Tuesday, October 5, 2010

బడుగుల ఉద్యమాలతో... పార్టీల్లో వణుకు !

Gaddar-final
రాష్ట్ర రాజకీయాలపై కొన్ని దశాబ్దాల నుంచి పెత్తనం సాగిస్తోన్న అగ్రకుల రాజకీయ పార్టీల పట్టు చేజారిపోయే పరిస్థితి మొదలయింది. రెడ్డి-కమ్మ-వెలమ-కాపు కులాలు సాగిస్తున్న రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలు సమిథలుగా మారుతున్నారు. ఓట్లుమావి-సీట్లు మీవా అని నినదించే స్థాయికి ఎదిగిన బడుగు వర్గాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి, ఉద్యమాలను తమ చేతులోకి తీసుకోవడం ప్రారంభించడంతో అగ్రకుల స్వభావం ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో వణుకు ఆరంభమయింది. తాజాగా గద్దర్‌ ప్రారంభించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆవిర్భావంతో అగ్రకుల పార్టీల్లో భయాందోళనతో కూడిన ఆత్మరక్షణ కనిపిస్తోంది.

జనాభాలో 85 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలను ఇప్పటిదాకా తమ ఓటు బ్యాంకులుగానే పరిగణిస్తూ, వారికి చిన్న చిన్న తాయిలాలు ఇస్తూ.. వారి పేరిట వచ్చిన రాజ్యాధికారాన్ని మాత్రం తామే అనుభవిస్తున్న అగ్రకుల పార్టీలు.. చివరకు బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల నుంచి పుట్టిన ఉద్యమాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని, దానిని అడ్డుపెట్టుకుని రాజకీయ పరమపదసోపానంలో నిచ్చెనలు ఎక్కేయాలన్న కుట్రలు పన్నుతున్న వైనాన్ని ఎట్టకేలకూ బడుగు వర్గాలు గ్రహించాయి. అగ్రకుల పార్టీలకు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారి నిర్ణయాలే శిలాశాసన ంలా మారిన పరిస్థితిలో మార్పు వచ్చి, బడుగులే సొంతంగాఎదిగేందుకు వేదికలు సిద్ధం కావడం అగ్రకుల పార్టీలను బేజారెత్తిస్తున్నాయి.

ప్రధానంగా.. తెలంగాణలో కేవలం ఒక్క శాతమే ఉన్న వెలమల నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ చుట్టూ రాజకీయాలతో పాటు, తెలంగాణ ఉద్యమం కూడా పరిభ్రమిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం బడుగు బలహీనవర్గాల్లో చాలాకాలం నుంచి ఉంది. అయితే, బడుగు సంఘాల్లో ఉన్న అనైక్యత, వాటికి నేతృత్వం వహిస్తోన్న నేతల వ్యక్తిగత బలహీనతల వల్ల తెలంగాణ ఉద్యమం ఇప్పటివరకూ వెలమ దొరల చుట్టూనే తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ప్రారంభిం చడం, దానికి దళిత నేత మందకృష్ణ మాదిగ సహా బీసీ నేతలంతా మద్దతు పలకడంతో టీఆర్‌ఎస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దానికితోడు బీసీ సంఘా లన్నీ కలసి జేఏసీలుగా ఏర్పడ్డాయి. బీసీ సంఘాలు ఇప్పటికే కేసీఆర్‌పై విమర్శ నాస్త్రాలు ఎక్కువపెడుతున్నాయి.

దళితుడిని సీఎం, మైనారిటీని డిప్యూటీ సీఎం గా చేస్తానన్న కేసీఆర్‌.. జనాభాలో 65 శాతం ఉన్న బీసీల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం వారిని ఆగ్రహావేశాలకు గురిచేసింది. మరోవైపు దళిత కార్డును అడ్డుపెట్టుకుని దళితులను తన వైపు ఆకర్షించాలన్న కేసీఆర్‌ ఎత్తుగడ కూడా వికటించింది. దళిత నేత మందకృష్ణమాదిగ వంటి వారూ ఆయనకూ దూరమయ్యారు. ఇక మొన్నటి వరకూ కేసీఆర్‌ మాట జవదాటని విద్యార్థులు కూడా ఆయనకు దూరమయ్యారు. దిష్టిబొమ్మలు తగులబెట్టే వర కూ వెళ్లారు. బడుగు విద్యార్థులు సైతం గద్దర్‌ ఫ్రంట్‌కు ఆకర్షితులవుతున్నారు. కవిత కోటి బతుకమ్మ జాతరను ఆపాలంటూ ఓయు జేఏసీ పిలుపునిచ్చే వరకూ వెళ్లారు. సీమాంధ్ర సీఈఓలతో కేసీఆర్‌ భేటీ సగటు తెలంగాణవాది హృద యాన్ని కోలుకోలేనంతగా గాయపరిచింది. ఇది టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులకు ఊత మిచ్చినట్టయింది. అటు కేసీఆర్‌ మానసిక స్థైర్యం పైనా దెబ్బపడింది.

తెలంగాణలో గద్దర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేయటంతో ఇప్పటివరకూ ప్రత్యా మ్నాయం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కొండంత ధైర్యం వచ్చినట్ట యింది. ఈ ఫ్రంట్‌ ద్వారా రాజ్యాధికారం సాధించాలన్న కాంక్ష మరింత బలపడింది. గద్దర్‌ సారధ్యంలో ఏర్పడే ఫ్రంట్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గొడుగుగా ఉంటుందన్న భావన మొదలయింది. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న గద్దర్‌, కృష్ణమాదిగ వంటి ప్రజాకర్షణ నేతలు వేదిక పంచుకుంటే తెలంగాణలో వెలమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌-రెడ్డి పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ బలహీనమవక తప్పదన్న అంచనా ఆరంభమయింది. ఈ శక్తులన్నీ కలిస్తే తెలంగాణలో బడుగు వర్గాలకే రాజ్యాధికారం వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. గద్దర్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ పెదవి విప్పకపోవడం చూస్తే ఆ పార్టీ ఏ స్థాయిలో ఆత్మరక్షణలో ఉందో స్పష్టమవుతోంది. గద్దర్‌ ఫ్రంట్‌ తర్వాత బడుగు బలహీనవర్గాలతో పాటు, సాంస్కృతిక, విద్యార్థి శక్తులు కూడా ఏకమవుతున్నారు.

ఇక సీమాంధ్రలో కమ్మ పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ పైనా ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్దర్‌ సీమాంధ్రలో కూడా పర్యటిస్తానని చెప్పడమే దానికి కారణం. సీమాంధ్రలో కూడా ఇమేజ్‌ ఉన్న గద్దర్‌, మందకృష్ణ మాదిగతో పాటు అక్కడున్న బీసీ నేతలు కూడా ఏకమవుతే అక్కడ టీడీపీకి గండిపడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. సీమాంధ్రలో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున.. వారితో బీసీలు కలిస్తే ఇక అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలోనూ బడుగుల రాజ్యాధి కారమే వస్తుందన్న ఆశలు, అంచనాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ తన బీసీ విధానాలకు దూరమయి, పారిశ్రామికవేత్తలకే పెద్ద పీట వేస్తుండటం, రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పదవుల్లో సైతం వారికే ప్రోత్సాహం ఇవ్వడం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పక్కన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలతో బీసీలు వెనక్కి తగ్గుతున్నారు. తెలంగాణలో వెలమ-రెడ్డి; సీమాంధ్రలో కమ్మ-రెడ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుండటంతో బీసీలు అసంతృప్తితో ఉన్నారు. అయినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మౌనంగా ఉన్నారు.

ఇప్పుడు బీసీలు ప్రత్యామ్నాయంగా తెరపైకొచ్చిన గద్దర్‌ ఫ్రంట్‌ వైపు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ-ఆంధ్రలో దళిత-బీసీలు కలసి రాజ్యాధికారంలో పాలుపంచుకునే దిశగా తాజా రాజకీయ పరిణామాలు మారుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటిపై వస్తున్న విమర్శలను గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో తన వ్యూహం మార్చుకుని, రెడ్డి-వెలమ నేతలు కాకుండా తెలంగాణలో బీసీ, దళిత శక్తులనే తెరపైకి తీసుకురావలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

