
అసభ్యం - అనాగరికం
- ఓల్గా, స్త్రీవాద రచయిత్రి

అది వేధింపులకు గురిచేయడమే...
- వాసుదేవ దీక్షితులు, ఆంధ్రప్రభ పూర్వ సంపాదకులు

చంద్రబాల సిబిఐ జెడీ లక్ష్మీ నారాయణతో మాట్లాడటమే తప్పా... ఒక వేళ ఆ సంభాషణలో ఏదైనా కుట్ర గురించి మాట్లాడుకున్నారని అనుమానం వస్తే... ఆ టేపులు బయటపెట్టాలి కదా. మరి అలా చేయలేదేం. మాట్లాడారు...మాట్లాడారు చివరి వరకు ఇదే. చంద్రబాల అందుబాటులోనే ఉన్నారుగా..ఆమెతో మాట్లాడితే విషయం తెలియదా? ఆమె ఏం చెప్తారో వినాలా? లేదా? అలా కాకుండా వెకిలి పేరడీలు, చౌకబారు మాటలు ప్రచారం చేయడం ఎవరు నేర్పిన నీతి.
మహిళల భద్రతతో పనిలేదా?
- సంధ్య, పిఒడబ్ల్యు నాయకురాలు
చంద్రబాల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. వారాంతపు సెలవుల్లో లీడ్ ఇండియా అనే సంస్థ ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న సాధారణ మహిళ. అలాంటావిడ్ని ఈ వ్యవహారంలోకి తీసుకురావడం దారుణం. అమ్మమ్మ వయసులో ఉన్న స్త్రీని వాళ్ల రాజకీయాలకోసం భ్రష్టు పట్టించే ప్రయత్నం ఎంత ఘోరం? జెడి లక్ష్మీనారాయణపై బురద చల్లడం కోసం రాజకీయాలతో, మీడియా యుద్ధాలతో, మనీల్యాండరింగ్‌తో, అక్రమాస్తులు, అక్రమపెట్టుబడులతో ఏ మాత్రం సంబంధంలేని వ్యక్తిని తీసుకు రావడం దుర్మార్గం, చవకబారుతనం.

నేలబారు ఆలోచనలు చేస్తున్నారనిపిస్తోంది ఈ వ్యవహారమంతా చూస్తుంటే. ఎబిఎన్‌కి గాని, ఎండి రాధాకృష్ణ గారికి గాని లీడ్ ఇండియా పనుల కోసం ఓ రెండు సార్లు ఫోన్లు చేస్తే ఎన్నో కాల్స్ చేసినట్టు చెప్పడం ఏమిటి? ఇదంతా గమనిస్తే వైఎస్పార్సీపి వాళ్లు ఎంత నిరాశానిస్పృహల్లో ఉన్నారో అర్థమవుతోంది. లేకపోతే ఒక మధ్యతరగతి మహిళను ఈ విధంగా మీడియాకెక్కించే ప్రయత్నం వేరెవరూ చేయరు. వాళ్లు ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ల పార్టీకీ మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతర మహిళల భద్రతని, గౌరవాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్న వీళ్లు తమ పార్టీ మహిళా ఓటర్లను ఎలా పట్టించుకోగలుగుతారు.
ఇక్కడ మీకో విషయం చెప్పాలి సాక్షి మీడియాలో చంద్రబాల స్టోరీ వేసేందుకు గాను ఆ మీడియా రిపోర్టర్ ఒకరు చంద్రబాల ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నంత పనిచేసి మరీ ఆవిడ ఫోటో పట్టుకెళ్లారు. అలా తీసుకెళ్లిన ఫోటోని క్యారికేచర్ చేసి వాడారు. చంద్రబాల కుటుంబంతో నాకు 30 ఏళ్లుగా పరిచయం ఉంది. నైతిక విలువలతో, సామాజికస్పృహతో ఉన్న కుటుంబం వాళ్లది. ఈ వ్యవహారాల వల్ల వాళ్ల కుటుంబం చాలా బాధపడుతోంది. జెడి లక్ష్మీనారాయణకి ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో పరిచయం ఉంది. వాళ్లంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్.
వైఎస్సార్‌సీపికి ఉపఎన్నికల్లో వచ్చిన గెలుపు అహంకారాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. జెడి మీద బురద చల్లడానికి ఈవిడ్ని పావుగా వాడడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఆయన మీద వాళ్లకున్న వ్యక్తిగత ద్వేషానికి ఎవరినంటే వాళ్లని రోడ్డు మీదకి ఈడుస్తారా. ఆ చానల్ గాని, పార్టీ గాని మహిళలకి ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించి స్త్రీ విలువకి, గౌరవానికి సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించాలి. ఆమె భద్రతకి, ఆత్మగౌరవానికి ముప్పు కలిగించే పని జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.
అన్ని విధాలా దిగజారుడుతనం
- వరవరరావు, విరసం
ఒక మహిళ ఒక పురుషినితో మాట్లాడినందుకు సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి తీసుకురావడం దారుణం. చంద్రబాల తనకు జెడీ లక్ష్మీ నారాయణ క్లాస్‌మేట్ అని, పూర్వ విదార్థుల సమ్మేళనం అవసరాల రీత్యా ఆయనను సంప్రదించానని చెప్పాల్సిరావడంఎంతో బాధాకరమైనది. ఒక పురుషుడు, స్త్రీ మాట్లాడుకుంటేనే తప్పా? తల్లీ, కూతురు, అన్నా, చెల్లీ మాట్లాడుకున్నా ఇలాగే సంజాయిషీ ఇచ్చుకోవాలా? మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకోవాలి.
ఏదో ఒక కంపెనీకి ప్రయోజనం చేకూర్చడానికే ఇప్పుడు మీడియా పనిచేస్తోంది.

ఇప్పుడు ఫోన్లు వచ్చాయి. సోషల్ నెట్‌వర్కు సౌకర్యం పెరిగింది. ఇలాంటి పరిస్థితిలో వ్యక్తుల పరిచయాలను రాజకీయ ప్రయోజనాలకో, మరో దానికో ఎలా వాడుకుంటారు? ఎవరితో మాట్లాడాలో ఆమె ఇష్టం. అలా కాకుండా చంద్రబాల ఫలానా వారితోనే మాట్లాడాలని ఏమైనా రూలు పెడదామా? ఎవరికైనా ఎవరితోనైనా మాట్లాడాకునే స్వేచ్ఛ ఉంది. మీడియా ఇది గమనించాలి. అలా కాకుండా ఆమెను కించపరిచేలా పేరడీలు, జోకులు సృష్టించడం దిగజారుడుతనం అవుతుంది.
ఇదేనా స్త్రీలను గౌరవించే సంస్క ృతి?
- ఘంటా చక్రపాణి, రాజకీయ విశ్లేషకులు
ఈ మొత్తం ఎపిసోడ్‌లోకి చంద్రబాలను లాగడం అనైతిక రాజకీయాలకు పరాకాష్ట. రాజకీయ సంస్థల ప్రయోజనాల కోసం మీడియా నడిపిన కుట్రకు ఆమె ఎందుకు బలి కావాలి? ఇదేనా స్త్రీలను గౌరవించే మన సంస్కృతి. అసలు మీడియాకు స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ నుంచి దక్కిందే. దాన్ని అడ్డంపెట్టుకుని ఇంకొకరి వ్యక్తిగత స్వేచ్ఛను ఎలా హరిస్తారు.

మీడియా నిజాలను వెలుగులోకి తీసుకురావాలి. అంతేకాని రాజకీయపార్టీల ప్రయోజనాల కోసం ఎంతకైనా బరితెగించాలా? విచారణ జరపడానికి విచారణ సంస్థలున్నాయి. శిక్షించడానికి న్యాయ స్థానాలున్నాయి. వీటన్నిటినీ వదిలి ఒక స్త్రీపై పడటం ఎక్కడి న్యాయం. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చాలా బిల్లులను వెనక్కుపంపిన చరిత్ర ఉంది. అదంతా విస్మరించి కేవలం రాజకీయపార్టీల, వ్యక్తుల ప్రయోజనాలకోసమే చంద్రబాలను నడిబజారులోకి ఈడ్చడం నాగరిక ప్రపంచంలో హర్షణీయమైన చర్యకాదు.
- ప్రస్తుతం పరిస్థితి ఎలా మారిందంటే...ఘోరమైన తప్పులు చేసిన వ్యక్తి సమాజం ముందు నిల్చొని తన ప్రవర్తన సమర్ధించుకోవడానికి "అందరూ తప్పులు చేస్తున్నవారే కదా'' అని చెప్పినట్టుగా ఉంది. ఇలాంటి ఒక చెత్త వాదనకు బలాన్నివ్వడానికే వ్యక్తుల స్వేచ్ఛను బలి చేయడానికి సిద్ధపడిపోయారు. చంద్రబాల కావచ్చు, మరొకరు కావచ్చు ఎవరి విషయంలోనైనా ఇలా జరగడం సమాజానికే శ్రేయస్కరం కాదు.
వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారు
- దేవి, సామాజిక కార్యకర్త
మహిళలకి సంబంధించి వివాదాస్పదమైన వార్తలు ప్రసారం చేసేటప్పుడు వాళ్ల ముఖాన్ని చూపించకూడదని, వాళ్ల పేర్లు వెలువరించకూడదని నియమం ఉంది. కాని సాక్షి చానల్‌లో చంద్రబాల విషయంలో ఈ విలువలేవీ పాటించలేదు. ఆవిడకి సంబంధించి ఎటువంటి కేస్‌లు లేవు. అయినప్పటికీ ఊహాగానాలు చేసి స్టోరీ అల్లేశారు. ఒకవేళ ఆమె వల్ల వాళ్లెవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే ఆమెపై వాళ్లు కేసు పెట్టవచ్చు. అంతేకాని వ్యక్తిగత విషయంలో జోక్యం చేసుకుని ఆవిడ స్వేచ్ఛను భగ్నం చేస్తూ... ఆవిడ ఎవరెవరితో మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అంటూ ఫోను జాబితాను వెలువరించడమనేది అమానుషమైన చర్య.

ఈ మధ్య మీడియాలో సున్నిత విషయాలను పట్టించుకోకపోవడం సర్వసాధారణమైంది. ఊహాగానాల ప్రసారాలకు అడ్డుకట్ట వేయాలి. చంద్రబాల విషయాన్ని ఎలాగైనా ప్రసారం చేయాల్సిందే అని వాళ్లనుకుంటే కనుక ఒక అపరిచిత మహిళ అనో, ఒక మహిళ అనో చెప్పి ఉండాల్సింది. అలా కాకుండా ఆమె పేరు, ఫోను నంబరుతో సహా ఇచ్చి ఆమె ఫోటోను ప్రసారం చేయడం దారుణమైన చర్య. నేరపూరితమైన చర్యగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు వీళ్లకెవరు ఇచ్చారు. ఈ విషయంపై ఆమె కావాలనుకుంటే క్రిమినల్ కేసు పెట్టొచ్చు.