Sunday, October 31, 2010

సమష్టి పోరాట ఫలం తెలుగు రాష్ట్రం

తెలుగు వారి చరిత్ర గత నూరేళ్ళుగా పరిశీలిస్తే ఎన్నో విస్మయాలు, విషాదాలు కనిపిస్తాయి.పురాణాలను, ఇతిహాసాలను నమ్మినా నమ్మకపోయినా తెలుగువారి శాపగ్రస్తతను మాత్రం నమ్మాల్సి ఉంటుంది. విశ్వామిత్రుడు వీళ్ళను శపించాడుట. ఆయన అసలే ఆవేశి. ఆగ్రహశీలి.శునశ్శేషుడనే దిక్కులేని వాడాయనను ఆశ్రయించాడుట. ఆయన తన కొడుకులతో వీణ్ణి మీతో కలుపుకొని సఖ్యంగా బతకండిరా అన్నాడుట. ససేమిరా వల్ల కాదన్నారట ఆయన సంతానం. అయితే మీరు కష్టాలపాలవుతారు పోండి అని విశ్వామిత్రుడు శపించాడుట. ఇదంతా పుక్కిటి పురాణమే అనుకున్నా శతాబ్దాలుగా తెలుగు వారి ఉత్థానపతనాలు ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. త్యాగశీలత, ధైర్యస్థైర్యాలు, విజ్ఞాన వికాసాలు, నాగరికత, సంస్కృతి, ప్రథమశ్రేణిలోనే వీళ్ళు ఎంతో కాలం నుంచీ నిలుపుకుంటూ వస్తున్నప్పటికీ వీరి ఉన్నతికీ, పురోగతికీ ఈ గొప్ప లక్షణాలు సహకరించడం లేదు. చెరుపు కూడా చేస్తున్నాయి.

telugu-mathaఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగారు. ఇప్పుడు నలిగిపోతున్నారు. కలత చెందుతున్నారు. తెలుగువారంతా ఒకటిగా ఉండాలనీ, వారందరికీ చెందిన ఒక రాష్ట్రం కావాలనీ, జీవన రంగాలలో ఇతోథికంగా అప్పుడు పురోభివృద్ధి సాధించగలమనీ, మళ్ళీ శాతవాహనుల కాలంలో లాగా ‘అఖిల భారతము మాదనన్ననాడు’ అనే శుభ ఘడియలు వస్తాయనీ వాళ్ళు నూరేళ్ళనాడు ఆశించారు. ఆకాం క్షించారు. మళ్ళీ ఇప్పు డు వాళ్ళ అస్థిత్వానికి ప్రశ్నార్థకం ఎదురవుతున్నది.తెలుగు వాళ్ళు తా మంతా మమేకమైపోవాలని గత శతాబ్దం మొదటి దశాబ్దంలోనే ఉద్వేగభరిత మనస్కులైనారనీ, గాఢంగా వాంఛించారనీ చెప్పటానికి చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఈ శతాబ్ది మొదటి దశాబ్దం ముగియకుండానే విడిపోవాలని కలహిస్తున్నారు.

madapati1905-06లో ‘వందేమాతరం’ ఉద్యమం తెలుగువారందరికి తా మంతా కలసిపోయి తమ వ్యక్తిత్వాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న నిర్ణయాత్మకమైన భావన అంకురించినట్లు ఆధునిక చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు.1905లో లార్డ్‌ కర్జన్‌ వంగదేశాన్ని రెండు ముక్కలు చేశాడు. ఈ నిర్ణయాన్ని భారతదేశమంతా తీవ్రంగా నిరసించింది. వ్యతిరేకించింది. అందువల్ల చేసేది లేక 1911లో పంచమ జార్జి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇది తెలుగువారికి స్ఫూర్తినిచ్చినట్లు చరిత్రజ్ఞులు భావిస్తున్నారు.తాము ఎప్పటి నుంచో ఇప్పటికే విడిపోయి ఉన్నారు. దానికి అనేకమైన చారిత్రక హేతువులున్నాయి. అక్రమాలు, అన్యాయాలు జరిగా యి. కాబట్టి ఇక ముందైనా ఒకటిగా ఉందాం అనే కోర్కె వారిలో పెల్లుబికింది. ఇది చారిత్రక నేపథ్యం.

PattabhiSitaramayyaగుంటూరులో జొన్నవిత్తుల గురునాథం, ఉన్నవ లక్ష్మీనారాయణ కలసి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కావాలో ప్రజాభిమతాన్ని కూడగట్టేం దుకు ఒక గొప్ప సభ జరిపే పూనిక వహించారు. ఇది గత శతాబ్ది మొదటి దశాబ్దానికే నిర్దిష్ట స్వరూపం ధరించింది. గురునాథం తెలుగువారి ఆకాంక్షను తెలియజేస్తూ ఇంగ్లీషులో ఒక పుస్తకం ప్రకటిం చారు. ఇంగ్లీషులో ఎందుకంటే రాచరికమంతా, రాజకీయమంతా అప్పుడు ఇంగ్లీషులోనే ఉండేది కనుక. ఈ పు స్తకంలో తెలుగువారు కాంక్షిస్తున్న స్వంత రాష్ట్ర చిత్రపటం ప్రకటిం చారు. ఈ పటంలో తెలంగాణం తెలుగు జిల్లాలన్నీ ఉన్నాయి. ఇవేకాక మధ్య ప్రదేశ్‌, మైసూరు, తమిళనాడు, ఒరిస్సాలలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నీ ఉన్నాయి. తెలుగువారి రాజకీయ నాయకుల స్వార్ధపరత్వం వల్ల, కపటం వల్ల, కుత్సితం వల్ల 1953 నాటికి ఆ ప్రాంతాలన్నీ తెలుగువారు వదులుకోవలసి వచ్చింది. అంటే పోగొట్టుకున్నారు.

akrగుమ్మడిదల వెంకట సుబ్బారావు అనే అద్భుత వ్యక్తి ఒకరు నలభై ఏళ్ళ కిందటి దాకా ఉ న్నారు.తెలుగునాట తెలుగు వారు నిర్వహించిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని గూర్చి ఆయన ఎన్నో తబ్బీళ్ళు పుస్తకరూపంలో ప్రకటించారు. ప్రసక్తానుప్రసక్తంగా తెలంగాణలో జరిగిన కృషి కూడా ఇందులో ఆయన చేర్చారు. ఆయన రచనలన్నీ కొన్ని సంపుటాలుగా వెలువరించారు. అందు లో మొట్టమొదటి సంపుటం ‘ఆంధ్రోద్యమము’ అనేది. ఈ పుస్తకం 1961లో వెలువడిం ది. తెలుగువారి కాంక్ష ఉద్భవ, వికాస పరిణామాలు ఈ సంపుటిలో ఆయన ఎంతో ప్రతిభావంతంగా నిరూపించారు. తెలుగువారి కాంక్షాఫల సిద్ధిలో వారు ఎదుర్కొన్న ఆటుపోటులు, భంగపాట్లు, ఆశా, నిరాశలు, ప్రతికూల శక్తుల అడ్డుపుల్లలు తమదైన ఉద్వేగ ధోరణిలో వారు వివరించారు. స్వాతంత్య్రోద్యమ తీవ్రఘట్టాలలో ఆంధ్రోద్యమం సుప్తచేతనావస్థలో ఉండటం ప్రస్తావించారు.

Konda_Venkatappayya‘‘అట్టి పరిస్థితిలో గుంటూరులో నడిం పల్లి నరసింహారావు, దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, ఉన్నవ లక్ష్మీనారాయణల సహకారంతో డాక్టర్‌ రాధా కుముద్‌ ముఖర్జీ అధ్యక్షత కింద, అఖిలభారత భాషా రాష్ట్ర సమితి నేర్పరచి కొంత కాల ము కృషి చేయగా 27-11-1947వ తేదీన ఢిల్లీ పార్లమెంటు సభలో వెంటనే ఆంధ్ర రాష్టమ్రేర్పడుతుందని ప్రధాని నెహ్రూ ప్రకటించారు.(ఈ సందర్భంగా తాను ప్రత్యక్ష సాక్షినని చెబుతున్నారు వెంకట సుబ్బారావు). ఆ తరువాత దేశం లోని అల్లకల్లోల పరిస్థితుల వల్ల ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు తిరిగిందని సుబ్బారావు ప్రస్తావించారు. ధార్‌ కమిషన్‌, జె.వి.పి. రిపోర్ట్‌, ఫజలాలీ కమిషన్‌ విషయాలు ప్రసక్తం చేశారు. ఈ చారిత్రక ఘట్టాలన్నీ వివరించారు.

అసలింతకూ తెలుగువారికి తమ స్వంత రాష్ట్రం పట్ల ఇంత ప్రగాఢ కాంక్ష కు నేపథ్యం ఏమిటో అయ్యదేవర కాళేశ్వరరావు స్వీయ చరిత్రలో ఇట్లా వివరించారు. 1911 లోనే అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ హార్డింజ్‌ భారతదేశం భాషా ప్ర యుక్తంగా ఉండాలని ఇంగ్లండుకు నివేదిక పం పినట్లు కాళేశ్వరరావు స్వీయ చరిత్రలో ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర జిల్లాల ప్రజలకు తమ రాష్ట్రం కావాలని కోర్కె రోజురోజుకూ ప్రబలింది. స్వరాజ్యం ఎట్లాగూ రాబోతున్నది. ఈ స్వరాజ్యం నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజల మాతృభాషలోనే శా సన నిర్మాణం, పరిపాలన నిర్వహణం, న్యాయవిచారణ తప్పనిసరి అని రా జకీయ నాయకులంతా తలచారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాల ని, తెలుగువారికి విశ్వవిద్యాలయం వెంటనే స్థాపన కావాలని ఆశించారు.

SuravaramPratapReddyఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ భాషలు మాట్లాడే జిల్లాలన్నీ ఒకే ప్రభుత్వం కింద ఉన్నాయి. కాబట్టి శాసనసభా కార్యక్రమం, ప్రభుత్వం నిర్వహణం, న్యాయస్థాన విచారణ విదేశీ భాష అయిన ఇంగ్లీషులోనే సాగుతున్నది. ఈ నాలుగు భాషల ప్రతినిధులకు ఒకరి భాష ఇంకొకరికి తెలియదు. అంతా ఇంగ్లీషునే నేర్చుకోవాలి. విద్యా బోధన అంతా ఇప్పటికీ ఇంగ్లీషే. అంతేకాదు మద్రాసు శాసనసభలో ఆంధ్ర, కన్నడ, కేరళ ప్రతినిధులకన్నా ఎక్కువమంది తమిళప్రతినిధులున్నారు.

శాసనసభలో, ప్రభుత్వంలో, హైకోర్టులో పలుకుబడి అంతా తమిళులది. తమిళుల యాజమాన్యం.ఆంధ్రుల వ్యక్తిత్వం, ఆత్మగౌరవం పరిగణనకు రావు. అది తమిళ రాజ్యమేకాని తెలుగువారి ప్రసక్తి లేదు. చెన్న రాష్ట్రంలో ఉన్నవారిందరినీ మద్రాసీలనే పేరు. అంటే తమిళులనే ఉత్తరభారత దేశపు వారి భావం... తమిళ లాయర్లు, తమిళ ఇంజనీయర్లు ఆంధ్ర జిల్లాల నుండి విశేషముగా ధనం సంపాదిస్తున్నారు.పరిశ్రమలు, విద్యుచ్ఛక్తిగా తమిళ ప్రాంతంలో ఉన్నంతగా ఆంధ్ర ప్రాంతాలు లేవు.‘తమిళ దేశంలో కావేరి మీద తొమ్మిది రోడ్డు వంతెనలుండగ, కృష్ణా, గోదావరి నదుల మీద ఒక వంతెన కూడా లేకుండెను.

unnava-lakshmi-narayanaతమిళ బస్తీలు అభివృద్ధి చెందినట్లు ఆంధ్ర బస్తీలు అభివృద్ధియగుట లేదు’’ (పుటలు 216-217; 1959లో తొలిముద్రణ). అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ తొలిస్పీకర్‌ కావడం గుర్తుంచుకోవాలి. అట్లానే మాడపాటి హనుమంతరావు శాసనమండలి తొలి సభాపతి అయినారు.ఆంధ్రుల పూర్వ చరిత్రను స్వీరుూ చరిత్రలో కాళేశ్వరరావు ఇట్లా విశ్లేషిం చారు. ‘‘తమ పూర్వపు స్థితి మిగుల గొప్పదని ఆంధ్రులకు తెలుసు.

దానిని గూర్చి వారికి గర్వం ఉంది. ఇప్పటి స్థితి వారికి రోజురోజుకూ దుర్భరంగా ఉంది. చరిత్ర తెలిసినప్పటి నుంచి ఇరవై రెండు శతాబ్దాలు వరుసగా శాతవాహన, చాళుక్య, కాకతీయ, విజయనగర, గోల్కొండ చక్రవర్తుల కింద ఆంధ్ర దేశమంతా ఏకపాలనం కింద ఉంటూ వచ్చింది. మహోజ్వల చరిత్రలో భరత వర్షము యొక్క సర్వతోముఖమైన నాగరికతను, అంతర్జాతీయ ప్రతిష్ఠను పెంపొందించింది ఆంధ్ర దేశం. ఆ కాలంలో ఆంధ్రుల శౌర్య ప్రతాపాలు, పరిపాలన దక్షత, రాజకీయ నైపుణ్యం, విజ్ఞానం, సిరిసంపదలు, కళాకౌశలములు అనన్య సామాన్యంగా పెంపొందాయి. ఆంధ్రులు అనాది కాలము నుండి ఓడల నిర్మాణంతో సముద్రంలో దూరదేశాలకు పోయి వర్తకవ్యాపారాలు సా గించారు. బర్మా, సయాం, కాంబోడియా, ఇండొనేషియాలలో ఆంధ్రుల వలసలను స్థాపించి ఆంధ్ర నాగరికత, శిల్పం, కళలను, విజ్ఞానాన్ని హిందూ బౌద్ధ ధర్మాలను నెలకొల్పారు’’( పు. 217) అని చెపు తూ ఆ తరువాత ఐదు శతాబ్దాల చరిత్రను, సాక్ష్యాధారాలతో సహా పేర్కొన్నారు కాళేశ్వరరావు.

అక్టోబరు 2, 1949 ప్రగతి గాంధీ జయంతి ప్రత్యేక సంచికలో దాశరథి పద్యాలివి. ‘‘ప్రగతి’’ వారపత్రిక వరంగల్‌ నుంచి వెలు వడేది. ఇది తెలంగాణ తెలుగు వారి ప్రథమ స్వాతంత్య్రోత్సవ విశేష సంచికగా ప్రారంభ మైంది. భారతదేశానికంతకూ 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకి 1948లో వచ్చింది స్వాతంత్య్రం. 1949 ఆగస్టు 15 తెలంగాణాకు ప్రథమ స్వాంత్య్ర దినోత్సవం. అప్పుడే భండారు చంద్రమౌళీశ్వరరావు గారు వరంగల్‌ నుంచి ఈ వార పత్రిక ప్రాంభిం చారు. ఈ పత్రికలో కాళోజీ నారా యణ రావు రచనలు చాలా వచ్చాయి. తెలం గాణ ప్రము ఖ రచయితలు, ఆంధ్ర పాంతం లోని ప్రసిద్ధ తెలుగు రచయితలు ఈ పత్రికలో తమ రచ నలు వెలువరించారు. పత్రికను ఎంతో అభి మానించారు.

Kalojiమన భవిష్యత్తు ఏమిటి? అనే రచనలో కాళోజీ నారాయణ రావు ఇట్లా అభిప్రాయపడ్డారు.‘‘నేటి సమాజములోని వ్యవహార సరళిననుసరించి ప్రతివాడు తాను పైకి వచ్చుటకు పక్కవానిని బొందలోనికి త్రోయుట తప్పనిసరియని తలచుచున్నాడు. పరస్పర సహకారము లేనిదే సమాజములో యే వ్యవహారమును జయముగ కొనసాగదు. ఈ సిద్ధాంతమును వల్లె వేయుచు ప్రతివాడు పక్కవాని వ్యవహారమునకు అవరోధము కల్పించి బాగుపడదలచుచున్నాడు..ఇట్టి దశలో సమాజోద్ధారకులమనియు, ప్రజాసేవకులమనియు, పేర్లుబడసినవారిగా అగుటకై తహతహపడు వారి కర్తవ్యమేమి? ప్రజా సంస్థలలో ని కార్యకర్తల విధి ఏమి?

RaviNarayanReddyవారును తమతమ సంస్థలను సంస్థానములుగ భావించి వ్యక్తిగత స్వార్ధాలను సాధించుటకై వ్యక్తిగత ద్వేషాలను బూని కసిబూని కుట్రలు జేసి ముఠాలుగా జేరి తమతమ ప్రతిభా విశేషములను సంస్థాతర్గత వైషమ్యాగ్నికాహుతి జేయవలసినదేనా? ఇదియేనా దేశోధ్ధరణ! ఇదియేనా వారి ప్రజాసేవ?.. సంస్థలోని బహు సంఖ్యాకులు దొంగలైన సంస్థ కూడా దొంగదేయగును. సంస్థలో నాయకులు ముఠాలుగా జేరి, తమతమ ముఠాలను బలపరచుకొనుటకై కుట్రలు బన్ని పతకాలల్లి అధికార సంపాదనకై కృషి సలుపునన్నాళ్ళు వారి నడవడి బాగుపడదు. పార్టీ ప్రాబల్యము కొరకు ప్రాకులాడునన్నాళ్ళు న్యాయము జరుగదు. మతోన్మాదముతో కూడుకొన్న ఫాసిస్టు ప్రభుత్వముతో పోరాడుచున్నంత కాలము సంస్థలోని కుళ్ళు మననంతగా బాధించదు.

అన్ని ముఠాలు తాత్కాలిక సహకార సామరస్యములతో పని చేసినవి. అంతర్గత విభేదాలు ఇంతగ తల ఎత్తలేదు. ఇప్పుడా పోరాటము ముగిసినది. ఇంటిలోని పోట్లాటలు మిగిలినవి. బలమంతయు రుూ కయ్యాలకే వినియోగింపబడుచున్నది... కార్యకర్తలలోని జమిందారీ, సాహుకారి, వతన్‌దారి, పైరవికారి, బ్లాక్‌ మార్కెట్లు, కుట్ర, పన్నాగాలు పోనంత వరకు దేశము బాగుపడదు. ప్రస్తుత ధో రణేయమలులోనున్న కాంగ్రెసు పతనము తథ్యము.’’ అరవై ఏళ్ళ కిందటి కాళోజీ పల్కులు ఎంత భవిష్యత్‌ సూచకంగా ఉన్నవి.

శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్ర్తిగారి సన్మాన సభ సందర్భములో తెలంగాణా ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ‘దాశరథి కృష్ణమాచార్యులు’ రచించి సమర్పించిన పూజా పంచకం...
ఓహో! వేంకట శాస్ర్తి సత్కవి! కవిత్వోద్యాన వన్యాంగణ
శ్రీహాసన్నవ పారిజాత కుసుమశ్రేణుల్‌ గుబాళించు నీ
ఊహా వీధికలన్‌ త్రిలింగ కవిరాడ్‌ యూధంబు గుర్రాలపై
రాహుత్తుర్‌ బలె స్వారి చేసెగద ధారారమ్య కావ్యాళితో!
మా తెలంగాణమంతయు రమారమి రెండు శతాబ్దముల్‌ తమః
ప్రేతము చేతిలో గడచె; వెచ్చని యెండకాయలే, దదే
దో తెరచాటునన్‌ గడచె; నుజ్వల కాంతి ఘటాకటాహముల్‌
పాతరవేసియుండె: తెలవారగలేదు గదా శతాబ్దముల్‌
నేడు, నవోదయ ప్రథమ నిర్మల భాను కరాగ్రమాలల
ర్రాడును మా తెలుగు కవిరాజుల మానస పద్మసీమ; నీ
తోడును నీడ యూడ నెగదా ! తెలగాణమునందు గూడ కా
వ్యోడు పతిప్రకాండములు వ్యోమమునన్‌ జలతారు లల్లెడిన్‌
అగ్ని పుష్పాలు పూచి ఉద్విగ్న మాన
సముల చీకట్లు కాల్చి వెచ్చదనమొసగి
కవులు కంఠాల శాంతిగీతి వెలలాంచె
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
కోటిగళాలతో పిలుచుకొన్నది నా తెలగాణ నిన్ను నీ
నోటి జెలంగు భారతిని-నూత్న యుగప్రథమోదయాన ము
క్కోటి తెలుంగు లొక్కకడ గూడ విశాల మహాంధ్రతా సుమ
స్ఫోటన మాచరింపుము యశోనిధి! చెళ్ళపిళాన్వయాగ్రణీ!

‘‘ఇరువదవ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దముల నాటి తెలంగాణ ఆంధ్రుల దైన్య స్థితి ని గూర్చి మాడపాటి హనుమంతరావు పంతులు రచించిన ‘తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర’ మొదటి భాగంలో విపులంగా వర్ణించబడింది. నైజాము రాజ్యంలో వాక్స్వాతంత్య్ర ము, పత్రికా స్వాతంత్య్రం, సభా స్వాతం త్య్రం, మానవ ప్రాథమిక హక్కులు, రాజకీ య ప్రాతినిధ్య హక్కులు బొత్తిగా లేకుం డెను. ఆంధ్ర, మహారాష్ట్ర, కన్నడ భాషలు అణచివేయబడి ఉర్దూ భాషలోనే విద్యావిధానం, పరిపాలన కార్యక్రమము నిర్వహింపబడెను. 1895వ సంవత్సరమున హైదరాబాదునందు శాసనమొకటి స్థా పింపబడెను.

కాని దానిలో నలుగురు మాత్రము ఎన్నికైన సభ్యులుగాను, మిగిలిన వారందరును ప్రభుత్వ నియమితులుగాను ఉండిరి. ఒక్క ఆంధ్రుడేనియు దానిలో సభ్యుడగు భాగ్యమును పొందలేదు.... నూరు రూపాయలకు మించిన మాసవారీ వేతనముగల యు ద్యోగము చేసిన తెలుగువారిని వేళ్ళ మీద లెక్కించవచ్చును’’ అని కాళేశ్వరరావు మాడపాటివారి గ్రంథం నుంచి ఆనాటి నిజాం పరిపాలనలో తెలుగువారి దుస్థితిని గూర్చి విపులంగా ఉదహరించాడు.

ఇదంతా 1948 దా కా ఉన్న పరిస్థితి. తెలంగాణలో మాధ్యమిక పాఠశాలల సంఖ్య 18 అని హనుమంతరావు భోగట్టా. ‘‘తెలుగు ప్రాథమిక పాఠశాలను కాని, గ్రంథాలయమును కాని స్థాపించవలెనన్న ప్రభుత్వము యొక్క అనుమతి కావలెను - అట్టి అనుమతి వచ్చు ట బహు దుర్లభముగనుండెను. ఎటులనో కష్టపడి ప్రభుత్వానుమతి సంపాదించి హైదరాబాదులోను, సికిందరాబాదులోను, హనుమకొండలోనూ గ్రంథాలయములు స్థాపింపబడెను’’ అని మాడపాటి వారి సాక్ష్యం తెచ్చుకున్నారు కాళేశ్వరరావు.

తెలంగాణంలోని తెలుగువారు, బ్రిటిషు పాలననుభవించిన తెలుగు వారూ తాము భి న్న జాతులవారమనీ, భిన్న భాషలకు చెందిన వారమనీ శతాబ్దాలుగా ఎన్నడూ అనుకోలే దు. ప్రతాపరుద్ర చక్రవర్తికి ఆంధ్రధరాధినేత అనే బిరుదున్నట్లు మల్లంపల్లి సోమశేఖరశర్మ రాశారు. ఓరుగల్లుకు ఆంధ్రనగరమనే పే రుండేది. ప్రాచీనాంధ్ర నగరములని ఆదిరా జు వీరభద్రరావు పంతులుగారొక గ్రంథమేశారు. మహమ్మదీయుల పాదాక్రాంతమై ఓ రుగల్లు పతనమైన తర్వాత తీరాంధ్రానికి వెళ్ళి మళ్ళీ ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించిన ముసునూరి ప్రోలయనాయకుడికి ‘ఆంధ్ర సురత్రాణ’ అనే బిరుదుండేది.

పాల్కురికి సో మన, పోతన, తిక్కన తాము అఖిలాంధ్రకి చెందిన వారమనుకున్నారే కాని ప్రత్యేక ప్రాంతాలకు చెందినవారమనుకోలేదు. 1944, 45 ప్రాంతాలలో హైదరాబాదు నుంచి వెలువడ్డ ‘మీజాన్‌’ పత్రికకు అడవి బాపిరాజు సంపాదకులు. పరిశోధనలో, సా హిత్య కృషిలో తనకు ఆదర్శం సురవరం ప్ర తాపరెడ్డి, తిరుమల రామచంద్ర అని చెప్పుకునేవారు. 1926లో ప్రారంభమైన గోల్కొండ పత్రికలో సురవరం వారి రచనలకూ, ఆంధ్రపత్రిక రచనలకూ భేదం ఏమీ కనపడదు. పోలీసు చర్య తర్వాత తెలంగాణంలో మొ ట్టమొదటి భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లు నుంచి ‘ప్రగతి’ అ నే వార పత్రిక మొదలైంది.ఇందులో కరుణ శ్రీ పద్యాలున్నాయి. కాళోజి నారాయణరావు రచనలు ఎన్నో ఉన్నాయి.పి.వి.నరసింహారావునీ ఈ పత్రిక ప్రభావితం చేసినట్లు కనపడుతుంది.

ప్రగతి ప్రారంభ సంచికకు శుభాకాంక్షలందజేస్తూ మాడపాటి హనుమంతరావు పంతులు ఇట్లా అన్నారు.‘చారిత్రక ప్రసిద్ధి గల ఆంధ్ర నగరము నుండి- మరొయొక తె నుగు వారపత్రిక మీవలన సంపాదింపబడనుండుట నాకత్యంత సంతోష ప్రదము. ఆం ధ్రోద్యమారంభ కాలమున వెడలిన రెండు తె లుగు వార పత్రికలలోకటి వరంగల్లు జిల్లాలోని ఇనుగుర్తి నుండి ప్రకటితము కాసాగె ను. అది సుమారు ఆరు వత్సరములు పలు కష్టములతో సేవ యొనర్చి తుది దినములలో వరంగల్లు నుండి వెడలుచు అస్తమించియుండెను.

వరంగల్లునకు మొదటి మొదటి దినములలో ఆంధ్రాభ్యుదమను మాసపత్రికను ప్రకటించిన గౌరవము కూడకలదు. తమ వా రపత్రిక తెలంగాణమున మంచి వ్యాప్తిగాంచి ఆంధ్ర వాఙ్మయమునకెంతో సంపదను పెం పొందించినట్లు దైవమనుగ్రహించుగాక’’-స్వామీ సీతారం, కళా వెంకటరావు, శివలెంక శంభుప్రసాద్‌, జమ్మలమడక మాధవరామశర్మ ప్రభృతులు తమ అభినందన సందేశాలు పంపించారు ఈ పత్రికకు. వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాం తం వేరు వేరు అనుకోలేదు. నైజాం నవాబు నుంచి తెలంగాణం విముక్త పోరాటంలో ప్రధాన పాత్ర నిర్వహించిన నరేంద్రజీ తమ సందేశంలో ఇట్లా అన్నారు.

‘‘హైదరాబాద్‌ రాజకీయ వాతావరణంలో ప్రవేశించిన వ్యక్తిగత ద్వేషాలూ, ముఠాబందీ లు, పరస్పర వైరుధ్యాలు మున్నగు వాటి నుండి దూరమై పవిత్ర భారతీయ సంస్కృతికనుగుణంగా రాజకీయాలను ప్రజానీకం లో వ్యాప్తి చేయుటలో ‘ప్రగతి’ అగ్రస్థానము వహించుగాక. భరత వర్షం యొక్క నిజమైన ప్రగతియే మీ ధ్యేయంగానూ, పీడిత ప్రజానీకము యొక్క సేవయే మీ మార్గపథంగాయుండుగాక. మానవ జాతి ‘ప్రగతి’ యొక్క నిరంతర ప్రగతిని నేను కోరుచున్నాను.’’స్వామీరామానంద తీర్థ ‘‘సంకుచిత పాక్షిక ప్రాంతీయ భావాలను విడనాడాలి’’ అని స్వా తంత్య్రదినోత్సవ సందర్భంగా సందేశపు హెచ్చరికను ఇట్లా వినిపించారు. ‘‘ఇప్పుడు మన జీవన భారత జాతీయతతో అవినాభావంగా జోడించి ఉన్నది.మనలను ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ భారత జాతీ య విధానాల విశాల దృక్పథంతో చూడాలె.

ప్రక్కన ఉన్న భాషాధారక రాష్ట్రాలలో విలీనకరణమవడమే భారతదేశంతో హైదరాబాదు సమైక్యమగు విధానంలోని తుదిదశ’’ అని ప్రబోధించారు స్వామీజీ. ‘‘హైదరాబాదులో మనం, ప్రజలకు విపరీతంగా హాని చేసిన ఈ మతతత్త్వ విషక్రిమి నిర్మూలనకు విపరీత కృషి చేసి, ఆరోగ్యప్రదమైన జాతీయ జీవన నిర్మాణానికి అనుకూలంగా వాతావరణాన్ని శుభ్ర మూ, నిర్మలమూ చేయాలి’’ అని కూడా హె చ్చరించారు.

శ్రీగడియారం రామకృష్ణ శర్మ స్వీయ చరిత్ర ‘శతపత్రం’ చదివితే పోలీసు చర్య అనంతరం ఇరు ప్రాంతాల వారి మధ్య సుహృద్భావం ఎంత ప్రగాఢంగా ఉండేదో, 1953 నాటికే అలంపురం లో విశ్వనాధ సహా అఖిలాంధ్ర కవి పండిత పరిషత్తు ఎంత వైభవంగా జరిగిందో, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటివారు ఎంత ఆనం దించారో, ప్రారంభ వేడుకను ఎంత ఉత్తేజకరంగా సర్వేపల్లి రాధాకృష్ణ నిర్వహించారో తెలుస్తుంది.తీరాంధ్రం నుంచి కాని, తెలంగాణం నుం చి కాని తెలుగు మహనీయుల స్వీయచరిత్ర లు ఎన్నో వచ్చాయి. ఇవి ఇప్పటికి నూరు సంఖ్య దాకా లెక్క తేలవచ్చు. ఈనాటి సం ఘర్షణల భావాలు ఈ రచనలలో మచ్చుకైనా కనిపించవు. చరిత్రనెవ్వరూ మార్చలేరు. తీరాంధ్రంలో సుమారు 60 ఏళ్ళు, తెలంగాణాంధ్రంలో సుమారు 30 ఏళ్ళు ఏ సురుచిర స్వప్న సుందర ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజలు ఉవ్విళ్ళూరారో అదంతా బహు ఉత్తేజకరమైన చరిత్ర.

మన కళాశాల విద్యార్ధులు, విశ్వవిద్యాలయ విద్యార్ధులు చదువదగినవి. సర్వేపల్లి రాధాకృష్ణయ్య రెండుసార్లు ఆంధ్ర మహాసభలకధ్యక్షత వహించారు (1928, 1938), కొండ వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, న్యాపతి సుబ్బారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కట్టమంచి రామలింగారెడ్డి, కూర్మా వెంకటరెడ్డి నాయుడు, మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌, వేమవరపు రామదాసు పంతులు, విజయానంద గజపతి ప్రభృతులు అక్కడ- నరసింగరావు, జమలాపురం కేశవరావు, రావినారాయణ రెడ్డి ఇక్కడ తెలుగు వారి సమైక్యం కోసం, ఉజ్జ్వల భవి తవ్యం కోసం ఎంతో కృషి చేశారు. వారి త్యాగాలు, వారి నిస్వార్థ ప్రజాహిత జీవనం- ఇవాళ ఏమైనాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గవర్నర్‌ జనరలైన లార్డ్‌ వెల్లింగ్డన్‌ దగ్గరకు రెం డుసార్ల ఆంధ్ర రాష్ట్ర విషయమై రాయబారా లు జరిపినట్లు గుమ్మడిదల సుబ్బారావు రాస్తున్నారు. వేమవరపు రామదాసు జీవితం బహు ఉజ్జ్వలమైనది. ఆయన తెలుగువారి స్వంత రాష్ట్రం కోసం ఎంతో శ్రమిం చారు. ఇవాళ ఆ పెద్దలందరినీ స్మరించటం తెలుగువారి కనీస కర్తవ్యం.

తెలుగు వాళ్ళు తామంతా మమేకమైపోవాలని గత శతాబ్దం మొదటి దశాబ్దంలోనే ఉద్వేగభరిత మనస్కులైనారనీ, గాఢంగా వాంఛించారనీ చెప్పటానికి చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఈ శతాబ్ది మొదటి దశాబ్దం ముగియకుండానే విడిపోవాలని కలహిస్తున్నారు. 1905-06లో ‘వందేమాతరం’ ఉద్యమం తెలుగువారందరికి తామంతా కలసిపోయి తమ వ్యక్తిత్వాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న నిర్ణయాత్మకమైన భావన అంకురించినట్లు ఆధునిక చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు.

Saturday, October 30, 2010

ఆనాడు నువ్వు తెలుగు తల్లివి, ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన బిరుదు... 'దయ్యం'



 మా దయ్యానికి మల్లెపూదండ
ఆనాడు నువ్వు తెలుగు తల్లివి,
ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి
ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన
బిరుదు... 'దయ్యం'
అవును నువ్వు నిజంగా దయ్యానివే!

అర్ధనూట పదహారు రోజులు
ఆకలితో మలమల మాడ్చి
అమర జీవిని బలితీసుకున్న దయ్యానివి నువ్వు!
ఏదో ఒరగబెడతానని అందర్నీ తీసుకొచ్చి
ఎటూ కాని ఎడారిపాలు చేసిన
దయ్యానివి నువ్వు!
ఇడ్లీ, సాంబార్ వదిలేసి రండి,
విందు భోజనం వడ్డిస్తానని పిలిచి
ఇరానీ చాయ్ కూడా
లేకుండా చేసిన దయ్యానివి నువ్వు!

తుంటరి వరుడంటూ నెహ్రూ ఉమ్మేసినా
తుడుచుకుని నవ్వేసిన దయ్యానివి నువ్వు!

కొత్త రాజధానిలో నీ బిడ్డలు
కొలువే చేయకూడదని
పెద్ద మనుషులు తీర్పిచ్చినా
పట్టని దయ్యానివి నువ్వు!

నీలోని రుద్రమ్మకు మసిపూసి,
నీకు సవతి తల్లిగా ముసుగేసినా
ఉలుకూ పలుకూ లేని దయ్యానివి నువ్వు!

నీతోపాటు త్యాగయ్యనూ తిక్కన్ననూ
అందర్నీ దయ్యాల్ని చేసి
కొత్తమ్మ కాళ్లు పట్టిస్తున్న దెయ్యానివి నువ్వు!

చిరునవ్వు సిరులన్నీ భాగ్యనగరిలో పారేసుకుని,
కట్టుబట్టలతో గడప దాటలేక
చూరుపట్టుకు వేలాడుతున్న దయ్యానివి నువ్వు!

హైటెక్ హంగులు, ధగధగ రోడ్లు,
మిలమిల లైట్లు
ఏవీ నీవి కానివై వెక్కిరిస్తుంటే,
గూడు పాడైనా ఎగిరిపోలేని చిలకలా
శిలావిగ్రహమై నిల్చిన దయ్యానివి నువ్వు!

నీ వాళ్లను పంచెలూడదీసి కొడతామంటున్నా
నీకు రోజూ వస్త్రాపహరణం తప్పదంటున్నా
ద్రౌపదిలా శ్రీకృష్ణ జపం చేస్తున్న
దయ్యానివి నువ్వు!

ఎంత దయ్యమైనా అమ్మ అమ్మే
అందుకే ఈ పరాయి పంచలో
సిగ్గులేని మా బతుకుల సాక్షిగా
'భాగో'లే తప్ప బాగోలేని మా మనసుల సాక్షిగా
తెల్లవారీ వారక ముందే, దొర నిద్ర లేవకముందే,
తిట్లూ శాపనార్థాల చీకట్లలో,
కాలుతున్న ఏపీ 16 స్కూటర్ వెలుగులో
ఎవరూ చూడకుండా దొంగల్లా వస్తాం!
నీకో మల్లెపూదండ వేసేసి పారిపోతాం!!
- వక్కలంక రమణ

రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ ఉండగా... మేధావులు కుల, మత, ప్రాంతీయ అభిమానంతో.....

నేతల మాటలు.. భవితతో ఆటలు

గడచిన వారం రోజులుగా వివిధ పార్టీలకు చెందిన మన నాయకులు, సమాజంలో మేధావులుగా చలామణి అవుతున్నవారు చేస్తున్న ప్రకటనలు, విమర్శలు చూస్తూ ఉంటే రోత పుడుతున్నది. రాజకీయ నాయకులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ ఉండగా... మేధావులు కుల, మత, ప్రాంతీయ అభిమానంతో మాట్లాడుతున్నారు.

సమస్యను సమస్యగా చూసి పరిష్కారం కోసం చొరవ తీసుకోవలసిన వర్గాలు కలుషిత మనస్సులతో ఆయా సమస్యలను మరింత జటిలం చేయడమే కాకుండా, మొత్తం సమాజంలో విద్వేషపూరిత వాతావరణాన్ని వ్యాపింపజేస్తున్నారు. అధికారం అనుభవించిన వాళ్లు, అధికారంలో ఉన్నవాళ్లు, అధికారం అందుకోవాలని కలలు కంటున్న వాళ్లు అన్న తేడా లేకుండా, ఎవరికి తోచిన విధంగా వాళ్లు వ్యవహరిస్తుండటం ఈ రాష్ట్రం చేసుకు న్న దౌర్భాగ్యం.

రాష్ట్ర రాజకీయాలు విద్వేషమయం అవడం తో, ఏ ఒక్క పార్టీకీ మరో పార్టీ పొడగిట్టడం లేదు. ఫలితంగా ఆయా సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోగా, మరింత ముదురుతున్నాయి. గతంలో ప్రధాన సమస్యలపై అధికారం లో ఉన్నవాళ్లు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి పరిష్కారా లు కనుగొనేవారు.

ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా పార్టీలు వ్యవహరిస్తుండటంతో అఖిలపక్ష సమావేశాలకు అర్థం లేకుండా పోతున్నది. ఆయా సమస్యలపై పలు పార్టీల అధినేతలు ఈ వారం రోజుల్లో పలు అఖిలపక్ష సమావేశాలు నిర్వహించారు. కానీ, ఏ ఒక్క సమావేశంలో కూడా పార్టీల ప్రతినిధులు నిర్ణయాత్మకంగా వ్యవహరించి సమస్యల పరిష్కారానికి సూచనలు చేసిన పాపాన పోలేదు.

సమాజంలో పెడధోరణులు ప్రవేశిస్తున్నప్పుడు చొరవ తీసుకుని కార్యరంగంలోకి దిగవలసిన మేధావులు అయితే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. లేదా, మరింత వక్రంగా ఆలోచి స్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. ఉదాహరణకు... 2012లో యుగాంతం అవుతుందని వచ్చిన పుకార్లను ఆధారంగా చేసుకుని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ సంస్థ కు చెందిన విద్యార్థులు కొందరు, ఆ పరిస్థితి వస్తే హైదరాబాద్‌లో ఎటువంటి విపరీతాలు జరుగుతాయో ఊహిస్తూ గ్రాఫి క్స్ మాయాజాలంతో లఘుచిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని న్యూస్‌చానెళ్లలో చూసిన తెలంగాణకు చెందిన మేధావి ఒకరు స్పందిస్తూ, "ఆ నాశనం అయ్యేది ఏదో విశాఖపట్నంలో ఊహించి చేయవచ్చు కదా? మా హైదరాబాద్‌లోనే విధ్వం సం ఊహించడం ఎందుకు?''అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి మేధావుల ఆలోచనలు ఎంత పెడధోరణులు పడుతున్నా యో తెలుస్తున్నది. ఆ లఘుచిత్రం రూపొందించిన విద్యార్థులకు గ్రాఫిక్స్ రూపొందించడంలో ఉన్న ప్రతిభ సదరు మేధావికి కనపడలేదు.

వాస్తవానికి, ఆ విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఉండవచ్చు. హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే వారు పనిచేస్తున్నది హైదరాబాద్‌లో. ప్రస్తుతం హైదరాబాద్ ఈ రాష్ట్ర రాజధాని కూడా! ఇలాంటి వక్రభాష్యాలు, విద్వేషపూరిత ఆలోచనలవల్ల ఆ విద్యార్థుల ప్రతిభ గురించి ఎవరూ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతున్న ది.

ఇది సమాజానికి మంచి చేస్తుందా? చెడు చేస్తుందా? అని మేధావులు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదేవిధంగా, విగ్రహాల ఏర్పాటు వివాదం ఒకటి తెరపైకి వచ్చి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించింది అనుకోం డి! తెలంగాణకు చెందిన గిరిజన నాయకుడు కొమురం భీం విగ్రహాన్ని కూడా ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.సి.ఆర్ కుమారుడు, సిరిసిల్ల ఎం.ఎల్.ఎ కె.తారకరామారావు కోరడంలో తప్పులేదు.

అయి తే, భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే ఇది వరకే ఏర్పాటు చేసిన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మహనీయుల విగ్రహాల ను ధ్వంసం చేస్తామని ఆయన అనడం ఎంతవరకు సమంజ సం? ఇది ఒక బాధ్యతగల నాయకుడు చేయవలసిన ప్రకటనే నా? వాస్తవానికి కొమురం భీంను ఇంతకాలం విస్మరించినందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులే ముందుగా సంజాయిషీ ఇచ్చుకోవాలి.

ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పలు విగ్రహాలలో సీమాంధ్రకు చెందినవారివే ఎక్కువ ఉన్న విషయం కూడా వాస్తవమే! అయితే, వారి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడానికి ముందే ఆయా ప్రాంతా ల ప్రజలు వారి విగ్రహాలను తమ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని గౌరవభావాన్ని తెలుపుకొన్నారు. ఫలితంగానే వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చి ట్యాంక్‌బండ్‌పై చోటు లభించింది.

కొమురం భీం విగ్రహాన్ని ఆదిలాబాద్ జిల్లాలో గానీ, తెలంగాణలోని మరో జిల్లాలో గానీ ఇంతకాలం ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారో తెలంగాణ నాయకులు వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఒక మహనీయుడి విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలందరికీ న్యాయం జరిగిపోదు. కాకపోతే, గుర్తింపు లభించినట్లు అవుతుంది.

అయితే ఇందుకు ఎంచుకున్న మార్గం సరైనదేనా అని ఆలోచించవలసిన బాధ్యత కె.తారకరామారావుపై గానీ, మరొకరిపైగానీ లేదా? ఎందుకంటే ట్యాంక్‌బండ్‌పై స్థానం పొందిన సీమాంధ్రకు చెందిన పలువురు మహనీయులను తెలంగాణకు చెందినవాళ్లు కూడా అభిమానిస్తారు. యోగి వేమన అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ఆ కారణంగానైనా వేమ న విగ్రహానికి తాను రక్షణగా నిలబడతానని తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

తెలుగు లలిత కళాతోరణం పేరు మార్పు వివాదం ఒకటి ఇప్పుడు తెరపైకి వచ్చింది. కళాబంధుగా కీర్తించబడటాన్ని ఇష్టపడే కాంగ్రె స్ ఎం.పి. టి.సుబ్బరామి రెడ్డి పదికోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించి తెలుగు లలిత కళాతోరణానికి ముందు రాజీవ్‌గాంధీ పేరు చేర్పిస్తూ ప్రభుత్వంతో ఉత్తర్వు లు జారీ చేయించారు. ఇక్కడ రాజీవ్‌గాంధీ పేరు పెట్టడం సమర్థనీయమా? కాదా? అన్నది ప్రశ్నకాదు.

తెలుగు సంస్కృతికి ప్రతీకగా ఎన్.టి.రామారావు నిర్మించిన దీనికి ఇప్పుడు పేరు మార్చవలసిన అవసరం ఉందా? అన్నదే ప్రశ్న. ఇలా ఎప్పుడో పేరు పెట్టిన సంస్థలు, ప్రదేశాలకు ఇప్పుడు పేర్లు మార్చడం వల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమీలేకపోగా, కొత్త సమస్యలకు తెరతీసినట్లు అవుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ మన తెలుగువాడు కాకపోయినా, ఆ రోజుల్లో ఉన్న జాతీయ భావంతో ఆ మహనీయుడి పేరిట రవీంద్ర భారతిని మనం నిర్మించుకున్నాం.

ఇప్పుడు ప్రాంతీయ కోణం తో చూసి రవీంద్ర భారతి పేరు మార్చాలని ఎవరైనా అంటే మాత్రం ఏమి చేయగలం! లలితకళా తోరణం ముందు తెలు గు అన్న పదం చేర్చడం ద్వారా తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటడానికి నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రయత్నించారు. అంతేకాదు, ఆయన హయాంలో ప్రారంభమైన పలు పథకాలకు కూడా వ్యక్తుల పేర్లు రాకుండా తెలుగు పేర్ల నే ఎన్.టి.ఆర్ ఎంచుకున్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద మెప్పు పొందడానికో లేక మరో కారణం వల్లనోగానీ తెలుగు లలిత కళాతోరణం ముందు రాజీవ్‌గాంధీ పేరు చేర్పించడాని కి సుబ్బిరామిరెడ్డి పూనుకున్నారు. దీనితో ఇది సహజంగానే వివాదం అయింది. తెలుగు లలిత కళాతోరణం పేరు మార్చే పక్షంలో కాళోజీ నారాయణరావు పేరు పెట్టాలని కొందరు, సుద్దాల హనుమంతు పేరు పెట్టాలని మరికొందరు తెలంగాణ వాదులు ప్రకటనలు చేయడం ప్రారంభించారు.

లేని సమస్యను సృష్టించుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి! ఈ వివాదం నేపథ్యంలో సి.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయ ణ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ప్రతినిధులు పర స్పరం చేసుకు న్న విమర్శలు రోత పుట్టిస్తున్నాయి. మన నాయకులు ఇంతగా ఎందుకు దిగజారిపోతున్నారా? అని ఆవేదన కలుగుతున్నది.

అన్నింటికీ రాజీవ్ పేరు పెట్టుకుంటూపోతున్న కాంగ్రెస్ నాయకులు సులభ్ శౌచాలయాలకు కూడా ఆయన పేరే పెట్టుకుంటే సరిపోతుందన్నట్లుగా నారాయణ వ్యాఖ్యానించగా... నారాయణ చనిపోయిన తర్వాత 'నారాయణ మూత్రశాలలు' ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నాయకులు బదులిచ్చారు. తెలుగు సంస్కృతి ఈ స్థాయికి దిగజారినందుకు గర్వించు దాం!

రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా ఉన్న మైక్రో ఫైనాన్స్ విషయంలో కూడా ఆయా పార్టీల నాయకులు చేస్తున్న ప్రకటనలు వారి బాధ్యతారాహిత్యాన్ని చెబుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌కు సంబంధించి పేద ప్రజలు రెండు కారణాల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇందులో మొదటిదీ, ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలకు కారణమైనదీ అధిక వడ్డీ. 40 నుంచి 60 శాతం వరకు వడ్డీ వసూలు చేయడంతో పాటు, ఒకే వ్యక్తికి రెండు మూడు సంస్థలు అప్పులు ఇవ్వడం వల్ల సమస్య జటి లం అయింది.

ఇచ్చిన అప్పు వసూలు కోసం మైక్రో సంస్థల ప్రతినిధులు సహజంగానే ఒత్తిడి తెస్తారు. పర్యవసానంగా ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలను మూసివేయడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందా? అంటే, అదీ లేదు. ఈ పరిస్థితులలో సమస్యను లోతుగా అధ్యయనం చేసి పరిష్కారానికి దోహదపడాల్సిన రాజకీయ పక్షా లు తాత్కాలిక ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్నాయి.

తీసుకున్న అప్పులు ఎగ్గొట్టాలని సి.పి.ఐ. నేత నారాయణ ప్రకటన ఇవ్వగానే, తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కూడా ముందూ వెనుక ఆలోచించకుండా అప్పు ఎగవేయవలసింది గా రుణగ్రహీతలకు పిలుపు ఇవ్వడా న్ని ఎలా సమర్థించుకోగలరు? తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలను కట్టవద్దని పిలుపు ఇచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయి ఉంటారు.

పరిపాలనా దక్షత గల వ్యక్తిగా కీర్తి గడించిన చంద్రబాబు ఇటువంటి సందర్భాలలో చౌకబారు ప్రచారం కోసం పాకులాడటం బాధాకరం. వాస్తవానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఆయన ఈ సమ స్య పరిష్కారానికి చొరవ తీసుకోవచ్చు కూడా. ఎవరు అధికారంలో ఉన్నా సమస్యలు ఉంటూనే ఉంటాయన్న నిర్ధారణకు వచ్చిన ప్రజలు, ఆయా సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచించిన వారిని అభిమానించే రోజులు వచ్చాయి.

ఈ సత్యాన్ని చంద్రబాబు గుర్తించవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు ఒకదాని పొడ మరొక దానికి గిట్టకపోవడం వల్లనే మైక్రోఫైనాన్స్ వంటి సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ కారణంగానే గత ఆదివారం నాడు ఎ.బి.ఎన్. ఛానెల్ చొరవ తీసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థల అధిపతులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వడ్డీ రేటు తగ్గించుకోవడానికి సంస్థల అధిపతులను అంగీకరింపజేసింది.

ఇకపై వడ్డీరేటును 24 శాతానికి మించనివ్వబోమని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సులోని నిబంధనలను విధిగా పాటిస్తామ ని మైక్రోఫైనాన్స్ సంస్థల అధిపతులు అంగీకరించారు. ఇందు కు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు రాజకీయ పార్టీలు పూనుకోవాలి. కానీ, స్వల్పకాలిక ప్రయోజనాల కోసం అప్పులు ఎగవేయవలసింది గా ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.

ఆర్థిక క్రమశిక్షణ, డబ్బు విలువ తెలిసి వాడుకోవడం కూడా పౌరులకు అవసరమే. ఒకసారి అరాచకత్వం అలవాటు చేస్తే అది మొత్తం సమాజాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుం ది. ఎగవేయడం అంటూ అలవాటైతే, ప్రభుత్వాలకు కట్టే పన్నుల్ని కూడా ప్రజలు ఎగవేయడానికి ప్రయత్నిస్తారు.

గతంలో కరెంటు బిల్లుల విషయంలో ఇలాంటి అనుభవాలే ప్రభుత్వానికి ఎదురయ్యాయి. తీసుకు న్న అప్పులను ఎగవేయ డం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఆర్డినెన్సులో పొందుపరచిన నిబంధనలను పాటించేలా మైక్రోఫైనాన్స్ సంస్థలపై ఒత్తిడి తేవడంతో పాటు, ఎ.బి.ఎన్. ఏర్పాటు చేసిన సమావేశంలో అంగీకరించిన విధంగా 24 శాతానికే అప్పు లభించేలా చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య పరిష్కా రం అవుతుంది.

ఒకవేళ పేద ప్రజలకు అప్పుల బాధ నుంచి ఊరట కల్పించాలని రాజకీయ పార్టీలు భావించే పక్షంలో, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి మైక్రోఫైనాన్స్ సంస్థలకు లేదా బ్యాంకులకు గ్రాంటు రూపం లో నిధులు అందే ఏర్పాటుకు కృషి చేయాలి. అంతేగానీ తామే బాధ్యతా రాహిత్యంతో వ్యవహరిస్తూ, మొత్తం సమాజాన్ని కూడా బాధ్యతారహితంగా మార్చివేసే అధికారం ఏ రాజకీయ నాయకుడికీ లేదు. 

- ఆదిత్య


Thursday, October 28, 2010

ట్యాంక్ బండ్‌పై కొమురం భీమ్ * తెలంగాణ వాదుల ఒత్తిడికి దిగివచ్చిన ప్రభుత్వం

  హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై తెలంగాణ పోరాట వీరుడు కొమురం భీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణవాదుల ఒత్తిడికి దిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భీమ్ విగ్రహాన్ని సత్వరం ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో సాంస్కృతిక శాఖ పని ప్రారంభించింది. మొత్తం 30 లక్షల రూపాయల వ్యయంతో కొమురంభీమ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

విగ్రహస్థాపనకు స్థలం కేటాయించాల్సిందిగా హైదరాబాద్ గ్రేటర్ కమిషనర్‌కు లేఖ రాశామని రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక అధికారి కాంతారావు గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు.

Thursday, October 14, 2010

కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే ..........

మూడ్ మారిస్తేనే 'ఫ్రంట్'లో గద్దర్ కొత్త పలుకు

కె.సి.ఆర్. ఎక్కడ విఫలం అయ్యారో అక్కడే విజయం సాధించగలిగితే, తెలంగాణలో కూడా గద్దర్ ఫ్రంట్‌కు మద్దతు అమాంతం పెరుగుతుంది. కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే తెలంగాణవాదులు సహజంగానే ఆయనతో నడుస్తారు. అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు.

అదే సమయంలో, అసాధ్యం కూడా కాదు. ఈ విషయంలో గద్దర్ విజయం సాధించినా, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికలకు దూరంగా ఉండే పక్షంలో అది బలపడే అవకాశమే లేదు. ఎన్నికలలో పోటీ చేసి పదవులు పొందే అవకాశం లేనప్పుడు, ఎవరు మాత్రం ఆయనతో నడవడానికి ముందుకు వస్తారు!

రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత దిలాసాగా, కులాసాగా ఉన్న నాయకుడు మరొకరు లేరని గతవారం రాసిన వ్యాసం లో పేర్కొన్నాను. అయితే వారం తిరిగే సరికి పరిస్థితులు మారిపోయాయి. ప్రజా యుద్ధ నౌక గద్దర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఇప్పుడు కె.సి.ఆర్.కు పక్కలో బల్లెం లా తెర మీదకొచ్చింది.

అందుకే రాజకీయాల్లో ఇవ్వాళ ఉన్న ట్లు రేపు ఉండదని పేర్కొనడం జరిగింది. తెలంగాణ ప్రజాఫ్రంట్ నిజంగానే తెలంగాణ రాష్ట్ర సమితికి పోటీగా నిలదొక్కుకోగలుగుతుందా? గద్దర్ నాయకత్వానికి కె.సి.ఆర్. నేతృత్వాని కి లభించినంత ఆమోదం లభిస్తుందా? గద్దర్ ఫ్రంట్‌కు ప్రజల మద్దతు ఎంత మేరకు లభిస్తుంది? అసలు, ఈ ఫ్రంట్ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోంది? ఈ ఫ్రంట్ ఎన్నికల బరిలోకి దిగుతుందా? లేదా? మొదలైన సందేహాలు ఉండనే ఉన్నా యి.

అయినా గద్దర్ ఫ్రంట్ గురించి వ్యాఖ్యానించడానికి కె.సి.ఆర్.తో సహా టి.ఆర్.ఎస్. శ్రేణులు నిరాకరించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది గద్దర్ నేపథ్యం కాగా, దళిత - బి.సి. సంఘాల మద్దతు కొత్తగా ఏర్పాటయ్యే ఫ్రంట్‌కు ఉండే అవకాశం రెండవ కారణం. అటు మావోయిస్టులతోనూ, ఇటు దళిత-బి.సి.లతోనూ కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా లేనందునే గద్దర్ విషయంలో కె.సి.ఆర్. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతంలో ఇదే గద్దర్‌ను దుర్భాషలాడిన కె.సి.ఆర్., ఇప్పుడు వ్యాఖ్యానించడానికి కూడా నిరాకరిస్తున్నా రు. ఎంతటి వారినైనా పురుగును తీసేసినట్లు మాట్లాడే కె.సి.ఆర్., గద్దర్ విషయంలో వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు.

ఇంతకీ, గద్దర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రజాఫ్రంట్ హఠాత్తుగా పురుడు పోసుకోవడానికి, ఆ ఫ్రంట్‌కు మద్దతు పెరగడానికి కారణం ఏమిటి? కె. చంద్రశేఖర రావు ఒంటెత్తు పోకడలే ఈ పరిణామాలకు కారణమని చెప్పవచ్చు. తనకు మాత్రమే సాధ్యమైన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను చీల్చి చెండాడే కె.సి.ఆర్.లో పలు అవలక్షణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన ఘనత ఖచ్చితంగా కె.సి.ఆర్.కే దక్కుతుంది.

అయితే, ఈ క్రమంలో తనకు సహకరించిన పలువురితో ఆయన పలు సందర్భాలలో అమర్యాదకరంగా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. గద్దర్‌తో పాటు పలు ప్రజా సంఘాలు తమదైన శైలిలో తెలంగాణ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహించాయి. వాటన్నింటి ఫలి తం తెలంగాణ రాష్ట్ర సమితికి లభించడం వల్ల ఆ పార్టీ తెలంగాణకు ప్రాతినిధ్యం వహించే ఏకైక పార్టీగా అవతరించగా, తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయంగా కె.సి.ఆర్. ఎదిగారు.

అసలే అహంభావి అయిన కె.సి.ఆర్., ఈ క్రమంలో ఒంటెత్తు పోకడలకు తెర తీశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చేసినట్టేనన్న భావం కలిగిస్తూ, రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో ఏది జరగాలన్నా తన వల్ల మాత్రమే సాధ్యమన్న అభిప్రాయాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నించడం మొదలెట్టారు. అందు లో భాగంగానే వివిధ పరిశ్రమలకు చెందిన సి.ఇ.ఒ.లతో సమావేశం కూడా ఏర్పాటు చేశారు

అదే సమయంలో తెలంగాణ ఉద్యమం బలపడటానికి కారకులైన పలువురిని (గద్దర్ తో సహా) కలుపుకుపోవడానికి ప్రయత్నించకపోగా, అవమానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నే తెలంగాణ ప్రజాఫ్రంట్ పురుడు పోసుకుంది. తనను 'ఫుట్‌పాత్ గాడు' అని కె.సి.ఆర్. దూషించిన విషయాన్ని ఫ్రంట్ నాయకుడు గద్దర్ గుర్తు చేయడంతో పాటు, కాళ్ల క్రింద దుమ్మే కదా అని తీసి పారేస్తే కంట్లో పడి ఇబ్బంది పెడతామని చేసిన వ్యాఖ్య ఈ సందర్భంగా గమనార్హం.

గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ భవిష్యత్తు ఎలా ఉండబోతోం ది? ఆ ఫ్రంట్‌కున్న ప్లస్ పాయింట్లు - మైనస్ పాయింట్లు ఏమి టి అనే విషయంపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చర్చ జరుగుతోంది. మాములుగా అయితే, మావోయిస్టు ఉద్యమ నేప థ్యం ఉన్న గద్దర్‌కు ఇతర వర్గాల మద్దతు లభించకపోయి ఉండేది. కానీ, కె.సి.ఆర్. అరాచక ప్రవర్తనతో కినుక వహించి ఉన్న వివిధ వర్గాలకు చెందిన వారితోపాటు, పలువురు నాయకులు కూడా గద్దర్ విషయంలో ఆసక్తి చూపుతున్నారు.

ఇంతకాలం తమతో ఆడుకుంటూ వచ్చిన కె.సి.ఆర్.కు గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ ద్వారా చెక్ పెట్టవచ్చన్న ఆశతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం కూడా ఉన్నాయి. మాట్లాడటానికి కూడా అందుబాటులోకి రానంతగా అహం పెంచుకున్న కె.సి.ఆర్.కు చెక్ ఉండి తీరాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన పలువురు నాయకులు కూడా అభిప్రాయపడుతున్నా రు. కె.సి.ఆర్. వల్ల గానీ, టి.ఆర్.ఎస్. వల్ల గానీ ఇబ్బందులు పడుతున్న సీమాంధ్రకు చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా ప్రత్యామ్నాయ వేదిక లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అవసరమైతే, గద్దర్‌కు ఆర్థిక సహాయం చేయడానికి కూడా ఈ వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే, గద్దర్ నేతృత్వంలోని ఫ్రంట్ వల్ల తెలంగాణ ఏర్పాటు లక్ష్యాని కి విఘాతంకలిగే ప్రమాదం ఉంటుందని తెలంగాణవాదుల్లో ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఫ్రంట్ ఎన్నికల బరిలో నిలిస్తే తెలంగాణ కోరుకునే వారి ఓట్లు చీలిపోయి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు లాభపడే ప్రమాదం ఉందని ఈ వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఈ పరిస్థితు ల్లో తెలంగాణ వాదుల్లో వ్యక్తం అవుతున్న సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత గద్దర్‌పై ఉంది. అదే సమయంలో, తన నేతృత్వంలోని ఫ్రంట్‌కు జవసత్వాలు కూడగట్టాలంటే ఎన్నికల బరిలోకి దిగుతామని ప్రకటించక తప్పని స్థితి గద్దర్‌ది. ఎన్నికలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండే పక్షంలో ఫ్రంట్‌లో చేరడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. అంతేకాకుండా, ఫ్రంట్ చేప ట్టే ఉద్యమాల ఫలితం కూడా తెలంగా ణ రాష్ట్ర సమితి ఖాతాలోకే వెడుతుంది.

ఈ కారణంగా ఎన్నికలకు దూరమన్న నిర్ణయానికి గద్దర్ ఎంతోకాలం కట్టుబడి ఉండలేకపోవచ్చు. ఒకవేళ ఆ మాటకే కట్టుబడి ఉండే పక్షంలో కె.సి.ఆర్. నెత్తిన పాలు పోసినట్టే! ఈ కారణంగానే గద్దర్‌కు మద్దతు ప్రకటించిన ప్రజా సంఘాలు, ఇతర కుల సంఘాలు ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నాయి.

తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర ప్రజలు కూడా దాదాపు మానసికంగా సిద్ధపడిన పరిస్థితులలో ఆ ప్రాంత ప్రజలను (ఆంధ్రావాళ్లు దోపిడీ దారులు అని అనడం) దూషించడం ద్వారా కె.సి.ఆర్. పరిస్థితిని జటిలం చేశారన్న అభిప్రాయం ఆ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ను బలమైన శక్తిగా తీర్చి దిద్దాలంటే రెండు, మూడు విషయాలలో స్పష్టత ఏర్పరుచుకోవలసిన అవసరం గద్దర్‌కు ఉంది.

ఇందులో మొదటి ది... కె.సి.ఆర్. దురుసు ప్రవర్తన వల్ల తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా ప్రతిఘటిస్తున్న సీమాంధ్రకు చెందిన నాయకులను న్యూట్రల్‌గా మార్చడానికి ప్రయత్నించడం. సీమాంధ్రలో కూడా పర్యటిస్తానని గద్దర్ స్వయంగా ప్రకటించినందున ఈ దిశగా ఆయన కృషి చేసే అవకాశం ఉంది.

తెలంగాణ ఏర్పా టు జరిగితే హైదరాబాద్‌లో గానీ, జిల్లాలలో గానీ నివసిస్తు న్న సీమాం«ద్రులకు పూర్తి భద్రత ఉంటుందని హామీ ఇవ్వడం ద్వారా సీమాంధ్ర ప్రజల మద్దతు కూడ గట్టే అవకాశం గద్దర్ కు ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రాంత ప్రజలను ఒప్పించగలిగితే అది గద్దర్ సాధించిన గొప్ప విజయం అవుతుంది. కె.సి.ఆర్. ఎక్క డ విఫలం అయ్యారో అక్కడే విజయం సాధించగలిగితే, తెలంగాణలో కూడా గద్దర్ ఫ్రంట్‌కు మద్దతు అమాంతం పెరుగుతుంది. కె.సి.ఆర్. సాధించలేనిది గద్దర్ సాధిస్తే తెలంగాణవాదులు సహజంగానే ఆయనతో నడుస్తా రు.

అయితే, ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అదే సమయం లో, అసాధ్యం కూడా కాదు. ఈ విషయంలో గద్దర్ విజయం సాధించి నా, తెలంగాణ ప్రజాఫ్రంట్ ఎన్నికల కు దూరంగా ఉండే పక్షంలో అది బలపడే అవకాశమే లేదు. ఎన్నికల లో పోటీ చేసి పదవు లు పొందే అవకాశం లేనప్పుడు, ఎవరు మాత్రం ఆయనతో నడవడానికి ముందుకు వస్తారు! కేవలం ప్రజాసంఘాల మద్దతు మాత్రమే సరిపోదన్న వాస్తవాన్ని గద్దర్ గుర్తించాలి. అంతేకాకుండా, తాను మావోయిస్టు ల నీడలో ఉన్నాన నే ప్రజాభిప్రాయాన్ని కూడా తొలగించుకోవలసిన బాధ్యత గద్దర్‌పై ఉంది.

అలా జరగని పక్షంలో ఇతర వర్గాల మద్దతు ఆయనకు లభించే అవకాశం లేదు. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టులకు క్రింది వర్గాలలో ఆదరణ ఉండవచ్చు గానీ, పై వర్గాలలో ఆ పరిస్థితి లేదు. ఈ రెండు, మూడు విషయాలలో స్పష్టతతోపాటు దృఢచిత్తంగా గద్దర్ ముందుకు వెళ్లని పక్షంలో కొత్తగా ఏర్పాటైన ఫ్రంట్ వ్యవహా రం ముణ్ణాళ్ల ముచ్చటగా తయారవుతుంది. టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావుకు ప్రత్యామ్నాయంగా నిలిచి ఢీ అంటే ఢీ అనే స్థితికి ఎదగాలంటే బూర్జువా పార్టీలు (గద్దర్ భాషలో) అనుసరించే వ్యూహ ప్రతి వ్యూహాలను గద్దర్ కూడా అలవర్చుకోక తప్పదు.

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల స్పాన్సర్డ్ సంస్థ ఈ ఫ్రంట్ అని ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా టి.ఆర్.ఎస్. నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది కనుక, వారికి అటువంటి చాన్స్ ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత కూడా గద్దర్‌పై ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తే ముఖ్యమంత్రి కావాలన్న కోరిక గద్దర్‌కు మనస్సులో ఉందని కొంతకాలంగా వినిపిస్తోంది.

ఇదే నిజమైతే, తెలంగా ణ ఏర్పాటైతే దళితుడైన గద్దర్‌నే ముఖ్యమంత్రిగా అంగీకరిస్తామని టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి వ్యూహ రచన చేయడంలో ఆయన దిట్ట కను క, గద్దర్‌ను ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించి తెలంగాణ ప్రజాఫ్రంట్ ను కూడా తన అనుబంధ సంస్థగా మార్చుకోవడానికి కె.సి.ఆర్. ప్రయత్నించే అవకాశాలు లేక పోలేదు.

తెలంగాణ ప్రజాఫ్రంట్ భవిష్యత్తు ఎలా ఉంటుంది? కె.సి.ఆర్.కు చెక్ పెట్టే పరిస్థితి ఉంటుందా? లేదా? అన్న విషయం ప్రక్కన పెడితే, గురువారం నాడు రాష్ట్రం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. పేదల కోసం నిరంతరం తపన పడిన రిటైర్డు ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్.ఆర్.శంకరన్ కన్ను మూయడంతో దిక్కులేని వారికి మరో దిక్కు లేకుండా పోయింది. ఇవ్వాళ్టి ఐ.ఎ.ఎస్. అధికారులతో పోల్చుకుంటే శంకరన్ జీవనశైలి గానీ, సర్వీసులో ఉన్నపుడు పని చేసిన తీరు గానీ, నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంది.

లక్ష్య సాధనలో అడ్డు ఉండకూడదనే సంకల్పంతో ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన శంకరన్, ఐ.ఎ.ఎస్.లకు రోల్ మోడల్‌గా నిలిచారు. కానీ, దురదృష్టవశాత్తు అధికారంలో ఉన్నవారి ప్రాపకం సంపాదించి కీలక పోస్టులు పొందడం, ఆ తర్వాత రెండు చేతు లా సంపాదించడానికి అలవాటు పడిన వారు ప్రస్తుత ఐ.ఎ.ఎస్. అధికారులలో పలువురు ఉన్నారు. వారెవరికీ శంకరన్ భౌతిక కాయాన్ని దర్శించి నివాళులు అర్పించే తీరిక కూడా లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి

. శంకరన్ వంటి వ్యక్తులు ప్రజా సంఘాలకు మాత్రమే పరిమితం కాదు. తమ కోసం నిజాయితీగా జీవించిన అధికారికి నివాళులు అర్పించవలసిన బాధ్యత పౌరులందరిపైనా ఉంటుంది. అలా చేయగలిగితేనే, శంకరన్ వంటి వాళ్లు మనకు మళ్లీ మళ్లీ పుట్టు కు వస్తారు. లేకపోతే నేటి కుక్క మూతి పిందెలే మిగులుతా యి. శంకరన్ సిద్ధాంతాలతో అందరూ ఏకీభవించవలసిన అవసరం లేదు. కానీ, ఆయన జీవితం మాత్రం ప్రతి ఒక్కరికీ ఆద ర్శం కావాలి.

ఆయన వలె జీవించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, అలాంటి వారిని ఆరాధించి గౌరవించడం మన కనీస బాధ్యత. మానవ హక్కుల వేదిక కన్వీనర్ బాలగోపాల్ చనిపోయి సంవత్సరం గడిచిపోయింది. ఆయన వర్ధంతి కి సరిగ్గా ఒకరోజు ముందు శంకరన్ కన్ను మూశారు. ఇలా మనకు మిగిలిన అతి కొద్ది మంది ఆదర్శమూర్తులు వెళ్లిపోవ డం బాధాకరం. జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన బాలగోపాల్, శంకరన్ వంటి వాళ్లు పైలోకంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు గానీ, ఇక్కడ దిక్కులేని వారికి దిక్కులేకుండా పోయిందే!

అన్నింటికంటే బాధాకరం ఏమిటంటే.. ఈ ఇద్దరు మహనీయుల పట్ల సమాజం స్పందించిన తీరు. శంకరన్ అంతిమ యాత్ర అతి సాదాసీదాగా సాగిపోయింది. బాలగోపాల్ ప్రథమ వర్ధంతి కేవలం ప్రజా సంఘాలు లేదా అలాం టి భావజాలం ఉన్న కొద్దిమంది వ్యక్తులకే పరిమితం అయిం ది.

ప్రజల సంపదను అడ్డంగా, నిలువుగా దోచుకుతింటున్న నాయకుల కోసం కొట్టుకు చచ్చే వాళ్లు ఉన్నంత కాలం ఇంతకంటే భిన్నమైన వాతావరణాన్ని ఊహించలేం. అవినీతిపరులకు జేజేలు పలికే వారు బాలగోపాల్, శంకరన్ వంటి వాళ్లను గుండెల్లో పెట్టుకోవాలని ఆశించడం అత్యాశే అవుతుంది. 

-ఆదిత్య


Tuesday, October 5, 2010

బడుగుల ఉద్యమాలతో... పార్టీల్లో వణుకు !

Gaddar-final
రాష్ట్ర రాజకీయాలపై కొన్ని దశాబ్దాల నుంచి పెత్తనం సాగిస్తోన్న అగ్రకుల రాజకీయ పార్టీల పట్టు చేజారిపోయే పరిస్థితి మొదలయింది. రెడ్డి-కమ్మ-వెలమ-కాపు కులాలు సాగిస్తున్న రాజకీయాలకు బడుగు బలహీన వర్గాలు సమిథలుగా మారుతున్నారు. ఓట్లుమావి-సీట్లు మీవా అని నినదించే స్థాయికి ఎదిగిన బడుగు వర్గాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి, ఉద్యమాలను తమ చేతులోకి తీసుకోవడం ప్రారంభించడంతో అగ్రకుల స్వభావం ఉన్న అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో వణుకు ఆరంభమయింది. తాజాగా గద్దర్‌ ప్రారంభించిన తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ఆవిర్భావంతో అగ్రకుల పార్టీల్లో భయాందోళనతో కూడిన ఆత్మరక్షణ కనిపిస్తోంది.

జనాభాలో 85 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలను ఇప్పటిదాకా తమ ఓటు బ్యాంకులుగానే పరిగణిస్తూ, వారికి చిన్న చిన్న తాయిలాలు ఇస్తూ.. వారి పేరిట వచ్చిన రాజ్యాధికారాన్ని మాత్రం తామే అనుభవిస్తున్న అగ్రకుల పార్టీలు.. చివరకు బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల నుంచి పుట్టిన ఉద్యమాలను సైతం తమకు అనుకూలంగా మార్చుకుని, దానిని అడ్డుపెట్టుకుని రాజకీయ పరమపదసోపానంలో నిచ్చెనలు ఎక్కేయాలన్న కుట్రలు పన్నుతున్న వైనాన్ని ఎట్టకేలకూ బడుగు వర్గాలు గ్రహించాయి. అగ్రకుల పార్టీలకు ఇప్పటివరకూ ప్రత్యామ్నాయం లేకపోవడంతో వారి నిర్ణయాలే శిలాశాసన ంలా మారిన పరిస్థితిలో మార్పు వచ్చి, బడుగులే సొంతంగాఎదిగేందుకు వేదికలు సిద్ధం కావడం అగ్రకుల పార్టీలను బేజారెత్తిస్తున్నాయి.

ప్రధానంగా.. తెలంగాణలో కేవలం ఒక్క శాతమే ఉన్న వెలమల నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ చుట్టూ రాజకీయాలతో పాటు, తెలంగాణ ఉద్యమం కూడా పరిభ్రమిస్తోందన్న అసంతృప్తి, ఆగ్రహం బడుగు బలహీనవర్గాల్లో చాలాకాలం నుంచి ఉంది. అయితే, బడుగు సంఘాల్లో ఉన్న అనైక్యత, వాటికి నేతృత్వం వహిస్తోన్న నేతల వ్యక్తిగత బలహీనతల వల్ల తెలంగాణ ఉద్యమం ఇప్పటివరకూ వెలమ దొరల చుట్టూనే తిరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ ప్రారంభిం చడం, దానికి దళిత నేత మందకృష్ణ మాదిగ సహా బీసీ నేతలంతా మద్దతు పలకడంతో టీఆర్‌ఎస్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దానికితోడు బీసీ సంఘా లన్నీ కలసి జేఏసీలుగా ఏర్పడ్డాయి. బీసీ సంఘాలు ఇప్పటికే కేసీఆర్‌పై విమర్శ నాస్త్రాలు ఎక్కువపెడుతున్నాయి.

దళితుడిని సీఎం, మైనారిటీని డిప్యూటీ సీఎం గా చేస్తానన్న కేసీఆర్‌.. జనాభాలో 65 శాతం ఉన్న బీసీల గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడకపోవడం వారిని ఆగ్రహావేశాలకు గురిచేసింది. మరోవైపు దళిత కార్డును అడ్డుపెట్టుకుని దళితులను తన వైపు ఆకర్షించాలన్న కేసీఆర్‌ ఎత్తుగడ కూడా వికటించింది. దళిత నేత మందకృష్ణమాదిగ వంటి వారూ ఆయనకూ దూరమయ్యారు. ఇక మొన్నటి వరకూ కేసీఆర్‌ మాట జవదాటని విద్యార్థులు కూడా ఆయనకు దూరమయ్యారు. దిష్టిబొమ్మలు తగులబెట్టే వర కూ వెళ్లారు. బడుగు విద్యార్థులు సైతం గద్దర్‌ ఫ్రంట్‌కు ఆకర్షితులవుతున్నారు. కవిత కోటి బతుకమ్మ జాతరను ఆపాలంటూ ఓయు జేఏసీ పిలుపునిచ్చే వరకూ వెళ్లారు. సీమాంధ్ర సీఈఓలతో కేసీఆర్‌ భేటీ సగటు తెలంగాణవాది హృద యాన్ని కోలుకోలేనంతగా గాయపరిచింది. ఇది టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థులకు ఊత మిచ్చినట్టయింది. అటు కేసీఆర్‌ మానసిక స్థైర్యం పైనా దెబ్బపడింది.

తెలంగాణలో గద్దర్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేయటంతో ఇప్పటివరకూ ప్రత్యా మ్నాయం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కొండంత ధైర్యం వచ్చినట్ట యింది. ఈ ఫ్రంట్‌ ద్వారా రాజ్యాధికారం సాధించాలన్న కాంక్ష మరింత బలపడింది. గద్దర్‌ సారధ్యంలో ఏర్పడే ఫ్రంట్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గొడుగుగా ఉంటుందన్న భావన మొదలయింది. తెలంగాణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్న గద్దర్‌, కృష్ణమాదిగ వంటి ప్రజాకర్షణ నేతలు వేదిక పంచుకుంటే తెలంగాణలో వెలమ పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌-రెడ్డి పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ బలహీనమవక తప్పదన్న అంచనా ఆరంభమయింది. ఈ శక్తులన్నీ కలిస్తే తెలంగాణలో బడుగు వర్గాలకే రాజ్యాధికారం వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. గద్దర్‌ ఫ్రంట్‌పై కేసీఆర్‌ పెదవి విప్పకపోవడం చూస్తే ఆ పార్టీ ఏ స్థాయిలో ఆత్మరక్షణలో ఉందో స్పష్టమవుతోంది. గద్దర్‌ ఫ్రంట్‌ తర్వాత బడుగు బలహీనవర్గాలతో పాటు, సాంస్కృతిక, విద్యార్థి శక్తులు కూడా ఏకమవుతున్నారు.

ఇక సీమాంధ్రలో కమ్మ పార్టీగా పేరున్న తెలుగుదేశం పార్టీ పైనా ఈ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్దర్‌ సీమాంధ్రలో కూడా పర్యటిస్తానని చెప్పడమే దానికి కారణం. సీమాంధ్రలో కూడా ఇమేజ్‌ ఉన్న గద్దర్‌, మందకృష్ణ మాదిగతో పాటు అక్కడున్న బీసీ నేతలు కూడా ఏకమవుతే అక్కడ టీడీపీకి గండిపడే ప్రమాదం లేకపోలేదంటున్నారు. సీమాంధ్రలో మాలలు, తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున.. వారితో బీసీలు కలిస్తే ఇక అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలోనూ బడుగుల రాజ్యాధి కారమే వస్తుందన్న ఆశలు, అంచనాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ తన బీసీ విధానాలకు దూరమయి, పారిశ్రామికవేత్తలకే పెద్ద పీట వేస్తుండటం, రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి నామినేటెడ్‌ పదవుల్లో సైతం వారికే ప్రోత్సాహం ఇవ్వడం, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన పక్కన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలతో బీసీలు వెనక్కి తగ్గుతున్నారు. తెలంగాణలో వెలమ-రెడ్డి; సీమాంధ్రలో కమ్మ-రెడ్లను ఎక్కువగా ప్రోత్సహిస్తుండటంతో బీసీలు అసంతృప్తితో ఉన్నారు. అయినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో మౌనంగా ఉన్నారు.

ఇప్పుడు బీసీలు ప్రత్యామ్నాయంగా తెరపైకొచ్చిన గద్దర్‌ ఫ్రంట్‌ వైపు ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ-ఆంధ్రలో దళిత-బీసీలు కలసి రాజ్యాధికారంలో పాలుపంచుకునే దిశగా తాజా రాజకీయ పరిణామాలు మారుతున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటిపై వస్తున్న విమర్శలను గ్రహించిన తెలుగుదేశం పార్టీ ఇటీవలి కాలంలో తన వ్యూహం మార్చుకుని, రెడ్డి-వెలమ నేతలు కాకుండా తెలంగాణలో బీసీ, దళిత శక్తులనే తెరపైకి తీసుకురావలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

కేవలం కోస్తాకే పరిమితమయిన పీఆర్పీపైనా తాజా రాజకీయ పరిణామాలు ప్రభావం చూపనున్నాయి. కాపు పార్టీగా ముద్ర ఉన్న పీఆర్పీ ఇంకా ఆ ముద్రను తొలగించుకోవడంలో విఫలమవుతోంది. పైగా.. కాపులను వ్యతిరేకించే బీసీ-దళిత శక్తులన్నీ తాజా రాజకీయ సమీకరణలో భాగంగా ఒక్క తాటిపైకి రానుండటం కూడా పీఆర్పీని వణికిస్తోంది. కోస్తాలో వారి మధ్య తరచూ సామాజిక సమరం జరుగుతూనే ఉంటుంది. సామాజిక తెలంగాణ నినాదం తిరగబడిన ఫలితంగా.. ఆ పార్టీకి చెందిన బడుగు వర్గాలంతా టీడీపీ, కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లో చేరాయి. అటు కోస్తాలో కూడా కళావెంకట్రావు, తమ్మినేని సీతారాం వంటి బీసీనేతంతా టీడీపీ గూటికి చేరిపోయారు.

గద్దర్‌ ఫ్రంట్‌తో పాటు.. కొత్తగా తెరపైకి రానున్న మరికొన్ని సామాజిక శక్తుల ఫ్రంటులు, సంస్థలు అదే ఊపులో అటు సీమాంధ్రలో కూడా బడుగుల పునరేకీకరణకు సమాయత్తమవుతున్నారు. వారికి గద్దర్‌ ఫ్రంట్‌ స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రం విడిపోయినా పెత్తనం కమ్మ-రెడ్డి-కాపుల చేతిలోకి వెళ్లకుండా రాజ్యాధికారం కోసం ఇప్పటినుంచే పోరాటం మొదలుపెడు తున్నారు. ఈ పరిణామాలే ఇప్పుడు అగ్రకుల పార్టీలుగా ముద్ర ఉన్న కాంగ్రెస్‌-టిడిపి, టీఆర్‌ఎస్‌, పీఆర్పీలకు వణుకు పుట్టిస్తున్నాయి. 85 శాతం ఉన్న బడుగుల్లో సామాజిక-రాజకీయ చైతన్యం పెరిగి, తామే అధికారంలోకి రావాలన్న ఆకాంక్ష బలపడితే.. ఇక కేవలం జనాభాలో 15 శాతమే ఉన్న తమకు, తమ కులానికి చెందిన వారే మిగులుతారన్న భయాందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రజాసంఘాల గర్జన
netallu
ఇక మలివిడత ఉద్యమానికి ప్రజా సంఘాలు సిద్దమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో ఇప్పటివరకు ప్రధానపాత్ర పోషించిన ప్రజాసంఘాలు ఈసారి ఉద్యమానికి నాయ కత్వం వహించాలని భావిస్తోంది. సామాజిక తెలంగాణ కావాలని భావిస్తున్న ప్రజా సంఘాలు ఆ దిశగా అన్ని బడుగు వర్గాలను ఏకం చేచే దిశగా అడుగులు వేస్తుంది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21నహైదరాబాద్‌లో ‘గిరిజన గర్జన’ డిసెంబర్‌ 3న హైదరాబాద్‌లో దళిత గర్జన, డిసెంబర్‌ 26న వరంగల్‌లో బిసి గర్జన, మైనారిటీ గర్జనలు చేపట్ట నున్నట్లు ప్రజా సంఘాల జేఏసీ ఉపాధ్యక్షులు బెల్లయ్యనాయక్‌ తెలిపిరు.

ఈ గర్జలనుల ముగిసిన తర్వాత అన్ని బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలతో జన వరి మొదటి వారంలో 2 లక్షల మందితో హైద్రాబాద్‌లో ‘ప్రజా యుద్దబేరి’ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభలోనే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రంప ఒత్తిడి పెంచేలా కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. అన్ని వర్గాలను ఉద్యమం లో భాగస్వాములు చేస్తామని తెలి పారు. గిరిజనుల్లోని 33తెగలు, ఎస్సీల్లోని 59 తెగలు, మైనార్టీల్లోని 8 వర్గాలు అందరూ భాగస్వాముల అయ్యే విధంగా ప్రచారం చేస్తామని బెల్లయ్యనాయక్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బడుగులు రాజ్యాధికారం చేపట్టటానికి ఈ మళి విడత ఉద్యమం నాంధి అవుతుందన్నారు.