Saturday, September 18, 2010

మేయర్‌గారు 100 కోట్లు మేశారు * రైతుల సబ్సిడీ స్వాహా చేశారు

ఎరువుల స్కాంలో కొత్త కోణం
4500 టన్నుల అక్రమ తరలింపు!
'హరిత' అక్రమం.. క్రిభ్‌కో, ఇఫ్కో ఎరువులతో దందా
రెండేళ్లుగా సాగుతున్న బాగోతం
వ్యవసాయ, మార్కెఫెడ్ అధికారులు కుమ్మక్కు?
వైఎస్‌కు బామ్మర్ది.. కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి ఎరువుల అక్రమ దందాలో ఇదో కొత్త కోణం! రైతులకు చెందాల్సిన సబ్సిడీని మేయరు గారు ఎంచక్కా మేసేశారు! ఒకటీరెండు కోట్లు కాదు.. ఏకంగా వంద కోట్ల రూపాయలు! అన్ని చట్టాలనూ అతిక్రమించి.. అక్రమ వ్యాపారానికి అడ్డదార్లు తొక్కారు! క్రిభ్‌కో, ఇఫ్కో వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఎరువులను నిబంధనలకు విరుద్ధంగా తన హరిత ఫ్యాక్టరీకి తరలించుకుపోయారు! అది కూడా మౌఖిక ఆదేశాలతోనే!

అక్రమ సంపాదనలో వాటా ఎందుకు కోల్పోవాలనుకున్నారేమో... ఈ బాగోతం రెండేళ్లుగా సాగుతున్నా.. వ్యవసాయ శాఖ అధికారులుగానీ.. మార్క్‌ఫెడ్ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు! ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 20 మిక్సింగ్ ప్లాంట్లకు 4.5 వేల టన్నుల యూరియాను అక్రమంగా తరలించినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో ఇప్పటికే బయటపడింది. ఇందులో రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన కంపెనీలే అధికంగా ఉన్నాయి.

రవీంద్రనాథ్‌రెడ్డికి చెందిన కీసరలోని హరిత ఫర్టిలైజర్‌కు అక్రమంగా ఈ ఏడాది 3,400 టన్నులు తరలివెళ్లినట్లు విచారణలో బయటపడింది. ఇందులో 2,200 టన్నులు ఆగాపూర్‌లోని తారమా మ్యాక్స్ ద్వారా తరలించగా వేయి టన్నులను మార్క్‌ఫెడ్ నేరుగా సరఫరా చేసింది. ఇది చాలదన్నట్లుగా నిబంధనలకు విరుద్ధంగా క్రిభ్‌కో కంపెనీ నేరుగా మరో 200 టన్నులను హరిత కంపెనీకి విక్రయించింది. ఈ ఎరువుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా తరలించిన వేయి టన్నులను ఇఫ్కో తయారు చేయగా మిగిలిన ఎరువులు క్రిభ్‌కోలో ఉత్పత్తి అయ్యాయి.

నేరుగా ఎరువులను దిగుమతి చేసుకునేందుకు ఒక సమయంలో ఇబ్బంది రావడంతో అతిగతీ లేని ఆగాపూర్‌లోని 'తారమా మ్యాక్స్' పేరుతో 2200 టన్నులను దిగుమతి చేసుకున్నారు. మూడో కంటికి కూడా తెలియకుండా ఇదంతా జరిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వేల టన్నుల యూరియా, డీఏపీలో దారి మళ్లినట్లు తెలుస్తోంది. గత ఏడాది, ఈ ఏడాది ఎరువుల కొరతకు మిక్సింగ్ ప్లాంట్లే ఓ కారణంగా అధికార వర్గాలు చెబుతున్నాయి.

మౌఖిక ఆదేశాలతోనే అంతా: అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కి, ఏకపక్షంగా అధికారులు అక్రమంగా ఎరువులను కంపెనీకి తరలించారని, రాతపూర్వకంగా ఎటువంటి ఫైల్ కదలకుండానే వేల టన్నుల యూరియా, డీఎపీలను హరిత కంపెనీకి చేర్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మార్క్‌ఫెడ్ ద్వారా ఈ ఏడాది హరిత ఫర్టిలైజర్ కంపెనీకి వేయి టన్నుల ఇఫ్కో యూరియాని విక్రయించారు.

ఎలాంటి ఆధారం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో యూరియాను కేటాయించేందుకు జిల్లా మేనేజర్ నిరాకరించారు. అయితే కంపెనీ యాజమాన్యం వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారుల నుంచి ఆయనపై ఒత్తిడి తెచ్చి యూరియాను విడుదల చేయించింది. ఇపుడు దీనిపై వివాదం రేగడంతో వారంతా కింది స్థాయి అధికారులపై నెట్టేస్తున్నారు. కింద స్థాయి అధికారులు కేసులో ఇరుక్కుపోయారు.

అక్రమాలు జరిగేది ఇలానే: ఎరువుల కుంభకోణంలో ఇప్పటికే అధికారుల పాత్ర స్పష్టమైంది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల సహకారంతో నాలుగైదేళ్లుగా కొందరు మిక్సింగ్ ప్లాంట్లు నిర్మించారు. రంగారెడ్డి జిల్లాలో రెండేళ్ల కిందట నిర్మించిన హరిత ఫర్టిలైజర్ కంపెనీలోనే భారీగా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ఎరువుల నియంత్రణ చట్టంలోని అన్ని నిబంధలను అతిక్రమించి కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడ్డారు.

అసలు ఆ ప్లాంట్ తయారు చేస్తున్న ఎరువులకు కావాల్సిన ముడిసరుకు మొత్తం అక్రమంగానే తరలించారు. వాస్తవానికి మిక్సింగ్ ప్లాంట్లు దిగుమతి చేసుకునే ఎరువులు, ముడిసరుకుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి రాయితీలు ఉండవు. ఉదాహరణకు యూరియా తయారీ కంపెనీకి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 200లకుపైగానే సబ్సిడీ ఇస్తుంది. ప్రస్తుతం 50కిలోల యూరియా ధర 500కు పైగానే ఉన్నా ప్రభుత్వం రూ. 275లకు అందచేస్తోంది.

అలాగే డీఏపీకి కూడా భారీగా సబ్సిడీ ఇస్తోంది. 50 కిలోల బస్తా రైతుకు సబ్సిడీపై రూ. 517లకే అందిస్తోంది. ఒక వేళ మిక్సింగ్ కంపెనీలు యూరియాను కొనుగోలు చేయాలంటే వీటికి దాదాపు రెట్టింపునకుపైనే ఖర్చు చేసి కొనుగోలు చేయా లి. అది కూడా నేరుగా ఉత్పత్తి కంపెనీల నుంచి సరుకు తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం లేదా ఉత్పత్తి కంపెనీల ద్వారా సరఫరా చేసే యూరియా, ఇతర ఎరువుల్లో నాణ్యత లోపిస్తే వాటిని ప్రత్యేకంగా నిల్వ చేస్తారు. వీటిలో నుంచే మిక్సింగ్ కంపెనీలు కొనుగోలు చేయాలి. ఎరువుల్లో తగ్గిన కాంప్లెక్స్ శాతాన్ని బట్టి వీటి రేటును అధికారులు నిర్ధారిస్తారు.

చట్టాలన్నీ అతిక్రమించి: హరిత ఎరువుల మిక్సింగ్ కంపెనీ అన్ని నిబంధనలూ తుంగలో తొక్కి యథేచ్ఛగా అక్రమ ఎరువుల వ్యాపారం చేస్తోంది. కేంద్ర ఎరువుల నియంత్రణ చట్టాలను పట్టించుకోకుండా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఎరువుల నియంత్రణ చట్టం 1985 క్లాజ్ 24 ప్రకారం కంపెనీల నుంచి నేరుగా ఏ ప్రైవేటు వ్యక్తి కూడా ఎరువులను దిగుమతి చేసుకోవడానికి వీలు లేదు. ఈ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేయాలి. సబ్సిడీ పై ఇచ్చే ఎరువులను రైతులను మాత్రమే వినియోగించాలి.

కానీ హరిత సంస్థ నేరుగా క్రిభ్‌కో నుంచి ఎరువులను దిగుమతి చేసుకుంది. దీనికి అధికారులంతా సహకరించారు. అలాగే సెక్షన్ 23 (1) ఏ, బీ, సీ క్లాజుల కింద మిక్సింగ్ ప్లాంట్లు నాన్‌స్టాండర్డ్‌గా గుర్తించిన సరుకును మాత్రమే కొనుగోలు చేసి, వాటితో కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసుకోవాలి. ఇదంతా కూడా వ్యవసాయ శాఖ పరిధిలోనే జరగాలి. కానీ రైతులు వినియోగించే మంచి సరుకునే దిగుమతి చేసుకున్నారు. అది కూడా రైతు సబ్సిడీని స్వాహా చేసి సరుకును తరలించారు.