Saturday, October 30, 2010

ఆనాడు నువ్వు తెలుగు తల్లివి, ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన బిరుదు... 'దయ్యం'



 మా దయ్యానికి మల్లెపూదండ
ఆనాడు నువ్వు తెలుగు తల్లివి,
ఈనాడు వట్టి ఆంధ్రా తల్లివి
ఆనక దొర నీకు కొత్తగా ఇచ్చిన
బిరుదు... 'దయ్యం'
అవును నువ్వు నిజంగా దయ్యానివే!

అర్ధనూట పదహారు రోజులు
ఆకలితో మలమల మాడ్చి
అమర జీవిని బలితీసుకున్న దయ్యానివి నువ్వు!
ఏదో ఒరగబెడతానని అందర్నీ తీసుకొచ్చి
ఎటూ కాని ఎడారిపాలు చేసిన
దయ్యానివి నువ్వు!
ఇడ్లీ, సాంబార్ వదిలేసి రండి,
విందు భోజనం వడ్డిస్తానని పిలిచి
ఇరానీ చాయ్ కూడా
లేకుండా చేసిన దయ్యానివి నువ్వు!

తుంటరి వరుడంటూ నెహ్రూ ఉమ్మేసినా
తుడుచుకుని నవ్వేసిన దయ్యానివి నువ్వు!

కొత్త రాజధానిలో నీ బిడ్డలు
కొలువే చేయకూడదని
పెద్ద మనుషులు తీర్పిచ్చినా
పట్టని దయ్యానివి నువ్వు!

నీలోని రుద్రమ్మకు మసిపూసి,
నీకు సవతి తల్లిగా ముసుగేసినా
ఉలుకూ పలుకూ లేని దయ్యానివి నువ్వు!

నీతోపాటు త్యాగయ్యనూ తిక్కన్ననూ
అందర్నీ దయ్యాల్ని చేసి
కొత్తమ్మ కాళ్లు పట్టిస్తున్న దెయ్యానివి నువ్వు!

చిరునవ్వు సిరులన్నీ భాగ్యనగరిలో పారేసుకుని,
కట్టుబట్టలతో గడప దాటలేక
చూరుపట్టుకు వేలాడుతున్న దయ్యానివి నువ్వు!

హైటెక్ హంగులు, ధగధగ రోడ్లు,
మిలమిల లైట్లు
ఏవీ నీవి కానివై వెక్కిరిస్తుంటే,
గూడు పాడైనా ఎగిరిపోలేని చిలకలా
శిలావిగ్రహమై నిల్చిన దయ్యానివి నువ్వు!

నీ వాళ్లను పంచెలూడదీసి కొడతామంటున్నా
నీకు రోజూ వస్త్రాపహరణం తప్పదంటున్నా
ద్రౌపదిలా శ్రీకృష్ణ జపం చేస్తున్న
దయ్యానివి నువ్వు!

ఎంత దయ్యమైనా అమ్మ అమ్మే
అందుకే ఈ పరాయి పంచలో
సిగ్గులేని మా బతుకుల సాక్షిగా
'భాగో'లే తప్ప బాగోలేని మా మనసుల సాక్షిగా
తెల్లవారీ వారక ముందే, దొర నిద్ర లేవకముందే,
తిట్లూ శాపనార్థాల చీకట్లలో,
కాలుతున్న ఏపీ 16 స్కూటర్ వెలుగులో
ఎవరూ చూడకుండా దొంగల్లా వస్తాం!
నీకో మల్లెపూదండ వేసేసి పారిపోతాం!!
- వక్కలంక రమణ

No comments: