Thursday, December 16, 2010

సంక్షోభం ముందంజ, విభజన వెనుకంజ? * 'నల్లారి' నడక కాదు! * గురివింద సుభాషితాలు

దటీజ్ హైకమాండ్!

రాష్ట్ర ప్రజానీకాన్ని ఆశ్చర్య చకితులను చేస్తూ, బుధ, గురువారా ల్లో, రెండు రోజుల పాటు, గంటకో మార్పుగా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. మామూలుగా చూస్తే ఇవి హఠాత్ పరిణామాలుగా కనిపించినప్పటికీ, నిజానికి నెల రోజుల క్రితమే వీటికి సమగ్రమైన స్కెచ్ తయారైంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అదను చూసి ఆ స్కెచ్‌ను అమలు పరచడమే ఇప్పుడు చేసిన పని.

రాజకీయంగా తమకు అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో, రెండో కంటికి తెలియకుండా, 24 గంటల్లో 'ఆపరేషన్ సీఎం ఛేంజ్' పూర్తి చేసిన హైకమాండ్, అసలు తానేమిటో, వ్యవహారశైలి ఎలా ఉంటుం దో పార్టీ శ్రేణులకు తేల్చిచెప్పింది. సాక్షాత్తు 'ముఖ్యమంత్రి రోశయ్య' కు కూడా, చివరి నిముషం దాకా తనను మారుస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియనివ్వకపోవడం చూస్తే, కాంగ్రెస్ నాయకత్వం ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. 'హైకమాండ్ లో సగం'గా భావించే ముఖ్య నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోనీ స్వయంగా, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రావడం, చిన్నపాటి నిరసన ధ్వనికి కూడా ఆస్కారం ఇవ్వకుండా గంటల్లోనే సాఫీ గా పని పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పట్ల అధిష్ఠానం ఎంత దృఢ చిత్తంతో ఉందో తెలియజెప్పింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం కురువృద్ధుడైన రోశయ్యకు కష్టం, నష్టం కలిగించి ఉంటే ఉండవచ్చు గానీ, ఇందుకు ఆయన ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. అయాచితం గా లభించిన అధికార పీఠం నుంచి, ఆకస్మికంగా నిష్క్రమించాల్సి రావడం రోశయ్య స్వయంకృతం. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత, ఆయన స్థానంలో, రోశయ్య నియామకం ఆపద్ధర్మ (స్టాప్ గ్యాప్) ఏర్పాటేనని అందరికీ తెలుసు.

ఒకరకంగా చూస్తే ఆయన అంచనా కన్నా ఎక్కువ కాలం (14 నెలల 22 రోజులు) పదవిలో ఉన్నారనుకోవచ్చు. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచీ రోశయ్యకు అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ప్రతిపక్షాలే కాదు; సొంత పార్టీ నేతలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, చివరికి ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదు. సామాజిక బలహీనత, వయోభారం, పార్టీలో సొంత గ్రూపు లేకపోవడం వంటి ఇతరత్రా సమస్య లు కూడా ఉండనే ఉన్నాయి. అధిష్ఠానం ఆశీస్సులే ఆయన ఏకైక బలం.

దీన్ని ఆసరాగా చేసుకుని, తనకున్న అపార అనుభవాన్ని రంగరించి, క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే రోశయ్య మరికొంత కాలం పదవిలో కొనసాగి ఉండేవారు. అయితే 'అబ్బే. ఈ వయసు లో కత్తి పట్టుకుని యుద్ధం ఏం చేస్తాం' అని బేలతనం ప్రదర్శించడం ద్వారా పదవిలో నిలదొక్కుకునే అవకాశాన్ని ఆయన చేజేతులా చెడగొట్టుకున్నారు.

చరిత్ర సృష్టించే సందర్భాన్ని సద్వినియోగం చేసుకోకుండా, బలహీన ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుని తెరమరుగయ్యారు. "రోశయ్య వ్యవహార శైలి కారణంగా రాష్ట్రంలో మున్ముందు మరే వైశ్యుడికీ, ప్రాధాన్యమున్న కీలక పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చు'' అని వైశ్య ప్రముఖుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో పి.వి.నరసింహారావు విషయంలో జరిగినట్టే ఇప్పుడు రోశ య్య విషయంలో కూడా, రెడ్డి సామాజిక వర్గం కత్తిగట్టి ఆయనను పదవి నుంచి దించే వరకు విశ్రమించలేదు.

ఇక కొత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా గుంభనం గా పావులు కదిపారు. అధిష్ఠానం కూడా ఆయనకు యథోచితంగా సహకరించింది. శాసనసభ స్పీకర్‌గా ఉన్న కిరణ్, గత కొన్ని మాసాలుగా తరచూ ఢిల్లీకి పర్యటనలు పెట్టుకున్నారు. అధిష్ఠానం పెద్దల తో, మరీ ముఖ్యంగా హోంమంత్రి చిదంబరంతో సంబంధాలు పెంచుకున్నారు. స్పీకర్ పోస్టులో ఉన్న వారికి ఢిల్లీతో పెద్దగా పని ఉండదు.

అయినా కిరణ్ తరచూ ఢిల్లీ వెళ్లడంపై ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠానం కిరణ్‌ను ఎంపిక చేస్తున్నట్టు నెలక్రితమే చూచాయగా తెలియడంతో, అప్పటిదాకా ఆయనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఒకింత విస్మయానికి గురయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో జగన్‌కు నిరోధక శక్తిగా, తనకు సహాయకుడిగా కిరణ్ ఉపయోగపడతారని జైపాల్ భావించారే తప్ప, ఏకంగా తనకే పోటీ వస్తాడని ఊహించలేదు. ఏకాభిప్రాయ అభ్యర్థిగా ముఖ్యమంత్రి పదవిని పరోక్షంగా ఆశిస్తూ వచ్చిన జైపాల్ అందుకే, తెలంగాణ కార్డును ప్రయోగిస్తూ, కిరణ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.

అదే తెలంగాణ కార్డును కె.సి.ఆర్. ప్రయోగించడం వల్లే తనకు సి.ఎం. పదవి దక్కలేదని జైపాల్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడే అధిష్ఠానం తనదైన శైలిలో వ్యవహరించింది. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే, కీలకమైన 'తెలంగాణ- జగన్' విషయాల్లో హైకమాండ్ పూర్తి స్పష్టత ఇవ్వాల ని జైపాల్ కోరడంతో, దీన్ని అడ్డుపెట్టుకుని అధిష్ఠానం, కిరణ్‌ను ఎంపిక చేసుకుంది. ఆయా అంశాలపై దృఢ వైఖరి చూపించే విషయంలో జైపాల్, కిరణ్‌తో సరితూగలేకపోయారు.

యువకుడు కావ డం, దూకుడుతనం ఉండడం, ఏది ఎలా వచ్చినా ఎదుర్కొంటానని కిరణ్ భరోసా ఇవ్వడం వల్ల అధిష్ఠానం ఆయనవైపే మొగ్గు చూపిం ది. రోశయ్య రాజీనామా రోజు కూడా ముఖ్యమంత్రి పదవికి జైపాల్ పేరు వినిపించడం, ఆయన చివరి ప్రయత్నాల్లో భాగం కాగా, ప్రణబ్ ముఖర్జీ ఆయన ను పిలిపించుకుని మాట్లాడడం, జైపాల్ మనోభావాలను తాము నిర్లక్ష్యం చేయ డం లేదని తెలంగాణ వాదులకు సూచించే చిన్న డ్రామా మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల క్రితమే నిర్ణయం జరగడంతో కాంగ్రెస్ పెద్దల్లో ఎలాంటి టెన్షన్లూ లేవు.

ఉంటే గింటే అసలు సంగతి తెలియని పార్టీ నేతలు, ప్రజలు, మీడియాకే ఆ టెన్షన్! రోశయ్య రాజీనామా, కిరణ్ ఎంపిక విషయంలో సరైన సమాచారాన్ని ముందే పసిగట్టలేకపోయినందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి. చివరికి కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుకు, అధిష్ఠానం ఆకస్మికంగా- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసినా, అందులోని అంతరార్థాన్ని అవి పట్టుకోలేకపోయాయి.

ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిపై చర్య కోసమైతే సి.ఎల్.పి. భేటీ ఎందుకు? అన్న ప్రశ్న ఎవరికీ తట్టలేదు. రాష్ట్రంలో డజనుకు పైగా ఉన్న 'సీరియస్ న్యూస్ చానెళ్లు', అర డజ ను తెలుగు దిన పత్రికల్లో ఏ ఒక్కటీ సి.ఎల్.పి. భేటీకి సరైన భాష్యా న్ని ముందే చెప్పలేకపోవడం, సమాచార సాధనాల్లో లోపిస్తున్న వృత్తి పరమైన పరిణతిని పట్టిచ్చింది.

ఇక కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విషయానికి వస్తే, ఆయనకు పరిపాలన అనుభవం లేదనే చెప్పాలి. మంత్రిగా పనిచేయకుండా, నేరుగా ముఖ్యమంత్రి అయిన రెండో నాయకుడు (ఎన్టీఆర్ తర్వాత) కిరణ్‌కుమార్ రెడ్డే. చంద్రబాబు తర్వాత చిన్న వయసులో (సెకండ్ యంగెస్ట్) ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి ఆయనే. చంద్రబాబు 45 ఏళ్లకు సీఎం కాగా, ప్రస్తుతం కిరణ్ వయసు 50 ఏళ్లు! దాదాపు రిటైర్‌మెంట్ వయసు వ్యక్తి యువ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందడం రాజకీయాల్లో కనిపించే వైచిత్రి! ఎవరికైనా తప్పని రోజువారీ పరిపాలనా సమస్యలను పక్కనబెడితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కిరణ్ ముందున్న ప్రధాన సమస్యలు రెండు.

ఒకటి తెలంగాణ, మరోటి జగన్! ఈ రెండింటినీ పరిష్కరించాల్సింది కాంగ్రెస్ అధినాయకత్వమే అయినా, రాష్ట్ర స్థాయిలో వాటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సింది మాత్రం కిరణే. ముఖ్యమంత్రి పదవిని రాయలసీమకు ఇవ్వడం తెలంగాణ ఏర్పాటుకు సంకేతమనే ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ, అందులో ఎంతమాత్రం నిజం లేదనే ఎదురు వాదన కూడా బలంగానే ఉంది. "కిరణ్‌కు తెలంగాణ వ్యతిరేకి అన్న ఇమేజ్ ఉంది. ఎంత అవసరమైతే అంత కఠినంగా వ్యవహరించగలడని గట్టిగా నమ్మడం వల్లే ఉద్యమాల ముంగిట్లో అధిష్ఠానం కిరణ్‌ను ఎంచుకుంది.

41 ఎంపీ సీట్లను గెలుచుకుంటామంటూ 2014 ఎన్నికల గురించి మాట్లాడడం, పెట్టుబడుల మజిలీగా మారుస్తామంటూ రాజధాని హైదరాబాద్ గురించి ప్రస్తావించడం, శాంతి భద్రతలపై కఠిన వైఖరి ప్రకటిస్తూ కేంద్ర బలగాలను రప్పిస్తాననడం... ఇవన్నీ కిరణ్ ఎంపిక ఎందుకో చెప్పకనే చెబుతున్నాయి'' అని ఢిల్లీలోని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వం దృష్ట్యా కిరణ్ కొంత అహంభావి. ఒకసారి తేడా వస్తే స్నేహపూర్వకంగా ఉండడం కష్టం.

అయితే పట్టినపట్టు వీడని మొండితనం, అనుకున్నది సాధించడానికి ఏ దశకైనా వెళ్లగల తెగువ ఉన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కిరణ్ దశాబ్దాల కుటుం బ వైరాన్ని కొనసాగిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అందువల్ల అధిష్ఠానం ఇతరత్రా కొన్ని ప్రయోజనాలను ఆశించే, అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణకు కాకుండా రాయలసీమకు చెందిన కిరణ్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించిందని భావించవచ్చు.

వై.ఎస్. కోటరీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన కిరణ్, వై.ఎస్. కుమారుడైన జగన్‌తో ఏ మేరకు వైరం పెట్టుకోగలరనే విషయంలో పార్టీలో ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. కిరణ్ వై.ఎస్. కు సన్నిహితుడన్న దానిలో ఎలాంటి అనుమానం లేనప్పటికీ, అదే స్థాయిలో జగన్‌తో సంబంధాలున్నాయని మాత్రం చెప్పలేం. వై.ఎస్. రెండోసారి అధికారంలోకి వచ్చాక, తనకు మంత్రి పదవి రాకపోవడానికి జగనే కారణమన్న అభిప్రాయం కిరణ్‌లో ఉంది.

చిత్తూరు జిల్లా కే చెందిన కిరణ్ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, జగన్‌కు వ్యాపార భాగస్వామి. పెద్దిరెడ్డికి జగనే మంత్రి పదవి ఇప్పించారని, తనను ఎన్నికల్లో ఓడించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయ ని కిరణ్ అనుమానిస్తూ ఉంటారు. కుమారుడి ఒత్తిళ్లకు తలొగ్గి వై.ఎస్. తనకు అన్యాయం చేశారన్న అభిప్రాయం కూడా ఆయనకు ఉంది. మంత్రి పదవి ఇవ్వకుండా, స్పీకర్ పదవి చేపట్టాలని వై.ఎస్. బలవంతపెట్టినపుడు కిరణ్ ఒకింత బాధపడ్డారు.

అయితే కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు, ఆ స్పీకర్ పదవే ఇప్పు డు ముఖ్యమంత్రి సీటు అధిరోహించడానికి సోపానమైంది. గత డిసెంబరు సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాన్ని సమర్థంగా పరిష్కరించడం, టి.ఆర్.ఎస్. నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దీటుగా నిర్ణయం తీసుకోవడం కిరణ్‌పై అధిష్ఠానం నమ్మకం పెంచుకోవడానికి ప్రధాన ప్రాతిపదికలు. ఎవరి అదృష్ట రేఖను ఎవరు చెరపగలరు?! అయినా కిరణ్ వ్యవహార శైలి 'తమ్ముడు తమ్ముడే - పేకాట పేకాటే' అన్నట్టు గా ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు.

కిరణ్ స్పీకర్ అయ్యాక, వై.ఎస్. ఆయనను పిలిచి, ప్రజా పద్దుల కమిటీ (పి.ఎ.సి.) చైర్మన్ పోస్టును, తెలుగుదేశం నేత నాగం జనార్దన్‌రెడ్డి చేపట్టకుండా చూడాలని ఆదేశించారట. అయితే అది ప్రధాన ప్రతిపక్షానికి దక్కే పోస్టు అనీ, ఎవరికి ఇచ్చుకోవాలో ఆ పార్టీ ఇష్టమనీ, తానేం చేయలేనని కిరణ్ బదులిచ్చారట. ఈ విషయం ఇరువురి మధ్య వాదులాట కు దారితీసింది. అందువల్లే పావురాలగుట్ట వద్ద ప్రమాదం జరిగిన రోజు వై.ఎస్.తోపాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన కిరణ్ తన ప్రయాణా న్ని విరమించుకున్నారట! ఈ నేపథ్యాన్ని గమనిస్తే జగన్‌ను అదుపు చేసే విషయంలో కిరణ్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉంటాయనుకోలేం.

ఎవరి రాజకీయ భవిష్యత్తు వారిదే కదా! అధిష్ఠానం ఆదేశా న్ని ధిక్కరించి, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితరులను కిరణ్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారా? మంత్రివర్గ కూర్పులో జగన్ వర్గీయులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? అన్న వాటి ఆధారంగా జగన్ పట్ల కిరణ్, అధిష్ఠానం వైఖరిని అంచనా వేయవచ్చు. బాలినేని, చంద్రబోస్‌లకు మంత్రి మండలిలో మళ్లీ చోటు కల్పిస్తే, జగన్‌తో రాజీకి అధిష్ఠానం సుముఖంగా ఉందనే సంకేతం వెలువడినట్టే! అయితే, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఓదార్పుకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తడం ఖాయం.

ప్రస్తుతానికైతే అధిష్ఠానం జగన్ ను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. సరికదా, పార్టీ శ్రేణులను క్రమంగా ఆయనకు దూరం చేస్తూ, వర్గాన్ని బలహీన పరుస్తున్నది. జగన్ ప్రాంతానికే చెందిన, ఆయన సామాజిక వర్గానికే చెందిన, వై.ఎస్. సన్నిహితుడైన కిరణ్‌ను 'పవర్ సెంటర్'గా మార్చడమే ఇందుకు నిదర్శనం. హైకమాండ్ ఆశించినట్టుగానే ఒకప్పటి వై.ఎస్. వర్గంలోని ముఖ్యులంతా క్రమంగా కిరణ్ పక్కన చేరుతున్నారు.

జగన్ రాజకీయంగా తనంతతాను నిర్వీర్యమయ్యే పరిస్థితిని కల్పిస్తుంది తప్ప, ఆయనకు లాభం కలిగించే రీతిలో, పార్టీ నుంచి బయటకు పంపడం వంటి ఏ చర్యనూ అధిష్ఠానం తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవు. దీంతో ఇక ఇప్పుడు జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది? తనకు పక్కలో బల్లెంలా మారుతున్న కిరణ్‌ను జగన్ ఏమేర కు సహిస్తాడు? అన్నది ఆసక్తికరం. మారిన సమీకరణాల దృష్ట్యా జగ న్ అప్పుడే తొందరపడకపోవచ్చు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేల్లో ఏర్పడే అసంతృప్తిని, లేదా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత చోటుచేసుకునే పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి జగన్ పావులు కదపవచ్చు. జగన్ ముందున్నవి రెండే రెండు మార్గాలు.

ఒకటి- గత వైభవాన్ని, ముఖ్యమంత్రి పదవిని మరచిపో యి, అవమానాలను దిగమింగుకుని, గుంపులో గోవిందయ్యలా రాజీపడి కాంగ్రెస్‌లోనే ఉండిపోవడం. రెండు-పార్టీపై తిరుగుబాటు చేసి తన భవిష్యత్తు తాను చూసుకోవడం. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జగన్ ఎత్తుకు అధిష్ఠానం మలి ఎత్తు వేసింది. జగన్ వంటి వ్యక్తులకు ఇతరులెవ్వరూ నష్టం చేయలేరు. ఎందుకంటే వారిని వారే దెబ్బతీసుకుంటారు!  - ఆదిత్య 

'నల్లారి' నడక కాదు!

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్‌ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వరకు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి.

2010 సంవత్సరం వెళుతూ వెళుతూ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, రెండు కీలక ఘట్టాలకు నాంది పలికింది. రాష్ట్ర కాంగ్రె స్ రాజకీయాలలో, కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు, అనూహ్యమైనవి కాకపోయినప్పటికీ, ఇంత త్వరగా చోటు చేసుకుంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇందులో మొదటిది కడప ఎం.పి. వై.ఎస్.జగన్మోహనరెడ్డి, తన తల్లి ఎం.ఎల్.ఎ. విజయమ్మతో సహా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి, సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం.

రెండవది కొణిజేటి రోశ య్య స్థానంలో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రావడం. జగన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సొంత పార్టీ పెట్టుకుంటారని అంద రూ భావించినదే అయినప్పటికీ, తనపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్య తీసుకునే వరకు వేచి ఉండి, ఆ తర్వాత మాత్రమే తిరుగుబాటు జెండా ఎగురవేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే ఓర్పుగా వేచి ఉండటం అంటే తెలియని జగన్, కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం శ్రమ కూడా లేకుండా చేశారు. కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎం.పి, ఎం.ఎల్.ఎ. పదవులకు జగన్ - విజయమ్మలు రాజీనా మా చేశారు. మరో రెండు మూడు నెలల్లో సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ తన సహచరులకు స్పష్టం చేశారు కూడా! వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెంచుకున్న జగన్, అది తనకు అందనంత దూరంలో ఉందని గ్రహించారు.

పార్టీలోనే ఉంటూ, తన తండ్రిలాగా 25 సంవత్సరాలపాటు నిరీక్షించి, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే ఓర్పు-నేర్పు లేని జగన్, కాంగ్రెస్‌లో ఎంతోకాలం ఉండరని ఊహించిందే! తాను ఆశించిన పదవిలోకి రోశయ్య వచ్చిన నాటి నుంచి, జగ న్ కాంగ్రెస్‌తో అంటీముట్టినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. నెలల తరబడి ఓదార్పు యాత్ర చేసినా, ఎక్కడా కాంగ్రెస్ గురించి గానీ, సోనియాగాంధీ గురించి గానీ జగన్ ప్రస్తావించిన పాపాన పోలేదు. అంటే సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారానే తాను కలలుగంటున్న ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారన్న మాట.

తాను కాంగ్రెస్‌కు నష్టం చేయలేదని జగన్ చెప్పినా, కాంగ్రెస్‌ను వీడి జగన్ సొంత పార్టీ పెట్టుకుంటారని వస్తున్న వార్తలు అభూత కల్పనలని ఆయన అనుచరులు ఎంతగా చెప్పినా, జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఆయన అంతరంగం ఇట్టే తెలిసిపోతుంది. నాలుగు పదుల వయస్సు కూడా లేని జగన్‌కే ఇన్ని తెలివితేటలు ఉంటే, కాకలు తీరిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఆ మాత్రం పసిగట్టలేరా? ఈ కారణంగానే జగన్‌ను దీటుగా ఎదుర్కొనే మొండితనం ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. సోనియాను విమర్శించిన వారంతా తన శత్రువులేనని ప్రకటించడం ద్వారా జగన్ విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతున్నదో ముఖ్యమంత్రి పరోక్షంగా స్పష్టం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? సొంత పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న జగన్, మూడున్నర ఏళ్ల పాటు నిరీక్షించి, సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అంతకాలం వేచి ఉండే సహ నం ఆయనకు ఉందా? ఇప్పటికే పది మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు జగన్‌తో చేతులు కలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వగలరా? అసలు ఆయన ప్రభుత్వ మనుగడ ఎంతకాలం? వచ్చే ఎన్నికలలో జగన్ లక్ష్యం నెరవేరుతుందా? జగన్ ఫ్యాక్టర్‌ను అధిగమించి కాంగ్రెస్ పార్టీని విజయతీరాల వైపు నడిపించగల సత్తా కిరణ్‌కు ఉందా? వంటి ప్రశ్నలు సామాన్యుల నుంచి మాన్యుల వరకు అందరిలో తలెత్తుతున్నాయి.

ముందుగా జగన్ విషయం తీసుకుంటే ఆయనది 'వాపా - బలుపా' అన్నది తేలవలసి ఉంది. ఇందుకు మరికొంత కాలం పడుతుంది. స్వతహాగా దుందుడుకు స్వభావం కలిగిన జగన్, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పలేం. ఎందుకంటే ఆయన కేవలం తన తండ్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఉన్న పేరునే నమ్ముకుని సొంత పార్టీ పెట్టుకోవాలన్న సాహ సానికి ఒడిగట్టారు. ఈ కారణంగానే తనతో ఎవరు ఉన్నారు? ఏయే జిల్లాలలో ఎవరెవరిని ఆకర్షించాలి? వంటి ఆలోచనలు చేయకుండా, తనతో ఎవరూ రాకపోయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. అందువల్లే తన చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డితో కూడా సఖ్యత నెలకొల్పుకోలేకపోయారు.

వాస్తవానికి వివేకానందరెడ్డి తన విధేయతను కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రకటించి, మంత్రివర్గం లో చేరడం జగన్‌కు తొలి దెబ్బ! అయినా ఇవేవీ పట్టించుకునే స్థితిలో జగన్‌లేరు. నిజానికి వివేకాకు పులివెందులలో మంచి పేరే ఉంది. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్, సహజంగానే పులివెందుల నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తారు. దశాబ్దాలుగా తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి గెలవడం, మామూలుగా అయితే ఆయనకు నల్లేరు మీద నడకే! కానీ, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు, పులివెందులలో జగన్‌పై పోటీకి వివేకాను దించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే జగన్ ఓడిపోతారని చెప్పలేం గానీ, గెలుపుకోసం శ్రమించవలసి ఉంటుంది.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని జగన్ వర్గీయులు ప్రస్తుతం చెబుతున్నప్పటికీ, మూడున్నరేళ్లపాటు కొనసాగడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బలపడటానికి జగన్ అవకా శం ఇస్తారన్నది నమ్మ శక్యం కాని విషయం. ఇప్పటికే తాను ఆదేశిస్తే 10 మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం ఆయనకు తెలు సు. అయితే ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి దాదాపు 25 మంది బలం ప్రజారాజ్యం- మజ్లిస్ పార్టీలు సిద్ధంగా ఉన్నందున, అంతే సంఖ్యలో కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లను తన వైపు తిప్పుకోవడానికి జగన్ కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నా యి. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్నది వేరే విష యం.

ఆ దిశగా అడుగులు పడాలంటే, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం జగన్ుకు కచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చీలికను ప్రోత్సహించడం ద్వారా అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తే, రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధింపజేయడం ద్వారా ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిం చే విషయం ఆయనకు తెలుసు. రాష్ట్రపతి పాలన పేరిట ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేయవచ్చు. ఈ కారణంగానే 'రెండేళ్లలో అధికారం మనదే' అని జగన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన బలాన్ని సమీకరించుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న మీదటే, 2014 బదులు 2013లోనే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను జగన్ ఇస్తున్నారు. అయితే తెలంగాణలో కనీస స్థాయిలో కూడా బలం లేని జగన్ లక్ష్యం నెరవేరుతుం దా? అంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటే సాధ్యం కాదు. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టుగానే, జగన్ అంచనాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియనివి కావు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర విభజన అంశంలోగానీ, మరేఇతర విషయంలోగానీ వారి వ్యూహాలు వారికి ఉంటాయి.

ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు కొంతమంది ఎం.ఎల్. ఎ.లు, ప్రజల్లో అంతగా ఆదరణ లేని ద్వితీయ శ్రేణి నాయకులు తన తో ఉన్నంత మాత్రాన, అధికారంలోకి వచ్చేస్తానని జగన్ కలలు కంటే అమాయకత్వమే అవుతుంది. ఇతరుల అభిప్రాయాలకు విలు వ ఇవ్వని జగన్, అన్నీ తనకు తెలుసుననీ, అన్నీ తాను అనుకున్నట్లుగానే జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు. వాస్తవానికి జగన్ వ్యవహారం కాంగ్రెస్ నాయకులను సంఘటిత పరచడానికి పరోక్షం గా ఉపయోగపడుతున్నది. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై అంత లా అసంతృప్తి చెలరేగినా, సాయంత్రానికల్లా చల్లబడిపోవడానికి జగన్ వ్యవహారమే ప్రధాన కారణం. తమ చర్యలు జగన్‌కు లాభించే ప్రమాదం ఉందని గుర్తించి మంత్రులు, ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు కొన్ని గంటల్లోనే స్వరం మార్చారు. అసాధారణ రీతి లో సంక్షోభం తలెత్తినా, అది తనకు ఉపయోగపడని విషయాన్ని జగన్ గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

అంతేకాదు; రాబోయే రోజుల్లో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఢీకొంటూ, ఒకదాన్ని ఒకటి బలహీనపరచుకోవడానికి తీవ్రస్థాయిలో పోరాడుతాయి. ఇప్పటి వరకు తమతో ఉన్న కారణంగా జగన్ వ్యవహారాలను అంత బాహాటంగా వెల్లడించని కార గ్రెస్ నేతలు, ఇకపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయననే టార్గెట్ చేస్తారు. జగన్ తన మీడియా ద్వారా ఇప్పటికే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఎందుకంటే తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే జగన్ ఆధారపడవలసి ఉంటుంది. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల ఓట్లు జగన్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఒకే ఓటు బ్యాంకు కోసం అటు జగన్, ఇటు కాంగ్రెస్ పార్టీ పోరాడవలసి ఉంటుం ది. ఈ క్రమంలో జగన్‌పై ముప్పేట దాడికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. రెడ్లు, మైనారిటీలు, దళితులు, క్రైస్తవుల ఓట్లపై జగన్ ఆధారపడి ఉన్నారు. ఈ వర్గాలన్నీ ఆది నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నాయి. తమ ఓటు బ్యాంకును జగన్ కొల్లగొట్టకుండా కాంగ్రె స్ శ్రేణులు ఏ మేరకు అడ్డుకుంటాయో వేచి చూడాలి.

అటు కేంద్రం లో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున, రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ సాగించిన వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు బజారుకీడ్చడం ద్వారా, ప్రజల్లో ఆయనను పలచన చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తాయి. అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే జగన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆషామాషీగా వదలిపెట్టదు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాగోతాలన్నీ కాంగ్రెస్ పెద్దలకు తెలియనివి కావు. ఇప్పుడు వాటినే అస్త్రాలుగా ప్రయోగిస్తా రు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి గా ఉన్నపుడు, రాజ్‌భవన్‌లో ఆగస్టు 15వతేదీ సాయంత్రం గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఆ విందుకు రాజశేఖరరెడ్డి దంపతులతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, పుర ప్రముఖు లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. సతీమణి విజయ మ్మ తన మనస్సులోని ఆవేదనను ఒక సీనియర్ మంత్రితో పంచుకున్నారు. "తండ్రి, కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. బెంగళూరుకు మాత్రమే పరిమితం కావాలని కొడుకు (జగన్)ను ఆయన (వై.ఎస్) ఆదేశించారు. అయినా మా వాడు చీటికీమాటికీ ఇక్కడకు వస్తున్నాడు. వాడిని చూసిన ప్రతిసారీ ఎందుకు రానిస్తున్నావు? అంటూ ఆయన నాపై మండిపడుతున్నారు. కొడుకు ఇంటికి వస్తే రావద్దని తల్లిగా ఎలా చెప్పగలను?''అని విజయమ్మ సదరు మంత్రి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సంఘటనను గుర్తుచేస్తూ, "జగన్ తత్వం ఏమిటో, తను ఎలాంటి వాడో, ఏమేమి చేశాడో, మాకు తెలుసు, మా అధికారానికి సవాల్‌గా నిలిచినపుడు మేం ఊరి కే ఉంటామా? అన్నీ బయటపెడతాం'' అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్ముందు పోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్ ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వర కు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయిం పు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాను నాయకత్వం వహిస్తున్నది 'మైనారిటీ ప్రభుత్వానికి' అన్న వాస్తవాన్ని కిరణ్ గుర్తించినట్లు లేదు. జగన్ మనుషులు రాజీనామా చేస్తే మైనారిటీ ప్రభుత్వమే అవుతుంది. ఆ పరిస్థితులలో ప్రజారాజ్యం, మజ్లిస్ పార్టీలపై ఆధారపడి, వారి ఒత్తిళ్లకు తలొగ్గుతూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కిరణ్‌కు కత్తి మీద సాము అవుతుంది.

తెలివిగలవాడైతే ఆ పరిస్థితి రాకుండా, కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు చేజారిపోకుండా చూసుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నైజంగానీ, ఆయన వ్యవహారశైలిగానీ సామాన్య ప్రజలెవ్వరికీ తెలియదు. అయితే ఆలోచనతో చేశారో, అనాలోచితంగా చేశారో తెలియదుగానీ, కీలక శాఖలన్నింటినీ ఒకే వర్గానికి కట్టబెట్టడం ద్వారా, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారన్న అపకీర్తిని ఆయన మూటగట్టుకున్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కిర ణ్ నైజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయనలో కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి.

మొండితనం, నిజాయితీ, ఒత్తిళ్లకు లొంగకపోవడం వంటి వి ఆయనలోని స్ట్రాంగ్ పాయింట్స్. అదే సమయంలో రెడ్ల పట్ల ప్రత్యేక అభిమా నం చూపడం, ఎవరినీ సంప్రదించకపోవడం, అహంకారి అని భావించేలా కనిపించడం ఆయనలోని వీక్ పాయింట్స్. నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనా, ఇప్పటిదాకా ఆయన నిర్వహించిన పదవులు ప్రభుత్వ చీఫ్ విప్ -శాసనసభ స్పీకర్ మాత్రమే. ఈ పదవులు వేరు, ముఖ్యమంత్రి పదవి వేరు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి నాయకుడు, కొందరివాడుగా కాకుండా, అందరివాడు అనిపించుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉంది.

జగన్‌వైపు ఆకర్షితులవుతున్న రెడ్లను, తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేసే ప్రయత్నం లో భాగంగా, ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు. లేదా, తనకు న్న కులాభిమానం వల్ల అలా చేసి ఉండవచ్చు. అయితే మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరుగరు కదా! తన చర్యల వల్ల ఇతర వర్గాల వారు మనస్సు కష్టపెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది. అదే సమయంలో అన్ని విషయాలను కాకపోయినా, కనీ సం కొన్ని విషయాలలోనైనా పార్టీలోని ముఖ్యులను భాగస్వాముల ను చేయవలసిన అవసరం ఉంది. ఇందుకు భిన్నంగా ఒంటెత్తు పోకడలు పోతే, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది.

జగన్‌ను కట్టడి చేసే విషయం అటుంచి, ఆయనకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని కాంగ్రెస్ ముఖ్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని సందర్భాలలో ఒకే ఫార్ములా పని చేయదన్న వాస్తవాన్ని కిరణ్ తెలుసుకోవడం అవసరం. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేయడం అర్థం లేనిదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఏ శాఖలు కేటాయించారన్నది కాదు, తమలో కొందరినైనా కనీసం సంప్రదించకుండా ఒక్కడే కూర్చుని శాఖలు కేటాయించిన తీరు పట్ల పలువురు మంత్రులు మనస్సు కష్టపెట్టుకున్నారు. దీన్ని మరో రూపంలో వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తలెత్తి సమసిపోయి న సంక్షోభాన్ని ఒక అనుభవంగా ముఖ్యమంత్రి స్వీకరించి, భవిష్యత్తులో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తే నాలుక కరుచుకునే పరిస్థితి రాకపోవచ్చు.        - ఆదిత్య 

గురివింద సుభాషితాలు

ఎట్టకేలకు స్వంత పార్టీ పెట్టుకుంటున్నట్లు కడప మాజీ ఎం.పి. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ప్రకటనతో పాటు ఆయన తన లక్ష్యాలను, ఏ కారణంగా స్వంత పార్టీ పెట్టుకుంటున్న దీ వివరించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశాలు అయ్యాయి. ఇందులో మొదటిది ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం.

ప్రస్తుత రాజకీయాలలో విలువలు లేవనీ, తాను ఏర్పాటు చేసే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని మిగతా లక్ష్యాలుగా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నుంచి అప్పుడే ప్రతిస్పందన కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవనీ, కుట్రలు, కుయుక్తులు రాజ్యమేలుతున్నాయని చెబుతున్న జగన్, ముందుగా ఆ విషయాన్ని ఎప్పు డు గుర్తించారో స్పష్టం చేయవలసి ఉంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ప్రతిపక్షాలకు చెందిన శాసన సభ్యులను ప్రలోభపెట్టి ఆయా పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినపుడు, ఈ విలువలు జగన్‌కు ఎందుకు గుర్తుకు రాలే దో తెలియవలసి ఉంది. తన కుటుంబాన్ని చీల్చే నీచత్వానికి కాంగ్రె స్ అధినేత్రి సోనియాగాంధీ పాల్పడ్డారని విమర్శించిన జగన్‌కు, రాజకీయాలలో ఇలాంటివి సర్వసాధారణం అన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.... కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఎన్.టి.రామారావు కుటుంబాన్ని చీల్చి పురందేశ్వరిని తమవైపు తిప్పుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం తప్పు కానప్పుడు, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చడం తప్పు ఎలా అవుతుందో జగనే వివరించాలి. తన ఇంటిపైన, తన మీడియా కార్యాలయాలపైనా దాడులు చేశారని విమర్శిస్తున్న జగ న్, ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోవడం అవసరం.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 'ఆంధ్రజ్యోతి'పై దాడులను పరోక్షంగా ప్రోత్సహించిన విషయం మరచిపోయారా? మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని 'ఈనాడు' గ్రూపు అధినేత రామోజీరావు కార్యాలయాలపై దాడులు చేయించిన విషయం గుర్తుకు రాలే దా? ఆనాడు తన తండ్రి చేసిన చర్యలను ఖండించని జగన్‌కు, ఇపు డు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే నైతికత ఉందా? ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత ఉండనే ఉంది.

తాను, తన తండ్రి కలిసి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి అనుసరించిన వినూ త్న పోకడల్నే, ఇప్పుడు తన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నద ని గుర్తించకపోతే ఎలా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అని కాంగ్రె స్ ప్రభుత్వం జగన్ విషయంలో మున్ముందు వ్యవహరించనుంది. ఈ విషయంలో ధర్మాధర్మాల గురించి వాపోయే అర్హత జగన్‌కు ఉందా? జగన్ వ్యాఖ్యలలో అన్నింటికంటే కీలకమైనది 'ఆత్మ గౌరవం'! ఆత్మ గౌరవం నినాదంతోనే ఆయన భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని ఢీకొనబోతున్నారని దీనితో స్పష్టం అవుతున్నది.

అయితే ఈ ఆత్మ గౌరవ నినాదాన్ని ఇచ్చే అర్హత జగన్‌కు ఉందా? అన్నది ప్రశ్న! రాష్ట్ర రాజకీయాలలో, ఆత్మ గౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్.టి.రామారావు. ఆనాటి పరిస్థితులలో ఎన్.టి.ఆర్. ఇచ్చిన ఈ నినాదానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆనాడు ఇందుకు దారితీసిన పరిస్థితులను ఒకసారి మన నం చేసుకుందాం. 1978-83 మధ్య కాలంలో, ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చీటికి మాటి కి మారుస్తూ వచ్చింది.

అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతున్నదని తెలుగు ప్రజలు భావించారు. ఆరణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించిన అంజయ్య విషయంలో ప్రజల్లో సానుభూతి ఉండేది. ఆనా డు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌గాంధీ, బేగంపేట విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్యను ఈసడించుకున్నారు. ఈ సంఘటన తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది.

అంజయ్యకు బోలెడు సానుభూతి లభించింది. ఆ తర్వాత ఎ.ఐ.సి.సి పరిశీలకుడు జి.కె.మూపనార్ రాష్ట్రానికి వచ్చి, అధికారం నుంచి తప్పుకోవలసిందిగా తనను ఆదేశించడంతో అంజయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు. మూపనార్ రాష్ట్రాలకు వెళుతున్నారంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మూడినట్టేనన్న భావన అప్పట్లో ఉండేది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్.టి.ఆర్ 'ఆం«ద్రుల ఆత్మ గౌరవం' నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ఏమి భంగం కలిగిందని ఆ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నారో జగన్ చెప్పవలసి ఉంది.

తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, రాష్ట్రంలో ప్రారంభించిన పతి పథకానికి, కార్యక్రమానికి రాజీవ్‌గాంధీ-ఇందిరాగాంధీ పేర్లు పెట్టినపుడు ఆంధ్రుల ఆత్మ గౌరవం జగన్‌కు ఎందుకు గుర్తుకురాలేదో! విమానాశ్రయానికి అప్పటికే ఉన్న ఎన్.టి.ఆర్ పేరును తొలగించి, రాజీవ్‌గాంధీ పేరు పెట్టినపుడు జగన్ ఎందుకు అభ్యంతరపెట్టలేదో తెలియవలసి ఉంది.

పొరుగున ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర తమ విమానాశ్రయాలకు తమ తమ రాష్ట్రాలకు చెందిన మహనీయుల పేర్లనే పెట్టుకున్నాయి. పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇదేవిధంగా వ్యవహరించా యి. ఒక్క మన రాష్ట్రంలోనే రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌గాంధీ నామ స్మరణ మారుమోగింది. బడుగు వర్గాలకు చెందిన అంజయ్యను అవమానించిన రాజీవ్‌గాంధీ పేరును ప్రతి దానికి పెట్టడం వల్ల ఆం«ద్రుల ఆత్మ గౌరవం దెబ్బతింటుందని జగన్ ఎందుకు గుర్తించలేక పోయారో స్పష్టంచేయవలసి ఉంది.

తాను టార్గెట్‌గా పెట్టుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఇవ్వకపోవడం వల్ల తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి కలిగిన నష్టం ఏమిటో తెలియడం లేదు. నిండా ఒకటిన్నర సంవత్సరం రాజకీయ అనుభవం కూడా లేని జగన్‌కే అన్ని ఆశలు ఉంటే, కాంగ్రెస్ పార్టీనే ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులకు ఎన్ని ఆశలు ఉండాలి! అయినా తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల లో, ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పడానికి సాహసించలేదు.

రాచరికపు వాసన లు నిండా ముప్పరిగొని ఉన్న జగన్ మాత్రమే తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి దక్కాలని కోరుకోగలరు! ఆశించినది దక్కకపోవడంతో ఆయన ఆశాభంగం చెందడంలో తప్పులేదు. కానీ తన తరఫున, రాష్ట్ర ప్రజలందరూ తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందం టూ శోకించాలని కోరుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది.

ఆయన అత్యాశాపరుడు కనుక అలాగే ఆలోచిస్తారు మరి! మూడేళ్లపాటు కష్టాలు తప్పవనీ, 2014లో అధికారం తమదేనని చేసిన వ్యాఖ్యలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోవలసి ఉంది. అధికారం కోసం 2014 వరకు వేచి చూసే ఓపిక ఉండే పక్షంలో కాంగ్రెస్‌లోనే కొనసాగి, అధిష్ఠానానికి విధేయుడుగా ఉండి ఉంటే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉంది కదా? అని సామాన్యులకు సందే హం కలుగుతున్నది.

వాస్తవానికి 2014 వరకు వేచి ఉండే ఓపిక జగన్‌కు లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా రోశయ్యను తప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించడంతోనే జగన్‌లో అసహ నం కట్టలు తెంచుకుంది. ఆ కారణంగానే కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సూచన మేరకు, ముఖ్యమంత్రి కిరణ్ ఫోన్ చేసినా జగన్ కట్ చేశారు. తనకు దక్కాల్సిన పదవిని కిరణ్ తన్నుకుపోయారన్నది ఆయన కోపానికి కారణం.

తనను తప్ప మరో వ్యక్తిని ముఖ్యమంత్రి గా అంగీకరించడానికే ఇష్టపడని జగన్, మూడేళ్ళపాటు ఓర్పుగా వేచి ఉంటారంటే నమ్మడం కష్టమే! అయినా ఆ ప్రకటన ఎందుకు చేశారో, దాని వెనుక మర్మం ఏమిటో శోధించవలసి ఉంది. నిజానికి ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా కూల్చివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠాంచాలన్న ఆత్రుత జగన్‌కు ఉంది. అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు ఉందా? అన్న విషయం లో ఆయనకే సందేహాలు ఉన్నాయి.

తాను ఆదేశిస్తే ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు రాజీనామాలు చేస్తారో ఆయనకే తెలియదు. రాజకీయాల్లో విశ్వాసానికి తావు ఉండదు. తన విషయంలో, తన తండ్రి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు విశ్వాసం చూపించడం లేదని వాపోయే జగన్, అదే ఫార్ములా కాంగ్రెస్ పార్టీ విషయంలో తనకు కూడా వర్తిస్తుందని గుర్తించకపోవడమే విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తన తండ్రి గానీ, తాను గానీ ఈ స్థానానికి వచ్చామ న్న విషయాన్ని విస్మరించి, తమ వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి వచ్చిందని భావించడం ఆయనలోని అహంకారానికి నిదర్శనం.

పైకి 2014 వరకు వేచి ఉంటానని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన బలం సమకూరినపుడు జగన్ కచ్చితంగా ఆ పని చేస్తారు. అటువంటి ఆలోచనే లేకపోతే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉండవచ్చు. అలా చేసి ఉంటే ఇవ్వాళ కాకపోయినా, రేపు అయినా ముఖ్యమంత్రి పదవి దక్కేది. అయినా ముఖ్యమంత్రి కావడానికి తనకున్న అర్హతలు ఏమిటో ఆయనే చెబితే మంచిది.

తండ్రి దుర్మరణం చెందిన ప్రమాద స్థలికి వెళ్ళి, భౌతిక కాయాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నించకుండా, తదుపరి ముఖ్యమంత్రి కావడానికి ఎం.ఎల్.ఎ.ల సంతకాల సేకరణకు ప్రేరేపించిన జగన్‌ను, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారో లేదో కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బాగా అర్థం చేసుకుంది. శ్రీమతి ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిగా నియమించలేదా? అని ప్రశ్నిస్తున్న జగన్ వర్గం ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.

రాజీవ్‌గాంధీ అప్పటికే ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా నాలుగైదు ఏళ్లపాటు పార్టీలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో రాజీవ్‌గాంధీ హత్యానంతరం సోనియాగాంధీ గానీ, పిన్న వయస్కులైన ప్రియాంక, రాహుల్‌గాంధీలు గానీ ప్రధానమంత్రి కాలేదే! జగన్ అనుచరులలో ఇంత వివేచన ఉంటుందనుకోవడం అత్యాశే అవుతుం ది. 2014లో అధికారంలోకి వచ్చినట్లే అని భావిస్తున్న జగన్, ఆ తర్వాత 30 సంవత్సరాలపాటు రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి పాలన అందిస్తాననీ, వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తానని చెప్పుకొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా, విజన్ 2020 అంటూ తానే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రినని కలలుగన్నారు. కానీ 2004లో ఏమైంది? ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన, ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. ఈ దేశంలో సుదీర్ఘకాలం (23 ఏళ్ల) పాటు ముఖ్యమంత్రిగా ఒక్క జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్) మాత్ర మే ఉండగలిగారు. కలలు కనడంలో తప్పు లేదు. ప్రజలు ఆదరిస్తే 30 ఏళ్ళు కాదు, నాలుగైదు దశాబ్దాల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండవచ్చు.

ఎవరు మాత్రం కాదనగలరు? 2014 నాటికి జగన్‌కు 40 ఏళ్ళు దాటుతాయి. అంటే తాను 70 సంవత్సరాల వరకు జీవిస్తానని భావించి 30ఏళ్ళపాటు అధికారంలో ఉంటానని ఆయన చెప్పుకొని ఉండవచ్చు. అంటే జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఆయన తన ను తాను ఊహించుకుంటున్నారన్న మాట! రాజకీయాలలో ఉండే వాళ్లు, అనుచరులను, కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి కొంత అతిశయోక్తిగా మాట్లాడడం సహజం.

జగన్ వ్యాఖ్యలను కూడా అలాగే అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాకపోతే ఆయన మాటల్లో అతిశయోక్తితో పాటు అత్యాశ కనపడుతూ ఉంటుంది. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఇప్పటి వరకు రాజశేఖరరెడ్డి కుమారుడుగా గుర్తింపు పొందుతూ వచ్చిన జగన్, ఇకపై ఒక పార్టీ అధినేతగా ఆయా అంశాలపై తన వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మాల- మాదిగల వర్గీకరణ వంటి అంశాలపై ఆయన తన పార్టీ వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది.

ఇలాంటి సందర్భాలలోనే ఒకరికి మోదం కలిగితే మరొకరికి ఖేదం కలుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలకు దీటుగా స్పందించవలసి ఉంటుంది. జగన్‌ను అత్యంత అవినీతిపరుడుగా, దురాశాపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీ, అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంది. తాను అవినీతిపరుడిని కాదంటే, కేవలం అయిదేళ్లలో తనకు అంత సంపద చట్టబద్ధంగా ఎలా సమకూరిందో ప్రజలకు వివరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంటుంది.

తనను ఆత్మ రక్షణలోకి నెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు కనుక, దాని నుంచి బయటపడటానికి జగన్ ప్రయత్నించవలసి వస్తుంది. తన తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని తిరుగుతూ, వైఎస్ పేరును మరువకుండా చూసుకుంటూ, ప్రజల సానుభూతి సంపాదించడానికి ఆయన కచ్చితంగా ప్రయత్నిస్తారు.

అయితే కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే దాడి ఏ రూపంలో ఉండనుంది? దానిని ఎలా అధిగమిస్తాడు? అన్న దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది... కడప ఎం.పి. స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ఫలితాలు జగన్ విషయంలో కీలకం కానున్నాయి. కడప వంటి ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలలో, ఓటర్లు కచ్చితమైన విభజనతో ఉంటారు. రిగ్గిం గ్ వంటి అక్రమాల వల్ల మెజారిటీలు తగ్గడం-పెరగడం జరుగుతూ ఉంటాయి.

పోలీసుల సహకారం లేకపోతే ఈ జిల్లాలో ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదు. 1996లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, కడప ఎం.పి. స్థానానికి పోటీ చేసిన రాజశేఖరరెడ్డిని, అప్పటి ఎస్.పి. ఉమేష్‌చంద్ర అష్ట దిగ్బంధనం చేయడంతో, అతి కష్టం మీద అయిదు వేల పైచిలుకు మెజారిటీతో గెలిచాననిపించుకున్నారు. దీన్నిబట్టి జగన్ భవిష్యత్‌ను ముందుగా ఈ రెండు ఎన్నికలే నిర్దేశించనున్నాయి.       - ఆదిత్య