Monday, January 3, 2011

6న భేటిపై రగడ * జనవరి 'ఆరు'పై అరవై వాదనలు * తెలంగాణకు తెర * నివేదిక సీఎం చేతుల్లో !


అఖిలపక్షానికి వెళ్లం..మళ్లీ గోల్‌మాల్‌కే సమావేశం : కేసీఆర్
ఒక్కో ప్రతినిధినే పిలవాలంటూ చిదంబరానికి లేఖ
అసలు కమిటీనే పనికిమాలినది... మేమూ ఢిల్లీ వెళ్లం : బీజేపీ
మీరూ వెళ్లొద్దు...నారాయణకు కేసీఆర్ వినతి
తిరస్కరించిన సీపీఐ... భేటికి వామపక్షాల ,పీఆర్పీ రెడీ
సోనియాను పిలిస్తే బాబూ వస్తారు... కేసీఆర్ మెలికపై టీడీపీ
కథ అడ్డం తిరిగింది. కేంద్రం అనుకున్నదొకటి. జరుగుతున్నది మరొకటి! తాంబూలాలు ఇచ్చేద్దాం అని కేంద్రం భావిస్తే.. దానికి ముందే తన్నులాటలు షురూ అయ్యాయి!! ఆరో తేదీ రాకుండానే.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక బయటపడకుండానే.. అఖిల పక్షంలోని పార్టీలు తలో పక్షంగా మారిపోయాయి. నివేదికతో సంబంధం లేకుండా అఖిలపక్ష భేటీపైనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రానికే షరతులు విధిస్తున్నాయి.

అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని కొన్ని పార్టీలు ప్రకటిస్తే.. మాకు టైం కావాలని మరికొన్ని డిమాండ్ చేస్తున్నాయి. అసలా భేటీయే దండగ అని మరికొన్ని ఈసడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఆరో తేదీ భేటీపై అసలు కేంద్రం వైఖరి ఏమిటి? పార్టీల డిమాండ్లను పట్టించుకుంటుందా!? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే.. నెలనెలా కేంద్ర హోం శాఖ నిర్వహించే విలేకరుల సమావేశం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా పార్టీల వైఖరులపై చిదంబరం తన స్పందనను వ్యక్తం చేసే అవకాశం ఉంది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ఈనెల ఆరో తేదీన 8 గుర్తింపు పొందిన పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర హోం శాఖ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని.. అప్పటికప్పుడే అభిప్రాయాలు చెప్పాలని ఆహ్వానిస్తూ చిదంబరం లేఖలు రాశారు. ఆ లేఖలోని కేంద్రం మెలికకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. అఖిలపక్ష భేటీని బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధినే ఆహ్వానించాలని.. ఒక్క అభిప్రాయాన్నే చెప్పమనాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఏకాభిప్రాయం సాధ్యమవుతుందన్నారు. మళ్లీ గోల్‌మాల్‌కే ఆరోతేదీ భేటీ అన్నారు. ఇద్దరేసి ప్రతినిధులు వస్తే.. భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారని, ఏకాభిప్రాయం లేదని కేంద్రం తప్పించుకుంటుందని, తెలంగాణ సమస్యను తాత్సారం చేయడానికే ఈ ఎత్తు అని ధ్వజమెత్తారు. కేంద్రమే కిరికిరి చేస్తోందని విమర్శించారు. ఈ మేరకు చిదంబరానికే ఆయన బహిరంగ లేఖ రాశారు.

ఇక, ఈ అఖిలపక్ష భేటీ.. పనికిమాలిన, పనికిరాని సమావేశమని బీజేపీ తేల్చేసింది. దానిని తాము బహిష్కరిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రకటించారు. శ్రీకృష్ణ కమిటీనే తాము గుర్తించడం లేదని, ఇక అదిచ్చే నివేదికను గుర్తిస్తామా!? అని ప్రశ్నించారు. అయితే.. ప్రజారాజ్యం పార్టీతోపాటు వామపక్షాలు మాత్రం భేటీకి సిద్ధమయ్యాయి. ఇప్పటికే ప్రతినిధులను కూడా ఎంపిక చేశాయి. అఖిలపక్ష భేటీకి వెళ్లవద్దంటూ కేసీఆర్ కోరినా.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

అంతేనా.. మీరు కూడా పాల్గొని పార్టీ వాదనను అక్కడే వినిపించండి అంటూ కేసీఆర్‌కే ఆయన హితవు పలికారు. అయితే.. సీపీఐతోపాటు పీఆర్పీ కూడా నివేదిక అధ్యయనానికి తమకు మరికొంత సమయం కావాలంటూ చిదంబరానికి లేఖలు రాశాయి. ఇక, కేసీఆర్ 'ఝలక్'పై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను చూసి ఊసరవెల్లి భయపడుతోందని ఆ పార్టీ నేత రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాను పిలిపిస్తే.. టీడీపీ తరఫున చంద్రబాబు అఖిలపక్ష భేటీకి వస్తారని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ నుంచి ఒక్కొక్కరినే పిలవాలన్న కేసీఆర్ వాదనను టీడీపీ నేతలు ఎర్రబెల్లి, కడియం శ్రీహరి సమర్థించారు. కానీ, పార్టీ అధ్యక్షులనే పిలవాలని మెలిక పెట్టారు. నివేదికపై అసలు అఖిలపక్షమే అనవసరమని తేల్చేశారు. ఈ పార్టీలకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నేతలే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఇచ్చాక అఖిలపక్షం దండగ అని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్, ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వ్యాఖ్యానిస్తే.. కేసీఆర్ వాదనతో తమకు పని లేదని, అఖిలపక్ష భేటీకి వెళతామని మరో ఎంపీ రాజయ్య స్పష్టం చేశారు.

కేసీఆర్‌ది పలాయన వాదమని సీమాంధ్రనేతలు విమర్శించారు. ఇక, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కేకే మరికాస్త ముందుకెళ్లారు. సీడబ్ల్యూసీ పదవి తనకు ముఖ్యం కాదని, తెలంగాణ రాకపోతే ఆ పదవిని విసిరి పారేస్తానని వ్యాఖ్యానించారు. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తెలంగాణ రాదా!? అని ఆగ్రహంతో ప్రశ్నించారు. ఈ దెబ్బతో తెలంగాణ సమస్య ఖతం కావాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు.

పొలిటికల్ బెటాలియన్ ఎవరి వాదనను వారు వినిపిస్తుంటే.. పోలీస్ బెటాలియన్ వాడవాడలా కవాతు చేస్తోంది. పికెట్లు, తనిఖీలతో రాష్ట్ర రాజధానిలో గుబులు పుట్టిస్తోంది. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో తెలంగాణ చిక్కుముడి.. అఖిలపక్షానికి ముందే పీటముడి పడుతోంది. ఈ ముడిని చిదంబరం విప్పుతారా!? మరో ముడి వేస్తారా!?.


అఖిలపక్ష భేటీకి రాం.. *  చిదంబరానికి కేసీఆర్ ఝలక్

ఒక్కోపార్టీ నుండి ఇద్దరేసి సభ్యులన్నందుకే తిరస్కరిస్తున్నామని ప్రకటన
తెలంగాణ సమస్యను జటిలం చేసేందుకు కేంద్రం కుట్రపన్నుతోంది
అనైతిక చర్యలకు పాల్పడుతూ, కాలయాపన చేసేందుకు యత్నిస్తోంది
ఒక పార్టీ.. ఒక్క అభిప్రాయమే చెప్పాలి
పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి
అభివృద్ధి ఒక్కటే కాదు.. ఆత్మగౌరవం, స్వయంపాలన కావాలి

టీఆర్‌ఎస్ అధినేత వ్యాఖ్యలు

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణ నిమిత్తం కేంద్ర హోంశాఖ ఈ నెల 6న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తాము హాజరు కాబోమని టీఆర్‌ఎస్ ప్రకటించింది. ఒక్కో రాజకీయ పార్టీ నుంచిఇద్దరు వ్యక్తులను పంపాలంటూ కేంద్ర హోంమంత్రి చిదంబరం పంపిన ఆహ్వానాన్ని ఆ పార్టీ తిరస్కరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో పార్టీ నేతలు విజయశాంతి, హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్ తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంలో కేంద్రం అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భేటీ ఏర్పాటు చేసిన పద్ధతి సక్రమంగా లేదని, గతాన్ని పునరావృతం చేసే విధంగానే ఉందని కేసీఆర్ విమర్శించారు. ఇటువంటి సమావేశాల వల్ల ఫలితం రాదని, అందువల్ల తాము అఖిలపక్ష సమావేశానికి రాబోమని తేల్చిచెపుతూ హోంమంత్రి చిదంబరానికి లేఖ రాశారు.
ఇద్దర్ని ఎలా పిలుస్తారు..?

‘ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరిని ఆహ్వానించడం ఆశ్చర్యకరం. ఒకే పార్టీకి చెందిన రెండుప్రాంతాల వారు అక్కడకొచ్చి కలహించుకుని కొట్లాడుకునే విధంగా ఈ ప్రయత్నం ఉంది. చాట్లో తవుడుపోసి కుక్కలకు కొట్లాట పెట్టేవిధంగా, తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుని చావండనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. తెలంగాణ ఉద్యమాన్ని తాత్సారం చేసి, జటిలంగా మార్చి, మరింత కాలం నానబెట్టాలనే ధోరణి వారిలో కనిపిస్తోంది. ఒక్కొక్క పార్టీ నుండి ఇద్దరు సభ్యులను పిలిచి కేంద్రమే కావాలని అనైతిక విధానాన్ని ప్రోత్సహిస్తోంది. అందుకే చిదంబరం ఆహ్వానాన్ని బాధతో తిరస్కరిస్తున్నా..’ అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులతోనూ, తెలంగాణ మేధావులతోనూ చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఏడాదికిందట అఖిలపక్ష సమావేశంలో ఇద్దరిని పిలిచి చేసిన తప్పే శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రస్తుతం చేసిందన్నారు. పార్టీ నుండి ఒక్కటే నివేదికను కాకుండా ఆయా పార్టీలో భిన్నాభిప్రాయాలను తీసుకుని తప్పుచేసిందని విమర్శించారు. అఖిలపక్ష భేటీ ఏర్పాటుచేయటం ‘పెళ్లి తర్వాత పెళ్లిచూపుల వంటింద’ని మండిపడ్డారు.
కేంద్రం నిర్ణయం అనైతికం..
‘కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒకపార్టీ నుండి ఒకే అభిప్రాయం వచ్చేవిధంగా చూడాలి. ఇద్దరిని ఆహ్వానించడం వల్ల ఏకాభిప్రాయం రాలేదంటూ తెలంగాణ అంశాన్ని మరింత కాలయాపన చేస్తరు. ఒక పార్టీ నుండి ఇద్దరిని పిలవాలనే నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతుంది. ఒకేపార్టీలో భిన్నాభిప్రాయాలు వచ్చే అనైతిక పద్ధతులకు కేంద్ర నిర్ణయమే ఆస్కారాన్నిస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయం కూడా చెప్పాలంటే ఎలా సాధ్యం? డిసెంబరు 10న పార్లమెంటులో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తారా లేదా’ అని కేసీఆర్ ప్రశ్నించారు. పిడికెడు మంది స్వార్థపరులు, సీమాంధ్ర పెట్టుబడిదారులు మినహా తెలంగాణ ఏర్పాటుకు అక్కడి ప్రజలు వ్యతిరేకంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని గుంటూరులో ఇటీవల టీడీపీ నిర్వహించిన రైతుకోసం సభలో ఎంతోమంది సాధారణ ప్రజలు మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. శ్రీకృష్ణ కమిటీపై విశ్వాసం లేకున్నా ఇప్పటివరకూ ఓపిక పట్టామన్నారు. ఈ కమిటీలు, నివేదికలతో సంబంధం లేకుండా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అభివృద్ధితో తెలంగాణ అంశాన్ని ముడిపెట్టలేమని, ఆత్మగౌరవం, స్వయంపాలనను ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నారని కేసీఆర్ చెప్పారు. నివేదికలోని అంశాలేమిటో తెలియకుండా తొందరపడి వ్యాఖ్యానించడమెందుకని, 6వ తేదీ దాటితే నివేదిక ఇంటర్నెట్‌లోనే ఉంటుందన్నారు. నివేదికలోని అంశాలను చూసిన తర్వాతనే ఎలా స్పందించాలనేది నిర్ణయిస్తామని కేసీఆర్ చెప్పారు.
తెలంగాణకు తెర
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అఖిలపక్షాన్ని ఆహ్వానించటం ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సాధ్యమైనంత కాలయాపన చేసేందుకు ప్రయత్నిస్తున్నదా?...అసలు కమిటీ ఉద్దేశమూ అదేనా?...ఇలా కాలయాపన చేయటం ద్వారా క్రమంగా తెలంగాణ అంశాన్ని తెర చాటుకు పంపించాలని కాంగ్రెస్‌ నాయకత్వం నిర్ణయించుకున్నదా?...వివిధ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను చూస్తే ఈ అనుమానాలు కలుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఏ ఒక్క ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఇతర ప్రాంతాలకు చెందిన ఎంపీలు దూరమయ్యే ప్రమాదం ఉంది కనుక నిర్ణయాన్ని వాయిదా వెయ్యడమే ఉత్తమమని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

final-tngf 
శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ఈ నెల 6 తేదీన ఢిల్లీలో అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించటంలోనే కేంద్ర ప్రభుత్వ తాత్సారవైఖరి తేలిపోతున్నదని తెలంగాణకు పూర్తి మద్దతు పలుకుతున్న టీఆర్‌ఎస్‌, బీజేపీ లాంటి పార్టీలు స్పష్టం చేస్తున్నా యి. గత ఏడాది జనవరి ఐదున కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఇలాగే అఖిలపక్షాన్ని పిలిపించారు. ఒక్కో పార్టీ నుంచి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు వెళ్ళి తమ ప్రాంతాలకు అనుగుణంగా అభిప్రాయాలు చెప్పటం, ఏకాభిప్రాయం ఏ పార్టీలోనూ లేదన్న సాకు చూపిన కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసి బంతిని ఆ కోర్టులోకి నెట్టటం జరిగింది. ఇప్పుడూ అలాగే ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులను పిలిచి, ఏ పార్టీకీ ఏకాభిప్రాయం లేదన్న సాకు చూపి తెలంగాణ అంశాన్ని అటకెక్కించటమే కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తున్నదని కాంగ్రెస్‌ మినహా మిగిలిన పార్టీలన్నీ అంటున్నాయి.

అసలు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ ఉద్దేశమూ అదేనని టీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీలు ఆరోపిస్తున్నాయి. కమిటీ నివేదిక నాలుక గీచుకోవటానికి తప్ప దేనికీ పనికి రాదని టీఆర్‌ఎస్‌ మొదటినుంచీ చెబుతున్నది. అయితే నివేదిక ఇవ్వలేదనే చెడ్డపేరు రాకుండా ఉండటం కోసం భారీ నివేదిక సమర్పించింది. ఇక బీజేపీ అసలు కమిటీనే గుర్తించేది లేదు పొమ్మన్నది. ఆ కమిటీకి చట్టబద్ధత లేదని ఎప్పుడో స్పష్టం చేసింది. ఇలా పార్టీలు తమకు నివేదిక సమర్పించనప్పుడు ఆయా పార్టీల అభిప్రాయాలు తమ కు తెలియనప్పుడు తాము పూర్తి స్థాయిలో సిఫారసులు చేయలేమని చెప్పి తప్పించుకునే ఉద్దేశం కమిటీకి ఉన్నట్టు తేలిపోతున్నదని టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు అంటున్నారు.
ఎంపీలు దూరం కాకుండా ఉండేందుకే?...
ఇక కాంగ్రెస్‌ పార్టీ ఈ నాన్చుడు తంత్రాన్ని అనుసరించటం ద్వారా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు పార్టీకి దూరం కాకుండా ఉంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు కనిపిస్తున్నది. కమిటీయే కనుక కచ్చితమైన సిఫారసులు చేసి ఉంటే, అవి ఏదో ఒక ప్రాంత ఎంపీలకు కంటగింపుగా తయారయ్యే పరిస్థితి కచ్చితంగా ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ దెబ్బ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే ఒక ప్రాంత ఎంపీలను దూరం చేసుకుని కేంద్రంలో అధికారానికి ఎసరు పెట్టుకోవటం ఎందుకన్న అభిప్రాయంతో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఉన్నట్టు చెబుతున్నారు.

