Wednesday, July 11, 2012

దేవుడు జడ్జి

"ధనాని భూమై పశువష్టి గోష్టే...భార్యాగృహ ర్వారే సుతా స్మశానే జనాని భూమే. ధర్మాను గోగచ్ఛతి జీవేక అనే శ్లోకానికి అర్థం ఏమిటంటే ..ధనము భూమిలో ఉండిపోతుంది. పశువులు కొట్టంలో ఉండిపోతాయి. భార్య గుమ్మందాక వస్తుంది. కొడుకు స్మశానం దాకా వస్తాడు.. జనం కూడా స్మశానం వరకే వస్తారు. ధర్మం ఒక్కటే జీవుడితో వచ్చేది'' ఈ తాత్పర్యమే నేను ఆచరిస్తాను అంటారు రిటైర్ట్ న్యాయమూర్తి చేకూరి వెంకట సూర్యనారాయణరాజు.. 
ఈ పేరు ఎక్కువమందికి తెలీకపోవచ్చు కాని దేవుడు జడ్జి అంటే మాత్రం ఓ ఆయనా అంటారు. న్యాయశాఖలో 33 ఏళ్ల అనుభవం ఆయనది. అందులో జడ్జిగా 17 ఏళ్లు. అప్పటి తీర్పులకే దేవుడు జడ్జిగా పేరు పొందారు. దీని వెనుక ఎంతటి త్యాగం, నైతిక విలువలు, పోరాటాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. 15 ఏళ్ళ క్రితమే పదవీ విరమణ చేసినప్పటికీ, అనంతర జీవనం కూడా సమాజ సేవకే అంకితమవ్వడం ఆయన గొప్పతనం.

ఓ న్యాయమూర్తి పనిచేసే కోర్టుకు ధర్మరాజు కోర్టుగా పేరు రావడమంటే మాటలు కాదు. శిక్షలు, జరిమానాలు విధించే ముందు ఆయన కక్షిదారుల పట్ల కనికరం చూపించడమే అందుకు కారణం. కక్షిదారుల పరిస్థితులను సమగ్రంగా పరిశీలించేవారు. విశాఖపట్టణం పోర్టులో మున్సిఫ్ మేజిస్ట్రేట్‌గా పనిచేసినపుడు అవసరమైతే కక్షిదారుల నివాసాలకు వెళ్ళి కుటుంబ సభ్యులతో ఇంటి పరిస్థితుల గురించి చర్చించేవారు. ఆ తర్వాతే వారికి శిక్ష ఖరారు చేసేవారు. ఆ శిక్ష ఎంతో ఎంతో న్యాయంగా ఉండేది. అలా చేస్తాడనే ఆయన పనిచేసిన కోర్టు ధర్మరాజు కోర్టుగా పేరు పొందింది. ఈ శైలి లాయర్లలో, తోటి న్యాయమూర్తులలో చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ కక్షిదారులు మాత్రం చాలా ఆనందించేవారు.

దేవుడు జడ్జి ఎలా అయ్యారంటే.....

శిక్షకు గురైనవారు జరిమానా చెల్లించలేకపోతే తనే ఒక్కొక్కసారి ఆ డబ్బును ప్రభుత్వ ఖాతాలో జమచేసేవారు. ఒక్కొక్కసారి డబ్బు సాయం కూడా అందించి కక్షలు పెంచుకోవద్దంటూ సలహాలు ఇచ్చేవారు. శిక్షలు కూడా నెల నుంచి 15 రోజులలోపు మాత్రమే విధించేవారు. ఈ విషయంలో తన ధోరణిని ఏమాత్రం మార్చుకునేవారు కాదు. ఆయన విశాఖపట్టణంలో పనిచేసినపుడు ఎక్కువగా రైల్వే కేసులు చూసే వారు. అక్కడ బొగ్గు చోరీ కేసులు, టిక్కెట్టు లేకుండా ప్రయాణం చేసిన కేసులు ఎక్కువగా వచ్చేవి.

మామూలుగా రైల్వే బొగ్గు దొంగతనం కేసుల్లో దొంగతనం చిన్నదైనా, పెద్దదైనా శిక్ష మాత్రం ఒకటే ఉండేది. ఆరు నెలల నుంచి ఏడాది వరకూ జైలు శిక్ష వేసేవాళ్లు. ఒకసారి తట్ట బొగ్గు దొంగతనం చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అదే సమయంలో ఒక లారీ బొగ్గు పట్టుకుపోతూ మరో దొంగ కూడా దొరికాడు. చట్టప్రకారం అయితే వీరిద్దరికీ ఒకే శిక్ష వేయాలి. కాని రాజుగారు తట్ట బొగ్గు దొంగతనం చేసిన వ్యక్తికి నెల రోజులు జైలు శిక్ష వేసి, లారీలోడు బొగ్గుల దొంగకు ఆరెనెలలు వేశారు.

మొదటి దొంగ కట్టాల్సిన జరిమానా తనే కట్టారు. తీర్పు హైకోర్టు న్యాయమూర్తి దృష్టికి వెళ్లినపుడు 'చట్టాన్ని అతిక్రమించి సొంత తీర్పులు ఇవ్వడం కుదరద'ని ఆయన హెచ్చరించారు. చిన్నదొంగను, పెద్ద దొంగను ఒకే గాటన కట్టకూడదు కదా అంటూ ఆయన దానికి వివరణ ఇచ్చుకున్నారు. రైల్వే టిక్కెట్టు కొనకుండా ప్రయాణం చేసిన వారికి, ఆటోలు, రిక్షాలు రాంగ్ పార్కింగ్ చేసేవారితో ఆరు వందల నుంచి రెండు వేల వరకూ జరిమానా కట్టించుకుంటారు. ఇలాంటి కేసుల్లో పేదవారంటే వారితో రెండు రూపాయలే కట్టించేవారు. దీంతో పేదవాళ్లపాలిట దేవుడిగా మారారాయన.

ఇంటికెళ్లిన న్యాయం...
ఒకసారి వైజాగ్‌లో ఇద్దరన్నదమ్ములు ఇంటి ప్రహరీగోడ విషయంలో గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టులో న్యాయమూర్తి ముందు నిలబడి నీది తప్పంటే నీది తప్పంటూ వాదించుకున్నారు. రాజుగారు కేసు వాయిదా వేసి మర్నాడు ఆ ఇద్దరన్నదమ్ముల ఇళ్లకు వెళ్లారు. రెండు కుటుంబాలను కూర్చోబెట్టి మాట్లాడారు. జడ్జీగారే స్వయంగా ఇంటికి వచ్చి సమస్య గురించి మాట్లాడడం చూసి వారంతా షాకయ్యారు.

అన్ని విషయాలను తెలుసుకున్నాక ఎవరు గోడ ఎక్కడ కట్టుకోవాలో ఆయనే స్వయంగా చెప్పి వచ్చారు. ఈ పెద్దాయన సలహాలు, ఆయన చెప్పిన న్యాయం ఆ ఇద్దరన్నదమ్ములకి నచ్చి ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. ఇలాంటి కేసులు ఒకటీ రెండూ కాదు వందల సంఖ్యలో పరిష్కరించారాయన. రాజమండ్రిలో న్యాయమూర్తిగా పనిచేసేటప్పుడు దశాబ్ద్దాలుగా పెండింగ్‌లో ఉన్న 2200 కేసుల్ని రెండేళ్లలో పరిష్కరించి న్యాయశాఖ ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా పొందారు. ఏ కోర్టులో ఉన్నా ఆయన ఇదే ధోరణి అవలంబించేవారు.

సేవా జీవితం...

దేవుడు జడ్జికి కబడ్డి అంటే ఎంతో ఇష్టం. కాలేజి చదువు నుంచే ఎన్నో పోటీల్లో పాల్గొనే వాడినని చెప్పారు. న్యాయశాఖలో ఉద్యోగిగా ఉండి కూడా కబడ్డీ ఆడి రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా పేరు తెచ్చుకున్నారు. రిటైర్ అయినా ఆటపై మక్కువ పోలేదు అంటారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలు ఆపలేదు. తనకు వచ్చే రూ.30 వేల పింఛను సొమ్ములో కొంత భాగాన్ని పేదలు కోసం కేటాయిస్తూనే ఉన్నారు. ఆధ్యాత్మికంగా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.


- వరప్రసాద్, ఆన్‌లైన్,భీమవరం