కేవలం కోస్తాకే పరిమితమయిన పీఆర్పీపైనా తాజా రాజకీయ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. కాపు పార్టీగా ముద్ర ఉన్న పీఆర్పీ ఇంకా ఆ ముద్రను తొలగించుకోవడంలో విఫలమవుతోంది. పైగా.. కాపులను వ్యతిరేకించే బీసీ-దళిత శక్తులన్నీ తాజా రాజకీయ సమీకరణలో భాగంగా ఒక్క తాటిపైకి రానుండటం కూడా పీఆర్పీని వణికిస్తోంది. కోస్తాలో వారి మధ్య తరచూ సామాజిక సమరం జరుగుతూనే ఉంటుంది. సామాజిక తెలంగాణ నినాదం తిరగబడిన ఫలితంగా.. ఆ పార్టీకి చెందిన బడుగు వర్గాలంతా టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లో చేరాయి. అటు కోస్తాలో కూడా కళావెంకట్రావు, తమ్మినేని సీతారాం వంటి బీసీనేతంతా టీడీపీ గూటికి చేరిపోయారు.

గద్దర్‌ ఫ్రంట్‌తో పాటు.. కొత్తగా తెరపైకి రానున్న మరికొన్ని సామాజిక శక్తుల ఫ్రంటులు, సంస్థలు అదే ఊపులో అటు సీమాంధ్రలో కూడా బడుగుల పునరేకీకరణకు సమాయత్తమవుతున్నారు. వారికి గద్దర్‌ ఫ్రంట్‌ స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రం విడిపోయినా పెత్తనం కమ్మ-రెడ్డి-కాపుల చేతిలోకి వెళ్లకుండా రాజ్యాధికారం కోసం ఇప్పటినుంచే పోరాటం మొదలుపెడు తున్నారు. ఈ పరిణామాలే ఇప్పుడు అగ్రకుల పార్టీలుగా ముద్ర ఉన్న కాంగ్రెస్‌-టిడిపి, టీఆర్‌ఎస్‌, పీఆర్పీలకు వణుకు పుట్టిస్తున్నాయి. 85 శాతం ఉన్న బడుగుల్లో సామాజిక-రాజకీయ చైతన్యం పెరిగి, తామే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష బలపడితే.. ఇక కేవలం జనాభాలో 15 శాతమే ఉన్న తమకు, తమ కులానికి చెందిన వారే మిగులుతారన్న భయాందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజాసంఘాల గర్జన
netallu
ఇక మలివిడత ఉద్యమానికి ప్రజా సంఘాలు సిద్దమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటివరకు ప్రధానపాత్ర పోషించిన ప్రజాసంఘాలు ఈసారి ఉద్యమానికి నాయ కత్వం వహించాలని భావిస్తోంది. సామాజిక తెలంగాణ కావాలని భావిస్తున్న ప్రజా సంఘాలు ఆ దిశగా అన్ని బడుగు వర్గాలను ఏకం చేచే దిశగా అడుగులు వేస్తుంది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21నహైదరాబాద్‌లో ‘గిరిజన గర్జన’ డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో దళిత గర్జన, డిసెంబర్‌ 26న వరంగల్‌లో బిసి గర్జన, మైనారిటీ గర్జనలు చేపట్ట నున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్‌ తెలిపిరు.

ఈ గర్జలనుల ముగిసిన తర్వాత అన్ని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో జన వరి మొదటి వారంలో 2 లక్షల మందితో హైద్రాబాద్‌లో ‘ప్రజా యుద్దబేరి’ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభలోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంప ఒత్తిడి పెంచేలా కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. అన్ని వర్గాలను ఉద్యమం లో భాగస్వాములు చేస్తామని తెలి పారు. గిరిజనుల్లోని 33తెగలు, ఎస్సీల్లోని 59 తెగలు, మైనార్టీల్లోని 8 వర్గాలు అందరూ భాగస్వాముల అయ్యే విధంగా ప్రచారం చేస్తామని బెల్లయ్యనాయక్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బడుగులు రాజ్యాధికారం చేపట్టటానికి ఈ మళి విడత ఉద్యమం నాంధి అవుతుందన్నారు.