Saturday, July 7, 2012

ఇవేం కొద్ది బుద్ధులు

పోయినోళ్లంతా మంచివాళ్లే -ఇది మనకు మన పెద్దలు నేర్పిన సంస్కారం. అయితే ఇప్పుడు మనం ఈ సంస్కారాన్ని వదిలి కుసంస్కారానికి అలవాటు పడుతున్నాం. దశాబ్దాలుగా మహనీయులుగా గుర్తింపు పొంది, జాతి గౌరవం పొందిన ఆదర్శమూర్తులకు కూడా కళంకం అంటించడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. చరిత్రలో మహనీయులుగా కీర్తించబడిన వారికి కూడా ఏవో కొన్ని వ్యక్తిగత బలహీనతలు, జీవించి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలలో అప్పుడప్పుడు అపశ్రుతులు దొర్లి ఉండవచ్చు. చిన్ని చిన్ని లోపాలను ఎత్తి చూపకుండా ఆయా మహానుభావులు జాతికి చేసిన సేవలను గుర్తించి గౌరవించడం మన బాధ్యత. ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయా వ్యక్తులను వివాదాస్పదం చేయడం ఒక ఘనకార్యంగా చలామణి అవుతోంది.

సి.పి.ఎం. రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు అన్నట్టు ఒక వ్యక్తి గొప్పవాడుగా కీర్తించబడటానికి ఎన్నో త్యాగాలు చేసి ఉండాలి. గొప్పవాళ్లను పలుచన చేయడం ద్వారా తాము కూడా గొప్పవాళ్లం అని అనిపించుకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వ్యక్తులు సఫలం అవుతూ ఉంటారు కూడా. అంత మాత్రాన ఇంతకాలం మనం పూజించిన మహనీయులకు వచ్చిన నష్టమేమీ ఉండదు. ఇలాంటి ప్రయత్నాలు చేయడం మనల్ని మనం కించపరచుకోవడమే అవుతుంది.

ఇదేదో కొత్తగా ఇప్పుడే ప్రారంభం కాలేదు. లబ్ధప్రతిష్ఠులలో లోపాలు వెతికేవారు ఎప్పుడూ ఉండనే ఉంటారు. అయితే గతంలో ఇలాంటి చర్యలకు ప్రాచుర్యం లభించేది కాదు. ఇప్పుడు ప్రసార మాధ్యమాల ప్రభావం అధికం కావడంతో గొప్పవాళ్లతో పాటు వారిని నిందించే వారికి కూడా ప్రచారం లభిస్తోంది. నిజానికి లోపాలు వెతకడం ప్రారంభిస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది.

అంతదాకా ఎందుకు - దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఉన్నట్టుగానే, లేడని నమ్మేవారు కూడా ఉన్నారు కదా! గిరిపుత్రుల జీవితాలలో వెలుగు నింపడానికి బ్రిటిష్‌వారితో పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి కూడా బర్ల వెంకటరావు అనే అతను తన వ్యాసంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివంగత పి.వి.నరసింహారావును కూడా వివాదాల్లోకి లాగుతూ పుస్తకాలు వస్తున్నాయి. ఇవన్నీ చరిత్రలో మరో కోణం చూపడానికి పనికి వస్తాయేమో గానీ, సమాజానికి మరే విధంగానూ ఉపయోగపడవు. పి.వి.కి తెలిసే బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిందని ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు ఈ విషయంలో కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. పి.వి. ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన సారథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన 'మా వాడు' కాదు అన్నట్టు వ్యవహరిస్తోంది. అయినా పి.వి.ని దోషిగా చిత్రీకరించడం వల్ల ఆయన చేసిన మంచి పనులు మరుగున పడిపోవు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తరుణంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పి.వి. సొంతం. ఆనాటి పరిస్థితులలో ఆర్థిక సంస్కరణలు తప్ప మరో మార్గం కనిపించి ఉండకపోవచ్చు! అయితే కాలక్రమంలో విధానాలలో మార్పులు చోటుచేసుకోవడం సహజం.

సమాజానికి ఇవ్వాళ మంచి చేసిన విధానాలు, రేపు చెడు చేసేవిగా మారవచ్చు. ఇందుకు ఏ 'ఇజం' కూడా అతీతం కాదు. చైనాలాంటి దేశంలోనే కమ్యూనిస్టులు తమ విధానాలలో ఎన్నో మార్పులు చేసుకుంటూ రావడం వల్లనే ఇప్పటికీ అక్కడ కమ్యూనిజం మనగలుగుతోంది. అలాగే పి.వి.నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలలో మార్పులు చేసుకోవలసిన బాధ్యత తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులదే అవుతుంది. ఆర్థిక సంస్కరణల వల్ల ఏవైనా ప్రతికూల ఫలితాలు వస్తున్నాయంటే అందుకు వాటిని ప్రారంభించిన పి.వి.ని తప్పుబట్టే బదులు, ఆయా విధానాలలో మార్పులు చేయకుండా గుడ్డిగా అనుసరించిన తదుపరి పాలకులనే నిందించాలి.

అలాగే బాబ్రీ మసీదు వ్యవహారం ముగిసిపోయిన అధ్యాయం. మసీదు కూల్చివేతకు పి.వి.ని బాధ్యుడిని చేసినా, చేయకపోయినా ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు ఏమీ ఉండదు. ఆయన కీర్తిశేషుడై చాలా కాలమైంది. ఆయన వారసులు ఎవరూ అధికారంలో లేరు. అయినా ఈ అంశాన్ని ఇప్పుడు రాజకీయం చేయడానికి ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తే అది వారి కుసంస్కారానికి నిదర్శనం. పి.వి.ని కాంగ్రెస్ పార్టీనే సొంతం చేసుకోనప్పుడు ఈ అంశాన్ని రాజకీయం చేయడం వల్ల ఏ పార్టీకైనా వచ్చే ప్రయోజనం ఏమిటి?

ఇక వ్యక్తిగత విషయాలకొస్తే ఆయా రంగాలలో లబ్ధప్రతిష్ఠులైన వారిలో ఏదో ఒక బలహీనత ఉండే అవకాశమే ఎక్కువ. అయితే సమాజ విశాల ప్రయోజనాల కోసం వారు చేసిన సేవలను జాతి గుర్తుపెట్టుకుంటుందే గానీ వ్యక్తిగత అంశాలను ఏనాడూ పట్టించుకోలేదు. పట్టించుకోదు. ఉదాహరణకు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూనే తీసుకుందాం. ఆయనకు లేడీ మౌంట్‌బాటన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండేవని ప్రచారం జరిగింది. అయినా భారత తొలి ప్రధానిగా నెహ్రూ దేశానికి చేసిన సేవలనే జాతి గుర్తుంచుకుంది. జాతిపిత మహాత్మాగాంధీకి కూడా వ్యక్తిగత బలహీనతలు ఉన్నాయని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.

అయినా ఈ దేశ ప్రజలే కాదు- ప్రపంచమే వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం సముపార్జించి పెట్టిన మహానుభావుడిగానే మనం ఆయనను స్మరించుకుంటూ గౌరవిస్తున్నాం. అయితే దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇంతకాలం జాతి మొత్తం పూజించిన మహనీయులను కొందరివాళ్లుగా కుదించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహాత్మాగాంధీ విగ్రహాలకు అపచారం జరిగితే ఆర్య వైశ్యులు మాత్రమే స్పందిస్తున్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు దళితవాడలకే పరిమితం అవుతున్నాయి.

ఆయన విగ్రహాలను ధ్వంసం చేస్తే దళితులు మాత్రమే ఆందోళన చేస్తున్నారు. మన్యం వీరుడిగా కీర్తించబడిన అల్లూరి సీతారామరాజును సొంతం చేసుకోవడానికి ఇప్పుడు క్షత్రియులు ఆరాటపడుతున్నారు. ఇలా అందరివాళ్లను కొందరివాళ్లుగా కుదించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ ప్రతిఘటించవలసిన అవసరం ఉంది. పి.వి.నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల లాభపడింది, నష్టపోయింది బ్రాహ్మణులు మాత్రమే కాదు. అయినా పి.వి.ని బ్రాహ్మణులకే పరిమితం చేస్తున్నారు. విద్యాబుద్ధులతో వికసించవలసిన మన మనస్సులు ఇలా కుదించుకుపోవడానికి కారణాలను అన్వేషించవలసిన తరుణం ఆసన్నమైంది.

ప్రతి విషయాన్నీ రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలన్న ధోరణి రాజకీయ పార్టీలలో పెరిగిపోవడం వల్ల దాని ప్రభావం సమాజంపై పడింది. ఫలితంగానే మనం కులాలు, మతాలు, ప్రాంతాలవారీగా విడిపోతున్నాం. అల్లూరి సీతారామరాజు 115వ జయంతి ఉత్సవాలు రెండు రోజుల క్రితమే జరిగాయి. అల్లూరి స్మారక సేవా సమితి ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి భీమవరం వెళ్లిన నన్ను, కొంత మంది రాజుల కుర్రాళ్లు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. భీమవరంలో రైలు దిగిన నాకు ఈ పరిణామం తెలిసి ఆశ్చర్యం వేసింది. అల్లూరి సీతారామరాజును కించపరిచే విధంగా 'ఆంధ్రజ్యోతి' పత్రికలో బర్ల వెంకటరావు అనే అతను రాసిన వ్యాసాన్ని ప్రచురించినందుకు నిరసన తెలుపుతున్నట్టు సదరు యువకులు ప్రకటించారు.

వాస్తవానికి నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవారిలో అత్యధికులు పత్రికలే చదవరు. అందునా ఎడిట్ పేజీలో వచ్చిన వ్యాసాలను చదివే అలవాటు ఎంత మందికి ఉంటుంది? అయినా ఎవరో రాసిన వ్యాసానికి నాకు నిరసన తెలపడం ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఈ నిరసనల తంతు వెనక యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోద్బలం ఉండటం ఆశ్చర్యం కలిగించలేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతిని ఎండగట్టడంలో 'ఆంధ్రజ్యోతి' పత్రిక అగ్రభాగాన ఉండటం ఆ పార్టీ వారికి సహజంగానే కంటగింపుగా ఉంటుంది. అయితే తమ నాయకుడికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినందుకు నేరుగా నిరసన తెలపలేరు

కనుక, బర్ల వెంకటరావు రాసిన వ్యాసాన్ని సాకుగా చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజును కించపరుస్తూ 'ఆంధ్రజ్యోతి'లో ఒక వ్యాసం వస్తే ఆయన ఔన్నత్యాన్ని కొనియాడుతూ అయిదు వ్యాసాలు వచ్చాయి. అంటే సీతారామరాజును న్యూనత పరచాలన్న ఆలోచన గానీ, ఉద్దేశం గానీ 'ఆంధ్రజ్యోతి'కి లేదని స్పష్టమవుతోంది. మే నెలలో ప్రచురితమైన ఈ వ్యాసానికి జూలై నెలలో నిరసన తెలపడం ఏమిటన్న ప్రశ్న ఉండనే ఉంది. వాస్తవానికి నాకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలను సీరియస్‌గా తీసుకోవలసిన అవసరం లేదు.

అయినా ఎందుకు ప్రస్తావించవలసి వస్తున్నదంటే, జగన్ పార్టీ కపటత్వాన్ని వివరించడంతో పాటు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు ఆచరణలో ఏ విధంగా వ్యవహరిస్తారో చెప్పడానికే! బర్ల వెంకటరావు రాసిన వ్యాసంలోని అంశాలు అల్లూరిని అభిమానించేవారి మనస్సులను గాయపరచి ఉండవచ్చు. సీతారామరాజును నిజంగా అభిమానించేవారు ఆయన ఆశయాలను సైతం పుణికిపుచ్చుకుని ఆచరించాలి. బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా అల్లూరి పోరాటం చేశారు.

మన్యం ప్రజల జీవితాలలో వెలుగు నింపడానికి తన జీవితాన్ని త్యాగం చేశారని మనం చదువుకున్నాం. అలాంటి త్యాగమూర్తికి అపచారం జరిగిందని బాధపడేవారు ఆచరణలో అల్లూరిని అనుసరిస్తున్నారా.. అన్నదే ఇక్కడ ప్రశ్న! పేదల కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు కాగా, నాకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు దర్శకత్వం వహించిన పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి పేదల పేరిట ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తి! ఎంత వైరుధ్యం! సీతారామరాజును అభిమానించే వారు జగన్ పార్టీలో ఎలా కొనసాగగలుగుతున్నారా? అన్నదే నా సందేహం. అంటే హిపోక్రసీకి కూడా అంతు లేకుండా పోతున్నదన్న మాట! ఇక్కడ ఒక విషయం ప్రస్తావించవలసి ఉంది.

భీమవరంలో జరిగిన సభలో పాల్గొన్న వారిలో వయోధికులే ఎక్కువ. సభా ప్రాంగణం వెలుపల నిరసన తెలుపుతున్నవారంతా యువకులే! అంటే మన యువత ఆలోచనలు ఎంత పెడదారి పడుతున్నాయో అర్థమవుతోంది. అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారిలో చేకూరి వెంకట సూర్యనారాయణరాజును చూపిస్తూ "ఆయనను దేవుడు జడ్జీగా పిలుచుకుంటాం'' అని మాజీ ఎమ్మెల్యే ఎర్రా నారాయణస్వామి నాతో అన్నారు. అదేమిటని ప్రశ్నించగా "ఆయన న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

న్యాయమూర్తిగా ఉన్నప్పుడు చట్ట ప్రకారం పేదలకు శిక్ష విధించవలసి వస్తే అపరాధ రుసుం విధించేవారు. అయితే పేదల తరఫున సదరు అపరాధ రుసుమును సొంత జేబులోంచి ఆయనే చెల్లించేవారు'' అని నారాయణస్వామి చెప్పారు. అలాంటి ఆదర్శమూర్తుల వారసులు ఇప్పుడు జగన్ పార్టీ తరఫున తిరుగుతున్నారు. ఈ పరిణామం పట్ల అల్లూరి సీతారామరాజును నిజంగా అభిమానించి, గౌరవిస్తున్నవారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రాజకీయ కుయుక్తులతో లబ్ధి పొందడానికి జగన్ పార్టీ అలవాటు పడింది. కొందరిని కొంత కాలమే మోసం చేయగలం. అందరినీ అన్ని సందర్భాలలోనూ మోసం చేయలేం! ఈ సూత్రాన్ని విస్మరించిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అమాయకులు, తాము ఏమి చెప్పినా నమ్ముతారన్న ధీమా వారిలో ఉండవచ్చు. నిజం కన్నా అబద్ధం ముందుగా ప్రచారంలోకి వెళ్లడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. నిజం నిలకడ మీద తెలుస్తుందని కూడా చెప్పుకుంటాం కనుక జగన్ పార్టీ కపటత్వాన్ని ప్రజలు ఏదో ఒక రోజు తెలుసుకోకపోరు.

తాజాగా సృష్టించిన కాల్ లిస్ట్ వివాదాన్నే తీసుకుందాం. సి.బి.ఐ. జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, చంద్రబాల, నేను కలిసి జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నామని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేశారు. నేను, లక్ష్మీనారాయణ మాట్లాడుకున్నట్టు రుజువు చేస్తే దేనికైనా సిద్ధమని నేను విసిరిన సవాల్‌కు వారి నుంచి ఇంతవరకు సమాధానం లేదు. ఇది వాస్తవం కాదని వారికి కూడా తెలుసు. అయినా రాజకీయ పార్టీలు, మీడియా కలిసి జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని జనాన్ని నమ్మించడమే వారి లక్ష్యం కనుక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉంటారు.

హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించడం వెనుక కుట్ర ఉందని కూడా ఇదే విధంగా ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ తల్లి శ్రీమతి విజయలక్ష్మి, చెల్లి షర్మిల ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి మరణం ప్రమాదవశాత్తూ జరిగిందేనని తెలిసినా, ఆ సంఘటన వెనుక కుట్ర ఉందనీ, రాజశేఖర్ రెడ్డిని చంపించారనీ ప్రజల్లో అనుమాన బీజాలు వేయడం వల్ల ఎన్నికలలో లబ్ధి పొందడం వారి లక్ష్యం. ఈ విషయంలో వారి లక్ష్యం నెరవేరిందని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. దీంతో ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ప్రచారం ప్రారంభించారు.

కాంగ్రెస్ నాయకులు కొందరు ఆక్షేపిస్తున్నట్టుగా ఎన్నికల తర్వాత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం గురించి తల్లీ కూతుళ్లు ఎందుకు ప్రస్తావించడం లేదు? సి.బి.ఐ అధికారులు జగన్‌ను వేధిస్తున్నారని ఢిల్లీదాకా వెళ్లి ప్రధానమంత్రిని సైతం కలిసి మొర పెట్టుకున్న శ్రీమతి విజయలక్ష్మి, కనీసం మాట మాత్రంగానైనా తన భర్త మరణం గురించి ప్రస్తావించకపోవడానికి కారణం ఏమిటి? ఒకవైపు సి.బి.ఐ., మరోవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కమ్ముకురావడంతో పీకల్లోతు కష్టాలలో చిక్కుకున్న జగన్‌ను వీలైతే కేసుల నుంచి బయటపడేయడానికి లేదా ప్రజల్లో మళ్లీ సానుభూతి పొందడానికి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ నాయకులు ప్రస్తుత ఢిల్లీ యాత్ర చేపట్టి ఉండవచ్చు. పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది.

ఇందులో తప్పు పట్టవలసింది ఏమీ లేదు. అయితే ఎదురుదాడే మంత్రంగా జగన్ పార్టీ పన్నుతున్న పన్నాగాలకు ఒక్కొక్క వ్యవస్థ బలవుతూ వస్తున్నది. న్యాయ వ్యవస్థలో ఏమి జరిగిందో మనం చూశాం. పారిశ్రామిక రంగం కుదేలైంది! మంత్రులు కేసుల్లో చిక్కుకున్నారు. ఒక మంత్రి జైలు జీవితం గడుపుతున్నారు. చివరకు మీడియాలో కూడా విభేదాలు సృష్టించారు. జర్నలిస్టుల సంఘాల నాయకులను కూడా వివాదాస్పదం చేశారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన నాలుగు స్తంభాలకు మకిలి అంటించిన ఘనత 'జగన్ అండ్ కో'కే చెందుతుంది. జీవిత చరమాంకంలో కాసులకు కక్కుర్తి పడినందుకుగాను న్యాయమూర్తి పట్టాభి రామారావు అవమాన భారంతో కుంచించుకుపోతున్నారు.

అటు గాలి, ఇటు జగన్ కేసుల్లో చిక్కుకున్న అధికారులు, వ్యాపారవేత్తలు మౌనంగా రోదిస్తూ జైలు జీవితం గడుపుతుండగా, ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయంగా మలచుకుని ప్రయోజనం పొందడానికి శ్రీమతి విజయలక్ష్మితో పాటు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. కుమారుడు జైలుకు వెళ్లి నెల దాటిందన్న విచారం శ్రీమతి విజయలక్ష్మి మొహంలో కనిపించడం లేదు. ఆమె ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలుసుకుని మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చిరునవ్వులు చిందిస్తున్నారు. భర్తను కోల్పోయి, కొడుకు జైలు పాలైనా దిగులు పడని శ్రీమతి విజయలక్ష్మి కోసం జనం మాత్రం బాధపడుతున్నారు.

జగన్ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మానసికంగా కుంగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గాలికి బెయిల్ కేసులో ఎ.సి.బి. అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో రౌడీ షీటర్ యాదగిరిరావు చిద్విలాసంగా చేతులు ఊపుతూ, 'మళ్లీ కలుద్దాం' అని మీడియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య నేరాలకు అలవాటు పడిన వారికి, తెలిసో తెలియకో విధిలేని పరిస్థితులలో నేరం చేసిన వారికి మధ్య వ్యత్యాసాన్ని చెప్పకనే చెబుతున్నది. ఈ మొత్తం కేసులలో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న వారిలో జగన్మోహన్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, సునీల్ రెడ్డి, యాదగిరిరావు మినహా మిగతా వారెవ్వరూ వంచిన తల ఎత్తడం లేదు.

జగన్ పార్టీ నాయకులు తమ ప్రత్యర్థులుగా భావిస్తున్న వారిపై ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నా, ఈ వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. రాజకీయాలలో ఉన్నవారంతా అవినీతిపరులేనని ప్రచారం జరగడం కూడా జగన్‌కు లాభిస్తున్నది. ఈ ప్రచారానికి ఒక వర్గం మేధావులు కూడా ఊతం ఇవ్వడంతో మంచికి, చెడుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఫలితంగా నిబద్ధత, నిజాయితీతో వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులకు, అవినీతిపరులకు మధ్య అంతరం తెలియకుండా పోతున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మొత్తం రాజకీయ వ్యవస్థపైనే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లి ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. సినిమాలలో ఇదివరకు ప్రతినాయకుడి పాత్రలను అందవిహీనంగా చూపించేవారు.

ఇప్పుడు హీరో కంటే అందమైన వాళ్లతో ప్రతినాయకుడి పాత్రలు వేయిస్తున్నారు. దీంతో విలన్లను ఆరాధించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పుడు రాజకీయాలలో కూడా ఇదే పరిస్థితి. విలన్ లక్షణాలు ఉన్నవారు హీరోలుగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే చరిత్ర పురుషుల ఔన్నత్యాన్ని జాతికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. మహనీయుల లోపాలను ఎత్తిచూపే బదులు, వారి త్యాగాలను వివరించగలిగితే సమాజానికి మేలు చేసిన వాళ్లవుతారు. కంచుకి, కనకానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గుర్తించేలా వారిని చైతన్యపరచవలసిన బాధ్యత మేధావి వర్గంపై ఉంది. లేని పక్షంలో మన యువత, గాంధీ బదులు గాడ్సేలను ఆదర్శంగా తీసుకునే ప్రమాదం ఉంది! 

కొత్త పలుకు! - ఆర్కే


No comments: