని పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నందున, ముఖ్యమంత్రి కుర్చీకి బంకమట్టిలా అతుక్కుపోయి, ప్రతిమల తయారీకి బంకమట్టి దొరకని పరిస్థితి కల్పించకూడదన్న దృఢ సంకల్పం తో రోశయ్య ఉన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా సీఎం పీఠాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే రోశయ్య కుర్చీ ఖాళీ చేస్తే, ఆ కుర్చీలో కూర్చోవాలని ఉబలాటపడుతున్న వారినే సమస్య పట్టి పీడిస్తున్నది.

రాష్ట్రం లో సీఎం మారే అవకాశం ఉందని, అలా జరగాలని, ఆ పదవి ని ఆశిస్తున్న వాళ్లు వినాయక చవితి రోజు గట్టిగా కోరుకునే అవకాశం ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నందున, వారి కోర్కెను మూషిక వాహనుడు మన్నించే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో, ముఖ్యమంత్రి మార్పునకు పూనుకోవడం అంటే తేనెతుట్టెను కదల్చడమేనన్న సంగతి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తెలియంది ఏమీకాదు.

ఇటు తెలంగాణ సమస్య, అటు జగన్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ముఖ్యమంత్రి రోశయ్యకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మార్పునకు ప్రయత్నిస్తే పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. ఈ కారణంగానే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొ న్న గందరగోళాన్ని చక్కదిద్ది, పరిస్థితి తమ అదుపులోకి వచ్చిందన్న విశ్వాసం కుదిరిన తర్వాత మాత్రమే, ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనను కాంగ్రెస్ అధిష్ఠానం చేయనుంది.

సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉన్నందున, రోశయ్య స్థానం లో నియమితుడయ్యే వ్యక్తి, 2014 ఎన్నికలలో పార్టీని విజయతీరాలకు నడిపించే సత్తా కలిగి ఉండాలని సోనియాగాంధీ మనస్సులోని మాటగా చెబుతున్నారు. ఏతావాతా తేలింది ఏమిటం టే, కనీసం మరో ఏడాది పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రిని మార్చడం, మార్చకపోవడం అనే ది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చేతిలోని అంశమే కనుక, సంకటం నుంచి సంకటమోచనుడు బయటపడినట్టే! అయినా ఉండ్రాళ్ల ను కడుపారా ఆరగించి, బొజ్జ పెంచుకున్న భక్త వత్సలుడికి రాజకీయాల పట్ల అంతగా పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు.

ఈ కారణంగా ఈ విషయంలో ఆయనను ఎవరూ ఏమీ కోరకపోవచ్చు. రోశయ్య స్థానాన్ని అధిష్ఠించాలని ఆశిస్తున్నవారు కోరినా, 'నన్ను కాదు, పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోండి' అని ఒక ఉచిత సలహా పారేసి, ఉండ్రాళ్లు భుజించే పనిలో ఆయన బిజీ అయిపోవచ్చు.

ఇక మిగిలింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కోరబోయే కోర్కెలు ఎలా ఉండబోతున్నాయన్నదే! జగన్ సొంత పార్టీ పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి, తాను కూడా దెబ్బతిని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా రాజకీయాలను మేనేజ్ చేయాలని విఘ్నేశ్వరుడిని చంద్రబాబు కోరుకునే అవకాశం ఉంది.

ప్రత్యర్థుల బలహీనతలపై ఆధారపడే బదులు, సొంత బలంపై ఆధారపడడం ఎప్పుడూ శ్రేయస్కరం కనుక, రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కామన్‌సెన్స్ ఉపయోగించి ప్రమథ గణాధిపతి ఈ విషయంలో చంద్రబాబుకు సలహా ఇవ్వవచ్చు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని అంశాలపై పోరు ప్రారంభించి, జిల్లాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నాయకుడు, అదే ధోరణి కొనసాగించి, ప్రజల మద్దతు చూరగొనగలిగితే, వరసిద్ధి వినాయకుడు నిస్సహాయుడిగా మిగిలిపోయే పరిస్థితి తప్పిపోతుంది.

అలవి గాని వాగ్దానాలు చేయకుండా, చిల్లర విషయాలు పట్టించుకోకుండా, ప్రజానీకాన్ని వేధిస్తున్న ముఖ్యమైన సమస్యలపై ఉద్యమించి, అర్థవంతమైన పరిష్కారాలను సూచించడం ద్వారా, కోల్పోయిన విశ్వసనీయతను పొందగలిగితే చంద్రబాబు రాజకీయ మనుగడకు ఢోకా ఉండకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే అలవిగాని కోర్కెలు తీర్చే భారం నుంచి మూషిక వాహనుడికి మోక్షం లభిస్తుంది.

చిరంజీవి విషయానికి వస్తే ఆయనకు విఘ్నేశ్వరుడితో పెద్దగా పని ఉండకపోవచ్చు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో డీల్ కుదుర్చుకున్నందున, మునిగి నా తేలినా కాంగ్రెస్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయాలలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు కనుక, కొట్టిన పిండి అయిన సినిమాల్లో చిరంజీవి రాణించడం కష్టమేమీ కాదు.

అయితే, అంతర్లీనంగా తనను ఊరిస్తున్న ముఖ్యమంత్రి పదవిని సొంత బలంతో కాకపోయినా, జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతే, ఆ పార్టీ బలంతో అందుకోవాలన్న తన కోర్కెను చిరంజీ వి వినాయకుడి ముందుంచవచ్చు. ఉభయకుశలోపరిగా ఈ విషయంలో చిరంజీవికి 'బెస్టాఫ్ లక్' చెప్పి, గణపతి ఈ ఏడాదికి నిష్క్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. కనుక తొందరపడి హామీ లు ఇవ్వవలసిన అవసరం విఘ్నేశ్వరుడికి లేదు.

నాయకుల సంగతి అలా ఉంచితే, సామాన్య భక్తుల కోర్కెల విషయంలో వినాయకుడు ఎలా స్పందిస్తాడన్నదే తెలియవల సి ఉంది. రోగాలు - రొష్టులు, ఎరువుల కొరత, వరదల వంటి సమస్యలతో పాటు, నడ్డి విరుస్తున్న రోడ్ల బారి నుంచి తమను కాపాడాలని సామాన్య భక్తులు ఆ దేవుడిని వేడుకోనున్నారు.

అయితే ఈ సమస్యలు పరిష్కారం కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి పైన పేర్కొన్న సమస్యలను కూడా పరిష్కరించవలసిన బాధ్యత వినాయకుడిపైనే ఉంది. ఈ రెండింటినీ ఏకకాలంలో పరిష్కరించడం ఆయన చేతిలో లేదు కనుక, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో కొన్నింటినైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే దిశగా, పాలకులకు ఆలోచన వచ్చేలా చేయాలని విఘ్నేశ్వరుడిని ఉమ్మడిగా ప్రార్థిద్దాం.

ఈసారికి నాయకుల కోర్కెల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా, సామాన్య ప్రజలను, కనీసం కొన్ని సమస్యల నుంచై నా విముక్తి చేయడానికి వినాయకుడు చొరవ తీసుకోవాలని ఆశిద్దాం. అయినా దొంగతనం, దోపిడీ, హత్య చేయడానికి వెళ్లేవాడు కూడా, తన పని సాఫీగా జరిగేలా దీవించాలని దేవుడిని కోరుకుంటాడు. అంతమాత్రాన దేవుడు వారిని కరుణించడు కదా! ఎవరిని ఎలా దీవించాలో ఆయనకు బాగా తెలుసు. ఏ నాయకుడు ఎలాంటి వరానికి అర్హుడో వినాయకుడికి అందరికంటే బాగా తెలుసు!! 

-ఆదిత్య


Friday, September 10, 2010

గండిపేట నీళ్లు తాగి బలిసిన సీమాంధ్రులకు మర్యాద తెలియదంటున్న మధుయాష్కి

తెలంగాణావాదులను రాజకీయ నిరుద్యోగులు అని సీమాంధ్ర నేతలు తేలికగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎం.పి. మధు యాష్కి ఆక్షేపించారు. గండిపేట నీళ్లు తాగి సీమాంధ్ర నేతలు బలిసి ఇలా మాట్లాడుతున్నారని, సీమాంధ్ర నాయకులు ఇలాగే మాట్లాడితే ఇక ప్రజలు బట్టలూడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు.

సీమాంధ్ర నాయకులకు మర్యాద లేదని, అందుకే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమార్ ప్రాపర్టీస్ దగ్గరనుంచి ఏ భూకుంభకోణం చూసినా అందులో ఉండేది సీమాంధ్ర రాజకీయ నాయకుల హస్తమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమాంధ్ర ఎం.పి.ల ఆస్తులు ఎంత పెరిగినయ్యో చూడండి, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఈ ఎం.పి.లు ఎలా డబ్బు దండుకుంటున్నారో చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణాలో టోల్ గేట్‌లు పెట్టి మరీ తెలంగాణా డబ్బు దోచుకుపోతున్నారని ఆయన విమర్శించారు. కావూరి సాంబశివరావు, లగడపాటి అందరూ దోచుకుంటున్నవారేనని, ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనేది కాదని, అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులూ తెలంగాణాను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రం మూడు ముక్కలు ! * * * ముక్కలు చెక్కలు విభజిస్తే రెండుతో ఆగదు.. ఐదు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది

AP-Hydరాష్ట్ర విభజన అనివార్యం కానుందా? ఆంధ్ర- తెలంగాణ విడిపోనున్నాయా? అందులో ప్రధా నంగా.. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారనుందా? ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యను పరిష్కరించ నుందా? రెండు వాదాల నేపథ్యంలో వస్తున్న ఒత్తిళ్లు, నేతలు చేస్తున్న బెదిరింపులను శ్రీకృష్ణ కమిటీ ఖాతరు చేసే పరిస్థితిలో లేదా?.. తాజాగా శ్రీ కృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌, కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజ మనిపించక మానదు. గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటు-సమైక్యవాద ఉద్యమాల నేప థ్యంలో జరిగిన అల్లర్లు, ప్రభుత్వ-ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలు, రెండు ప్రాంతాలనేతల ఆమరణ నిరాహారదీక్షలు, ప్రత్యేకించి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష, ఆయనకు పోటీగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పోటీ దీక్ష, ఢిల్లీలో చిదంబరంతో అఖిలపక్షం భేటీ, ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీల ఢిల్లీ హడావిడి వాతావరణాన్ని వేడెక్కించాయి.

ఆ క్రమంలో వేసిన శ్రీకృష్ణ అధ్యయన కమిటీ తన పని ప్రారంభించింది. ఇప్పటికే 90 శాతం వరకూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఆ సందర్భంగా శ్రీ కృష్ణ కమిటీ సభ్యులను తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌, బిజెపి, జేఏసీ నేతలు ఘెరావ్‌ చేశారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నందున కమిటీ తన నివేదికను తెలంగాణ కు అనుకూలంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయినా, ఆ కమిటీ తన పని తాను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో.. తనపై వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కమిటీ ఖాతరు చేయడం లేదు. డిసెంబర్‌ తర్వాత అంతర్యుద్ధం వస్తుందని, తెలంగాణ అగ్నిగుండమవుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులను పరిగణనలోకి తీసుకోమని దుగ్గల్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో తన కమిటీని దిక్కుమాలిన కమిటీగా చాలారోజుల క్రితం అభివర్ణించిన కేసీఆర్‌ వ్యాఖ్యలపై జస్టిస్‌ శ్రీకృష్ణ ఆశ్చర్యకరమైన రీతిలో గురువారం స్పందించారు. ‘మాది దిక్కుమాలిన కమిటీ కాదు. కేంద్రానికి సరైన దిక్కు చూపే కమిటీ’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బట్టి.. శ్రీకృష్ణ కమిటీ బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకూడదని స్థిర నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Srikrishnaaఅయితే, గురువారం నగరానికి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ టివి-9 న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జస్టిస్‌ శ్రీ కృష్ణ మీడియాతో భే టీ అయిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అవి వారు ఇవ్వనున్న నివేదికకు సంకేతాలుగా మారాయి. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ వస్తున్న డిమాండ్‌, వార్తలను ఆ చానెల్‌ ప్రతినిధి దుగ్గల్‌ను ప్రశ్నించిన సమయంలో.. ఆ ప్రతిపాదనను పరిశీలిసు ్తన్నామని దుగ్గల్‌ ఇచ్చిన సమాధానం పెను వివాదంగా పరిణమించింది. దీనిపై తెలంగాణ వాదులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. అసలు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తర్వాత దుగ్గల్‌ వివరణ ఇచ్చుకున్నా, తెలంగాణ వాదుల నిరసనలు ఆగలేదు.

ఆ తర్వాత జస్టిస్‌ శ్రీ కృష్ణ మాట్లాడుతూ తాము ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేద ని, తమది పనికిరాని, దిక్కుమాలిన కమిటీ అని విమర్శించిన వారే తిరిగి మనసు మార్చుకుని తమకు నివేదిక ఇచ్చారన్నారు. తమది దిక్కుమాలిన కమిటీ కాదని, కేంద్రానికి సరైన దిక్కు చూపే కమిటీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కమిటీపై కేసీఆర్‌ ఏనాడో చేసిన వ్యాఖ్యలను గుర్తు పెట్టుకుని మరీ శ్రీ కృష్ణ వ్యాఖ్యానించారంటే కమిటీ ఎలాంటి వైఖరితో ఉందో స్పష్టమవుతోంది. శ్రీ కృష్ణ, దుగ్గల్‌ జిల్లా పర్యటనలకు వెళ్లిన సమయంలో రాష్ట్ర విభజనకు సంబంధించి సంధించిన ప్రశ్నలు కూడా అప్పట్లో చర్చనీయాంశమ య్యాయి. రాష్ట్రం విడిపోతే నష్టమేమిటని సీమాంధ్రలో, కలసి ఉంటే వచ్చే నష్టమేమిటని తెలంగాణలో అడిగారు.

ఈ నేపథ్యంలో తాజాగా దుగ్గల్‌ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమిటీ.. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజనే అన్న నిర్ణయానికి వచ్చినట్లు వారి మాటల ద్వారా స్పష్టమవు తోందని విశ్లేషిస్తున్నారు. వారి పరిశీలన ప్రకారం... రాష్ట్రం విడిపోయి, తాము విడిగా ఉండాలని, ప్రతిరోజూ వివాదం ఎందుకన్న ధోరణిలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారు.

అయితే.. వారికి వచ్చిన చిక్కల్లా హైదరాబాద్‌ ప్రాంతమే. హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి నివసిస్తున్న తమ కుటుంబసభ్యుల రక్షణ, వారి ఆస్తులకు భద్రతపైనే తప్ప, రాష్ట్రం విడిపోవడంపై సీమాంధ్ర ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేదంటున్నారు. తమకు రక్షణ కల్పించేందుకు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని విభిజిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్న భావనతో సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఆ రకంగా రెండు రాష్ట్రాలను విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, ఇది అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమని భావిస్తోంది. అందుకే ‘ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంద రికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచిస్తామ’మని దుగ్గల్‌ పదే పదే చెప్పడం గమనార్హం.

ఎలాగూ తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి..అటు చాలాకాలం నుంచి స్థిర నివాసం ఉంటున్న సీమాంధ్ర వాసులను, ఇటు తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచవచ్చన్న భావనతో కమిటీ ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణ వాసులు కూడా మెజారిటీ శాతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాబట్టి, వారు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. గవర్నర్‌ నరసింహన్‌ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే తన నివేదికలో వ్యక్తపరిచి కేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుతో పాటు భద్రతాపరంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా ప్రకటించడమే పరిష్కారమని సూచించినట్లు గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.ఇక ఈ విషయంలో నాయకుల నుంచి మాత్రమే వ్యతిరేకత వ్యక్తమవుతుంది తప్ప, హైదరాబాద్‌లో నివసించే అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక ఎదురవదని కమిటీ వేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ లేని తెలంగాణను తాము అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అది తల లేని శరీరంగా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి దుగ్గల్‌ చేసిన వ్యాఖ్యల బట్టి తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో పాటు.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

ముక్కలు చెక్కలు విభజిస్తే రెండుతో ఆగదు.. ఐదు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది

స్వపరిపాలన అంటే జిల్లాకో రాష్ట్రమే..
విడిపోయాకే పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం
నాగాలండ్‌లోనూ ప్రత్యేక దేశం డిమాండ్...
ప్రత్యేక ఉద్యమాలన్నీ రాజకీయ ప్రేరేపితమే
ముందు వెనుకబాటు అన్నారు..
ఇప్పుడు సెంటిమెంట్ అంటున్నారు
ఫ్యూడల్ అధికారుల కోసమే అగ్రవర్ణాల 'తెలంగానం'..
విభజస్తే రాజకయ అస్థిరత తథ్యం
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నివేదిక

"రాష్ట్రాన్ని విభజిస్తే... రెండుతో ఆగిపోదు. ఐదు రాష్ట్రాలుగా విభజించాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రతి జిల్లా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుం ది. ఆపై... ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్లు కూడా తలెత్తే ప్రమాదముంది''... అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనవ్యక్తం చేశారు.

ఆత్మ గౌరవం, స్వపరిపాలన పేరి ట రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పోతే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాజకీయ నిరుద్యోగుల ప్రేరేపితమని తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ నివేదిక సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఇందు లో నొక్కి చెప్పారు. విభజిస్తే తలెత్తే దుష్పరిణామాలను వివరించారు.

"మొదటి ఎస్సార్సీ తర్వాత పంజాబ్‌ను ఏర్పాటు చేయలేకపోయారు. ఒక విద్వేషోద్యమం తర్వాతే పంజాబ్‌ను వేరు చేశారు. ఆ తర్వాత... తమకు ప్రత్యేక దేశం కావాలంటూ 'ఖలిస్థాన్' ఉద్యమం మొదలైంది. అలాగే... గేటర్ అస్సాం నుంచి విడిపోయిన నాగాలాండ్‌లోనూ ప్రత్యేక దేశం డిమాండ్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా 22 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి 'సెంటిమెంట్' డిమాండ్లు మరిన్ని వచ్చే అవకాశముంది'' అని హెచ్చరించారు.

కావూరి సాంబశివరావు నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు జూబ్లీహాల్‌లో శ్రీకృష్ణ కమిటీకి తమ నివేదిక సమర్పించారు. ఇందులోని అంశాలను 'పవర్ పాయింట్ ప్రజంటేషన్' ద్వారా వివరించారు. ప్రత్యేకవాదులు చేస్తున్న వెనుకబాటు, సెంటిమెంట్, స్వపరిపాలన తదితర వాదనలన్నింటినీ తోసిపుచ్చారు. స్వార్థపూరిత, హ్రస్వదృష్టి కలిగిన కొందరు నేతలే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎగదోస్తున్నారని తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో తమ భూస్వామ్య అధికారాలను అనుభవించలేక పోతున్నామనే దుగ్ధతో, ఆధిపత్య వర్గాలు, కులాలు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగుల చేతిలో ఇదో వజ్రాయుధంగా మారిందని అన్నారు. మతతత్వం, కులతత్వంలాగే ప్రాంతీయ తత్వం కూడా రాజకీయంగా త్వరగా ఎదిగే సాధనంగా మారిందన్నారు. వాస్తవాల వక్రీకరణ, ఊహాజనిత గణాంకాలే ప్రత్యేకవాదానికి ప్రధాన ఆధారాలని తెలిపారు. 1998, 2006, 2008 గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణకు 45.03 శాతం పోస్టులు దక్కాయన్నారు. ఇటీవల ప్రత్యేక వాదుల హుకుంను ఉల్లంఘించి జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష రాసిన యువతకు 'హ్యాట్సాఫ్' చెప్పారు.

ఏది వెనుకబాటు? ఎక్కడ సెంటిమెంటు?
"బాగా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. అలాగే... వెనుకబడిన జిల్లాల్లోనూ అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక చట్టం ఉంది. మీరూ ఈ చట్టాన్ని పరిశీలించండి. ప్రస్తుత అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఆ కమిషన్‌ను బలోపేతం చేయవచ్చు. మూడు ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించేందుకు మండలం, పంచాయతీ స్థాయిలో సమాచారాన్ని అధ్యయనం చేయాలి'' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీని కోరారు.

తొలుత వెనుకబాటు, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం అనే వాదనతో మొదలైన ఉద్యమం... ఇప్పుడు 'సెంటిమెంట్' వద్దకు చేరిందన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో తెలంగాణదే సింహభాగమని తేటతెల్లం కావడంతో సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఇలాంటి భావోద్వేగాలతో రాష్ట్రం ఇవ్వలేమన్నారు.

భావోద్వేగాలు శాశ్వతం కావని స్పష్టం చేశారు. "డిసెంబర్ 9 ప్రకటన తర్వాతే ఉద్యమానికి ఊపు వచ్చింది. భావోద్వేగాలు తాత్కాలికం. అవి త్వరగా చల్లారతాయి. అంతేకాదు... ఈ సెంటిమెంట్ తెలంగాణ అంతటా ప్రబలంగా లేదు. ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు... జిల్లా నుంచి జిల్లాకు తేడా ఉంది. ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంది'' అని నివేదికలో పేర్కొన్నారు.

ఇప్పుడున్నది విదేశీ పాలనా?
'స్వపరిపాలన పేరిట ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నవారు... ఇప్పుడు విదేశీ పాలనలో లేమని గ్రహించాలి' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన పేరిట రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆత్మగౌరవం అనేది ఒక భావన మాత్రమేనని.. దానికి శాస్త్రీయ కారణం లేదని తమ నివేదికలో తెలిపారు.

"సంస్కృతి, ఆత్మ గౌరవం కోల్పోతున్నామంటూ పిలుపునివ్వడం వెనుక ప్యూడల్ హక్కులను పునరుద్ధరించుకోవాలనే ఆలోచన తప్ప, మరొకటి లేదు. తెలంగాణలో వెట్టి చాకిరీతో ప్రజలను బానిసలుగా చూసేవారు. తెలంగాణ ప్రాంత పేదలు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అనుభవించలేక పోయారు. సమైక్య రాష్ట్రంలోనే వెట్టి విధానం రద్దయింది'' అని తెలిపారు.

విలీనం స్వచ్ఛందం: ఆంధ్రలో తెలంగాణ విలీనం స్వచ్ఛందంగా జరిగిందని... ఇది బలవంతంగా జరగలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. విశాలాంధ్ర కోరుతూ తెలంగాణ నేతలే తీవ్రమైన ప్రయత్నాలు చేశారన్నారు. "విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఇదే తీర్మానం చేసింది.

విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు హైదరాబాద్ రాష్ట్ర పరిధిలోని పది జిల్లాల్లో 7 జిల్లాల్లోని కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని వివరించారు. 1953లో పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క ఎంపీ కూడా దానిని వ్యతిరేకించలేదు.

ఎస్సార్సీ సైతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం అయ్యేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. అయితే, దీనిని పరిపాలనాపరమైన కారణాలతో ఐదేళ్లు వాయిదా వేసింది'' అని తెలిపారు. ఎస్సార్సీ ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ విధించలేదని గుర్తు చేశారు. 1969లో జైతెలంగాణ, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు తలెత్తినప్పుడు అప్పటి ప్రధాని ఇందిర దృఢచిత్తంతో వ్యహరించారని తెలిపారు. రాష్ట్ర విభజనతో సమస్య పరిష్కారం కాకపోగా, మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని ఆమె గుర్తించారన్నారు.

విభజనతో అస్థిరత: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. పైగా అస్థిరతకు, రాజకీయ బేరసారాలకు నిలయాలుగా మారాయని... కొన్ని రాష్ట్రాలు దివాలా అంచుల్లో నిలిచాయని వివరించారు.

"రాష్ట్రాన్ని విభజిస్తే మరిన్ని ఉప ప్రాంతీయ పార్టీలతోపాటు కులాలు, ఉప కులాల పేరిట కూడా పార్టీలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఎన్నికల్లో అస్పష్ట తీర్పు మాత్రమే వెలువడుతుంది. రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అంతిమంగా అభివృద్ధి, భద్రతకు భంగం వాటిల్లుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సంకుచిత భావాలు, ఉప ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతుందని... రాష్ట్ర రాజకీయాల్లో వాటి అవసరమూ పెరుగుతుందని అన్నారు. ఇలాంటి పార్టీలే భవిష్యత్తును నిర్దేశిస్త్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ రాజధాని...
గత ఐదేళ్లలో హైదరాబాద్ జనాభా 34 నుంచి 41 శాతానికి పెరిగిందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీకి తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వలసలు రావడం వల్లే జరిగిందన్నారు. వీరంతా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించకుంటే హైదరాబాద్ కూడా ఒకప్పటి రాజధాని నగరం కర్నూలులాగే ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఉండేదని అన్నారు.

హైదరాబాద్‌లోని పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల జాబితాను తమ నివేదికలో పొందుపరిచారు. డిగ్రీ కాలేజీల నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల దాకా... రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, వాటిలో తెలంగాణ వాటా ఎంత అనే గణాంకాలు సమర్పించారు.

కావూరి ఇంట్లో కసరత్తు: శ్రీకృష్ణ కమిటీ వద్దకు వెళ్లే ముందు కావూరి సాంబశివరావు నివాసంలో ఎంపీలు మేకపాటి రాజమోహన రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, కిల్లి కృపారాణి, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, నేదురుమల్లి జనార్దన రెడ్డి సమావేశమయ్యారు. కమిటీ ముందు వినిపించాల్సిన వాదన్రలపై సమీక్షించారు.

సమైక్యాంధ్ర వాదనలు పూర్తిగా కావూరి విన్పించాలని.. మిగిలిన ఎంపీలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని తీర్మానించారు. అనంతరం కేవీపీ, నేదురుమల్లి మినహా మిగిలిన ఎంపీలందరూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరయ్యారు. కావూరి నివాసంలో జరిగిన భేటీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి రాలేదు. ఆయన నేరుగా కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

చిత్తగించండి...
* ప్రత్యేక వాదాలన్నీ రాజకీయ ప్రేరేపితమే. 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించగానే... తెలంగాణ ఉద్యమం గాలి తీసిన బుడగలా మారింది. అలాగే.. 1972లో పీవీ నరసింహరావును తప్పించగానే జై ఆంధ్ర ఉద్యమమూ మాయమైపోయింది.

* ఒకప్పుడు తెలంగాణలో ఉన్న వెట్టి వ్యవస్థ సమైక్య రాష్ట్రంలోనే అంతమైంది. తమకు కావాల్సింది దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ అని వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేశాయి. దొరల తెలంగాణకంటే సమైక్య రాష్ట్రంలోనే ఉంటామని ప్రకటించాయి కూడా.

* తెలంగాణ రాష్ట్రం ఇద్దరు ప్రధాన మంత్రులను, నలుగురు ముఖ్యమంత్రులను అందించింది. పీవీ నరసింహారావుది తెలంగాణా? సీమాంధ్రా? అని ఎవరూ చూడలేదు. ప్రతి తెలుగు వాడూ ఆయనను తమ వాడుగానే భావించారు. ప్రధానిగా ఉన్న ఆయన రాయలసీమలోని నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

* 2004లో ఎన్నికల పొత్తులో సీపీఐ, సీపీఎంకు కేటాయించిన స్థానాల్లో పది చోట్ల టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ పదిచోట్లా టీఆర్ఎస్ ఓడిపోగా... సమైక్య నినాదం వినిపించిన కమ్యూనిస్టులు అధికచోట్ల నెగ్గారు. 2008లో టీఆర్ఎస్ తనంత తాను తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో 2 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటమిపాలైంది.

* విభజన రెండు రాష్ట్రాలతో ఆగిపోదు. 5 రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. గిరిజనులు మన్యసీమ కావాలంటున్నారు. తమకూ రాష్ట్రాలు కావాలని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Monday, September 6, 2010

‘పరీక్ష’ పాస్‌

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎవరు ఉత్తీ ర్ణులు అయినా, కాకపోయినా ముగ్గురు మాత్రం ఫలితాలు వెలువడక ముందే పాస్‌ అయ్యారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావు తాము చెప్పినట్టు చేసి పరీక్షలో ఉత్తీర్ణత పొందారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర పార్టీల నేతలు, జేఏసీలు...ఇలా ఎందరు చెప్పినా, విన్నపా లు చేసుకున్నా ముఖ్యమంత్రి తాను అను కున్నట్టే చేశారు. ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతి పత్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ వివాదంలో తాను తల దూర్చబోనని మంత్రుల బృందం తో చెప్పేసిన ఆయన, చెదురుమదురు ఘటనలు మినహా పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారన్న పేరు సంపాదించుకున్నారు.

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సైతం ఏది ఎలా ఉన్నా ఈ పరీక్షలో రోశయ్య పాస్‌ అయ్యారంటూ వ్యాఖ్యానించటం విశేషం. వాస్తవానికి శనివారం నాటి సాయంత్రమే రోశయ్య తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి గందర గోళమూ లేదన్న వ్యాఖ్య చేసినప్పుడే అసలు విషయం తేలిపోయింది. ఎలాగైనా సరే పరీక్షను నిర్వహించి తీరుతామన్న ధోరణి ముఖ్యమంత్రి వ్యాఖ్య వెనుక కనిపించింది.

అలాగే అంతకు ముందు ఏపీపీఎస్సీ చైర్మన్‌ వెంకట్రామిరెడ్డితో టెలిఫోన్‌లో మాట్లాడి పరీక్షను వాయిదా వేయాలని చెప్పిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆతర్వాత తెలంగాణ మంత్రుల బృందం ముఖ్య మంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అక్కడ లేరు. ఆమె వేరే సమావేశానికి హాజ రయ్యారు. దానితోనే ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోదలచలేదని, ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని వివాదాస్పదుడు కాదలచలేదని తేలిపోయింది. పరీక్ష విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాంతీయ పక్షపాత ముద్ర పడిపోతుందన్న ఉద్దేశంతోనే రోశయ్య ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్టు చెబుతున్నారు.
sabita
సబిత...అంతా వ్యూహాత్మకం...
ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యవహారంలో మొదటినుంచీ వ్యూహాత్మకం గానే వ్యవహరించారు. పరీక్షను వాయిదా వేయాలని లేకపోతే భూకంపాలు సృష్టిస్తా మని టీఆర్‌ఎస్‌, జేఏసీ నేతలు ఒకవైపు బెదిరింపులకు దిగినప్పటికీ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఇంటిలిజెన్స్‌ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ నూతన డీజీపీ అరవిందరావుతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం మీడియా కలసినప్పుడు పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తాను కోరానని మాత్రమే చెప్పారు తప్ప అటువైపు నుంచి స్పందన ఏమిటన్నది బహిర్గతం చేయలేదు.

angry
ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి మాత్రమే చెబుతానన్నారు. ఈ వ్యవహారంలో సబిత మొదటినుంచీ వ్యూహాత్మకంగానే వ్యవ హరిస్తూ వచ్చారు. శనివారం ఉదయం సహచర మంత్రులు డి.శ్రీధరబాబు, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పరీక్షను వాయిదా వేయకపోతే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పినప్పుడు సబిత ఆ విషయంలో మౌనం వహించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, డీజీపీతో తప్ప మిగిలిన వారితో మాట్లాడరాదని నిర్ణయించుకున్న ఆమె అదే వ్యూహాన్ని అనుసరించి అనుకున్న రీతిలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ చైర్మన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడటం ద్వారా తాను తెలంగాణ ప్రాంతం వారికి అనుకూలంగా ఉన్నానని, ఆ తర్వాత పరీక్షను నిర్వహింపజేయటం ద్వారా రాష్ట్రం మొత్తానికీ తాను మంత్రిననీ ఆమె నిరూపించుకున్నారు.

అరవింద...తొలి షాట్‌ సక్సెస్‌...
ఇక డీజీపీ అరవిందరావు తన తొలి ప్రయత్నంలోనే పెద్ద కార్యక్రమాన్ని అంతగా అవాంతరాలు లేకుండా పూర్తి చేశారన్న పేరు సంపాదించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే పోలీస్‌ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు బందోబస్తు ఏర్పాటు చేయటం పెను సవాల్‌గా మారింది. దాన్ని అరవిందరావు సమర్థంగా ఎదు ర్కున్నారన్న పేరు సంపాదించారు. ఉస్మా నియా వర్శిటీ బీఈడీ కాలేజీ కేంద్రం వద్ద కొద్దిపాటి ఘర్షణ, విద్యార్థులను చెదర గొట్టేందుకు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం మినహా కాల్పుల దాకా పరిస్థితి వెళ్ళకుండా జాగ్రత్త వహించారు.

విద్యార్థులతో వ్యవహారం కాబట్టి పూర్తి సంయమనం పాటించాలన్న ఆదేశాలు ముందుగానే జారీ చేయటంతో ఉస్మా నియాలో గతంలో జరిగిన ఘటనలలాంటివి పునరావృతం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 445 పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం, మూడంచెల భద్రతా వ్యవస్థకు ఆదేశాలు జారీ చేయటం, ఎప్పటికప్పడు జంట నగరాలు, జిల్లా స్థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మార్గ నిర్దేశనం చేయటంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల నుంచి కాస్తంత ప్రతిఘటన మినహా చెప్పుకోదగ్గ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారన్న పేరును అరవిందరావు సంపాదించు కోగలిగారు.

అందరి చూపు డిసెంబర్‌ వైపే

srikrishnaరాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. అన్ని ప్రాంతాల్లోని అన్ని వర్గాలూ డిసెంబర్‌లో, ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ బోయే పరిణామాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ప్రధానంగా.. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఉత్కంఠ తో ఊపిరిబిగపట్టి ఫలితం కోసం ఎదురుచూస్తు న్నారు. డిసెంబర్‌ తర్వాత రాష్ట్రంలో ఏం జరగబో తోందన్న అంశం రాజకీయ పార్టీల భవితవ్యాన్నీ తేల్చనుంది. అన్నింటికన్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ వ్యవహారం కూడా డిసెంబర్‌తోనే ముడిపడి ఉండటం మరో ఆసక్తికర అంశం.

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలయిన కాంగ్రెస్‌ -తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? టీఆర్‌ఎస్‌ వ్యూహం ఎలా మారబోతోంది? సర్వ త్రా ఇవే ప్రశ్నలు. ఈ గందరగోళం నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో గందరగోళం. పెట్టుబడులపై తర్జనభర్జన. అమ్మకాలు, కొనుగోళ్లు స్తంభించిన వైనం. ప్రతిదానికీ ఆచితూచి నిర్ణయం. ఇదీ.. రాష్ట్రంలో పై నుంచి కిందవరకూ ఉన్న పరిస్థితి.ప్రత్యేక-సమైక్యవాద ఉద్యమాల నేపథ్యంలో హైకోర్టు నుంచి పంచాయతీ వరకూ నిలువునా చీలిన మానసిక భావన రాష్ట్రంలోని అన్ని రంగా లపై పెను ప్రభావం చూపుతోంది.

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానమైన హైకోర్టులో స్వేచ్ఛగా అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రధాన పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనూ ఉద్యో గులు రెండుగా చీలిపోయారు. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించవలసిన మంత్రులు ప్రాం తాల వారీగా విడిపోయి, ఒకరి ప్రాంతాల నేతలపై మరొకరు ధ్వజమెత్తుతున్నారు. దాదాపు అన్ని ఉద్యోగ సంఘాల్లోనూ ప్రాంతాల వారీగా చీలిక ఏర్పడింది. జర్నలిస్టు సంఘాలూ చీలిపోయాయి.

ప్రధానంగా.. రాజకీయపార్టీల్లోనూ స్పష్టమైన విభజన వచ్చింది. కాంగ్రెస్‌-తెలుగుదేశం పార్టీలు తెలంగాణ-సీమాంధ్రగా విడిపోయి పోరా టాలు చేస్తుంటే, స్థానిక ప్రజల మనో భావాలు దెబ్బతింటాయన్న భయంతో ఆయా నాయ కత్వాలు రెండు ప్రాంతాల ఉద్యమాలను ప్రోత్సహించవలసిన అనివార్యపరిస్థితి ఏర్ప డింది. పిసిసి అధ్యక్ష పదవీకాలం పూర్తవుతు న్నప్పటికీ, డిసెంబర్‌ వరకూ ఆ పార్టీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేని అయోమయ పరిస్థితిలో ఉంది. తెలుగుదేశం పార్టీ మహానాడును పూర్తి చేసుకుని నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర కమిటీని ప్రకటించలేని గందరగోళంలో ఉంది. చివ రకు మునిసిపల్‌ ఎన్నికలు కూడా నిర్వహించ లేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ డిసెంబర్‌లో శ్రీకృష్ణ మిటీ ఇచ్చే నివేదిక ప్రభావమేనని స్పష్టమవుతోంది.

srikirhsnaaరాష్ట్ర రాజకీయాలు ఇంత అనిశ్చితికి గురయ్యేందుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ పార్టీ చివరకు తాను తవ్వుకున్న గోతిలో తానే పడనుంది. రెండు ప్రాంతాల్లోని పార్టీ నేత లకు స్వేచ్ఛ ఇచ్చి, వ్యూహాత్మకంగా వాదాలను రగిలించిన కాంగ్రెస్‌ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంపై నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోతోంది. ముఖ్యంగా.. తనను ధిక్కరించి వ్యవహరి స్తోన్న జగన్‌ సంగతి తేలేవరకూ రాష్ట్ర విభ జనపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. జగన్‌ పార్టీ నుంచి తనంతట తాను వెళ్లిపోతాడా? లేక పార్టీ నుంచి తానే పంపించాలా? జగన్‌ వెళితే పార్టీ చీలుతుందా? ప్రభుత్వం కూలుతుందా? ఒకవేళ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సాయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి జగన్‌ వైపు వెళ్లేది ఎంతమంది? తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్‌ సతమత మవుతోంది. గతంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాక పోవడం వల్లే ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతోంది.

డిసెంబర్‌తో శ్రీకృష్ణ కమిటీ గడువు పూర్తి కానుంది. గడువు కంటే ముందే నివేదిక ఇస్తామని శ్రీకృష్ణ విస్పష్టంగా చెబుతున్నారు. ఆ కమిటీ రాష్ట్ర విభజనకు సంబంధించినది కాకపోయినా, మూడు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాలకు అద్దం పట్టే కమిటీగానే భావించవలసి ఉంది. దానికితోడు అది తన పర్యటనల్లో వేస్తున్న ప్రశ్నలు, చేస్తున్న వ్యాఖ్యలు కూడా గందరగోళంగా, అనుమా నాస్పదంగా కనిపిస్తున్నాయి. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన వెంటనే కేంద్రం ఒక నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ, రాష్ట్రానికి సంబం ధించి ఒక నిర్ణయం తీసుకునేందుకు కమిటీ నివేదిక అక్కరకొస్తుందన్నది నిర్వివాదం.

ఇప్పుడు అన్ని పార్టీలు, వర్గాలు, ప్రాంతాల్లో ఆ అంశమే ప్రధాన చర్చగా మారింది. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఇచ్చే వరకూ ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ ఉండకపోవచ్చంటున్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. ఆ నివేదికలో అంశాలు తెలంగాణకు సానుకూలంగా ఉంటే.. సమైక్యాంధ్రను కొనసాగిస్తూనే, తెలంగాణకు చెందిన సీనియర్‌ నే తకు సీఎం పదవి అప్పగించవచ్చని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దానికి సైతం అంగీకారం కుదర పోతే హైదరాబాద్‌ను కేంద్రపాలిక ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి తెలంగాణలో లబ్థి పొందే వ్యూహం కూడా లేకపోలేదంటున్నారు. ఇవన్నీ.. కాంగ్రెస్‌ తనకు రాజకీయంగా లాభం చేకూరుతుందనుకున్న నిర్ణయానికి వస్తేనే అని కాంగ్రెస్‌ సీనియర్లు విశ్లే షిస్తున్నారు. ఆ ప్రకారం చూస్తే డిసెంబర్‌ వరకూ ముఖ్యమంత్రి రోశయ్యకు ఎలాంటి ఢోకా ఉండకపోవచ్చంటున్నారు.

ఈ అంశంలో శ్రీకృష్ణ కమిటీతో పాటు.. గవర్నర్‌ నరసింహన్‌ నివేదిక కూడా కీలకంగా మారింది. గత కొద్ది నెలల నుంచి రాష్ట్ర రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీ లిస్తూ, ప్రభుత్వ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సమాంతర పాలన నడుపుతున్న గవర్నర్‌, రాష్ట్ర విభజనపై కేంద్రానికి ఎలాంటి సూచనలు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌ అంశమే ప్రధానంగా మారింది కాబట్టి, దానిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని సిఫార్సు చేస్తారా అన్న ప్రశ్నలూ వినిపించకపోలేదు. స్వతహాగా ఐపిఎస్‌ అయిన గవర్నర్‌ ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయాలన్న ధోరణినే ప్రదర్శిస్తున్నారు. శనివారం తనను కలిసేం దుకు వచ్చిన ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేతలకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వని విషయం తెలిసిందే.

ఇదిలాఉండగా... జగన్‌ వ్యవహారమే కాంగ్రెస్‌కు నిర్ణయం తీసుకునేందుకు ఒక అవరోధంగా పరిణమించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్‌లోగా నాయకత్వం జగన్‌ వ్యవహారాన్ని తేల్చే ఉద్దేశంతో ఉందని, దానిని దశల వారీగా పూర్తి చేస్తుందంటున్నారు. తొందరపడి జగన్‌పై వేటు వేయడం వల్ల ఆయన సీమాంధ్రలో బలమైన నేతగా ఆవిర్భవిస్తారన్న ఆందోళన కూడా లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. జగన్‌ను వదిలించుకోవాలనుకుంటే.. ముందు ఆయన మద్దతుదారులందరినీ బయటకు పంపించి, ఆ తర్వాత జగన్‌పై వేటు వేయాలన్నది ఒక ఆలోచన అంటున్నారు. సీమాంధ్రలో అటు తెలుగుదేశం, ఇటు జగన్‌ లబ్ధి పొందకుండా చూసే వ్యూహంలో భాగంగానే తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేస్తోందని సీనియర్లు చెబుతున్నారు.

అటు తెలుగుదేశం పార్టీకీ డిసెంబర్‌ ఫీవర్‌ పట్టుకుంది. ఇప్పటికే రెండుగా చీలిన ఆ పార్టీ కూడా కొత్త సంవత్సరంలో కేంద్రం ఏం నిర్ణయం తీసు కుంటుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. తెలంగాణ- సమైక్యాంధ్ర నే తలు ఇప్పటికే ఎవరి ఉద్యమాల్లో వారు మునిగిపోయారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని అటకెక్కించి చాలా కాలమయింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరినీ నియంత్రించే పరిస్థితిలో లేరు.

ఒకవేళ రాష్ట్రం విడి పోయినా.. రెండు ప్రాంతాల్లోనూ అధికారం లోకి రావాలన్న వ్యూహంతో ఉన్న చంద్రబాబునాయుడు వంటి పరిణతి చెందిన వ్యూహరచయిత సైతం,ఈ రాష్ట్రాన్ని కేంద్రం ఏం చేయబో తోంది? డిసెంబర్‌ తర్వాత ఏం జరగబో తోందన్న ఒత్తిడిలో ఉన్నారు. అందుకే ఆయన రాష్ట్ర కమిటీని ప్రకటించలేకపో తున్నారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్‌ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగానే వ్యవ హరించాలని తీర్మానించుకున్నారు. అసలు రాష్ట్రంలో తన పార్టీని సమాధి చేసేందుకే కాంగ్రెస్‌ విభజన చిచ్చు తెరపైకి తీసుకు వచ్చిందని భావిస్తోన్న బాబు, ఆ మేరకు ఇరు ప్రాంత నేతలకూ వాస్తవాలు చెప్పి, పార్టీని అదుపులో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో బాబు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు.

ఇక టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా తన పార్టీ భవితవ్యాన్ని నిర్దేశించుకు నేందుకు జనవరి కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకూ విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ జేఏసీల దన్నుతో ఉద్యమాన్ని, ఉద్యమ సహకారం తో పార్టీని బతి కించుకుంటూ వస్తోన్న కేసీఆర్‌, జనవరి తర్వాత ఏం చేయబోతా రన్న ఉత్కంఠ మిగిలిన వర్గాల్లో ఉంది. అదే సమయంలో కేసీఆర్‌కు సైతం పార్టీని ఏ దారి పట్టించాలన్న అయోమయం లేకపోలేదు. కాంగ్రెస్‌తో కలసి నడవాలా? బిజెపితో కలసి ఉద్యమాలు సాగించాలా? సొంతగా పార్టీని పటిష్టం చేసుకోవాలా? విద్యార్థులు, జేఏసీల ప్రభావం ఇదేవిధంగా కొనసాగితే పార్టీ మనుగడ ఏమిటి? అన్న ప్రశ్నలు కేసీఆర్‌ ముందున్నాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్థిక రంగం కూడా స్తంభించిపోయింది. ప్రధా నంగా.. రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలయింది. ఇల్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి. అపార్టుమెంట్ల నిర్మాణాలు సగంలోనే నిలిచి పోయాయి. రాష్ట్రానికి రావలసిన పెట్టుబడుల వ్యవహారం కూడా అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చక్కబడి, కేంద్రం ఒక నిర్ణయా నికి వచ్చిన తర్వాతే విస్తరణ, కొత్త కంపెనీలపై దృష్టి పెట్టాలని నిర్ణయించాయి.