సాధ్యమైనంత ఎక్కువ కాలం కమిటీ సిఫారసులు లేదా నివేదికపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేసి, వచ్చే సార్వత్రిక ఎన్నికల దాకా కాలాన్ని నెట్టుకురావాలన్న ఉద్దేశంతో అధినాయకత్వం ఉన్నట్టు కనిపిస్తున్నదని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కమిటీ సిఫారసులలో ఏమున్నా దాన్ని ముందుగా పార్టీలోని అన్ని ప్రాంతాల ఎంపీలకు తెలియజెప్పి, ఏమి చేస్తే ప్రయోజనం ఉంటుందో ఆలోచించుకున్న తర్వాతే నివేదికపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపాటు తనం ప్రదర్శిస్తే పుట్టి మునుగుతుందన్న ఆందోళన కాంగ్రెస్‌ అధినాయకత్వంలో ఉందని విపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
నివేదికపై మరో కమిటీ?
సాధ్యమైనంత ఎక్కువకాలం కాలయాపన చేసేందుకు వీలుగా ముందు మొక్కుబడిగా అఖిలపక్షాన్ని నిర్వహించి, ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదన్న సాకు చూపి మరో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయటం, నివేదికను ఆ కమిటీ అధ్యయనం చేస్తుందని చెప్పి మరి కొంత కాలం ఊపిరి పీల్చుకోవటం కాంగ్రెస్‌ అధినాయకత్వం అసలు ఉద్దేశంగా కనిపిస్తున్నదని బీజేపీ, టీఆర్‌ఎస్‌, సీపీఐ తదితర పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కమిటీ గడువును సైతం దాదాపు ఏడాది పాటు విధించటం, అప్పట్లోగా రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయో తెలిసిపోతాయి కాబట్టి అవసరం అయితే అప్పుడే నిర్ణయం తీసుకుంటే సరిపోతుందన్న అభిప్రాయంతో హై కమాండ్‌ ఉన్నట్టు ఢిల్లీలోని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అడకత్తెరలో తెలంగాణ ఎంపీలు...
అధినాయకత్వం వేస్తున్న ఈ నాన్చివేత ఎత్తుగడలు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల పరిస్థితిని అడకత్తెరలో పోకచెక్కలా మారుస్తున్నాయి. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని ఎంత గట్టిగా చెబుతున్నా, వారు అధినాయకత్వం ఇలాగే సాచివేత ధోరణి అనుసరిస్తే ప్రజలు తమను వీధుల్లో నిలదీసే పరిస్థితి దాపురిస్తుందని ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆందోళనతో ఉన్నారు. అఖిలపక్షం తర్వాత కేంద్రం ఏదో ఒక అభిప్రాయాన్ని చెప్పకపోతే ప్రజలు తమను నిలదీయక తప్పదని, దానికి తాము ఇవ్వాల్సిన సంజాయిషీ ఏమిటో తేల్చుకోలేకపోతున్నామని ప్రజా ప్రతినిధులు అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్‌ నేత కె.కేశవరావు లాంటి వారు స్వరం పెంచి అవసరం అయితే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యత్వాన్ని అయినా సరే వదులుకుంటానని చెప్పటం, తెలంగాణ కోసం జైలుకు వెళ్ళటానికైనా సిద్ధం అని చెప్పటాన్ని చూస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులలో ఏ స్థాయి ఆందోళన, భయం పెనవేసుకు పోయి ఉన్నాయో అర్థం అవుతున్నదని ఇతర పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ తెలంగాణఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ అధినాయకత్వం అనుసరిస్తున్న నాన్చుడు వ్యూహం తెలంగాణ నేతలను మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కు అన్న చందంగా వ్యవహరించేలా చేస్తున్నది. చూస్తూ చూస్తూ నాయకత్వాన్ని ధిక్కరించలేకపోవటం, అలాగని మౌనంగా ఉండి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోవటం వంటి ఇబ్బందికర పరిస్థితిలో ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
Click Here!

‘ఆరు’కు ఎసరు ?
logos 
జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివే దికపై అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు కేంద్రం ఈ నెల ఆరున ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష సమావేశం సజావుగా సాగకుండా తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతున్నది. కాంగ్రెస్‌ మినహా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరు కాకుండా పార్టీ అధినేత కేసీఆర్‌ స్వయంగా చొరవ తీసుకుంటున్నారు. పార్టీకి ఇద్దరు చొప్పున వెళ్ళటం వల్ల తేలేది ఏమీ లేదని అలాంటప్పుడు వెళ్ళి ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన తమ పార్టీ హాజరు కావటం లేదని స్పష్టం చేశారు. స్వయంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణకు ఫోన్‌ చేసి వెళ్ళవద్దని అర్థించారు. అయితే తాము వెళ్ళి తీరుతామని, అభిప్రాయం చెబుతామని నారాయణ స్పష్టం చేసినట్టు సమాచారం. అయినా ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మరోసారి మాట్లాడి సీపీఐని దూరం చేసేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.
బీజేపీ దూరం....
అసలు కమిటీకే చట్టబద్ధత లేనప్పుడు అఖిలపక్షానికి హాజరై ప్రయోజనం ఏమిటని బీజేపీ ముందు నుంచీ ప్రశ్నిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిలపక్షానికి వెళ్ళేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సిహెచ్‌.విద్యాసాగరరావు సైతం ఇదే డిమాండ్‌ చేశారు. సమావేశానికి కాంగ్రెస్‌, టీడీపీ దూరంగా ఉండాలని సూచించారు.
టీడీపీ డైలమా...
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతంతో తల బొప్పికట్టించుకున్న తాము మళ్ళీ అఖిల పక్షానికి వెళ్ళి రెండు ప్రాంతాలకూ అనుకూలంగా అభిప్రాయాలు చెప్పి వస్తే టీఆర్‌ఎస్‌కు మరో అస్త్రాన్ని అందించినట్టు అవుతుందన్న అభిప్రా యంతో తెలంగాణ ప్రాంత నేతలు కొందరు ఉన్నట్టు సమాచారం. సీమా ంధ్ర ప్రాంత నేతలు సైతం ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు తెలిసింది. వెళ్ళినా ఏ ప్రాంతం నేతలు ఆ ప్రాంతానికి అనుకూలంగా వాదనలు వినిపించటం తప్ప చేయగలిగిందేమీ లేదని, అలాంటప్పుడు సమావే శానికి వెళ్ళి తెలంగాణ లేదా సమైక్యాంధ్ర వ్యతిరేక పార్టీగా ముద్ర వేయిం చుకోవటం ఎందుకన్న అభిప్రాయాన్ని పార్టీలో పలువురు సీనియర్‌ నేతలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
కచ్చితంగా వెళ్ళేది మూడు పార్టీలే...
ఈ నేపథ్యంలో అఖిలపక్షానికి కచ్చితంగా హాజరయ్యే పార్టీలు మూడే కనిపిస్తున్నాయి. అధికార పక్షం కాబట్టి కాంగ్రెస్‌కు ఎలాగూ వెళ్ళక తప్ప దు. ఆ పార్టీ తరఫున ఇద్దరితో పాటు ముఖ్యమంత్రి హోదాలో తాను సైతం స్వయంగా హాజరవుతానని కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటిం చారు. ఈ లెక్కన కాంగ్రెస్‌ తరఫున మెజారిటీ అభిప్రాయం సమైక్యానికి అనుకూలంగానే ఉండక తప్పదు. ఇక ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదాన్ని అటకెక్కించి సమైక్య వాదానికి కట్టుబడింది. లోక్‌సత్తా అదే అభిప్రాయంతో ఉంది. ఇక మజ్లిస్‌ తెలంగాణకు అనుకూలమూ కాదు, ప్రతికూలమూ కాదు. అయితే హైదరాబాద్‌ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్‌ చేస్తున్నది.

ఇక సీపీఎం సైతం తన వైఖరిలో మార్పు రాకపోయినప్పటికీ, తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు తెలుస్తోంది. తాము హాజరైనా, కాకపోయినా ఎలాంటి ఫలితమూ ఉండనప్పుడు, ఇప్పటికే ఒకసారి పార్టీ అభిప్రాయాన్ని ఏడాది క్రితం స్పష్టం చేసినందున హాజరై ప్రయోజనం ఏమీ లేదన్న అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్టు చెబుతున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలలో చాలా మటుకు గైర్హాజరు అయిన పక్షంలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చేందుకు వీలు కలుగుతుందన్న అభిప్రాయంతో కేసీఆర్‌ ఉన్నట్టు సమాచారం. ఎలాగూ జాతీయ పార్టీ అయిన బీజేపీ హాజరు కానందున మిగిలిన పార్టీలను సైతం సమావేశానికి దూరంగా ఉంచితే తెలంగాణ పట్ల ప్రజాభిప్రాయం ఎంత తీవ్రంగా ఉందో కేంద్రానికి వ్యక్తం చేసినట్టు అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నట్టు సమాచారం. తాము సమావేశానికి వెళ్తామని సీపీఐ చెప్పినప్పటికీ, మరో మారు ఆ పార్టీ కేంద్ర నాయకత్వంతో మంతనాలు జరిపేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

Click Here!

నివేదిక సీఎం చేతుల్లో !

పీఆర్పీ, ఎంఐఎం నేతలతో కిరణ్ చర్చలు

అఖిలపక్ష వ్యూహంపై కసరత్తు
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలుసా? ఆ నివేదిక ప్రతి ముఖ్యమంత్రి చేతికి చేరిందా? అందులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం... తాను అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నారా? అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు!! ఈ నెల ఆరో తేదీన ఢిల్లీలో హోం మంత్రి చిదంబరం సమక్షంలో జరిగే అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కసరత్తు ప్రారంభించారు.

అంతేకాదు.. భవిష్యత్తులో తనతో కలిసి వస్తారని భావిస్తున్న పీఆర్పీ, ఎంఐఎం పెద్దలతో ఆదివారం సాయంత్రం వేర్వేరుగా చర్చించారు. చిరంజీవి, రామచంద్రయ్య, అసదుద్దీన్ ఒవైసీ ఈ చర్చల్లో పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సమస్యలపై చర్చించినట్లు పీఆర్పీ... ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడామని ఎంఐఎం నాయకులు చెబుతున్నా, నిజానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక అంశాలపైనే వీరు ప్రధానంగా చర్చించారని తెలిసింది.

అయితే, రైతు సమస్యలపై మాట్లాడేందుకు సోమవారంనాటికి సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరామని, అనుకోకుండా ఆయన ఆదివారమే సమయం ఇవ్వడంతో చిరంజీవి, రామచంద్రయ్య వెళ్లి కలిశారని పీఆర్పీ పార్టీ వర్గాలు వివరించాయి. ఈ సమావేశానికి కొద్దిసేపటి ముందే కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పార్టీకి ఒక్కరినే అఖిలపక్ష భేటీకి పిలవాలని, లేదంటే సమావేశాన్ని బహిష్కరిస్తామని ప్రకటించారు. ఈ అంశం కూడా వీరి మధ్య చర్చకు వచ్చింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని వివిధ అంశాలపై ఎలాంటి వైఖరి అవలంబించాలన్న అంశంపై సీఎం వారితో చర్చించారు. ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అఖిలపక్ష సమావేశానికి ముందే సొంత పార్టీలోని తెలంగాణ నేతల్లో కూడా భిన్నస్వరాలు వినిపించడంతో తన వైఖరి ఏంటో బయట పడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారు.

No comments: