తెలుగు వారి చరిత్ర గత నూరేళ్ళుగా పరిశీలిస్తే ఎన్నో విస్మయాలు, విషాదాలు కనిపిస్తాయి.పురాణాలను, ఇతిహాసాలను నమ్మినా నమ్మకపోయినా తెలుగువారి శాపగ్రస్తతను మాత్రం నమ్మాల్సి ఉంటుంది. విశ్వామిత్రుడు వీళ్ళను శపించాడుట. ఆయన అసలే ఆవేశి. ఆగ్రహశీలి.శునశ్శేషుడనే దిక్కులేని వాడాయనను ఆశ్రయించాడుట. ఆయన తన కొడుకులతో వీణ్ణి మీతో కలుపుకొని సఖ్యంగా బతకండిరా అన్నాడుట. ససేమిరా వల్ల కాదన్నారట ఆయన సంతానం. అయితే మీరు కష్టాలపాలవుతారు పోండి అని విశ్వామిత్రుడు శపించాడుట. ఇదంతా పుక్కిటి పురాణమే అనుకున్నా శతాబ్దాలుగా తెలుగు వారి ఉత్థానపతనాలు ఇందుకు అనుగుణంగానే ఉన్నాయి. త్యాగశీలత, ధైర్యస్థైర్యాలు, విజ్ఞాన వికాసాలు, నాగరికత, సంస్కృతి, ప్రథమశ్రేణిలోనే వీళ్ళు ఎంతో కాలం నుంచీ నిలుపుకుంటూ వస్తున్నప్పటికీ వీరి ఉన్నతికీ, పురోగతికీ ఈ గొప్ప లక్షణాలు సహకరించడం లేదు. చెరుపు కూడా చేస్తున్నాయి.





అసలింతకూ తెలుగువారికి తమ స్వంత రాష్ట్రం పట్ల ఇంత ప్రగాఢ కాంక్ష కు నేపథ్యం ఏమిటో అయ్యదేవర కాళేశ్వరరావు స్వీయ చరిత్రలో ఇట్లా వివరించారు. 1911 లోనే అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ భారతదేశం భాషా ప్ర యుక్తంగా ఉండాలని ఇంగ్లండుకు నివేదిక పం పినట్లు కాళేశ్వరరావు స్వీయ చరిత్రలో ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర జిల్లాల ప్రజలకు తమ రాష్ట్రం కావాలని కోర్కె రోజురోజుకూ ప్రబలింది. స్వరాజ్యం ఎట్లాగూ రాబోతున్నది. ఈ స్వరాజ్యం నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజల మాతృభాషలోనే శా సన నిర్మాణం, పరిపాలన నిర్వహణం, న్యాయవిచారణ తప్పనిసరి అని రా జకీయ నాయకులంతా తలచారు. మాతృభాషలోనే విద్యా బోధన ఉండాల ని, తెలుగువారికి విశ్వవిద్యాలయం వెంటనే స్థాపన కావాలని ఆశించారు.

శాసనసభలో, ప్రభుత్వంలో, హైకోర్టులో పలుకుబడి అంతా తమిళులది. తమిళుల యాజమాన్యం.ఆంధ్రుల వ్యక్తిత్వం, ఆత్మగౌరవం పరిగణనకు రావు. అది తమిళ రాజ్యమేకాని తెలుగువారి ప్రసక్తి లేదు. చెన్న రాష్ట్రంలో ఉన్నవారిందరినీ మద్రాసీలనే పేరు. అంటే తమిళులనే ఉత్తరభారత దేశపు వారి భావం... తమిళ లాయర్లు, తమిళ ఇంజనీయర్లు ఆంధ్ర జిల్లాల నుండి విశేషముగా ధనం సంపాదిస్తున్నారు.పరిశ్రమలు, విద్యుచ్ఛక్తిగా తమిళ ప్రాంతంలో ఉన్నంతగా ఆంధ్ర ప్రాంతాలు లేవు.‘తమిళ దేశంలో కావేరి మీద తొమ్మిది రోడ్డు వంతెనలుండగ, కృష్ణా, గోదావరి నదుల మీద ఒక వంతెన కూడా లేకుండెను.

దానిని గూర్చి వారికి గర్వం ఉంది. ఇప్పటి స్థితి వారికి రోజురోజుకూ దుర్భరంగా ఉంది. చరిత్ర తెలిసినప్పటి నుంచి ఇరవై రెండు శతాబ్దాలు వరుసగా శాతవాహన, చాళుక్య, కాకతీయ, విజయనగర, గోల్కొండ చక్రవర్తుల కింద ఆంధ్ర దేశమంతా ఏకపాలనం కింద ఉంటూ వచ్చింది. మహోజ్వల చరిత్రలో భరత వర్షము యొక్క సర్వతోముఖమైన నాగరికతను, అంతర్జాతీయ ప్రతిష్ఠను పెంపొందించింది ఆంధ్ర దేశం. ఆ కాలంలో ఆంధ్రుల శౌర్య ప్రతాపాలు, పరిపాలన దక్షత, రాజకీయ నైపుణ్యం, విజ్ఞానం, సిరిసంపదలు, కళాకౌశలములు అనన్య సామాన్యంగా పెంపొందాయి. ఆంధ్రులు అనాది కాలము నుండి ఓడల నిర్మాణంతో సముద్రంలో దూరదేశాలకు పోయి వర్తకవ్యాపారాలు సా గించారు. బర్మా, సయాం, కాంబోడియా, ఇండొనేషియాలలో ఆంధ్రుల వలసలను స్థాపించి ఆంధ్ర నాగరికత, శిల్పం, కళలను, విజ్ఞానాన్ని హిందూ బౌద్ధ ధర్మాలను నెలకొల్పారు’’( పు. 217) అని చెపు తూ ఆ తరువాత ఐదు శతాబ్దాల చరిత్రను, సాక్ష్యాధారాలతో సహా పేర్కొన్నారు కాళేశ్వరరావు.
అక్టోబరు 2, 1949 ప్రగతి గాంధీ జయంతి ప్రత్యేక సంచికలో దాశరథి పద్యాలివి. ‘‘ప్రగతి’’ వారపత్రిక వరంగల్ నుంచి వెలు వడేది. ఇది తెలంగాణ తెలుగు వారి ప్రథమ స్వాతంత్య్రోత్సవ విశేష సంచికగా ప్రారంభ మైంది. భారతదేశానికంతకూ 1947లోనే స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణాకి 1948లో వచ్చింది స్వాతంత్య్రం. 1949 ఆగస్టు 15 తెలంగాణాకు ప్రథమ స్వాంత్య్ర దినోత్సవం. అప్పుడే భండారు చంద్రమౌళీశ్వరరావు గారు వరంగల్ నుంచి ఈ వార పత్రిక ప్రాంభిం చారు. ఈ పత్రికలో కాళోజీ నారా యణ రావు రచనలు చాలా వచ్చాయి. తెలం గాణ ప్రము ఖ రచయితలు, ఆంధ్ర పాంతం లోని ప్రసిద్ధ తెలుగు రచయితలు ఈ పత్రికలో తమ రచ నలు వెలువరించారు. పత్రికను ఎంతో అభి మానించారు.


అన్ని ముఠాలు తాత్కాలిక సహకార సామరస్యములతో పని చేసినవి. అంతర్గత విభేదాలు ఇంతగ తల ఎత్తలేదు. ఇప్పుడా పోరాటము ముగిసినది. ఇంటిలోని పోట్లాటలు మిగిలినవి. బలమంతయు రుూ కయ్యాలకే వినియోగింపబడుచున్నది... కార్యకర్తలలోని జమిందారీ, సాహుకారి, వతన్దారి, పైరవికారి, బ్లాక్ మార్కెట్లు, కుట్ర, పన్నాగాలు పోనంత వరకు దేశము బాగుపడదు. ప్రస్తుత ధో రణేయమలులోనున్న కాంగ్రెసు పతనము తథ్యము.’’ అరవై ఏళ్ళ కిందటి కాళోజీ పల్కులు ఎంత భవిష్యత్ సూచకంగా ఉన్నవి.
శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకట శాస్ర్తిగారి సన్మాన సభ సందర్భములో తెలంగాణా ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన ‘దాశరథి కృష్ణమాచార్యులు’ రచించి సమర్పించిన పూజా పంచకం...
శ్రీహాసన్నవ పారిజాత కుసుమశ్రేణుల్ గుబాళించు నీ
ఊహా వీధికలన్ త్రిలింగ కవిరాడ్ యూధంబు గుర్రాలపై
రాహుత్తుర్ బలె స్వారి చేసెగద ధారారమ్య కావ్యాళితో!
మా తెలంగాణమంతయు రమారమి రెండు శతాబ్దముల్ తమః
ప్రేతము చేతిలో గడచె; వెచ్చని యెండకాయలే, దదే
దో తెరచాటునన్ గడచె; నుజ్వల కాంతి ఘటాకటాహముల్
పాతరవేసియుండె: తెలవారగలేదు గదా శతాబ్దముల్
నేడు, నవోదయ ప్రథమ నిర్మల భాను కరాగ్రమాలల
ర్రాడును మా తెలుగు కవిరాజుల మానస పద్మసీమ; నీ
తోడును నీడ యూడ నెగదా ! తెలగాణమునందు గూడ కా
వ్యోడు పతిప్రకాండములు వ్యోమమునన్ జలతారు లల్లెడిన్
అగ్ని పుష్పాలు పూచి ఉద్విగ్న మాన
సముల చీకట్లు కాల్చి వెచ్చదనమొసగి
కవులు కంఠాల శాంతిగీతి వెలలాంచె
నా తెలంగాణ కోటి రత్నాల వీణ
కోటిగళాలతో పిలుచుకొన్నది నా తెలగాణ నిన్ను నీ
నోటి జెలంగు భారతిని-నూత్న యుగప్రథమోదయాన ము
క్కోటి తెలుంగు లొక్కకడ గూడ విశాల మహాంధ్రతా సుమ
స్ఫోటన మాచరింపుము యశోనిధి! చెళ్ళపిళాన్వయాగ్రణీ!
‘‘ఇరువదవ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దముల నాటి తెలంగాణ ఆంధ్రుల దైన్య స్థితి ని గూర్చి మాడపాటి హనుమంతరావు పంతులు రచించిన ‘తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర’ మొదటి భాగంలో విపులంగా వర్ణించబడింది. నైజాము రాజ్యంలో వాక్స్వాతంత్య్ర ము, పత్రికా స్వాతంత్య్రం, సభా స్వాతం త్య్రం, మానవ ప్రాథమిక హక్కులు, రాజకీ య ప్రాతినిధ్య హక్కులు బొత్తిగా లేకుం డెను. ఆంధ్ర, మహారాష్ట్ర, కన్నడ భాషలు అణచివేయబడి ఉర్దూ భాషలోనే విద్యావిధానం, పరిపాలన కార్యక్రమము నిర్వహింపబడెను. 1895వ సంవత్సరమున హైదరాబాదునందు శాసనమొకటి స్థా పింపబడెను.
కాని దానిలో నలుగురు మాత్రము ఎన్నికైన సభ్యులుగాను, మిగిలిన వారందరును ప్రభుత్వ నియమితులుగాను ఉండిరి. ఒక్క ఆంధ్రుడేనియు దానిలో సభ్యుడగు భాగ్యమును పొందలేదు.... నూరు రూపాయలకు మించిన మాసవారీ వేతనముగల యు ద్యోగము చేసిన తెలుగువారిని వేళ్ళ మీద లెక్కించవచ్చును’’ అని కాళేశ్వరరావు మాడపాటివారి గ్రంథం నుంచి ఆనాటి నిజాం పరిపాలనలో తెలుగువారి దుస్థితిని గూర్చి విపులంగా ఉదహరించాడు.
ఇదంతా 1948 దా కా ఉన్న పరిస్థితి. తెలంగాణలో మాధ్యమిక పాఠశాలల సంఖ్య 18 అని హనుమంతరావు భోగట్టా. ‘‘తెలుగు ప్రాథమిక పాఠశాలను కాని, గ్రంథాలయమును కాని స్థాపించవలెనన్న ప్రభుత్వము యొక్క అనుమతి కావలెను - అట్టి అనుమతి వచ్చు ట బహు దుర్లభముగనుండెను. ఎటులనో కష్టపడి ప్రభుత్వానుమతి సంపాదించి హైదరాబాదులోను, సికిందరాబాదులోను, హనుమకొండలోనూ గ్రంథాలయములు స్థాపింపబడెను’’ అని మాడపాటి వారి సాక్ష్యం తెచ్చుకున్నారు కాళేశ్వరరావు.
తెలంగాణంలోని తెలుగువారు, బ్రిటిషు పాలననుభవించిన తెలుగు వారూ తాము భి న్న జాతులవారమనీ, భిన్న భాషలకు చెందిన వారమనీ శతాబ్దాలుగా ఎన్నడూ అనుకోలే దు. ప్రతాపరుద్ర చక్రవర్తికి ఆంధ్రధరాధినేత అనే బిరుదున్నట్లు మల్లంపల్లి సోమశేఖరశర్మ రాశారు. ఓరుగల్లుకు ఆంధ్రనగరమనే పే రుండేది. ప్రాచీనాంధ్ర నగరములని ఆదిరా జు వీరభద్రరావు పంతులుగారొక గ్రంథమేశారు. మహమ్మదీయుల పాదాక్రాంతమై ఓ రుగల్లు పతనమైన తర్వాత తీరాంధ్రానికి వెళ్ళి మళ్ళీ ఆంధ్ర రాజ్యాన్ని స్థాపించిన ముసునూరి ప్రోలయనాయకుడికి ‘ఆంధ్ర సురత్రాణ’ అనే బిరుదుండేది.
పాల్కురికి సో మన, పోతన, తిక్కన తాము అఖిలాంధ్రకి చెందిన వారమనుకున్నారే కాని ప్రత్యేక ప్రాంతాలకు చెందినవారమనుకోలేదు. 1944, 45 ప్రాంతాలలో హైదరాబాదు నుంచి వెలువడ్డ ‘మీజాన్’ పత్రికకు అడవి బాపిరాజు సంపాదకులు. పరిశోధనలో, సా హిత్య కృషిలో తనకు ఆదర్శం సురవరం ప్ర తాపరెడ్డి, తిరుమల రామచంద్ర అని చెప్పుకునేవారు. 1926లో ప్రారంభమైన గోల్కొండ పత్రికలో సురవరం వారి రచనలకూ, ఆంధ్రపత్రిక రచనలకూ భేదం ఏమీ కనపడదు. పోలీసు చర్య తర్వాత తెలంగాణంలో మొ ట్టమొదటి భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్లు నుంచి ‘ప్రగతి’ అ నే వార పత్రిక మొదలైంది.ఇందులో కరుణ శ్రీ పద్యాలున్నాయి. కాళోజి నారాయణరావు రచనలు ఎన్నో ఉన్నాయి.పి.వి.నరసింహారావునీ ఈ పత్రిక ప్రభావితం చేసినట్లు కనపడుతుంది.
ప్రగతి ప్రారంభ సంచికకు శుభాకాంక్షలందజేస్తూ మాడపాటి హనుమంతరావు పంతులు ఇట్లా అన్నారు.‘చారిత్రక ప్రసిద్ధి గల ఆంధ్ర నగరము నుండి- మరొయొక తె నుగు వారపత్రిక మీవలన సంపాదింపబడనుండుట నాకత్యంత సంతోష ప్రదము. ఆం ధ్రోద్యమారంభ కాలమున వెడలిన రెండు తె లుగు వార పత్రికలలోకటి వరంగల్లు జిల్లాలోని ఇనుగుర్తి నుండి ప్రకటితము కాసాగె ను. అది సుమారు ఆరు వత్సరములు పలు కష్టములతో సేవ యొనర్చి తుది దినములలో వరంగల్లు నుండి వెడలుచు అస్తమించియుండెను.
వరంగల్లునకు మొదటి మొదటి దినములలో ఆంధ్రాభ్యుదమను మాసపత్రికను ప్రకటించిన గౌరవము కూడకలదు. తమ వా రపత్రిక తెలంగాణమున మంచి వ్యాప్తిగాంచి ఆంధ్ర వాఙ్మయమునకెంతో సంపదను పెం పొందించినట్లు దైవమనుగ్రహించుగాక’’-స్వామీ సీతారం, కళా వెంకటరావు, శివలెంక శంభుప్రసాద్, జమ్మలమడక మాధవరామశర్మ ప్రభృతులు తమ అభినందన సందేశాలు పంపించారు ఈ పత్రికకు. వీళ్ళంతా ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ ప్రాం తం వేరు వేరు అనుకోలేదు. నైజాం నవాబు నుంచి తెలంగాణం విముక్త పోరాటంలో ప్రధాన పాత్ర నిర్వహించిన నరేంద్రజీ తమ సందేశంలో ఇట్లా అన్నారు.
‘‘హైదరాబాద్ రాజకీయ వాతావరణంలో ప్రవేశించిన వ్యక్తిగత ద్వేషాలూ, ముఠాబందీ లు, పరస్పర వైరుధ్యాలు మున్నగు వాటి నుండి దూరమై పవిత్ర భారతీయ సంస్కృతికనుగుణంగా రాజకీయాలను ప్రజానీకం లో వ్యాప్తి చేయుటలో ‘ప్రగతి’ అగ్రస్థానము వహించుగాక. భరత వర్షం యొక్క నిజమైన ప్రగతియే మీ ధ్యేయంగానూ, పీడిత ప్రజానీకము యొక్క సేవయే మీ మార్గపథంగాయుండుగాక. మానవ జాతి ‘ప్రగతి’ యొక్క నిరంతర ప్రగతిని నేను కోరుచున్నాను.’’స్వామీరామానంద తీర్థ ‘‘సంకుచిత పాక్షిక ప్రాంతీయ భావాలను విడనాడాలి’’ అని స్వా తంత్య్రదినోత్సవ సందర్భంగా సందేశపు హెచ్చరికను ఇట్లా వినిపించారు. ‘‘ఇప్పుడు మన జీవన భారత జాతీయతతో అవినాభావంగా జోడించి ఉన్నది.మనలను ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ భారత జాతీ య విధానాల విశాల దృక్పథంతో చూడాలె.
ప్రక్కన ఉన్న భాషాధారక రాష్ట్రాలలో విలీనకరణమవడమే భారతదేశంతో హైదరాబాదు సమైక్యమగు విధానంలోని తుదిదశ’’ అని ప్రబోధించారు స్వామీజీ. ‘‘హైదరాబాదులో మనం, ప్రజలకు విపరీతంగా హాని చేసిన ఈ మతతత్త్వ విషక్రిమి నిర్మూలనకు విపరీత కృషి చేసి, ఆరోగ్యప్రదమైన జాతీయ జీవన నిర్మాణానికి అనుకూలంగా వాతావరణాన్ని శుభ్ర మూ, నిర్మలమూ చేయాలి’’ అని కూడా హె చ్చరించారు.
శ్రీగడియారం రామకృష్ణ శర్మ స్వీయ చరిత్ర ‘శతపత్రం’ చదివితే పోలీసు చర్య అనంతరం ఇరు ప్రాంతాల వారి మధ్య సుహృద్భావం ఎంత ప్రగాఢంగా ఉండేదో, 1953 నాటికే అలంపురం లో విశ్వనాధ సహా అఖిలాంధ్ర కవి పండిత పరిషత్తు ఎంత వైభవంగా జరిగిందో, శ్రీపాద కృష్ణమూర్తి శాస్ర్తి వంటివారు ఎంత ఆనం దించారో, ప్రారంభ వేడుకను ఎంత ఉత్తేజకరంగా సర్వేపల్లి రాధాకృష్ణ నిర్వహించారో తెలుస్తుంది.తీరాంధ్రం నుంచి కాని, తెలంగాణం నుం చి కాని తెలుగు మహనీయుల స్వీయచరిత్ర లు ఎన్నో వచ్చాయి. ఇవి ఇప్పటికి నూరు సంఖ్య దాకా లెక్క తేలవచ్చు. ఈనాటి సం ఘర్షణల భావాలు ఈ రచనలలో మచ్చుకైనా కనిపించవు. చరిత్రనెవ్వరూ మార్చలేరు. తీరాంధ్రంలో సుమారు 60 ఏళ్ళు, తెలంగాణాంధ్రంలో సుమారు 30 ఏళ్ళు ఏ సురుచిర స్వప్న సుందర ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రజలు ఉవ్విళ్ళూరారో అదంతా బహు ఉత్తేజకరమైన చరిత్ర.
మన కళాశాల విద్యార్ధులు, విశ్వవిద్యాలయ విద్యార్ధులు చదువదగినవి. సర్వేపల్లి రాధాకృష్ణయ్య రెండుసార్లు ఆంధ్ర మహాసభలకధ్యక్షత వహించారు (1928, 1938), కొండ వెంకటప్పయ్య, కాశీనాథుని నాగేశ్వరరావు, న్యాపతి సుబ్బారావు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కట్టమంచి రామలింగారెడ్డి, కూర్మా వెంకటరెడ్డి నాయుడు, మాడభూషి అనంతశయనం అయ్యంగార్, వేమవరపు రామదాసు పంతులు, విజయానంద గజపతి ప్రభృతులు అక్కడ- నరసింగరావు, జమలాపురం కేశవరావు, రావినారాయణ రెడ్డి ఇక్కడ తెలుగు వారి సమైక్యం కోసం, ఉజ్జ్వల భవి తవ్యం కోసం ఎంతో కృషి చేశారు. వారి త్యాగాలు, వారి నిస్వార్థ ప్రజాహిత జీవనం- ఇవాళ ఏమైనాయి. సర్వేపల్లి రాధాకృష్ణ గవర్నర్ జనరలైన లార్డ్ వెల్లింగ్డన్ దగ్గరకు రెం డుసార్ల ఆంధ్ర రాష్ట్ర విషయమై రాయబారా లు జరిపినట్లు గుమ్మడిదల సుబ్బారావు రాస్తున్నారు. వేమవరపు రామదాసు జీవితం బహు ఉజ్జ్వలమైనది. ఆయన తెలుగువారి స్వంత రాష్ట్రం కోసం ఎంతో శ్రమిం చారు. ఇవాళ ఆ పెద్దలందరినీ స్మరించటం తెలుగువారి కనీస కర్తవ్యం.
తెలుగు వాళ్ళు తామంతా మమేకమైపోవాలని గత శతాబ్దం మొదటి దశాబ్దంలోనే ఉద్వేగభరిత మనస్కులైనారనీ, గాఢంగా వాంఛించారనీ చెప్పటానికి చారిత్రక ఆధారాలున్నాయి. అయితే ఈ శతాబ్ది మొదటి దశాబ్దం ముగియకుండానే విడిపోవాలని కలహిస్తున్నారు. 1905-06లో ‘వందేమాతరం’ ఉద్యమం తెలుగువారందరికి తామంతా కలసిపోయి తమ వ్యక్తిత్వాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న నిర్ణయాత్మకమైన భావన అంకురించినట్లు ఆధునిక చరిత్రకారులు ప్రతిపాదిస్తున్నారు.