Friday, April 6, 2012

ఇంటికెళితే అమ్మనే ....


ఏ శాఖలో పనిచేస్తున్నా పూనం మాలకొండయ్య తన ప్రత్యేకత చాటుకుంటుంటారు. నికార్సయిన పనితనంతో సంచలనం రేపుతుంటారు. ప్రస్తుతం ఎపిపిఎస్సీ సెక్రటరీగా చేస్తున్న ఆమె ఎబీఎన్‌లో ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొని ఇలా మాట్లాడారు...

మీరు చాలా కఠినమైన అధికారి అని పేరుంది. ఇంట్లో కూడా అంతే కఠినంగా ఉంటారా?
ఇంట్లో అధికారాలు ఉండవు. ఆత్మీయతలు ఉంటాయి. ఆఫీసుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం అక్కడ ఉంటుంది. భర్త, పిల్లలు, వారితో ఉంటే వచ్చే ఆనందం అన్నీ ఉంటాయి. నేను ఇంట్లో పూర్తిగా అమ్మనే. ఒక అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే నేనూ ఉంటాను. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మెడిసన్ చదువుతోంది. అబ్బాయి లా చదువుతున్నాడు.

ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలంటారు?
పిల్లలు జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దితే చాలని చాలామంది అనుకుంటారు. కాని వాళ్లు సమాజం గురించి ఆలోచించేలా కూడా ప్రోత్సహించడం అవసరమని నేను అంటాను. పిల్లల్ని అలాగే పెంచాలని కూడా చెబుతాను.

మీ బాల్యం ఎలా గడిచింది?
నాన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగి. దాని వల్ల నా బాల్యం చాలా చోట్ల నా బాల్యం గడిచింది. అన్నిటికంటే తమిళనాడులోని కోయంబత్తూరులో ఎక్కువకాలం ఉన్నాము. నా పాఠశాల, కాలేజీ రోజులన్నీ కోయంబత్తూరులోనే.

గృహిణి పాత్రను ఎలా పోషిస్తారు?
నాకు వంటలంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో రకరకాల వంటలు చేస్తాను.

ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు, ఇంట్లో గృహిణిగా ...రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
ఆఫీసును ఇంటికి తీసుకెళ్లను. ఇంట్లో అడుగుపెట్టగానే మారిపోతాను. నిజానికి బ్యాలెన్స్ చేయడమంటూ ఏమీ ఉండదు. ఆఫీసులో ప్రతి నిమిషం సద్వినియోగం చేస్తే బయటకొచ్చేటప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. అప్పుడు ఇంట్లో కూడా హాయిగా ఉంటుంది.


ఇప్పుడు స్వేచ్ఛ, సమస్య రెండూ ఉంటున్నాయి. ఇది అభివృద్ధా? వెనకబాటు తనమా?
అమ్మాయిలకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే బాధ్యత. ఇంట్లో, సమాజంలో మనకు చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. లేదంటే రకరకాల సమస్యలు వస్తాయి. బాధ్యతాయుతంగా ఉండాలన్నది స్త్రీలకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది.

స్త్రీలు తమకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?
గతానికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. ఏ రంగంలో తీసుకున్నాసరే స్త్రీలు కనిపిస్తున్నారు. సాంకేతిక పరమైన స్కిల్స్ వారిలో ఉంటున్నాయి. అయినప్పటికీ సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. సమస్యలు ఎదురైనపుడు ప్రతిభ ఒక్కటే సాయపడగలదు.

విదార్థినుల డ్రాపవుట్స్ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేయాలి?
కుటుంబానికి ఆర్థిక స్వేచ్చ ఉంటే సగం వరకు డ్రాపవుట్స్ తగ్గుతాయి. ఈ డ్రాపవుట్స్ కూడా ఒక్కో దశలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. పాఠశాలలు అందుబాటులో ఉంటే చదవడానికి వెళుతున్నారు. అదే ఐదారు కిలోమీటర్ల దూరానికి నడిచివెళ్లాలంటే మాత్రం క్రమంగా చదువుకు దూరమవుతున్నారు. దీంతోపాటు పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలు వలన కూడా డ్రాపవుట్స్ ఎక్కువవుతున్నాయి.

తరాలమధ్య ఎలాంటి తేడాలున్నాయి? నేటి తరంపై మీ అభిప్రాయం?
ఇప్పటి తరానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తమను తాము రక్షించుకోగలరు. ప్రతిభ అపారం. గతంలో నేర్చుకోవడానికి ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పటి తరానికి అవి పుష్కలం. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేనైతే ఈ తరానికి హ్యాట్సాఫ్ అంటా.

స్త్రీని నిర్వచించమంటే?
'ఆమె' ఒక క్రియేటర్. దేన్నయినా నిర్మించగలదు. కూలగొట్టనూ గలదు. కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆమే కేంద్రబిందువు. ఏదైనా నాగరికతను నిర్వచించాల్సి వస్తే ఆ కాలంలో సమాజం స్త్రీని ఎలా చూసేది అన్న విషయాన్ని గమనిస్తే చాలు. స్త్రీ పాత్ర అలాంటిది.

మరి స్త్రీల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
నేననుకోవడం అర్బన్ ప్రాంతంలోనే ఆత్మహత్యలు ఎక్కువని. చదువుకున్న వారు కూడా చిన్నవిషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశమే అందుక్కారణం. సమస్యలను విశ్లేషిస్తే ఎలాంటి చెడూ జరగదు. కాని చదువుకున్న వారు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకొని ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధతో చనిపోయేవారు, చదువుకోకుండానే సమాజంలో నెట్టుకొస్తున్న చాలామందిని చూసి తెలుసుకోవాలి. అనాథ శరణాలయాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ ఎంతోమంది జీవిస్తుంటారు. వారి జీవితాలు గమనించి సహాయం చేయగలిగితే ఆనందంతోపాటు ఎలా జీవించాలో అర్థమవుతుంది.

ఎన్నో మంచి విషయాలు చెప్పగలిగే మీరు మీడియాకు దూరంగా ఉంటారెందుకు?
నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. ముఖ్యమైన విషయాలైతే మీడియా ముందుకు వస్తాను. అంతే. అయినా మీడియాను ఎవరూ దూరంగా ఉంచలేరు. ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మీడియా అవసరం కదా. 

ఇంటర్వ్యూ : శ్వేత

No comments: