Friday, September 10, 2010

గండిపేట నీళ్లు తాగి బలిసిన సీమాంధ్రులకు మర్యాద తెలియదంటున్న మధుయాష్కి

తెలంగాణావాదులను రాజకీయ నిరుద్యోగులు అని సీమాంధ్ర నేతలు తేలికగా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎం.పి. మధు యాష్కి ఆక్షేపించారు. గండిపేట నీళ్లు తాగి సీమాంధ్ర నేతలు బలిసి ఇలా మాట్లాడుతున్నారని, సీమాంధ్ర నాయకులు ఇలాగే మాట్లాడితే ఇక ప్రజలు బట్టలూడదీసి కొడతారని ఆయన హెచ్చరించారు.

సీమాంధ్ర నాయకులకు మర్యాద లేదని, అందుకే వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎమార్ ప్రాపర్టీస్ దగ్గరనుంచి ఏ భూకుంభకోణం చూసినా అందులో ఉండేది సీమాంధ్ర రాజకీయ నాయకుల హస్తమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీమాంధ్ర ఎం.పి.ల ఆస్తులు ఎంత పెరిగినయ్యో చూడండి, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఈ ఎం.పి.లు ఎలా డబ్బు దండుకుంటున్నారో చూడాలని ఆయన కోరారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణాలో టోల్ గేట్‌లు పెట్టి మరీ తెలంగాణా డబ్బు దోచుకుపోతున్నారని ఆయన విమర్శించారు. కావూరి సాంబశివరావు, లగడపాటి అందరూ దోచుకుంటున్నవారేనని, ఎవరు ఏ పార్టీకి చెందినవారు అనేది కాదని, అన్ని పార్టీల సీమాంధ్ర నాయకులూ తెలంగాణాను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

రాష్ట్రం మూడు ముక్కలు ! * * * ముక్కలు చెక్కలు విభజిస్తే రెండుతో ఆగదు.. ఐదు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది

AP-Hydరాష్ట్ర విభజన అనివార్యం కానుందా? ఆంధ్ర- తెలంగాణ విడిపోనున్నాయా? అందులో ప్రధా నంగా.. హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతంగా మారనుందా? ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యను పరిష్కరించ నుందా? రెండు వాదాల నేపథ్యంలో వస్తున్న ఒత్తిళ్లు, నేతలు చేస్తున్న బెదిరింపులను శ్రీకృష్ణ కమిటీ ఖాతరు చేసే పరిస్థితిలో లేదా?.. తాజాగా శ్రీ కృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌, కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ చేసిన వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజ మనిపించక మానదు. గత ఏడాది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న వేర్పాటు-సమైక్యవాద ఉద్యమాల నేప థ్యంలో జరిగిన అల్లర్లు, ప్రభుత్వ-ప్రైవేటు ఆస్తుల విధ్వంసాలు, రెండు ప్రాంతాలనేతల ఆమరణ నిరాహారదీక్షలు, ప్రత్యేకించి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష, ఆయనకు పోటీగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ పోటీ దీక్ష, ఢిల్లీలో చిదంబరంతో అఖిలపక్షం భేటీ, ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీల ఢిల్లీ హడావిడి వాతావరణాన్ని వేడెక్కించాయి.

ఆ క్రమంలో వేసిన శ్రీకృష్ణ అధ్యయన కమిటీ తన పని ప్రారంభించింది. ఇప్పటికే 90 శాతం వరకూ అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించింది. ఆ సందర్భంగా శ్రీ కృష్ణ కమిటీ సభ్యులను తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్‌, బిజెపి, జేఏసీ నేతలు ఘెరావ్‌ చేశారు. తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నందున కమిటీ తన నివేదికను తెలంగాణ కు అనుకూలంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయినా, ఆ కమిటీ తన పని తాను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

ఈ నేపథ్యంలో.. తనపై వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కమిటీ ఖాతరు చేయడం లేదు. డిసెంబర్‌ తర్వాత అంతర్యుద్ధం వస్తుందని, తెలంగాణ అగ్నిగుండమవుతుందని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులను పరిగణనలోకి తీసుకోమని దుగ్గల్‌ స్పష్టం చేశారు. అదే సమయంలో తన కమిటీని దిక్కుమాలిన కమిటీగా చాలారోజుల క్రితం అభివర్ణించిన కేసీఆర్‌ వ్యాఖ్యలపై జస్టిస్‌ శ్రీకృష్ణ ఆశ్చర్యకరమైన రీతిలో గురువారం స్పందించారు. ‘మాది దిక్కుమాలిన కమిటీ కాదు. కేంద్రానికి సరైన దిక్కు చూపే కమిటీ’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం బట్టి.. శ్రీకృష్ణ కమిటీ బెదిరింపులు, ఒత్తిళ్లకు లొంగకూడదని స్థిర నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

Srikrishnaaఅయితే, గురువారం నగరానికి వచ్చిన శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ టివి-9 న్యూస్‌ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జస్టిస్‌ శ్రీ కృష్ణ మీడియాతో భే టీ అయిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అవి వారు ఇవ్వనున్న నివేదికకు సంకేతాలుగా మారాయి. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ వస్తున్న డిమాండ్‌, వార్తలను ఆ చానెల్‌ ప్రతినిధి దుగ్గల్‌ను ప్రశ్నించిన సమయంలో.. ఆ ప్రతిపాదనను పరిశీలిసు ్తన్నామని దుగ్గల్‌ ఇచ్చిన సమాధానం పెను వివాదంగా పరిణమించింది. దీనిపై తెలంగాణ వాదులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దుగ్గల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేశారు. అసలు తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తర్వాత దుగ్గల్‌ వివరణ ఇచ్చుకున్నా, తెలంగాణ వాదుల నిరసనలు ఆగలేదు.

ఆ తర్వాత జస్టిస్‌ శ్రీ కృష్ణ మాట్లాడుతూ తాము ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేద ని, తమది పనికిరాని, దిక్కుమాలిన కమిటీ అని విమర్శించిన వారే తిరిగి మనసు మార్చుకుని తమకు నివేదిక ఇచ్చారన్నారు. తమది దిక్కుమాలిన కమిటీ కాదని, కేంద్రానికి సరైన దిక్కు చూపే కమిటీ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. కమిటీపై కేసీఆర్‌ ఏనాడో చేసిన వ్యాఖ్యలను గుర్తు పెట్టుకుని మరీ శ్రీ కృష్ణ వ్యాఖ్యానించారంటే కమిటీ ఎలాంటి వైఖరితో ఉందో స్పష్టమవుతోంది. శ్రీ కృష్ణ, దుగ్గల్‌ జిల్లా పర్యటనలకు వెళ్లిన సమయంలో రాష్ట్ర విభజనకు సంబంధించి సంధించిన ప్రశ్నలు కూడా అప్పట్లో చర్చనీయాంశమ య్యాయి. రాష్ట్రం విడిపోతే నష్టమేమిటని సీమాంధ్రలో, కలసి ఉంటే వచ్చే నష్టమేమిటని తెలంగాణలో అడిగారు.

ఈ నేపథ్యంలో తాజాగా దుగ్గల్‌ చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే.. రాష్ట్ర విభజన అనివార్యంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమిటీ.. రాష్ట్రంలో నెలకొన్న అన్ని సమస్యలకు పరిష్కారం రాష్ట్ర విభజనే అన్న నిర్ణయానికి వచ్చినట్లు వారి మాటల ద్వారా స్పష్టమవు తోందని విశ్లేషిస్తున్నారు. వారి పరిశీలన ప్రకారం... రాష్ట్రం విడిపోయి, తాము విడిగా ఉండాలని, ప్రతిరోజూ వివాదం ఎందుకన్న ధోరణిలో సీమాంధ్ర ప్రజలు ఉన్నారు.

అయితే.. వారికి వచ్చిన చిక్కల్లా హైదరాబాద్‌ ప్రాంతమే. హైదరాబాద్‌లో దశాబ్దాల నుంచి నివసిస్తున్న తమ కుటుంబసభ్యుల రక్షణ, వారి ఆస్తులకు భద్రతపైనే తప్ప, రాష్ట్రం విడిపోవడంపై సీమాంధ్ర ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేదంటున్నారు. తమకు రక్షణ కల్పించేందుకు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించి, రాష్ట్రాన్ని విభిజిస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్న భావనతో సీమాంధ్ర ప్రజలు ఉన్నారు. ఆ రకంగా రెండు రాష్ట్రాలను విభజించి, హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవని, ఇది అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారమని భావిస్తోంది. అందుకే ‘ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలంద రికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచిస్తామ’మని దుగ్గల్‌ పదే పదే చెప్పడం గమనార్హం.

ఎలాగూ తెలంగాణ ప్రజలు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి..అటు చాలాకాలం నుంచి స్థిర నివాసం ఉంటున్న సీమాంధ్ర వాసులను, ఇటు తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచవచ్చన్న భావనతో కమిటీ ఉన్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న తెలంగాణ వాసులు కూడా మెజారిటీ శాతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే కాబట్టి, వారు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. గవర్నర్‌ నరసింహన్‌ కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాలనే తన నివేదికలో వ్యక్తపరిచి కేంద్రానికి సమర్పించినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో నెలకొన్న గందరగోళానికి ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుతో పాటు భద్రతాపరంగా హైదరాబాద్‌ను కేంద్రపాలిత కేంద్రంగా ప్రకటించడమే పరిష్కారమని సూచించినట్లు గతంలోనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.ఇక ఈ విషయంలో నాయకుల నుంచి మాత్రమే వ్యతిరేకత వ్యక్తమవుతుంది తప్ప, హైదరాబాద్‌లో నివసించే అన్ని ప్రాంతాల ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక ఎదురవదని కమిటీ వేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ లేని తెలంగాణను తాము అంగీకరించేది లేదని తెలంగాణ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. అది తల లేని శరీరంగా స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి దుగ్గల్‌ చేసిన వ్యాఖ్యల బట్టి తెలంగాణ- ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటుతో పాటు.. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది.

ముక్కలు చెక్కలు విభజిస్తే రెండుతో ఆగదు.. ఐదు రాష్ట్రాలు ఇవ్వాల్సి ఉంటుంది

స్వపరిపాలన అంటే జిల్లాకో రాష్ట్రమే..
విడిపోయాకే పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం
నాగాలండ్‌లోనూ ప్రత్యేక దేశం డిమాండ్...
ప్రత్యేక ఉద్యమాలన్నీ రాజకీయ ప్రేరేపితమే
ముందు వెనుకబాటు అన్నారు..
ఇప్పుడు సెంటిమెంట్ అంటున్నారు
ఫ్యూడల్ అధికారుల కోసమే అగ్రవర్ణాల 'తెలంగానం'..
విభజస్తే రాజకయ అస్థిరత తథ్యం
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల నివేదిక

"రాష్ట్రాన్ని విభజిస్తే... రెండుతో ఆగిపోదు. ఐదు రాష్ట్రాలుగా విభజించాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రతి జిల్లా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుం ది. ఆపై... ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్లు కూడా తలెత్తే ప్రమాదముంది''... అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనవ్యక్తం చేశారు.

ఆత్మ గౌరవం, స్వపరిపాలన పేరి ట రాష్ట్రాలు ఇచ్చుకుంటూ పోతే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాజకీయ నిరుద్యోగుల ప్రేరేపితమని తెలిపారు. గురువారం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ నివేదిక సమర్పించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఇందు లో నొక్కి చెప్పారు. విభజిస్తే తలెత్తే దుష్పరిణామాలను వివరించారు.

"మొదటి ఎస్సార్సీ తర్వాత పంజాబ్‌ను ఏర్పాటు చేయలేకపోయారు. ఒక విద్వేషోద్యమం తర్వాతే పంజాబ్‌ను వేరు చేశారు. ఆ తర్వాత... తమకు ప్రత్యేక దేశం కావాలంటూ 'ఖలిస్థాన్' ఉద్యమం మొదలైంది. అలాగే... గేటర్ అస్సాం నుంచి విడిపోయిన నాగాలాండ్‌లోనూ ప్రత్యేక దేశం డిమాండ్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా 22 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి 'సెంటిమెంట్' డిమాండ్లు మరిన్ని వచ్చే అవకాశముంది'' అని హెచ్చరించారు.

కావూరి సాంబశివరావు నేతృత్వంలో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు జూబ్లీహాల్‌లో శ్రీకృష్ణ కమిటీకి తమ నివేదిక సమర్పించారు. ఇందులోని అంశాలను 'పవర్ పాయింట్ ప్రజంటేషన్' ద్వారా వివరించారు. ప్రత్యేకవాదులు చేస్తున్న వెనుకబాటు, సెంటిమెంట్, స్వపరిపాలన తదితర వాదనలన్నింటినీ తోసిపుచ్చారు. స్వార్థపూరిత, హ్రస్వదృష్టి కలిగిన కొందరు నేతలే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎగదోస్తున్నారని తెలిపారు.

సమైక్య రాష్ట్రంలో తమ భూస్వామ్య అధికారాలను అనుభవించలేక పోతున్నామనే దుగ్ధతో, ఆధిపత్య వర్గాలు, కులాలు తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తుతున్నాయని ఆరోపించారు. రాజకీయ నిరుద్యోగుల చేతిలో ఇదో వజ్రాయుధంగా మారిందని అన్నారు. మతతత్వం, కులతత్వంలాగే ప్రాంతీయ తత్వం కూడా రాజకీయంగా త్వరగా ఎదిగే సాధనంగా మారిందన్నారు. వాస్తవాల వక్రీకరణ, ఊహాజనిత గణాంకాలే ప్రత్యేకవాదానికి ప్రధాన ఆధారాలని తెలిపారు. 1998, 2006, 2008 గ్రూప్-1 నియామకాల్లో తెలంగాణకు 45.03 శాతం పోస్టులు దక్కాయన్నారు. ఇటీవల ప్రత్యేక వాదుల హుకుంను ఉల్లంఘించి జరిగిన ప్రిలిమ్స్ పరీక్ష రాసిన యువతకు 'హ్యాట్సాఫ్' చెప్పారు.

ఏది వెనుకబాటు? ఎక్కడ సెంటిమెంటు?
"బాగా అభివృద్ధి చెందిన జిల్లాల్లోనూ వెనుకబడిన ప్రాంతాలున్నాయి. అలాగే... వెనుకబడిన జిల్లాల్లోనూ అభివృద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక చట్టం ఉంది. మీరూ ఈ చట్టాన్ని పరిశీలించండి. ప్రస్తుత అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ఆ కమిషన్‌ను బలోపేతం చేయవచ్చు. మూడు ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించేందుకు మండలం, పంచాయతీ స్థాయిలో సమాచారాన్ని అధ్యయనం చేయాలి'' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీని కోరారు.

తొలుత వెనుకబాటు, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం అనే వాదనతో మొదలైన ఉద్యమం... ఇప్పుడు 'సెంటిమెంట్' వద్దకు చేరిందన్నారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిలో తెలంగాణదే సింహభాగమని తేటతెల్లం కావడంతో సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చారన్నారు. ఇలాంటి భావోద్వేగాలతో రాష్ట్రం ఇవ్వలేమన్నారు.

భావోద్వేగాలు శాశ్వతం కావని స్పష్టం చేశారు. "డిసెంబర్ 9 ప్రకటన తర్వాతే ఉద్యమానికి ఊపు వచ్చింది. భావోద్వేగాలు తాత్కాలికం. అవి త్వరగా చల్లారతాయి. అంతేకాదు... ఈ సెంటిమెంట్ తెలంగాణ అంతటా ప్రబలంగా లేదు. ఉత్తర తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు... జిల్లా నుంచి జిల్లాకు తేడా ఉంది. ఎప్పటికప్పుడు ఇది మారుతూ ఉంది'' అని నివేదికలో పేర్కొన్నారు.

ఇప్పుడున్నది విదేశీ పాలనా?
'స్వపరిపాలన పేరిట ప్రత్యేక రాష్ట్రం కావాలని అంటున్నవారు... ఇప్పుడు విదేశీ పాలనలో లేమని గ్రహించాలి' అని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు హితవు పలికారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన పేరిట రాష్ట్రాలు ఇవ్వాల్సి వస్తే... జిల్లాకో రాష్ట్రం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఆత్మగౌరవం అనేది ఒక భావన మాత్రమేనని.. దానికి శాస్త్రీయ కారణం లేదని తమ నివేదికలో తెలిపారు.

"సంస్కృతి, ఆత్మ గౌరవం కోల్పోతున్నామంటూ పిలుపునివ్వడం వెనుక ప్యూడల్ హక్కులను పునరుద్ధరించుకోవాలనే ఆలోచన తప్ప, మరొకటి లేదు. తెలంగాణలో వెట్టి చాకిరీతో ప్రజలను బానిసలుగా చూసేవారు. తెలంగాణ ప్రాంత పేదలు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అనుభవించలేక పోయారు. సమైక్య రాష్ట్రంలోనే వెట్టి విధానం రద్దయింది'' అని తెలిపారు.

విలీనం స్వచ్ఛందం: ఆంధ్రలో తెలంగాణ విలీనం స్వచ్ఛందంగా జరిగిందని... ఇది బలవంతంగా జరగలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. విశాలాంధ్ర కోరుతూ తెలంగాణ నేతలే తీవ్రమైన ప్రయత్నాలు చేశారన్నారు. "విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఇదే తీర్మానం చేసింది.

విశాలాంధ్ర కోరుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు హైదరాబాద్ రాష్ట్ర పరిధిలోని పది జిల్లాల్లో 7 జిల్లాల్లోని కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయని వివరించారు. 1953లో పార్లమెంటులో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క ఎంపీ కూడా దానిని వ్యతిరేకించలేదు.

ఎస్సార్సీ సైతం ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనం అయ్యేందుకు సూత్రప్రాయంగా సమ్మతించింది. అయితే, దీనిని పరిపాలనాపరమైన కారణాలతో ఐదేళ్లు వాయిదా వేసింది'' అని తెలిపారు. ఎస్సార్సీ ఇలాంటి నిబంధన ఏ రాష్ట్రంలోనూ విధించలేదని గుర్తు చేశారు. 1969లో జైతెలంగాణ, 1972లో జై ఆంధ్ర ఉద్యమాలు తలెత్తినప్పుడు అప్పటి ప్రధాని ఇందిర దృఢచిత్తంతో వ్యహరించారని తెలిపారు. రాష్ట్ర విభజనతో సమస్య పరిష్కారం కాకపోగా, మరిన్ని కొత్త సమస్యలు వస్తాయని ఆమె గుర్తించారన్నారు.

విభజనతో అస్థిరత: ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మిజోరాం వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. పైగా అస్థిరతకు, రాజకీయ బేరసారాలకు నిలయాలుగా మారాయని... కొన్ని రాష్ట్రాలు దివాలా అంచుల్లో నిలిచాయని వివరించారు.

"రాష్ట్రాన్ని విభజిస్తే మరిన్ని ఉప ప్రాంతీయ పార్టీలతోపాటు కులాలు, ఉప కులాల పేరిట కూడా పార్టీలు పుట్టుకొస్తాయి. అప్పుడు ఎన్నికల్లో అస్పష్ట తీర్పు మాత్రమే వెలువడుతుంది. రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది. అంతిమంగా అభివృద్ధి, భద్రతకు భంగం వాటిల్లుతుంది'' అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే సంకుచిత భావాలు, ఉప ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం పెరుగుతుందని... రాష్ట్ర రాజకీయాల్లో వాటి అవసరమూ పెరుగుతుందని అన్నారు. ఇలాంటి పార్టీలే భవిష్యత్తును నిర్దేశిస్త్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ రాజధాని...
గత ఐదేళ్లలో హైదరాబాద్ జనాభా 34 నుంచి 41 శాతానికి పెరిగిందని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు శ్రీకృష్ణ కమిటీకి తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వలసలు రావడం వల్లే జరిగిందన్నారు. వీరంతా రాజధాని అభివృద్ధిలో భాగస్వాములయ్యారని తెలిపారు. భారీ పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించకుంటే హైదరాబాద్ కూడా ఒకప్పటి రాజధాని నగరం కర్నూలులాగే ఎలాంటి అభివృద్ధి జరగకుండా ఉండేదని అన్నారు.

హైదరాబాద్‌లోని పరిశ్రమలు, ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థల జాబితాను తమ నివేదికలో పొందుపరిచారు. డిగ్రీ కాలేజీల నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయాల దాకా... రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, వాటిలో తెలంగాణ వాటా ఎంత అనే గణాంకాలు సమర్పించారు.

కావూరి ఇంట్లో కసరత్తు: శ్రీకృష్ణ కమిటీ వద్దకు వెళ్లే ముందు కావూరి సాంబశివరావు నివాసంలో ఎంపీలు మేకపాటి రాజమోహన రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అనంత వెంకట రామిరెడ్డి, కిల్లి కృపారాణి, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, నేదురుమల్లి జనార్దన రెడ్డి సమావేశమయ్యారు. కమిటీ ముందు వినిపించాల్సిన వాదన్రలపై సమీక్షించారు.

సమైక్యాంధ్ర వాదనలు పూర్తిగా కావూరి విన్పించాలని.. మిగిలిన ఎంపీలు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించాలని తీర్మానించారు. అనంతరం కేవీపీ, నేదురుమల్లి మినహా మిగిలిన ఎంపీలందరూ జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు హాజరయ్యారు. కావూరి నివాసంలో జరిగిన భేటీకి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి రాలేదు. ఆయన నేరుగా కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

చిత్తగించండి...
* ప్రత్యేక వాదాలన్నీ రాజకీయ ప్రేరేపితమే. 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించగానే... తెలంగాణ ఉద్యమం గాలి తీసిన బుడగలా మారింది. అలాగే.. 1972లో పీవీ నరసింహరావును తప్పించగానే జై ఆంధ్ర ఉద్యమమూ మాయమైపోయింది.

* ఒకప్పుడు తెలంగాణలో ఉన్న వెట్టి వ్యవస్థ సమైక్య రాష్ట్రంలోనే అంతమైంది. తమకు కావాల్సింది దొరల తెలంగాణ కాదని, సామాజిక తెలంగాణ అని వెనుకబడిన వర్గాలు డిమాండ్ చేశాయి. దొరల తెలంగాణకంటే సమైక్య రాష్ట్రంలోనే ఉంటామని ప్రకటించాయి కూడా.

* తెలంగాణ రాష్ట్రం ఇద్దరు ప్రధాన మంత్రులను, నలుగురు ముఖ్యమంత్రులను అందించింది. పీవీ నరసింహారావుది తెలంగాణా? సీమాంధ్రా? అని ఎవరూ చూడలేదు. ప్రతి తెలుగు వాడూ ఆయనను తమ వాడుగానే భావించారు. ప్రధానిగా ఉన్న ఆయన రాయలసీమలోని నంద్యాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

* 2004లో ఎన్నికల పొత్తులో సీపీఐ, సీపీఎంకు కేటాయించిన స్థానాల్లో పది చోట్ల టీఆర్ఎస్ పోటీ చేసింది. ఈ పదిచోట్లా టీఆర్ఎస్ ఓడిపోగా... సమైక్య నినాదం వినిపించిన కమ్యూనిస్టులు అధికచోట్ల నెగ్గారు. 2008లో టీఆర్ఎస్ తనంత తాను తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో 2 లోక్‌సభ, 7 అసెంబ్లీ స్థానాల్లో ఓటమిపాలైంది.

* విభజన రెండు రాష్ట్రాలతో ఆగిపోదు. 5 రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది. గిరిజనులు మన్యసీమ కావాలంటున్నారు. తమకూ రాష్ట్రాలు కావాలని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు.