Monday, July 2, 2012

నెల్లూరు నుంచి నాసా వరకు


అమెరికాలో అత్యున్నత ఉద్యోగాలు చేస్తున్న మన తెలుగింటి ఆడపడుచులు చాలా మందే ఉన్నారు. వారిలో నెలకో ఇద్దర్ని 'మన పరదేశీ' శీర్షిక కింద పరిచయం చేసే కాలమ్ ఇవాళ్టి నుంచి ప్రారంభించాం. నాసాకు చెందిన లాంగ్లీ రీసెర్చి సెంటర్ (లార్క్)లో సీనియర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్‌గా పని చేస్తున్న ఏకైక భారతీయ మహిళ మంజులా అంబూర్. నెల్లూరులో పుట్టి కర్నూలులో చదివి అమెరికా వెళ్లి నాసా ఇచ్చే అసాధారణ ప్రతిభా మోడల్, వారి టీమ్ లీడర్‌షిప్ అవార్డులు పొందిన ఆమే మొదటి 'మన పరదేశీ'


అమెరికా వచ్చేనాటికి నేను డిగ్రీ మాత్రమే చేశాను. నా భర్త దామోదర్ రెడ్డి పి.హెచ్.డి చేయడానికి అమెరికా వస్తే ఆయన వెంట నేనూ వచ్చాను. ఆ తరువాత నాసాలో ఉద్యోగం వచ్చిందాయనకి. నేనేమో కమ్యూనిటీ కాలేజిలకి వెళ్లి కంప్యూటర్ కోర్సులు చేశాను. జార్జియా స్టేట్ యూనివర్శిటీలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎమ్మెస్ చేశాను.మేము అమెరికాకి వచ్చినప్పుడు పరిస్థితులు వడ్డించిన విస్తరిలా ఏమీ లేవు. ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేందుకు, అలవాటు పడేందుకు కొంత సమయం పట్టింది. అయితే నాకున్న పట్టుదల, సాంకేతిక పరిజ్ఞానాలతో పాటు వీలయినంత ఎక్కువ పనిచేయాలనుకునే నా ఆలోచనలే నన్ను కెరీర్ పరంగా బాగా నిలబెట్టాయి. ఎంత వీలైతే అంతే పని చేయాలనుకునే వారిలో ఒకదాన్ని కాదు నేను. ఏ పని చేసినా వంద శాతం కృషి చేస్తాను. ఎప్పుడూ, ఏ విధంగా నేను చేసే పనిలో వెనక్కి తగ్గి ఉండాలని అనుకోను. నేను వీరికంటే తక్కువ, నాకు వీరికంటే ఎక్కువ తెలీదు లాంటి భావాలని అసలు దరికి రానీయలేను. నా మెరిట్‌ని, తెలివిని, కృషిని నమ్ముకుని ముందుకు సాగుతూ పోయాను.


మొదటి మహిళని నేనే
అట్లాంటాలోని ఐటి డిపార్టుమెంటులో నా కెరీర్ మొదలయ్యింది. అక్కడ మూడేళ్లు పనిచేసిన తరువాత నాసాకు చెందిన లాంగ్లీ పరిశోధనా కేంద్రం (వర్జీనియా)లో చేరాను. మన దేశానికి చెందిన మగవాళ్లు, అమెరికా ఆడవాళ్లు చాలామందే పనిచేస్తున్నారక్కడ. కాని అక్కడ చేరిన మొదటి భారతీయ మహిళని మాత్రం నేనే. లాంగ్లీరీసెర్చి సెంటర్ నాసా ఫీల్డ్ సెంటర్స్‌లో అన్నిటికన్నా పాతది. లార్క్ ముఖ్యంగా ఏరోనాటికల్ రీసెర్చ్ పై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇక్కడి నుండే అపొలో లునార్ ల్యాండర్ ప్లైట్ టెస్ట్ చేశారు. అలాగే పెద్ద పెద్ద స్పేస్‌మిషన్స్ ఇక్కడే డిజైన్ చేయబడ్డాయి. అమెరికాలో నాసా సెంటర్లు పది ఉన్నాయి. నేను మొదటి భారతీయ మహిళనైతే లాంగ్లీ రీసెర్చి సెంటర్‌కి మొట్టమొదటిసారిగా ఒక అమెరికన్ స్త్రీ లెసా బి.రో. ఇప్పుడు డైరెక్టర్‌గా ఉన్నారు.


జెండర్‌తో కాకుండా మెరిట్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇక్కడ. అందుకని నన్నెవరూ వేరుగా చూడరు. నా పనిని గౌరవిస్తారు. మొదటి నుండీ నాసాలో చాలెంజింగ్ పనులే ఇచ్చేవారు. ఇష్టమైన పనిచేస్తుంటే కష్టంగా అనిపించదు అనేది నాకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న పిల్లలతో ఉద్యోగం చేస్తూ కుటుంబ బాధ్యతల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోగలిగానంటే ఈ పని పట్ల నాకున్న ఇష్టమే కారణం. మా ఆయన సహకారం కూడా ఎంతో ఉంది నా విజయంలో. అంతేకాకుండా నాకవసరం అయినప్పుడల్లా అమ్మావాళ్లు వచ్చి సాయం చేయడంతో కెరీర్‌లో పైకెదగగలిగాను. అదే సహకారం ఇప్పటికీ లభిస్తోంది.


నాసాలో లీడర్‌షిప్ ప్రోగ్రామ్స్ చేసిన తరువాత చాలా పనులు చేయడం సులువైంది నాకు. ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థయిర్యం పెంపొందాయి. దాంతో కీలక నిర్ణయాలు తీసుకోవడం సులువైంది. ఎన్నో బృందాలతో వివిధ రకాల ప్రాజెక్ట్స్ విజయవంతంగా చేయగలిగాను.


పని తీరిలా...
ఐటి ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఆపరేషన్ అండ్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్‌లో 1989 నుంచి 1997 వరకు పనిచేశాను. అప్పుడు 30 మంది కంప్యూటర్, సమాచార నిపుణుల బృందంతో కలిసి సెంటర్ వైడ్ 'డిజిటల్ లైబ్రరీ సిస్టమ్స్' ను అభివృద్ధి చేసి ఆచరణలో పెట్టాను. అలాగే దేశంలోని వివిధ నాసా విభాగాల్లో (పది సెంటర్లలో 25 ఉద్యోగుల బృందంతో) మొట్టమొదటి ఆన్‌లైన్ సమాచార పద్ధతిని డిజైన్ చేశాను. 1996 నుంచి 2001 వరకు సీనియర్ ఐటి ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రంట్ ఆఫీసులో ఆఫీసర్‌గా పనిచేశాను. సెంటర్ ఇయర్ 2000 ప్రాజెక్టులో రెండు వందల మంది ఇంజనీర్లు, కంప్యూటర్ నిపుణులతో,సెంటర్ వై2కె క్రాస్ ఆర్గనైజేషనల్ బృందంతో పరీక్షలు జరిపే ప్రదేశాల్లో, పరిశోధనాలయాల్లో డెస్క్‌టాప్ కంప్యూటర్లకి ఏ సమస్య వచ్చినా అధిగమించడానికి సంసిద్ధంగా ఉన్నాం.


20 మంది బృందానికి నాయకత్వం వహిస్తూ వెబ్ బేస్డ్ పోర్టల్ పద్ధతిని అభివృద్ధి చేసి నాసాలోని వివిధ విభాగాల్లో అద్భుతమైన సమాచార, కమ్యూనికేషన్ పద్ధతిని విజయవంతంగా ప్రవేశపెట్టగలిగాం. దీనివల్ల నాసాకి చెందిన అన్ని కేంద్రాల మధ్య సమాచారాలు పంచుకోవడం సులభమైంది. నాసా ఐటి స్ట్రాటజీ 30 మంది బృందంతో రోడ్‌మ్యాప్‌ని తయారుజేయడంలో, ఎప్పటికప్పుడు నూతన సమాచారాన్ని సిస్టం ద్వారా నెట్‌వర్క్‌లో అప్‌గ్రేడ్ చేయడం, నాసా పోర్టల్‌ని వ్యూహాత్మకంగా నిర్మించడంలో ముఖ్యపాత్ర వహించాం. 2001 నుంచి 2005 వరకు స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ ఆఫీసర్‌గా, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌గా, ఆఫీస్ ఆఫ్ సెంటర్ డైరెక్టర్‌గా పనిచేశాను. అలాగే విజ్ఞానాన్ని విస్తరింపచేసే (కెఎమ్ - నాలెడ్జి మేనేజ్‌మెంట్) మిగతా కేంద్రాలతో, ఆ కేంద్రాలలో వివిధ భాగాలు కలిసి పనిచేయడంలో సాయపడ్డాను.నాసా సెంటర్‌లో వివిధ సంస్కృతుల గురించి అవగాహన పెంపొందించడానికి ఒక బృందానికి లీడర్‌గా పనిచేశాను. ఆ సెంటర్‌లో బడ్జెట్ సవాళ్లని ఎదుర్కోవడానికి సెంటర్ అసోసియేట్ డైరెక్టర్‌తో కలిసి పనిచేశాను.


ఇతర రంగాలకూ సేవలు
నాసాలోనే కాకుండా ఇతర రంగాల్లో అంటే క్లీవ్‌లాండ్ హాస్పిటల్‌కి సాంకేతికంగా సమాచారాన్ని అందించేందుకు కొత్త ప్రక్రియలను ఆరోగ్య సేవా పరిశ్రమకి ఇచ్చాను. నాసా సెంటర్‌లోని ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, మేనేజర్లకి ఉపయోగపడే వెబ్ టెక్నాలజీ, డేటా మేనేజ్‌మెంట్, వ్యవస్థాగత అన్వేషణ ప్రక్రియలు పెంపొందించేందుకు పనిచేశాను. గూగుల్, ఐబియంతో కొత్త అన్వేషణ ప్రక్రియలు, కొత్త సాంకేతిక విజ్ఞానంలో భాగస్వామ్యం నెలకొల్పాను. నాసా సెంటర్లోని పరిశోధన, సైన్స్, అంతరిక్ష శోధన, ఏరోనాటిక్స్ వివిధ భాగాల మధ్యన అవగాహన పెంపొందించడానికి కృషి చేశాను.


రెండు సంతోషాలు...
గత మూడు ఏళ్లుగా చేస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో సమస్యలు వచ్చి ఎంతో మంది ఎంతో సమయం వెచ్చించి చేసిన పని అంతా దండగవుతుందేమో అనే పరిస్థితి వచ్చింది. కానీ ఈ మధ్యనే అన్ని సమస్యలతో ఆగిపోతుందేమో అనుకున్న ప్రాజెక్టు మళ్లీ కొనసాగుతుందని తెలియగానే చాలా ఆనందం వేసింది. దామెదర్ రెడ్డికి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్ వచ్చినపుడు కూడా చాలా సంతోషం వేసింది. ఆయన నాసాకి అతి ముఖ్యమైన ప్రాజెక్టులు చేశారు. ఆయన ప్రతిభకి గుర్తింపు వచ్చినందుకు సంతోషించానే కాని ఆ సంతోషంలో తను క్లీన్‌లాండ్‌కి వెళ్లి ఉండాలి అనే విషయం కూడా గుర్తు రాలేదు. అక్కడ కొన్నాళ్లు పని చేశాక మళ్లీ లాంగ్లీరీసెర్చ్ సెంటర్‌కి వచ్చేశారు.


ఇదీ ఇప్పటి నేను...
విరామం అన్నది లేకుండా పనిచేశాను ఇన్నాళ్లూ కాని ఈ మధ్య కొన్ని రోజులు ఇంటి నుంచి పనిచేస్తున్నాను. అదీకాక మరీ ఒత్తిడి కలిగించే విషయాలు పట్టించుకోవడం లేదు. చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేసుకున్నా నా ఉద్యోగంలో మూడు ముఖ్యమైన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలోనే నాకు సంతృప్తి ఉంది. వాటిలో మొదటిది నాతో పనిచేసేవారి గురించి పట్టించుకోవడం. వాళ్లు మానసికంగా బాగుంటేనే చేసే పనిపై దృష్టి పెడతారు. అలాగే వాళ్లకి చాలెంజింగ్ పనులివ్వడం, ప్రతిభకి తగ్గ పనిని ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రెండోది బడ్జెట్‌ని సరిగా బాలెన్స్ చేయడం. మూడోది కొత్తగా వచ్చే సాంకేతిక రిజ్ఞానంతో పనిచేయడం. ఇది ఎంతో ముఖ్యమైనది. అలాగే నాకెంతో ఇష్టమైనది.


నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు మా పెద్దబాబు పసివాడు. ఇప్పుడు వాడు డాక్టర్, అమెరికన్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. తనకి ఇద్దరు పాపలు. చిన్నబ్బాయి ముందు ఇంజనీరింగ్ చదివినా సర్జన్ కావాలని ఉండేది వాడికి. అందుకని మళ్లీ మెడిసిన్ చదివాడు. మే నెలలో గ్రాడ్యుయేట్ అయ్యాడు. రెసిడెన్సీ చేస్తూ క్యాన్సర్ సర్జరీలో స్పెషలైజేషన్ చేస్తాడు. చిన్న బాబుకి తెలుగమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. వ చ్చే ఏడాది పెళ్లి చేస్తాం. కెరీర్ ముఖ్యమే అయినప్పటికీ కుటుంబం అంతకంటే ముఖ్యం నాకు. పిల్లలతో చాలా సన్నిహితంగా ఉంటాను. మన సంస్కృతి, సంప్రదాయాలంటే మాకు చాలా ఇష్టం. ఆ పద్ధతుల్లోనే పిల్లల్ని పెంచాం. మా పెద్దబ్బాయి పెళ్లి భారతీయ సంప్రదాయం ప్రకారం, చర్చిలో వారి పద్ధతి ప్రకారం కూడా చేశాం. మా పిల్లలిద్దరూ ఇప్పటికీ నాకు రెగ్యులర్‌గా ఫోన్ చేసి అన్ని విషయాలూ చెప్తారు.


అవార్డులు
- నాసా ఇచ్చే అసాధారణమైన ప్రతిభా మెడల్


- వై2కె, ఆర్థిక పద్ధతి, శాస్త్ర సమాచార పద్ధతి, సంస్కృతి మార్పు వంటి అనేక షయాల్లో నాసా టీమ్ లీడర్‌షిప్ అవార్డ్‌లు వచ్చాయి


పనిని తగ్గించుకోవడం వల్ల చాలా మార్పు కనిపిస్తోంది. యోగా చేస్తే మనసు, శరీరం రెండూ రిలాక్స్ అవుతాయి. స్నేహితుల్ని అప్పుడప్పుడు ఇంటికి ఆహ్వానించడం, వాళ్లతో సంతోషంగా గడపడం వల్ల కూడా మనసు రిలాక్స్ అవుతుంది. వార్తా పత్రికలు చదువుతాను. పుస్తకాలు, నవలలు కూడా బాగా చదువుతాను. మా నాన్న వై.బి.వి రమణారెడ్డి పుస్తకాలు బాగా చదివేవారు. రోజూ కాసేపు ఏదైనా చదివితేనే కాని ఆయన నిద్రపోయేవారు కాదు. నాన్నని చూసే నాకు పుస్తకాలు చదివే అలవాటయ్యింది.
- కనకదుర్గ (అమెరికా నుంచి)
* Andhra Jyothy

No comments: