Saturday, September 11, 2010

వినాయకుడికి సంకట చవితి

 
*  వినాయక చవితి శుభాకాంక్షలు. 
తాము తలపెట్టిన కార్యక్రమాలు, నిర్దేశించుకున్న లక్ష్యాలు, నిర్విఘ్నంగా నెరవేరాలని భక్తులు చవితి రోజున విఘ్న నాయకుడిని వేడుకుంటారు. అయితే ఈ వినాయక చవితి మాత్రం, మన రాష్ట్రంలో ఏక దంతుడికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. ఎందుకంటే సామాన్య భక్తులు కోరే కోరికలు, రాష్ట్రంలోని రాజకీయ నాయకుల కోరికలు, ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం మనస్సులోని మాటలు పరస్పర విరుద్ధం గా ఉన్నాయి.

ఒకరి కోరిక తీర్చితే, మరొకరికి నష్టం జరుగుతుం ది. దీనితో అందరినీ సంతృప్తిపరచడం ఎలాగో తెలియక తలపట్టుకోవలసిన స్థితిలో లంబోదరుడు చిక్కుకోవడం ఈ వినాయ క చవితి ప్రత్యేకత! ముందుగా గణాధిపతి పరిగణనలో ఉన్న కోర్కెల జాబితాను పరిశీలిద్దాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులతోపాటు, ప్రజారాజ్యంపార్టీ కోరుతున్నది.

అదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. పరస్పర విరుద్ధమైన ఈరెండు కోర్కెలలో దేన్ని తీర్చాలో తెలియక గణాధిపుడు సహజంగానే గడబిడపడుతున్నాడు. తెలంగాణవాదుల కోర్కె తీర్చితే సీమాంధ్ర వాళ్లకు కోపం వచ్చి, వచ్చే వినాయక చవితి నాడు తనకు ఉండ్రాళ్లు పెట్టరేమోనన్న ధర్మ సందేహంలో మోదక ప్రియుడు చిక్కుకున్నాడు.

అలాగని సీమాంధ్ర వాళ్ల కోర్కెను మన్నిస్తే, తెలంగాణవాదులకు కోపం వచ్చి, ఈ ప్రాంతంలో తనకు పూజా పునస్కారాలు దక్కవేమోనన్న భయంలో 'ప్రథమ పూజల దేవుడు' ఉన్నాడు. తనకు తెలంగాణలోనే, ముఖ్యంగా హైదరాబాద్‌లోనే ఆదరణ ఎక్కువని గజ కర్ణికుడికి తెలుసు! దీంతో జటిలమైన ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తేలక, మధ్యేమార్గం ఉందేమో కనుక్కోవలసింది గా, శ్రీకృష్ణ కమిటీని ఆ పార్వతీ నందనుడే వేడుకోవలసిన పరిస్థితి!

దీన్ని బట్టి రాష్ట్ర విభజన విషయంలో విఘ్నేశ్వరుడు చేయగలిగేది ఏమీ లేదని స్పష్టం అవుతున్నది. తేలాల్సింది ఏమిటంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏయే ప్రతిపాదనలు చోటు చేసుకోబోతున్నాయి? ఆ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉండబోతున్నది?

ఈ రెండు అంశాలు బొజ్జ గణపయ్య చిట్టి చేతిలో లేవు కనుక, అటు తెలంగాణవాదులు గానీ, ఇటు సీమాంధ్రకు చెందిన వాళ్లు గానీ, ఈ వినాయక చవితి రోజున దేవుడిని వదిలేసి, అంతకంటే శక్తిమంతురాలైన సోనియాగాంధీకి విన్నపాలు పంపుకోవడం మేలు! అలా చేస్తే కనీసం మిగతా కోర్కెల విషయంలోనైనా గణపతి ఆశీస్సులు లభించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో అతి పెద్ద సమస్యగా మారిపోయిన కడప ఎం.పి. జగన్మోహనరెడ్డి వ్యవహారాన్నే తీసుకుందాం. జగన్మోహనరెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు కనుక, తాను కలలుగంటున్న ముఖ్యమంత్రి పదవిని కటాక్షించాలని, ఆయన వినాయక చవి తి రోజున సుముఖుడిని కోరుకోకపోవచ్చు. కానీ ఆయన అనుచరులకు లంబోదరుడిపై నమ్మకం ఉంది కనుక, జగన్‌ను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని వారు వేడుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో పాటు, పార్టీలోని జగన్ వ్యతిరేకులు ఆయనను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇష్టపడకపోవడం! జగన్ పట్ల అంతులేని ఆగ్రహంతో ఉన్నానని, తనను కలిసిన వారి వద్ద హావభావాలు ప్రదర్శిస్తున్న సోనియాగాంధీ కూడా క్రైస్తవ మతాన్నే అనుసరిస్తారు కనుక, ఆమె కూడా జగన్ తన దారిలోకి రావాలని గజాననుడిని కోరకపోవచ్చు.

అంటే జగన్ వల్ల గానీ, ఇటు సోనియాగాంధీ వల్ల గానీ ఈ వికట దేవుడికి వచ్చిన సంకటం ఏమీ లేదు. ఎటొచ్చీ వారి అనుయాయుల కోరికలతో నే చిక్కు వచ్చి పడుతోంది. అయితే జగన్ తమ దారిలోకి అయినా రావాలని, లేదా రాజకీయాలలో అడ్రస్ లేకుండా పోవాలని, కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు, ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకులు కోరుకుంటూ ఉండగా, జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేలా పార్టీ అధిష్ఠానం మనస్సు మార్చాలని, లేదా ప్రజల అండదండలతో పార్టీని ఎదిరించైనా జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన వర్గం ముచ్చట పడుతోంది.

ఈ రెండు కోర్కె లు పరస్పర విరుద్ధంగా ఉన్నందున, ఎవరో ఒకరి కోర్కెను మన్నించి, మరో వర్గం ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేని వక్రతుండుడు, ఇక్కడ కూడా లౌక్యం ప్రదర్శించే అవకాశం ఉంది. రాష్ట్రంలో జగన్ భవిష్యత్తును, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును, ఆయన ప్రజలకే వదలి వేసే అవకాశం ఉంది. అంటే జగన్ ముఖ్యమంత్రి అవుతారా? రాజకీయంగా కనుమరుగు అవుతా రా? అన్నది తేల్చవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజల మీదే ఉంది.

అదే సమయంలో తన నాయన చనిపోయి ఏడాది దాటినా, ఇప్పటికీ నాయనను, తనను టార్గెట్ చేసి, అసూయ, కుళ్లుతో విమర్శలు చేస్తున్న వాళ్లంతా నాశనం కావాలని, జగన్, ఆయ న వర్గం కోరుకుంటున్నది. అంటే ఈ బాధ్యత కూడా చవితి నాడు శివ పుత్రుడిపైనే పడుతోంది.

పోనీ ఈ కోర్కెను తీర్చి, కైలాసానికి వెళదామనుకుంటే, అయిదేళ్లు తండ్రి అధికారంలో ఉంటేనే వేల కోట్ల రూపాయల ను అక్రమంగా పోగేసుకున్న జగన్‌కు, మళ్లీ అధికారం సిద్ధిస్తే రాష్ట్రంలో ఇక ఏమీ మిగలదు కనుక, ఆయనే రాజకీయంగా నాశనం కావాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు.

ఈ రెండు కోర్కెలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నందున, ఎవరినీ నొప్పించకుండా ఉండటానికి, మోదకప్రియుడు ఉండ్రాళ్లు భోంచేసి, మౌనవ్రతం పాటిస్తే ఏ పేచీ ఉండదని, ఆయన అధికారిక వాహనంగా చెల్లుబాటు అవుతున్న మూషికుడు సలహా ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య కొనసాగుతా రా? ఆయన కుర్చీకి ముప్పు ఉందా? లేదా? అనే, రాజకీయ వర్గాలను వేధిస్తున్న ధర్మ సందేహానికి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత విఘ్నేశ్వరుడిపై ఉంది.

లంబోదరుడి విగ్రహాలను బంకమట్టితోనే తయారు చేసుకుని పూజించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నందున, ముఖ్యమంత్రి కుర్చీకి బంకమట్టిలా అతుక్కుపోయి, ప్రతిమల తయారీకి బంకమట్టి దొరకని పరిస్థితి కల్పించకూడదన్న దృఢ సంకల్పం తో రోశయ్య ఉన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా సీఎం పీఠాన్ని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే రోశయ్య కుర్చీ ఖాళీ చేస్తే, ఆ కుర్చీలో కూర్చోవాలని ఉబలాటపడుతున్న వారినే సమస్య పట్టి పీడిస్తున్నది.

రాష్ట్రం లో సీఎం మారే అవకాశం ఉందని, అలా జరగాలని, ఆ పదవి ని ఆశిస్తున్న వాళ్లు వినాయక చవితి రోజు గట్టిగా కోరుకునే అవకాశం ఉంది. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నందున, వారి కోర్కెను మూషిక వాహనుడు మన్నించే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో, ముఖ్యమంత్రి మార్పునకు పూనుకోవడం అంటే తేనెతుట్టెను కదల్చడమేనన్న సంగతి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి తెలియంది ఏమీకాదు.

ఇటు తెలంగాణ సమస్య, అటు జగన్ సమస్య పరిష్కారం అయ్యే వరకు ముఖ్యమంత్రి రోశయ్యకు వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి మార్పునకు ప్రయత్నిస్తే పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లు అవుతుందని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు తెలుసు. ఈ కారణంగానే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొ న్న గందరగోళాన్ని చక్కదిద్ది, పరిస్థితి తమ అదుపులోకి వచ్చిందన్న విశ్వాసం కుదిరిన తర్వాత మాత్రమే, ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనను కాంగ్రెస్ అధిష్ఠానం చేయనుంది.

సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఇంకా మూడున్నరేళ్ల వ్యవధి ఉన్నందున, రోశయ్య స్థానం లో నియమితుడయ్యే వ్యక్తి, 2014 ఎన్నికలలో పార్టీని విజయతీరాలకు నడిపించే సత్తా కలిగి ఉండాలని సోనియాగాంధీ మనస్సులోని మాటగా చెబుతున్నారు. ఏతావాతా తేలింది ఏమిటం టే, కనీసం మరో ఏడాది పాటు రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయంగా కనిపిస్తున్నది.

ముఖ్యమంత్రిని మార్చడం, మార్చకపోవడం అనే ది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం చేతిలోని అంశమే కనుక, సంకటం నుంచి సంకటమోచనుడు బయటపడినట్టే! అయినా ఉండ్రాళ్ల ను కడుపారా ఆరగించి, బొజ్జ పెంచుకున్న భక్త వత్సలుడికి రాజకీయాల పట్ల అంతగా పరిజ్ఞానం ఉండే అవకాశం లేదు.

ఈ కారణంగా ఈ విషయంలో ఆయనను ఎవరూ ఏమీ కోరకపోవచ్చు. రోశయ్య స్థానాన్ని అధిష్ఠించాలని ఆశిస్తున్నవారు కోరినా, 'నన్ను కాదు, పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోండి' అని ఒక ఉచిత సలహా పారేసి, ఉండ్రాళ్లు భుజించే పనిలో ఆయన బిజీ అయిపోవచ్చు.

ఇక మిగిలింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి కోరబోయే కోర్కెలు ఎలా ఉండబోతున్నాయన్నదే! జగన్ సొంత పార్టీ పెట్టుకుని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి, తాను కూడా దెబ్బతిని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా రాజకీయాలను మేనేజ్ చేయాలని విఘ్నేశ్వరుడిని చంద్రబాబు కోరుకునే అవకాశం ఉంది.

ప్రత్యర్థుల బలహీనతలపై ఆధారపడే బదులు, సొంత బలంపై ఆధారపడడం ఎప్పుడూ శ్రేయస్కరం కనుక, రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కామన్‌సెన్స్ ఉపయోగించి ప్రమథ గణాధిపతి ఈ విషయంలో చంద్రబాబుకు సలహా ఇవ్వవచ్చు. ఇప్పటికే ఎంపిక చేసిన కొన్ని అంశాలపై పోరు ప్రారంభించి, జిల్లాల్లో పర్యటిస్తున్న ప్రతిపక్ష నాయకుడు, అదే ధోరణి కొనసాగించి, ప్రజల మద్దతు చూరగొనగలిగితే, వరసిద్ధి వినాయకుడు నిస్సహాయుడిగా మిగిలిపోయే పరిస్థితి తప్పిపోతుంది.

అలవి గాని వాగ్దానాలు చేయకుండా, చిల్లర విషయాలు పట్టించుకోకుండా, ప్రజానీకాన్ని వేధిస్తున్న ముఖ్యమైన సమస్యలపై ఉద్యమించి, అర్థవంతమైన పరిష్కారాలను సూచించడం ద్వారా, కోల్పోయిన విశ్వసనీయతను పొందగలిగితే చంద్రబాబు రాజకీయ మనుగడకు ఢోకా ఉండకపోవచ్చు. ఇక్కడ చంద్రబాబు కాస్త కామన్ సెన్స్ ఉపయోగిస్తే అలవిగాని కోర్కెలు తీర్చే భారం నుంచి మూషిక వాహనుడికి మోక్షం లభిస్తుంది.

చిరంజీవి విషయానికి వస్తే ఆయనకు విఘ్నేశ్వరుడితో పెద్దగా పని ఉండకపోవచ్చు. ఆయన ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో డీల్ కుదుర్చుకున్నందున, మునిగి నా తేలినా కాంగ్రెస్ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. రాజకీయాలలో పెద్దగా వర్కవుట్ కాకపోయినా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మళ్లీ సినిమాల్లో నటించనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు కనుక, కొట్టిన పిండి అయిన సినిమాల్లో చిరంజీవి రాణించడం కష్టమేమీ కాదు.

అయితే, అంతర్లీనంగా తనను ఊరిస్తున్న ముఖ్యమంత్రి పదవిని సొంత బలంతో కాకపోయినా, జగన్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతే, ఆ పార్టీ బలంతో అందుకోవాలన్న తన కోర్కెను చిరంజీ వి వినాయకుడి ముందుంచవచ్చు. ఉభయకుశలోపరిగా ఈ విషయంలో చిరంజీవికి 'బెస్టాఫ్ లక్' చెప్పి, గణపతి ఈ ఏడాదికి నిష్క్రమించే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. కనుక తొందరపడి హామీ లు ఇవ్వవలసిన అవసరం విఘ్నేశ్వరుడికి లేదు.

నాయకుల సంగతి అలా ఉంచితే, సామాన్య భక్తుల కోర్కెల విషయంలో వినాయకుడు ఎలా స్పందిస్తాడన్నదే తెలియవల సి ఉంది. రోగాలు - రొష్టులు, ఎరువుల కొరత, వరదల వంటి సమస్యలతో పాటు, నడ్డి విరుస్తున్న రోడ్ల బారి నుంచి తమను కాపాడాలని సామాన్య భక్తులు ఆ దేవుడిని వేడుకోనున్నారు.

అయితే ఈ సమస్యలు పరిష్కారం కావాలన్నా, కాంగ్రెస్ పార్టీ కి సంబంధించి పైన పేర్కొన్న సమస్యలను కూడా పరిష్కరించవలసిన బాధ్యత వినాయకుడిపైనే ఉంది. ఈ రెండింటినీ ఏకకాలంలో పరిష్కరించడం ఆయన చేతిలో లేదు కనుక, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలలో కొన్నింటినైనా పరిష్కరించేందుకు చర్యలు తీసుకునే దిశగా, పాలకులకు ఆలోచన వచ్చేలా చేయాలని విఘ్నేశ్వరుడిని ఉమ్మడిగా ప్రార్థిద్దాం.

ఈసారికి నాయకుల కోర్కెల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకుండా, సామాన్య ప్రజలను, కనీసం కొన్ని సమస్యల నుంచై నా విముక్తి చేయడానికి వినాయకుడు చొరవ తీసుకోవాలని ఆశిద్దాం. అయినా దొంగతనం, దోపిడీ, హత్య చేయడానికి వెళ్లేవాడు కూడా, తన పని సాఫీగా జరిగేలా దీవించాలని దేవుడిని కోరుకుంటాడు. అంతమాత్రాన దేవుడు వారిని కరుణించడు కదా! ఎవరిని ఎలా దీవించాలో ఆయనకు బాగా తెలుసు. ఏ నాయకుడు ఎలాంటి వరానికి అర్హుడో వినాయకుడికి అందరికంటే బాగా తెలుసు!! 

-ఆదిత్య